మంచి మాట

మంచిమాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణంలో ప్రతి సంఘటన హృద్యంగమమే! సీతమ్మవారి జాడ తెలుసుకున్న హనుమను చూసిన తక్షణం మధ్యాహ్నకాల అభిజిత్ లగ్న ముహూర్తంలో యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టామన్నాడు శ్రీరాముడు. యుద్ధ సన్నాహాలను కూడా అత్యంత సుందరంగా సృజించిన వాల్మీకి మహర్షి సదా శ్లాఘనీయుడు.
శ్రీరాముడు స్వయంగా లంకకు వెళ్లి రావణుని సంహరిస్తానని శపథం చేయగానే లక్ష్మణ సుగ్రీవులు ప్రశంసల వర్షం కురిపించారు. కొద్ది క్షణాలలోనే లోక కళ్యాణార్థం మహా సంగ్రామంలో పాల్గొనేటందుకు ఎప్పుడెప్పుడా అని ఉవ్విళ్లూరుతున్న కారణజన్ములైన వానర సమూహాలు పర్వత గుహలనుండి, శిఖరాలనుండి మహాదండుగా రావడం ప్రారంభించాయి. నీలుని సేనానాయకునిగా అభిషేకించాడు శ్రీరాముడు.
హనుమంతుని ఉత్సాహం చూస్తే యుద్ధం పరిసమాప్తమై విజయుడైన శ్రీరామచంద్రుడు సీతాదేవిని తీసుకువచ్చి అయోధ్యకు ప్రయాణమైనట్లు ఉన్నది. అమోఘమైన వానరసేన మధ్యభాగంలో మహాకాయుడైన హనుమ భుజాలపై శ్రీరాముడు, అంగదుని భుజాలపై లక్ష్మణుడు ఆరూఢులై దక్షిణ దిక్కుగా బయలుదేరిన ఆ దృశ్యం అధర్మవర్తులను పరిమార్చే రీతిలో కదులుతున్న మహోగ్ర ధర్మదేవతలా ఉంది.
వానరులు తమ తమ బలమైన వాలములను పెద్దవిగా, నిటారుగా చేస్తూ అడ్డువచ్చిన శిలలను ఛిన్నాభిన్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు. వారి కదన కుతూహలం పెళ్లి విందుకు వెడుతున్న బృందంలా పరమోత్సాహంతో ఉంది. సీతామాతను దర్శించి తమతో తీసుకువచ్చేందుకు కదులుతున్న ఆ వానరసేన రాత్రనక, పగలనక ప్రయాణిస్తూనే ఉంది. లంకకు ఒక తుచ్ఛమైన దేహంగా, సీతామాతను ఒక పవిత్రాత్మగా భావించి ఆత్మదర్శనం చేసుకోవడానికి తహతహలాడుతున్నట్లు ఉంది.
ఎక్కడికక్కడే సమృద్ధిగా లభిస్తున్న కందమూలములు, మధర ఫలాలు సుమధురమైన మధువును తృప్తిగా సేవిస్తూ అలసట లేకుండా ఆహ్లాదంగా సాగుతోంది వానరసేన. సుందమైన సరస్సులలో స్నానపానాలు చేస్తూ పయనిస్తోంది వానరవాహిని. చివరకు సేనతో సహా శ్రీరామచంద్రుడు మహేంద్ర పర్వత సానువులను చేరాడు. పర్వత శిఖరాన్ని అధిరోహించిన శ్రీరామునకు అనంతమైన సాగరం కనపడింది. రాముడు సుగ్రీవునితో సముద్రాన్ని దాటే సమస్యకు పరిష్కారం కోసం సమాలోచన చేయసాగాడు.
ఎగసిపడుతున్న నీలి సముద్రం ఒకవైపు, లయబద్ధంగా పైకి క్రిందికి లేచి పడుతున్న వానర సైన్యం ఇంకొకవైపు. వానర సైన్యం కూడా వింత వర్ణంలో ఒక మహాసముద్రంలా గోచరిస్తోంది. ఆ విధంగా సమరోత్సాహంతో ఆహ్లాదంగా సాగిన వానర సేన దశకంఠుడైన రావణుని అవలీలగా సంహరించిన శ్రీరామచంద్రుని వేనోళ్ల కొనియాడారు. విజయోత్సాహంతో వానరసేన సీతాసమేతంగా పుష్ప విమానంలో అయోధ్యకు చేరి పట్ట్భాషేక విందులో బహుపసందుగా పాల్గొని తమ జన్మలను చరితార్థం చేసుకున్నారు.

- వారణాశి వెంకట సూర్యకామేశ్వరారావు