మంచి మాట

జయాపజయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలచక్రం పగలు రేయిల సమాహారం. జీవిత చక్రం కష్టసుఖాలు, జయాపజయాలు, కలిమిలేముల కలయిక. కష్టాలు, అపజయాలు జీవిత చక్రాన్ని ఎలా నడపాలో చెబుతాయి. జయం జీవన సాఫల్యం, జీవితంలో మరువరాని ఘటన. జయమే జీవితం కాదు. అది జీవితంలో ఒక భాగం మాత్రమే! జయం ఎప్పటికీ జీవిత గమ్యం కాదు. అది అలుపు సొలుపులెరుగని నిరంతర ప్రయాణం. థామస్ ఆల్వా ఎడిసన్ సెలవిచ్చినట్టు ‘‘విజయానికి కావాల్సింది పది శాతం ప్రేరణ, తొంభై శాతం కఠోర శ్రమ’’. జయం కోసం శ్రద్ధతో, నిరంతరం శ్రమచేస్తూ లక్ష్య దిశలో నిలకడగా, నెమ్మదిగా పయనించాలి. అల్లకల్లోలంగా వుండే అలలను అధిగమిస్తూ నౌకను నడిపినవాడే అసలు సిసలు నావికుడు.
చేసే ప్రతి పనిలో పొరపాట్లు, వైఫల్యాలు దొర్లి ఉండవచ్చు. వాటికి అధైర్యపడి వెనుతిరగరాదు. అపజయాలు నిన్ను ఆపేసే చిహ్నాలు కాదు. అవి సరైన గమ్యాన్ని చూపే మార్గదర్శకాలు. ముందుగా అపజయాల ఎరుపు చిహ్నం కొద్ది క్షణాలు కన్పిస్తుంది. తర్వాత అపజయాలనుండి బయటపడమని చెప్పే నారింజ రంగు చిహ్నం, వెంటనే విజయం దిశగా సాఫీగా సాగమని చెప్పే ఆకుపచ్చ చిహ్నం కన్పిస్తాయి. జీవిత ప్రయాణంలో కూడళ్ళలో ఇలా వస్తూ పోతూ వుంటాయి.
వైఫల్యం అనేది విజయానికి పునాదిరాయి. ఎడిసన్ విద్యుత్ దీపాన్ని కనుక్కోవటానికి వెయ్యి వైఫల్యాలను చవిచూశాడు. ఆ సందర్భంలో ఒక విలేకరి ‘‘విద్యుత్ దీపాన్ని కనుక్కోవటంలో వెయ్యిసార్లు వైఫల్యం చెంది ఇపుడు గెలిచిన మీకు ఏమన్పిస్తోంది?’’ అని ప్రశ్నిస్తే ‘‘నేను వెయ్యి సార్లు వైఫల్యం చెందలేదు. వెయ్యి అంచెల తర్వాత విద్యుత్ దీపాన్ని కనుక్కోగలిగాను’’ అంటూ ఆత్మవిశ్వాసాన్ని వెళ్ళబుచ్చాడు. వైఫల్యం నిరాశకు కారణం కారాదు, కొత్త ప్రేరణకు నాంది కావాలి. స్కాట్లండ్ రాజు రాబర్డ్ బ్రూస్ యుద్ధంలో ఆరుసార్లు ఓడిపోయి సైన్యం చెదురవగా చివరకు అజ్ఞాతంలోనికి వెళ్ళాడు. వర్షం కురిసిన ఒక రోజు గుహలో తలదాచుకుంటాడు. ఇంతలో ఒక సాలీడు తన తల నుండి వేలాడుతూ కన్పించింది. చికాకులో దానిని ఆరుసార్లు గోడపైకి విసిరేశాడు. అధైర్యపడక ఏడోసారి పైకి లేచి చక్కని గూటిని అల్లేసింది. ఈ ఘటనకు ప్రేరణ పొందిన బ్రూస్ ధైర్యాన్ని కూడగట్టుకుని, మంచి పథకాన్ని రచించి ఏడోసారి యుద్ధంలో గెలిచి ఇంగ్లండ్‌కి రాజయ్యాడు. అపజయాల అసలు చిరునామాగా ముద్రపడిన అబ్రహం లింకన్ 1832 నుండి 1852 వరకు జరిగిన 7 ఎన్నికల్లో పరాజయం పాలై 1860లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాడు.
ఎవరికైనా రాత్రికిరాత్రే గెలుపు అసాధ్యం. గెలుపుకి ఆరాటం తక్కువ, పోరాటం ఎక్కువ ఉండాలి. పోరాటానికి దూరంగా జరిగే వారికి గెలుపు గగన కుసుమం. ప్రతి విజయం వెనుక అనేక ఓటమి సంవత్సరాలు కూడా ఉంటాయి. పసందైన పరమ పద సోపానపటం ఆటలో ఎంతో ఎత్తుకి వెళ్లినా, పాము మింగితే ఒక్కసారిగా అమాంతం కిందకు జారిపోతాం. ఉత్సాహంగా ఆడుతూ వెళితే నిచ్చెనలు నిట్టనిలువుగా ఉన్నత స్థానాలకు చేర్చుతాయి. గెలవకపోవటం ఓటమి కాదు, తిరిగి మళ్లీ ప్రయత్నించకపోవటమే పెద్ద ఓటమి. గర్వం, నిరాశ, నిరుత్సాహం, సోమరితనం, కోపం, భయం అపజయానికి ఆరు కారణాలు. అపజయాన్ని అర్థం చేసుకోవటమే విజయరహస్యం. విజయం అంటే నిట్టనిలువుగా పైకి ఎగబాకటం కాదు, ఎంతగా కిందకు పడిపోతే అంతకంటే వేగంగా తిరిగి పైకి లేవగలగటం.
అపజయాన్ని తలరాతగా భావిస్తూ ప్రయత్నించకుండా ఉండకూడదు. ప్రయత్నించి అపజయం పాలైనా ఫర్వాలేదు. అపజయం శబ్దానికి భయపడి చెవులు నేడు మూసుకుంటే, రేపటి జయం చప్పుళ్ళను ఎలా వినగలం? ఆత్మ పరిశీలన, ఆత్మవిశ్వాసం, గత అనుభవాలు, ప్రయత్నం, సమయ సద్వినియోగం, సరైన ప్రణాళిక, ధైర్యం, ధ్యేయం, సంకల్పం, సాహసం, అంకితభావం, శ్రమ పట్ల గౌరవం, సమయ సద్వినియోగం, జ్ఞాన సముపార్జనలు విజయ సౌధానికి ఇటుకలు.

-ఎ.ఎన్.ఎస్.శంకరరావు