మంచి మాట

ఋణబాధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరణ బాధను మించిన బాధ ఈ లోకంలో ఏదైనా ఉందా అంటే అది ఋణబాధనే చెప్పాలి. మృత్యువన్నది ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తన పని పూర్తి చేసుకుని పోతుంది. ఋణబాధ అలా కాదు. దినదినగండంగా మారి చచ్చేదాకా పీడిస్తునే ఉంటుంది. మనిషన్న వాడికి ఆర్థిక ఇబ్బందులు రావడం సహజం.
అలాంటప్పుడే మనోధైర్యంతో వాటిని ఎదుర్కోవాలి. అలా కాకుండా భేషజాలకు పోయి అప్పులు చేస్తే మాత్రం తిప్పలు తప్పవు. హరిశ్చంద్రుడు అంతటివాడే అప్పుల ఊబిలో కూరుకుపోయి భార్యా బిడ్డలతో అనేక కష్టాల్ని చవి చూసాడు. రామభక్తుడైన గోపన్న ఋణబాధ పిశాచానికి బలై కారాగారం పాలై అనేక కష్టాల్ని అనుభవించాడు. అటువంటప్పుడు మనమనగా ఎంత?
ఋణం అంటే ఒకరి కష్ట్ఫలాన్ని మరొకరు అనుభవించడమే. అందుకు అప్పు తీసుకున్నవాడు పుచ్చుకున్నదానికి అదనంగా అంతో ఇంతో చెల్లించవలసి వుంటుంది. అసలుకు మించి వడ్డీ చెల్లించేవాళ్లను ఎందరినో మనం చూస్తున్నాం. నిజానికి అప్పు చేయడమన్నది ఒక వ్యసనం లాంటిది.
ఒకసారి దాని రుచి మరిగితే మ ళ్లీ మళ్లీ అప్పు చేయాలనిపిస్తుంది. తీసుకున్న అప్పు తీర్చలేక ఇబ్బందులో పడేవాళ్లు కొందరైతే స్వల్ప ఆదాయంవల్ల వడ్డీమాత్రమే కడుతూ అసలు తీర్చలేక నానా యాతన పడేవాళ్లు మరికొందరు. అప్పు తీసుకున్న వ్యక్తికి డబ్బిచ్చిన వాడు తన పీకలమీదకు ఎప్పుడొచ్చి పడతాడోనన్న బెంగ అనుక్షణం పీడిస్తునే ఉంటుంది. ఫలితం మనశ్శాంతిని కోల్పోతాడు. దాంతో చిరాకు పరాకు ఎక్కువై ఆత్మీయుల్ని సైతం బాధపెడతాడు.
వ్యవహారంలో పుచ్చుకున్నవాడే కాదు ఇచ్చిన వాడు కూడా సుఖపడలేడు. అనుక్షణం ఇచ్చిన సొమ్మును ఎలా వసూలు చేసుకోవాలా అని మదనపడుతూ ఉంటాడు. అవసరానికి మించి ధనం ఉన్నా లేకున్నా ఈ లోకంలో కష్టంగానే వుంటుంది. డబ్బు ఎక్కువగా వుంటే దాని వెంబడే భయం ఆవరించి ఉంటుంది. అయినా సరే సిరిని పదింతలు చేయాలన్న యావ వుంటుంది. ఫలితంగా మనశ్శాంతి కరవవుతుంది.
ధనం మూలం మిదమ్ జగత్ అన్నట్టు లోకంలో ధనానికున్న ప్రాధాన్యత ఇంతా అంతా కాదు. అప్పు ఇచ్చేవారు తామిచ్చిన పైకం కంటే పరులనుంచి ఎక్కువ సొమ్మును ఆశించడం ఒకరకంగా అన్యాయమనే చెప్పాలి. అయితే వారు ఇలా ఆలోచించరు. ఇతరులకు అవసరమైనప్పుడు వారి ఇబ్బందులనుంచి విముక్తుల్ని చేయడానికి మా కష్టార్జితాన్ని ఇస్తున్నాం. తిరిగి దానినే వారు చెల్లిస్తున్నారని సమర్ధించుకుంటారు.
ఆపత్కాలమందు సహాయం పొందినవారు మరికొంత మొత్తాన్ని వడ్డీరూపంలో కృతజ్ఞతగా ఇస్తే తప్పేంటి అంటారే తప్ప పరధనాపేక్ష కూడదన్న ధర్మసూత్రాన్ని అంగీకరించరు. పైపెచ్చు కష్టకాలంలో వారిని ఆదుకోవడం మావంటి వారి విధి అని గొప్పగా చెపుతూ ఉంటారు.
ఋణ వ్యవహారంలో అప్పు ఇచ్చేవాడు పుచ్చుకున్నవాడు ఇరువురిలో ఏ ఒక్కరు సుఖపడలేరు. లోకంలో అప్పుల వలయంలో చిక్కి దాని ఫలితాన్ని అనుభవించువారు, అప్పులిచ్చి ఆవతల వారిని జీవచ్ఛవాలను చేసి సంతోషించువారు కూడా ఉన్నారు. ధనవంతుడు తన డబ్బుని వడ్డీకిచ్చి, వడ్డీకి వడ్డీ వసూలు చేస్తు కూడబెడితే ఆ ధనాన్ని ఎవరో ఒకరు తన్నుకుపోవచ్చు.
అందువల్ల ఉన్నవారు ఆపదల్లో ఉన్నవారికి అంతో ఇంతో సహాయపడుతూ వడ్డీ తీసుకోకుండా వారి కష్టల్లో భాగస్వాములు కావడమే ఉత్తమం. చెంచులక్ష్మిని బంధించేవారెవరూ ఈ లోకంలో ఉండరు. అందుచేత ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నామని దుఃఖించకూడదు. మనసు దిటువ చేసుకుని వాటిని అధిగమనించేందుకు శతవిధాల ప్రయత్నించాలి. రేపు మనల్ని ధనలక్ష్మి వరిస్తుందేమో ఎవరికి తెలుసు?
ధనవంతుడు తన సంపదని వడ్డీ వ్యాపారం చేస్తూ ఒకటికి పదింతలు చేయాలనుకోకుండా దానిని సద్వినియోగపరచాలి. అలా చేయడంవల్ల ఆ వ్యక్తికి తృప్తి, సౌఖ్యం లభిస్తాయి. అంతేకాదు ఆ పరమేశ్వరుడు అటువంటి వారికి సర్వదా తోడ్పడుతుంటాడు. ఫలితంగా దైవానికి చేరువ కాగలడు.

-దూరి వెంకటరావు