డైలీ సీరియల్

పూలకుండీలు - 7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటి వెనుక నులకమంచంమీద పడుకున్న భార్య పక్కన కూర్చున్న ఎల్లయ్య మెల్లగా ఆమె నడుం ముడతల మీద చెయ్యి వేసి తనవైపుకు తిప్పకుంటూ ‘‘నువ్వు అనవసరంగా కోపం తెచ్చుకున్నావుగాని ముసలోళ్ళన్నదానిలో తప్పేముంది చెప్పు?
ఈ రోజుల్లో రెండు గదుల డాబా ఇల్లు గడ్డటమంటే మాటలా!? ఆ సర్కారోణ్ణి నమ్మి ఇండ్లు మొదలుపెట్టి మన కండ్లముందే బస్తీల ఎంతమంది బాధపడుతున్నారో నీకు తెలవదా?
మనం కూలి నాలి పన్లకు పోతుంటే వచ్చేదానికి వడిసేదానికి బరాబర్‌గా సరిపోతుండె. ఎవరైనాసరే తోక వున్నంతవరకే ఇసురుకోవాలగాని అంతకంటే ఎక్కువ కావాల్నంటే యాడికెల్లొస్తది?’’ అంటూ ఆమెను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు వేగవంతం చేశాడు.
దాలిపొయ్యి సెగకు అలాగ్గా కరిగిపోయే వెన్నపూసలా పెనిమిటి చేతి స్పర్శతో ఇట్టే కరిగిపోయిన శాంతమ్మ మెల్లగా భర్తవైపు తిరిగి కూర్చున్న అతని వడిలో తల పెట్టి ‘‘మన సంపాదన ఎంతొస్తుందో ఎంత ఖర్చైతుందో నేనెరుగనిదాన్నా!? అందుకనే నేనో పని జేశాను’’ నయగారాలు పోతూ అంది.
‘‘ఏం జేశావ్!’’ విచిత్రపడిపోతూ అడిగాడు ఎల్లయ్య.
‘‘నేను పనికిబోతున్న ఇండ్లలో ఓ నలుగురమ్మగార్లను తలలో ఐదు వేలు మిత్తీ లేకుండా అడిగిన. వాళ్ళు గూడా ఇస్తామన్నారు. అది కూడా నా జీతంలో నెలకింత ముదరా జూసుకునేటట్టు మాడ్లాడిన’’ తానెంత ముందుచూపుతో ఇంటికోసం ఏర్పట్లు చేసుకొస్తుందో తెలియజేయాలన్న తపన తన మాటల్లో తొంగి చూస్తుంటే ఏ మాత్రం తడబాటు లేకుండా మాట తరువాత మాట పాయలు పాయలుగా విడమర్చి మెల మెల్లగా చెప్పుకుంటూ వచ్చింది శాంతమ్మ.
ఆమె మాటలు విన్న ఎల్లయ్య, భార్య బుగ్గలు పునికి గట్టిగా ముద్దుపెట్టుకుంటూ ‘‘బాగనే వుంది తెలివి, నీకొచ్చే జీతంలో సగం వాళ్ళే ముదరా జూసుకుంటే ఇక ఇల్లు గడిసేదెట్ల?’’ ఆవిడ సగం సగం ఆలోచనలతో ఇల్లు మొదలుపెట్టి అవసరమైన చిక్కుల్లో పడుతుందన్న ఆందోళనతో కదిలిపోతూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఆ మాటలతో మళ్లీ అంతలోనే కోపం తెచ్చుకున్న శాంతమ్మ భర్త వడిలో నుండి దిగ్గున లేచి కూర్చుంటూ ‘‘ అయితే నువ్వనేదేంటి? డాబా ఇల్లొదంటావా? అయినా నా పిచ్చిగాని నువ్వెన్నడు నా మాటిన్నవని, ఇయ్యాల ఇనలేదనుకోడానికి. ఏదోవిధంగా పిల్లలు పెద్దోలుగాకముందే డాబా ఇల్లు నిలబెట్టుకోకుంటే ముందు ముందు అసలేం కట్టలేం. ఏడినీల్లకు సన్నీల్లన్నట్టు గౌర్మెంటోడిచ్చే పైసలకు తోడు మనం గూడా పైసా పైసా గూడబెట్టి ఇల్లు గట్టుకోవల్సిందే’’ ఇక తన నిర్ణయాని తిరుగులేదన్నట్టు ఒకటికి రెండుసార్లు తేల్చి చెప్పింది.
‘‘ఏమో నేను చెప్పాలనుకుంది చెప్పిన, ఆపైన నీ ఇష్టం ఖర్మజాలక ఏదన్నా జరిగి కుతికలమీదికి ముంచుకొస్తే మాత్రం చూసుకొనే బాధ్యత గూడా నీదే మరి’’ తను అనుకున్నది సాధించేదాకా నిద్రపోని భార్య స్వభావం ఎరిగివున్న ఎల్లయ్య భారం మొత్తం భార్యమీదనే వదిలేస్తూ ఆవిడ మీదకు వరుగుతూ మరింకేం మాట్లాడొద్దన్నట్టు తన పెదాలతో ఆమె పెదాలకు తాళం వేశాడు.
అదే సమయంలో ఉత్తీత పక్షుల జంట ఒకటి ఎందుకోగాని గుండెలు జలదరించేలా అరుస్తూ వాళ్ళ ఇంటిమీదుగా దక్షిణ దిశకు ఎగిరిపోయింది.
‘‘సర్లే కానియ్యి నేనే చూసుకుంటాలే’’ అంటూ భర్తను కొండచిలువలా చుట్టేసింది శాంతమ్మ.
5
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసేటపుడు కంప్యూటర్ స్క్రీన్‌మీది అక్షరాలు జారిపోయినంత వేగంగా రోజులు కూడా కాలం లోయలోకి జారిపోసాగాయి.
శాంతమ్మ ఇందిరమ్మ ఇంటి విషయంలో పట్టువదలని విక్రమార్కుని మాదిరిగా తన ప్రయత్నాలు తాను కొనసాగిస్తూనే వుంది.
రోజూ ఏదో పని వెతుక్కునేదానికన్నా ఏదన్నా కంపెనీలో పనికిపోతే మంచిదన్న ఉద్దేశ్యంతో ఈమధ్యనే తను పనిచేస్తున్న మైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్‌గారి భార్యకు తెలిసిన వాళ్ళద్వారా ఎల్లయ్యను స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో ఓ కాంట్రాక్టర్ దగ్గర పనికి పెట్టించింది శాంతమ్మ.
వెల్డర్ దగ్గర హెల్పర్‌గా చేరిన ఎల్లయ్య మెల్ల మెల్లగా వెల్డింగ్ పని నేర్చుకోసాగాడు.
రెండు, మూడు నెల్లపాటు వాళ్ళ బస్తీ వార్డు మెంబర్ ఇంటి చుట్టూ దారిపడేలా తిరిగి వెయ్యి, పదిహేనొందలదాకా లంచం కూడా ముట్టజెప్పి ఎలాగైతేనేమి మొత్తంమీద ఇందిరమ్మ ఇల్లు సంపాదించింది శాంతమ్మ.
శాంతమ్మ, ఎల్లయ్య దంపతులిద్దరూ ఓ రోజు మాలచ్చమ్మగుడి దగ్గరికెళ్లి పూజారికి యాభై ఒక్క రూపాయలు దక్షిణ ఇచ్చి కొత్త ఇంటికి ముగ్గుపోయడానికి ముహూర్తం పెట్టించుకున్నారు.
అప్పటిదాకా వుంటున్న గుడిశ పీకి బ్రాహ్మణుడు పెట్టిన ముహూర్తానికి కంసాలి వీరాచారితో కొత్త ఇంటికి ముగ్గుపోయించిన శాంతమ్మ, ఎల్లయ్యలు పలుగు, పారలు అందుకుని వాళ్ళే పునాదులు తీసుకోసాగారు.
ఇల్లు పూర్తయ్యిందాకా తాత్కాలికంగా ఉండడానికి ఇంటి ముందు ఆగ్నేయం మూలనున్న చింతచెట్టు కింద, పీకిన గుడిశ కర్రలతోనో కోళ్ళ గూడు లాంటి ఓ చిన్న గుడిసెను ఏర్పాటుచేసుకున్నారు.
ఇల్లు మొదలుపెట్టి పునాదులు తీసిన ఆరు నెల్లకుగాని బేస్‌మెంట్ లేవలేదు.
‘దరిద్రుడి పెళ్లికి వడగళ్లవాన’ అన్నట్టుగా రాష్ట్రంలో పాత గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ‘పాత గవర్నమెంట్ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అంతులేని అవినీతి జరిగింది, దాని సంగతేంటో నిగ్గుతేల్చాల్సిన అవసరం తమ మీద వుంది’’ అంటూ ఓ ఎంక్వైరీ కమిటీని వేసింది. ఆ కమిటీ రిపోర్టు వచ్చేదాకా బిల్లు ఇచ్చేది లేదంటూ తాత్కాలికంగా నిలిపివేసింది.
దాంతో ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు రాక జనం గగ్గోలు పెట్టసాగారు.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు