మంచి మాట

సద్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్య జీవితంలో ఏ ఇరువురి ఆలోచనలు అభిప్రాయాలు కాని, వారి జీవిత విధానాలు కాని ఒకే రీతిలో వుండవు. వైవిధ్యభరితమైన జీవితంలో పలు వైరుధ్యాలు కనిపిస్తుంటాయి. ఒకరు అవునన్నది ఇంకొకరు కాదనడం, కాదన్నది మరొకరు అవుననడం అనాదిగా కొనసాగుతున్నదే. ఒకరు భక్తిపూర్వకంగా ఏది జరిగినా దైవలీలగా భావిస్తే, మరికొందరు దైవం చిరునామా ఎక్కడని ప్రశ్నించేవారున్నారు. ఎవరి తీరెలావున్నా ఎంతో చిన్నదనగిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడమెలా అన్నది ప్రతి ఒక్కరిని ఎంతో కొంత ఆలోచింపజేసే విషయమే!
పువ్వులు, నవ్వులు, వెలుగులు, విజయాలు అందరికీ ఆనందం కలిగించే అంశాలే అయినప్పటికీ వాటిని అంటిపెట్టుకునే వుండే ముళ్లు, ఏడ్పు, చీకటి, ఓటమి వంటివి ప్రతిక్షణం ప్రశ్నలై ప్రతిధ్వనిస్తున్నట్లనిపిస్తుంది. కాలంతో పరుగు తీస్తున్నట్లు మనిషి భ్రమించడమే తప్ప మానవ లోకమంతా ఒకటై ముందడుగు వెయ్యగలిగినా ఒక్క సెకను ఒకే ఒక్క సెకను సమయాన్ని వెనకడుకు వేయించడం సాధ్యం కాదు కదా! అందుకే ప్రతిక్షణం అప్రమత్తంగా వుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. అప్పుడే అవకాశాలు కలసివస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగేవారికి అంతా బ్రహ్మాండంగా వుండకపోయినా అనుకోని అవరోధాలు ఎదురైనప్పుడు కష్టతరమనిపించినా వాటినుండి బయటపడేందుకు చేసే ప్రయత్నంలో ఎలాంటి లోపం వుండదు.
క్షణికావేశంలో మనిషి ఎనె్నన్నో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటాడు. తన నిర్ణయాలకు తానే ఎంతగానో నష్టపోతాడు. ఫలితంగా లోకమంతా కలిసికట్టుగా తనను భయపెడుతున్నట్లు బాధపెడుతున్నట్లు ఏవేవో ఊహించుకుంటాడు. అందుకు భిన్నంగా ఆలోచించగలిగితే తనకు తెలిసిన నలుగురితో కాకపోతే తెలియనివారికి తన పరిస్థితి ఇదీ అని వివరించగలిగితే క్షణాల్లో వారు అద్భుతాలు చెయ్యలేకపోవచ్చుగాని, వారి సలహాలు సూచనలు స్వీకరిస్తే సముచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగి తీరుతుంది. తద్వారా లోకం తాననుకున్నంత సంకుచిత స్వభావంతో నిండిపోలేదని మాట సాయమందించడంలో లోకానిది విశాల హృదయమేనని స్పష్టమవుతుంది. లోకమెప్పుడైనా ఎక్కడైనా తానున్నానన్న భరోసా కలిగించదు. లోకానికనుకూలంగా అడుగులు వేస్తూ లోకముందన్న భరోసాతో మనిషే ముందుకు సాగిపోవాలి. చేతికందిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. తన చుట్టూ వున్నవారితో తనకెంత అవసరమో, వారికి తన అవసరం అంతకుమించి వుంటుందన్నది విస్మరించరానిది.
జీవితంలో పలు సందర్భాల్లో ఎదురయ్యే పరిస్థితులు ముందుకెళితే నుయ్యిలా వెనక్కెళితే గొయ్యిలా గోచరిస్తుంటాయి. అయోమయంలో పరిస్థితి తీవ్రత పెరుగుతుందే తప్ప తగ్గదు. దాహాన్ని తీర్చగలిగే నీరు ఆకలిని కొంతమేర తీర్చగలదేమోగాని ఆకలిని తీర్చగలిగే అన్నం దాహాన్ని తీర్చలేదన్న నిజాన్ని తెలుసుకునేందుకు కూడా తెలివితేటలో, అనుభవమో కావాలా? ఊహ తెలిసిన తర్వాత ముఖ్యంగా తమను తాము తీర్చిదిద్దుకునే క్రమంలో జీవితాన్ని అర్థం చేసుకోగలిగిన వారెవరైనా, అందం, అధికారం, సంపద, ప్రాపకం వంటివేమీ జీవితంలో శాశ్వతం కావని తెలుసుకుంటారు. ఇంటా బయటా మనిషిని మరో మనిషి చిరునవ్వుతో పలకరిస్తూ ప్రేమాభిమానాలను పెంచుకోవడమే జీవితానికి వనె్నతెచ్చే విషయంగా భావిస్తాడు. అదే విషయాన్ని తానున్న సమాజంలో ఆచరించి చూపుతాడు.పగలు తర్వాత రాత్రి, వెనె్నల తర్వాత చీకటి వున్నట్లే జీవితంలో సుఖమొక్కటే ఏ ఒక్కరికి శాశ్వతం కాదు. సుఖం తర్వాత కష్టమెంత సర్వసామాన్యమో కష్టం తర్వాత సుఖం సైతం అంతే! అనారోగ్యం, శత్రుబాధలు దరిచేరనివ్వక మనిషి తన జాగ్రత్తలో తానుండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటిని తప్పించుకోలేక అవి చాలవన్నట్లు ఆర్థిక సమస్యలు, అవహేళనలు తోడైనా విచారిస్తూ కూర్చోవడంవల్లనో, పరనిందవల్లనో ప్రయోజనం వుండబోదు. తన బలాలేమిటో బలహీనతలేమిటో తెలుసుకుంటూ వున్న బలాలను పెంచుకునే ప్రయత్నంలో బలహీనతలను తొలగించుకోగలగాలి. సంయమనం పాటించడంలోనైనా జీవితంలో ఎదుగుదలకైనా అడ్డుగోడలు వుండకూడదని ప్రతిక్షణాన్ని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి.

- కొల్లు రంగారావు