మంచి మాట

మానవజన్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జంతునాం నరజన్మ దుర్లభం’ అని గీతావాక్యం. జంతువుల్లోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనదని చెబుతారు. మనిషి ఉదయం నుంచి రాత్రివరకు పనిచేస్తాడు, రాత్రికాగానే నిద్రపోతాడు. ఈ రెంటిమధ్య ఏదో విశ్రాంతి, శాంతి కలిగించే అద్భుతమైన శక్తి ఉన్నదని భగవంతునిపై నమ్మకం లేని వారు గ్రహించరు. అటువంటివారికి శాంతికి, విశ్రాంతికి నోచుకోరు. కారణం- తన శక్తికంటే మరో శక్తి సృష్టిలో లేదని అనుకుంటారు. తను చేసే పనికి, నిద్రకు, మధ్యలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగల ప్రాణవాయువులాంటి భగవంతుడు ఉన్నాడని గ్రహించరు.
పాపం లేదు, పుణ్యం లేదు, పునర్జన్మ అంటూ లేదు, అంతా తన శక్తేయని భ్రమిస్తారు. శ్రమ ఒక్కటే చాలని గర్విస్తూ పనిచేస్తాడు, మన శాస్త్రాలు వేదాలు, భగవద్గీతలో మొదలగు ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ పునర్జన్మ ఉన్నదని, పాపంతో జంతు జన్మ, పుణ్యంతో మనుష్య జన్మ లభిస్తాయని ఎంత చెప్పినా నాస్తికులు అర్థంచేసుకోరు. పని ఒక్కటే తన జీవితమని శ్రమిస్తారు. శ్రమతో జయం కలుగవచ్చు కాని శాంతి కలగదు, విశ్రాంతి దొరకదు.
సృష్టిలో ఒకటి ఉంటే సరిపోదు. రెండు చేతులు కలిస్తేనే చప్పుడవుతుంది. వినలేని మనిషి వింటాడు. దగ్గరకు వస్తాడు, సహాయపడతాడు. మనిషికి ఒక కన్ను, ఒక చెవి ఒక కాలు ఉంటే సరిపోదు. రెండూ ఉంటేనే పూర్తి సహకారం వాటితో లభిస్తుంది. శక్తియుక్తి రెండూ ఉంటేనే పూర్తి విజయం లభిస్తుంది. శాంతి, సహనం దొరుకుతుంది. శక్తి తనదైతే యుక్తి భగవంతుడు. బుద్ధిలో ఉండేది భగవంతుడు. ‘బుద్ధి కర్మానుసారే’ అని ఆర్యోక్తి. పాండవులు ఎంత శక్తివంతులైనా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ సహాయం తీసుకొని విజయం సాధించారు. దుర్యోధనుడు బలగాన్ని తీసుకొని యుద్ధంలో శక్తి ఎంత ఉన్నా అపజయం పొందాడు.
తులసీదాసు గంగానది ఒడ్డున సత్సంగం చేస్తూ ఒక పదిమందికి రామాయణం చెబుతున్నాడు. ఆ దారి వెంబడి, రోజూ ఓ రాజుగారు వినోదయాత్ర చేస్తూ వెళుతుండేవాడు. తులసీదాసు రాజుగారిని ఆపి తన సత్సంగానికి రమ్మంటాడు. రాజు కాదనలేక రేపు వస్తానంటాడు. ఈ మాట దాసుగారికి సంతోషం కలిగించి, రెండవ రోజు కూడా వెళ్లి అడిగాడు. రాజుగారు తిరిగి రేపు అంటూ రెండవ రోజు వాయిదా వేశాడు. ఈ విధంగా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచినవి. తులసీదాసు విసుగు చెందకుండా రామాయణంలో ఒక శ్లోకం, లేక ఒక పాదం పోనీ దాని అర్థాలన్నా తెలుసుకోమని బ్రతిమిలాడేవాడు. ఓ రోజు రాజుగారు కనిపించలేదు. విచారించగా రాజుగారు చనిపోయినట్లు తెలిసింది. తులసీదాసు ఆంజనేయుణ్ణి ప్రార్థించి రాజుగారి ప్రస్తుత జన్మ ఓ ఎద్దు రూపంలో ఉన్నట్లు తెలుసుకుని ఆ ఎద్దును చూసినాడు. ఎద్దు జన్మలో వున్న రాజుగారు కన్నీరు కారుస్తూ కనిపించాడు. దాసుగారు తన మహిమచే ఆ ఎద్దుకు గత జన్మ స్మృతి కలిగించాడు. ఆ ఎద్దు మనుష్య జన్మలో తాను ఛేసిన తప్పును తెలుసుకున్నాడు. సత్సంగం ఎంత గొప్పదో తెలుసుకొని అదే విషయం దాసుగారికి చెప్పుకొని బాధపడినాడు. నా జన్మ మరొకరికి గుణపాఠం కావాలని చెప్పుకొని కళ్లు మూసుకున్నాడు, ఎద్దు జన్మలో ఉన్న రాజు.
ఇక ఎద్దు జన్మ గురించి శ్రీరామకృష్ణులవారు ఒక ఉపమానం తెలియజేస్తాడు. ఎద్దు మెడపై రైతు కావడి వేసి పొలం దున్నుతాడు. కావడి ఒత్తిడికి ఎద్దు మెడపై పుండు పడుతుంది. ఆ పుండు బ్రహ్మరాక్షసిలా మారుతుంది. కావడి లేచి దిగినప్పుడల్లా పుండుపై భారం పడుతుంది. భారం పడినపుడల్లా బాధ కలుగుతుంది. బాధకు ఆగినపుడల్లా రైతు తోక మెలేస్తాడు. దానికి కూడా కదలకుంటే చండ్రకోలంతో కొడతాడు. పోనీ ఇంటికొచ్చినపుడైనా విశ్రాంతి తీసుకుందాం, బాధ మరచిపోదామనుకుంటే మెడపై పుండు, రక్తం, చీముతో బాధ ఉంటుంది. దానికితోడు ఓ కాకి మాంసం ముద్దని భ్రమించి పుండుపై నుండి పొడుస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎద్దు బ్రతికినంతకాలం బాధపడుతుంది. కాని చివరకు మరోరూపంలోకి మారిన తరువాత మాత్రమే ఎద్దు పరమాత్ముడు ఒకడున్నాడన్న విషయం తెలుసుకుంటుందని శ్రీరామకృష్ణులు చమత్కరించారు.
పాప పుణ్యాలు, పునర్జన్మలు ఉన్నవని తెలుసుకుంటేనే మానవుడికి భయమన్నది కలుగుతుంది. పాపపు పనులు చేయడు. పుణ్యం పనులకు, పరోపకారానికి ప్రయత్నిస్తాడు.

-జమలాపురం ప్రసాదరావు