భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! -3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిమూర్తులు, దేవీమాతలు అతనివైపు ప్రసన్నంగా చూశారు!
‘‘వత్సా! ఇప్పటికి పరిస్థితులు అనుకూలమైనాయని ఏమరిపాటుతో ప్రవర్తించకూడదు సుమా! మంచి, చెడులమధ్య సంఘర్షణ తల ఎత్తుతూనే వుంటుంది! అందుకు కారణం గర్వాహంకారాలే! వాటిని దరి చేరనీయకుండా మసలుకోవాలి! భూలోకంలో ఇప్పుడు ఋషి, మునులకు యజ్ఞయాగాలు సక్రమంగా జరుపుకునే అవకాశం ఏర్పడింది! ఆ ప్రశాంత వాతావరణంలోకి వెళ్లి జీవించడానికి ఒక జంట అవతరించబోతున్నది, చూడండి!’’ అన్నాడు బ్రహ్మదేవుడు చిరునవ్వుతో చూస్తూ!
సభలో వారందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా త్రిమూర్తులనుండి తేజస్సులు వెలువడి, అవి క్రమంగా కలిసి ఒక పురుషాకృతిని దాల్చాయి! దేవీమాతలు ముగ్గురునుండి తేజస్సులు వెలువడి కలిసిపోయి స్ర్తి ఆకృతిని పొందాయి! వాళ్లవైపు ప్రసన్నంగా చూసారు త్రిమూర్తులు!
‘‘ఆహా! అసమాన సౌందర్యంతో అలరారుతున్నారు! వీరిని ఎందుకు సృజించినట్లు?’’ అనుకుంటూ కుతూహలంగా చూస్తున్నారందరూ ఆ జంటవైపు!
శ్రీమహావిష్ణువు వాళ్లవైపు చూస్తూ ‘‘సుందరదత్తుడు, లీలావతి అనబడే మీరిద్దరూ దంపతులై భూలోకంలో ధర్మమార్గాన జీవించండి! గృహస్థాశ్రమ ధర్మాన్ని నెరవేరుస్తూ ఆదర్శప్రాయంగా గడపండి!’’ అని ఆదేశించాడు.
‘‘మీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను!’’ అంటూ నమస్కరించి భూలోకాన్ని చేరుకున్నారు మానుష్యాకృతులు పొందిన ఆ ఇద్దరూ!
***
సుందర దత్తుడు, లీలావతి బదరికారణ్య ప్రాంతం చేరి అక్కడ ఆశ్రమం నిర్మించుకుని ఇతర మునిగణాలతో పాటు జీవించసాగారు! అక్కడకు చేరిన కొద్దికాలంలోనే తమ సత్ప్రవర్తనతో అందరి ఆదరాభిమానాలు చూరగొన్నారు!
‘‘ఈ జంటను చూస్తుంటే ఎంతో ముచ్చటవేస్తున్నది! ఆ యువకుడు పేరుకు తగ్గట్లే సుందర రూపంతో మనందరికీ దత్తుడై పుత్రుడికన్నా ఎక్కువగా గౌరవాభిమానాలు చూపుతున్నాడు! అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ, దైవకార్యాలు ఏ కొరతా లేకుండా నెరవేరస్తున్నాడు! లీలావతి కూడా అతనికి తగిన పత్నిగా, ఆదర్శ గృహిణిగా జీవిస్తున్నది! పెద్దలంటే గౌరవం, అందరినీ స్నేహపూర్వకంగా పలకరిస్తూ సహాయపడుతుంటుంది. వీళ్లిక్కడికి రావడంతో ఈ ప్రాంతానికి కొత్త కళ వచ్చింది కదూ?’’ అంటూ మెచ్చుకునేవాళ్లు అక్కడ నివశిస్తున్న మునిగణాలు!
ఆ ప్రశంసలు అతిశయోక్తులు కావు! నిజంగానే దత్తుడు, లీలావతి మనసా, వాచా కర్మణా ఎన్నడూ ఎవరినీ నొప్పించకుండా మసలుకునేవారు! కాలం వేగంగా గడిచిపోసాగింది. తమకున్నదానిలో పరులకు ఉపకారం చేస్తూ, ఎవరినీ నొప్పించకుండా సంతోషంగా కాలం గడుపుతున్న ఆ దంపతుల జీవితం హఠాత్తుగా అనుకోని మలుపు తిరిగింది!
ఒక రోజు...
‘‘లీలావతి! ఒకసారి ఇలారా! నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి!’’
లోపల పనిలో వున్న లీలావతి భర్త పిలుపు విని బయటకు వచ్చింది.
ఆశ్రమం ముందున్న అరుగుమీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్న దత్తుడి ఆమె రావటం చూసి ‘‘ఇట్లా కూర్చో లీలా!’’ అన్నాడు ప్రక్కకు జరుగుతూ.
‘‘ఏమిటి చెప్పండి!’’ అంటూ ప్రక్కన కూర్చుంది, భర్త ముఖంలోకి పరిశీలనగా చూస్తూ.
‘‘ఈవేళ ఉదయం నుండి ఎందుకో ఏదో ఆలోచిస్తూ గంభీరంగా వున్నారు! ఏ విషయం గూర్చి ఆలోచిస్తున్నారు చెప్పండి?’’ అడిగింది లీలావతి.
‘‘చెబుతాను. జాగ్రత్తగా విను. మనకు వయస్సుమీద పడుతున్నది. ఈ గృహస్థాశ్రమాన్ని త్యజించి సన్యసించి తపస్సులో కాలం గడపాలన్న సంకల్పం నాలో చోటుచేసుకుంది..’’
అతని మాట పూర్తికాకుండానే ‘‘ఏమిటండీ వింతగా మాట్లాడుతున్నారు? మనకు సంతాన భాగ్యం కూడా కలగలేదింకా! నాకు సంసారిక సుఖాలమీద ఇంకా మోహం తీరలేదు. మీరు సన్యసించి తపస్సుకు వెళ్లడమేమిటి?’’ అన్నది ఆందోళనగా చూస్తూ!

-ఇంకాఉంది

-డా. టి. కళ్యాణీ సచ్చిదానందం