మంచి మాట

సుందరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూచిన తోడనే సుశబ్దశోభితుడుగా కనబడ్డ సుందరుడు అంజనీసుతుడు ఆంజనేయుడు. ‘కంటిని సీతమ్మ’ను అని దుఃఖార్తిలో మునిగిపోయిన రామునికే సంతోషం కలుగజేసినవాడు. ‘ రాఘవుడున్నాడమ్మా నీ మనోభిరాముడు నీకోసమే ఎదురుచూస్తున్నాడమ్మా!’ అంటూ శోకసముద్రంలో కొట్టుకొని పోయే సీతమ్మకు ఆసరాగా కనిపించినవాడు. సోదరుని భయంతో వణికిపోయే సుగ్రీవునికి ‘‘ఇదుగో ఈ రామభద్రునితో స్నేహం కలుపు నీకు మేలు జరుగుతుంది’’అని స్నేహహస్తాన్ని చూపినవాడు. పొందిన సత్కృతిని మరిచి సుఖలాలసకు బానిసయై ఇచ్చిన మాటను మరిచిన సుగ్రీవునికి కర్తవ్యోపదేశాన్ని చేసి కార్యోన్ముఖుడిని చేసినవాడు. ఎర్రపూలు, జిల్లేడు (అర్క) పుష్పాలు, తమలపాకులు అంటే అత్యంత ప్రీతి గలవాడు. వడమాలలిచ్చిన వారికి కోరిన కోరికలు ఈడేర్చువానిగా ప్రసిద్ధుడు.
‘‘ఇతను చెప్పేవి ఎట్టెదుట కనిపిస్తున్నవే. వీనికి మరలా అనే్వషణ అక్కర్లేదు, సంశయమక్కర్లేదు. శరణుకోరిన వారికి ఆశ్రయాన్ని ఇవ్వడం ధర్మం ’’అని చెప్పి విభీషణుడికి రాముని దరిచేర్చడంలో ముందున్నవాడు. పండు అనుకొన్నానంటూ సూర్యమండలానికి ఎగరి సర్వదేవతల అనుగ్రహాన్ని వాత్సల్యాన్ని అందిపుచ్చుకున్నవాడు. సురస సింహికల పోరాటంలో పోరాటపటిమనే కాదు బుద్ధికుశలత అవసరమని నిరూపించినవాడు. వందయోజనాల దూరం అవలీలగా లంఘించినవాడు. ‘‘నీకున్న దుర్లక్షణాల వల్లే నువ్వే కాదు నీ వంశమూ నాశనవౌతుంది. నీకున్న దురభిమానం నీకు మృత్యువును తెస్తుంది.ఇప్పటికైనా మించినది లేదు. రామునికి శరణు పొందు బాగుపడతావు’’ అని రావణునికి ధైర్యంగా స్థైర్యంగా చెప్పినవాడు. శక్తి ఆయుధానికి మూర్ఛిల్లిన లక్ష్మణుని కోసం స్థావర్ణ్యికరిణి, సంజీవ కరణి, సంధాయనీకరణి లాంటి ఓషధులతో నిండి ఉన్న ఓషధీ పర్వతానే్న తీసుకొచ్చినవాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ ఓ రామ సీతారామ అని భజన చేస్తేచాలు ఒడలంతా పులకరించిపోగా నవోత్సాహంతో రామభక్తుల ఎట్టెదుట కనిపించే రామసేవాతత్పరుడు. అఖండ బ్రహ్మచర్య వ్రత పాలకుడు. వీరత్వ, శూరత్వ, బుద్ధిమత్వ, దక్షత్వాది సద్గుణాలకు అతడు నిధియైనవాడు.
ఇన్ని శుభలక్షణ సమన్వితుడు ఆంజనేయుడే కదా. ఈరుద్రాంశసంభూతుడు, రామనామజపనిరతుడు అయిన కేసరి నందనుడు వైశాఖ బహుళ దశిమినాడు అంజనీసుతుడుగా జన్మనొందాడు. జన్మించిన నాటి నుంచి అతులితబలశాలిగా ఎదిగాడు. సూర్యభగవానుడే పండు అనుకొని సూర్యమండలానికి ఎగిశాడు.
ఈ వీరుడెవ్వాడో తన సదనానికి ముప్పుతెచ్చె లాగున్నాడనుకొన్న మహేంద్రుడు వజ్రాయుధ ప్రయోగం చేశాడు. పవి దెబ్బకు మూర్ఛిల్లి న బాలాంజనేయుని చూచి వాయునందనుడు బిర్రబిగిసాడు. లోకాలన్నీ తల్లడిల్లి పోయాయి. దేవతలంతా దిగివచ్చారు. దీనికి కారణం ఈ హనుమన్న గాయమేనని తెలుసుకొన్నారు. వెంటనే సర్వదేవతలు బాలాంజనేయునికి అనేక వరాలను గుప్పించారు. అంజనీసుతుడు కళ్లు తెరవగా వాయుదేవుడు మహాదానందపడి సర్వులకు ఆనందాన్ని కలిగించాడు.
ఆ ఆంజనేయుడే సూర్యునికి ప్రియతమ శిష్యుడైనాడు. రామునికి ప్రియబాంధవుడైనాడు. అరివీరభయంకరుడైన ఆంజనేయుడు శత్రువుల పాలిట మృత్యురూపుడే. అటువంటి ఆంజనేయుని స్తుతించిన వారికి సదా అభయాన్నిచ్చే కృపాలుడు. భూతప్రేతపిశాచాదులు కూడా ఆంజనేయుని స్మరణతో పారిపోతాయి. ఆంజనేయుని స్మరణ చేసిన విద్యార్థులకు ఏకాగ్రతను, బుద్ధికుశలతనుప్రసాదించే నిపుణి. రామ గానం చేసేవారికి అండదండగా ఉండే రామసేవాదురంధరుడు.
యత్ర యత్ర రఘునాధ కీర్తనం......... మారుతిం నమత రాక్షసాంతకం.ఎక్కడైతే రామనామ సంకీర్తనం ఉంటుందో అక్కడ వినయ విధేయతలకు మారు రూపంగా ఆర్ధ్రతతో కూడిన కళ్లతో ఉంటాడు. అణిమాది అష్టసిద్ధులు పొందిన ఆంజనేయుడు శక్తిమంతుడు. ఈయన సత్తు అమేయం, అపూర్వం. రామదూత భజన, స్మరణతో బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, ఆరోగ్యము, మానసిక దృఢత్వం, వాక్పటుత్వం వంటి ఫలితాలనిస్తాయి.

- చివుకుల రామమోహనరావు