మంచి మాట

ఆత్మశక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతిలో అనేక జీవరాసుల సృష్టి జరుగుతూ ఉంటుంది. పురాణాల ప్రకారం ఈలోకంలో 84 లక్షల జీవరాసులున్నాయ. ఇవన్నీ భగవంతుని అంశలే అన్నది భగవద్గీత సారాన్ని బట్టి తెలుస్తోంది. సర్వం ఈశ్వరమయం కదా. జన్మలనేవి వారి వారి కర్మలనుబట్టి లభ్యమవుతాయ. జన్మలెన్ని ఎన్ని ఎత్తినప్పటికి పరమార్థమేమీ ఉండదు. మోక్షం దొరికేవరకు జన్మల పరంపర సాగుతూనే ఉంటుం ది. జ్ఞానమావిర్భవించి భగవంతునికి ప్రాణికి భేదంలేదని తెలుసు కొనేదాక లేక భగవంతుని తత్వాన్ని ఎరుక పరుచుకునేదాకా ఈ జననమరణచక్రం తిరుగుతూనే ఉంటుంది.
ఎట్టి పరిస్థితుల్లో ఏ జీవి అంశమైనా ఆ దివ్య అఖండాత్మలో లీనమయ్యే వరకు జన్మలురావడం తప్పని సరి మహర్షులు చెబుతారు.
జీవరాసులన్నింటికంటే ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ. జీవులు అన్నింటికి ప్రాణం-శరీరం-ఆత్మ తప్పక ఉంటాయి.కాని మనుషులకు మాత్రం శరీరం, ప్రాణం, ఆత్మతోపాటు బుద్ధి, మనసు కూడా ఇవ్వడం జరిగింది. వీటితోపాటు మనిషి ఆత్మను గుర్తించలేని మాయను ఇవ్వడం జరిగింది.
పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భం కప్పివేయబడినట్టు జ్ఞానం కామముచే ఆవృతమై ఉంటుంది.
మనిషికి అజ్ఞానమనే మాయ పెద్ద దాటలేని పరీక్ష. జ్ఞానాన్ని పొందాలంటే మాయను తప్పనిసరిగా ఛేదించాలి. ఆ మాయలోనే అన్ని అవలక్షణాలు ఉన్నాయి. వాటితోనే నిత్యం మమేకమై ఉండేదే మనిషి జీవనం.
కలి ప్రభావం మనుషులందరిపైనా ఉంటుంది. కలి ప్రభావం వల్లనే అహంకారపూరితులు అవుతారు. కాని ఆ కలిమాయను తెలుసుకొని మమకారం, అహంకారం, చివరి వరకు నేను, నాది అనే భావాన్ని విడువలేకపోవడం. వీటినన్నింటిని విడిచిపెట్టినపుడు సమబుద్ధి ఏర్పడు తుంది. దానిద్వారా భగవంతుని తత్వం అలవడుతుంది.
మనసును భగవంతునిపై లగ్నం చేస్తూ ఐహిక విషయాలపై అదుపును కలిగిఉండడం అనేది కష్టసాధ్యమైనపని. కాని దీన్ని ఏకాగ్రతతో అకుంఠిత దీక్షతో చేస్తూనే ఉండాలి. ఒకనాటికి విజయం తప్పక సిద్ధిస్తుంది. ఆత్మ అఖండాత్మ. ఆ పరమాత్మను దర్శించాలన్నా చేరుకోవాలన్నా మనసును, మాయనుండి విడదీసి భగవంతునిపై లగ్నం చేయాలి.
ఆత్మశక్తి చాలా గొప్పది. తన్ను తాను తెలుసుకున్నవారికి ఆత్మజ్ఞానం జాగృతమై భగవంతునిపై లగ్నం చేయగలుగుతారు. అస్థిరమైన అశాశ్వతమైన ప్రాపంచిక విషయాశక్తి మనో నిగ్రహం ముందు ఎంతమాత్రం ప్రభావం చూపజాలవు. వీటన్నిటికీ ముందుగా ఆ సర్వేశ్వరానుగ్రహం లభించినవానికి మాయను ఛేదించడం ఐహిక విషయ వాసనలను త్యజించడం అనేది సులభసాధ్యమే. కనుక ఆ భగవంతుని అనుగ్రహంకై సర్వులు సర్వవిధాల ప్రయత్నించాలి. ప్రార్ధించాలి. స్థిర చిత్తంతో సర్వత్ర నెలకొన్న సర్వాంతర్యామికై ఆత్మనివేదన చేయాలి.
వైరాగ్యం వృద్ధాప్యానికి చిహ్నం కాదు. జీవితానికి తొలినుండి వైరాగ్యం పట్టుకొమ్మలాంటిది. మనిషి జీవితానికి వైరాగ్యం వజ్రాయుధం లాంటిది. వైరాగ్యం అనగా దేనిమీదా రాగం లేకపోవడం ‘విరాగం’. రాగాన్ని పట్టుకోవడం వలనే రోగాలనీ వస్తాయి. రాగంనుండే కోరికలు ఉత్పన్నంఅవుతాయ. అది తీరకపోతే కోపం ప్రకోపిస్తే ద్వేషం ఏర్పడుతుంది అనేది చరిత్ర చెప్పిన సత్యం.
రాగానికి ముద్దుపేరు వాత్సల్యం. పుత్రవాత్సల్యంతో దశరధుడు శ్రీరాముడు తనకు దూరమైతే నాకు మరణంతో సమానమని అనుకొన్నాడు. నిజంగా రాముడు దూరమైన క్షణాలు గడుపలేక దశరథుడు అసువులు బాసాడు. పిల్లలు చెడ్డద్రోవలో పోతున్నప్పుడు మందలించక కట్టడి చేయని తల్లిదండ్రులు ధృతరాష్ట్రుని గుడ్డి పుత్ర వాత్సల్యాన్ని తప్పనిసరిగా గుర్తుకు తెచ్చుకోవాలి. వీరిద్దరిదికూడా పుత్రమమకారమే. అందుకనే జనకమహారాజులా దేనిపైనా, రాగంఅంటే మమకారం లేకుండా విరాగులై జీవించడం నేర్చుకోవాలి. ఎంత సంపాదించినా ఎంతఅనుభవించినా ధర్మం తప్పకుండా ప్రవర్తించాలి.
పనిమీద అనురక్తి కలిగి నైపుణ్యంగా పని చేయాలి. తనకు భగవంతుడిచ్చిన దాన్ని దేనినైనా ప్రసాదంలా స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. పరాయిది తనది కాదు తనకు లభించిందే తనది అన్న తత్వం తెలుసుకోవాలి.

-ఎ.నాగభూషణరావు