డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మొదటి షరతే, వాళ్ళ అమ్మాయికి నచ్చితే వారంలో పెళ్లి చేయాల్సి వస్తుందని. నేను ఎవరితోనూ అనలేదు. అంతా కుదిరినపుడు కదా! అని. ఇప్పుడు మనం వెనక్కి వెడితే బాగుండదు’’ అన్నారు.
నాకేం మాట్లాడాలో తోచలేదు.
‘‘ఏం సాకు చెప్పమన్నావు వాళ్ళతో. మా అమ్మాయికి అబ్బాయి నచ్చలేదనా?’’ నవ్వుతూ అడిగాడు నాన్న.
‘‘అది కాదు నాన్న, నచ్చడం నచ్చకపోవడం కాదు. ఇంత హడావిడిగా పెళ్లి చేసుకుని, ఎక్కడికో అంత దూరం వెళ్లిపోయి, మళ్లీ ఎప్పుడో కలుసుకోవడం. అదంతా ఎందుకో నాకు సరిగ్గా అనిపించడంలేదు’’ అన్నాను.
నాన్న చాలా ప్రేమగా భుజం తట్టాడు. ‘‘ఈ రోజుల్లో ఈ సినిమాలు అన్నీ చూసి పెళ్లిఅవంగానే చేతులు పట్టుకు తిరిగేయాలనుకుంటారు. కానీ, పూర్వం రోజుల్లో ఇది సర్వ సామాన్యం తల్లీ! పెళ్లిళ్ళు చిన్నప్పుడే అయితే పిల్లాడి చదువు పూర్తయి ఉద్యోగంలో చేరేదాకా, ఆడపిల్ల పుట్టింట్లో ఉండటం చాలా సహజం. అంతదాకా ఎందుకు మన మధు, భార్య ఈమధ్యే కదా కాపురం పెట్టుకున్నది. రెండు ఏళ్ళ క్రితం పెళ్లయినా వాడి ట్రైనింగ్ అయ్యేవరకూ వదిన వాళ్ళ ఇంట్లో ఉండలేదూ. ఇదీ అంతే! అతని చదువు అయ్యేటప్పటికి, నీ డిగ్రీ పూర్తి అవుతుంది. అన్నీ కలిసి వస్తే, అతనితోపాటు అమెరికా వెళ్లి నువ్వు చదువుకోవచ్చు.
లేదా! కొద్దిరోజులు ఆ దేశాలన్నీ చూసి రావచ్చు’ అన్నాడు.
‘‘కానీ, నాన్న అంటూ’’ నా అసంతృప్తి తెలపలేకపోయాను.
నాన్న మధ్యలో ఆపేశారు. ‘‘చూడు కళ్యాణి, అదృష్టం అస్తమానూ తలుపు తట్టదు. అది కలిసి వచ్చినపుడు మనం, తలుపులు తెరుచుకోవాలి. ఈ విషయంలో చూడు- మన వైపు నుంచి ఏ ప్రయత్నం లేకుండా నీకిలాంటి సంబంధం కలిసి వచ్చిందంటే! ఏమిటంటావు. అతని చదువు సంగతి విన్నావా? మన దేశంలోనే అతి చిన్న వయసులో పిహెచ్‌డి సంపాదించిన వాళ్లల్లో ఒకడుట. 23 ఏళ్ళు లేవు. పిహెచ్‌డి అంటే మాటలా? పైగా అమెరికా వాళ్ళు పెద్ద స్కాలర్‌షిప్ మీద ఆహ్వానించారుట. అసలు ఆ స్కాలర్‌షిప్‌లో సెలక్ట్ అవ్వడమే ఒక పెద్ద గౌరవప్రదమయినదట. అలాంటి అవకాశాలతో చదివేవాడు, ఎంత పైకి వస్తాడో ఊహించగలవా?’’
‘‘నీకు పైచదువుమీద ఎంత ఇష్టం ఉందో నాకు తెలుసు. ఎవరు చెప్పగలరు, అతని సహకారంతో నువ్వెంత పైకి చదువుకోగలవో?’’
నాన్న కాబోయే అల్లుడి అర్హతలు తలుచుకుని మురిసిపోవడంలో మునిగిపోయాడు. ఇక నా మాటలు, నా సందిగ్ధాలు ఏమీ ఆయన మనసుకు వినిపించడంలేదు.
నా ప్రయత్నం వృధా అయిపోయింది. కాని మనసులో అసంతృప్తి వదలడంలేదు.
పైగా అందరూ ఒకరి తరవాత ఒకరు ‘‘ఇదంతా నా పెద్ద అదృష్టం’’ అని అడక్కుండానే చెప్పేస్తుంటే.. నా ఆలోచనల పరిధి మారడం మొదలుపెట్టింది. నేను ‘కాబోలు’ అనుకునే స్థితికి దిగిపోయాను.
మనవాళ్ళ ఆలోచనలు ఎంత కుదించుకుపోయిన్నాయంటే- ఒకరు చదువులో దిట్ట అయితే ఇక ఆ వ్యక్తి సర్వగుణ సంపన్నుడే! చదువు వ్యక్తిత్వానికి ఒక ఆభరణం అనుకోరు, చదువే వ్యక్తిత్వం అనుకుంటారు. చదువే సర్వస్వం అనుకుంటారు. ఒక్క చదువుంటే మనోవికాసం, మనఃప్రవృత్తి, మనస్తత్వం అన్నీ మినే్న అనుకుంటారు.
ఇక నా ప్రమేయం ఏమీ లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. కేవలం ఎవరు ఏం చెప్తే అది చేయడం తప్ప.
ఒక్క రోజుల్లో ముహూర్తాలు నిర్ణయం అయ్యాయి. శుభలేఖలు అచ్చు అయ్యాయి. బంధువులందరకూ కబుర్లు వెళ్లాయి. మా ఇంట్లో ఆఖరు శుభకార్యం అంటూ అందరూ తరలివచ్చారు.
నా పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. కాలేజీ మూయలేదు. చదవడం మాత్రం చాలా కష్టం అనిపించింది. జీవితాన్నంతా శాసించే శుభకార్యం ఎటువంటి ప్రయత్నం లేకుండా, అసలా విషయాన్ని గురించి ఆలోచించే సమయం లేకుండా జరిగిపోతోంది.
పెళ్ళంటే ఎన్నో ఊహలు, కలలు ఉంటాయంటారు. ఎంతో ఎదురుచూడాలంటారు. నా విషయంలో ఏమీ జరగలేదు. అంతవరకూ చదువులో పడిపోయి పెద్దగా నా మనసు పెళ్లి గురించి ఆలోచించలేదు. అన్నిటికంటే ఇలా ఏ రకపు ఎదురుచూపు లేకుండా, అర్థాంతరంగా, కాలేజీ బస్‌లోంచి పెళ్లిచూపులకు పెళ్లిచూపులనుండి పెళ్లి మంటపానికే దారితీస్తుందని అనుకోలేదు.
ఏడు రోజులు ఏడు గంటల్లా గడిచిపోయాయి. షామియానా, పందిళ్ళూ, సన్నాయి బాజాలు, పిండి వంటలు, చుట్టాలు హడావుడితో పెళ్లిరోజు వచ్చేసింది. గుమ్మంలో సన్నాయి మోగింది. డోలుమీద డం అని మోగించాడు. పరధ్యానంగా ఉన్న మనసు మీద కొట్టినట్లే అయింది. ఉలిక్కిపడ్డాను. ఒక్కసారి గుండెలు గబగబా కొట్టుకున్నాయి. చుట్టూ చూశాను. నా కలవరం ఎవరైనా గ్రహించారేమోనని. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉండి నన్ను ఎవరూ పట్టించుకోలేదు.
పెళ్లికూతుర్ని చేసారు. తలస్నానం చేసి కొత్త చీర కట్టుకున్నాను. నల్లబొట్టు తెచ్చి బుగ్గన చుక్క పెడుతుంటే అమ్మ కళ్ళు నీళ్ళతో నిండిపోయి బుగ్గల మీంచి జారిపడిపోయాయి.
పక్కనే నుంచుని చూస్తున్న మామ్మ అమ్మను కోప్పడింది. కాని మామ్మ మనసు కూడా అదే స్థితిలో ఉంది.

-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి