డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా జీవితం! నా జీవితం! ఏమిటా జీవితం- ఏమో! దాన్ని గురించి ఆలోచించడం ఏనాడో మానేశాను. ఎప్పుడూ కావలసినంత పని, చేతినిండా పని లేకపోతే ఖాళీ. ఈ రెంటి పోరాటంలో నడిచిపోయింది. నా పని అంటూ ఎప్పుడూ ఉండేది కాదు. అలా అని ఖాళీగా కూర్చునేదాన్ని కాదు! నేనే కాదు నన్ను ఖాళీగా ఉంచటానికి ఇంట్లో ఎవరూ ఇష్టపడేవారు కాదు!
మొదటి 18 ఏళ్ళ జీవితం ఎలా గడిచిపోయిందో- మరచిపోలేను. ఇంట్లో ఆఖరు అవడంతో ఏ బాధ్యతా లేకుండా, వచ్చిన ప్రతి సినిమాకు వెడుతూ, వారపత్రికలు చదువుతూ, నా చదువు, స్నేహితులు తప్ప మరొకటి లేకుండా గడిపాను.
అప్పుడప్పుడు అమ్మ మాత్రం ‘‘నువ్వేమీ పనులు నేర్చుకోవడం లేదు’’ అంటూ ఉండేది. వెంటనే మామ్మ ‘ఆ పోనిద్దు, బాధ్యతలు మీదపడితే పనులు అవే వస్తాయి’’ అనేది. అలాగే నామీద బాధ్యతలు పడలేదు. నేను పనులూ ఎక్కువ నేర్చుకోలేదు. నేనే ఒక బాధ్యత అయ్యాను.
నా జీవితం మరోలా ఉంటే మా మామ్మ మరో పదేళ్ళు బతికేదేమో! నేను ఎప్పుడు ఆవిడ దృష్టిలో పడినా, కళ్లు తుడుచుకోకుండా ఉండేది కాదు.
అసలు నా జీవితంలో ఏదీ నాది అంటూ ఒక ప్రణాళిక ప్రకారం చేయలేదు.
ఏ రోజు గాలి ఎటు వీస్తే అటు వెళ్లిపోయింది. ఏ సమయంలో ఏది సరయినది అనిపిస్తే అది చేయడం జరిగింది.
నాదే కాదు, మనలో సగానికి సగంమంది జీవితాలు అలాగే నడుస్తాయి.
ఒక రోజు కాలేజీ నుంచి వచ్చే టైంకి ముందు వరండా అంతా శుభ్రం చేసి, కుర్చీలు అవీ వేసి నీట్‌గా సర్ది ఉన్నాయి. అమ్మ, అన్నయ్య, నాన్న అంతా ఎవరినో రిసీవ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు.
నన్ను చూడంగానే, అమ్మ హడావుడిగా ఎదురువచ్చి, ఇంత ఆలస్యం అయిందేం అంటూ జబ్బ పుచ్చుకుని లోపలకు లాక్కెళ్లింది. అమ్మ వెనక గబగబా వెడుతూ, చేతి గడియారం వంక చూశాను. రోజూకంటే 5 నిమిషాలు మాత్రం ఆలస్యం. అదీ బస్సు రావడం ఆలస్యం మూలంగా!
లోపలకు వెళ్ళంగానే, వెంటనే స్నానం చేసి ఈ చీర కట్టుకో. త్వరగా పూర్తిచేయి. ఆలస్యం చేయకు. పెద్ద మనుషులని వెయిట్ చేయిస్తే బాగుండదు అని తను వెళ్లిపోయింది.
ఎవరా పెద్దమనుషులు. ఇంత అనుకోకుండా ఈ ఏర్పాట్లు ఏమిటి? నాకెవరూ చెప్పకపోయినా ఈ హడావిడి ఏమిటో నాకు తెలుసు. చిన్నక్క పెళ్లిముందు నాలుగు, అయిదుసార్లు ఇలాగే జరిగింది.
కొంచెం కోపం అనిపించింది. కాని, ఆటైంలో నా మాట ఎవరూ వినరని నాకు తెలుసు. అందుకే, మాట్లాడకుండా అమ్మ ఎంత త్వరగా అని చెప్పినా హాయిగా తీరిగ్గా స్నానం చేశాను. మెల్లిగా తయారయ్యాను.
నా తయారీకి పెద్ద స్పెషల్ ఏమీ లేదు. కొద్దిగా పౌడర్ అద్దుకుని, దోసగింజల్లె బొట్టు పెట్టుకున్నాను. కళ్ళకి కాటుక అంతే. తల దువ్వుకుని జడ అల్లుకుంటుంటే వదిన లోపలికి వచ్చింది బారెడు పూలదండ పట్టుకుని.
‘‘ఇంతేనా అలంకరణ?’’ అడిగింది.
నవ్వాను. ‘‘ఏం చేసినా, ఇంతకంటే ఎక్కువ ఏం ఫలితం ఉండదు. టైం వేస్ట్’’ అన్నాను! మా ఇంట్లో అందరి దృష్టిలో నేను చలా చక్కనిదాన్నని వాళ్ళ ఉద్దేశ్యం. మా అమ్మ అయితే చిదిమి దీపంపెట్టచ్చు అంటుంది. ఆ మాటకు అర్ధం నాకు ఇప్పటికీ తెలియదు. మామ్మని అడిగితే నా మనుమరాలు చక్కటిది అని అర్థం అని కొట్టిపారేసేది. మా మామ్మకు, తన మనుమలు, మనుమరాళ్ళు గురించి ఎక్కువ మాట్లాడటం ఇష్టం ఉండదు. వాళ్లకు దిష్టి తగులుతుందని ఎవరూ చూడకుండా మెటికలు విరుచుకునేది.
మా అమ్మ మూతి మూడుసార్లు తిప్పి అత్తగారిని వేళాకోళం చేసేది. మీరొక్కరేనా ఏమిటి ప్రపంచం మనుమలను ఎత్తింది. విరుచుకుని, విరుచుకుని, ఆ చేతి వేళ్ళు రాలిపడిపోతాయి అనేది.
‘‘పోనీలే! నా మనుమలే అన్నం కలిపి పెడతారు’’ అనేది మామ్మ.
అలవాటు ప్రకారం మనసు ఎటో వెడుతోంది.
నెత్తిమీద ఒక్క జెల్ల కొట్టి, పూలు తలలో పెట్టుతూ, మెల్లిగా గుసగుసగా అంది వదిన.
‘‘వాళ్ళు వచ్చేస్తారు! ఆ అబ్బాయి మాత్రం నాకు చాలా నచ్చాడు. వెరీ హేండ్‌సమ్’’ అంది కళ్ళు ఎగరేస్తూ.
‘‘పోనీ నిన్ను చేసుకుంటాడేమో అడుగు’’ అన్నాను.
‘‘అడుగుదును కానీ మీ అన్నయ్య దేవదాసు అయిపోతాడు’’
వదిన ఎప్పుడూ అంతే, ఏ మాటయినా తేలిగ్గా తీసుకుంటుంది.
నవ్వి ఊరుకున్నాను.
మనసంతా చిరాగ్గా ఉంది. ‘‘ఏమిటిది వదినా! నాకు చదువుకోవాల్సింది బోలెడుంది. హఠాత్తుగా ఈ ఏర్పాట్లు ఏమిటి’’ అన్నాను చిరాగ్గా!
‘‘ఊరికే చిరాకుపడకు. చిర్రుబుర్రులాడుతూ కనిపించకు ఆ అబ్బాయికి. హడలిపోయి ఇక్కడినుంచే అమెరికా వెళ్లిపోతాడు’’ అంది.
అర్థం కానట్లు చూశాను.
‘‘వివరాలన్నీ తరువాత చెప్తాను. వెళ్లి ప్లెజెంట్‌గా కూచో’’ అంది వదిన.

-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి