డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ 7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ఇంట్లో నా ఉనికికి ఓ ప్రత్యేకత ఉంది. అన్నయ్యలంతా ఇంట్లోంచి వెళ్లిపోయారు ఉద్యోగాల రీత్యా. అక్కయ్యలు, బావలు, కలకత్తాలో ఉంటారు. పెద్దన్నయ్య కుటుంబం ఒక్కటే నాన్నతో ఉంది. ఇంట్లో గారాలు సాగించేది అన్నయ్య కొడుకు, నేనే! అన్నయ్య కొడుకు వేరే లెవెల్. వాడు మనుమడు, వాడిదంతా ఓ యువరాజు భోగం.
ఇక మిగిలింది నేనే! మామ్మ పూజకు పూలు కోసేది నేనే! నాన్న ఆఫీసు నుంచి రాగానే మంచినీళ్ళు ఇచ్చేది నేనే! యువరాజుకు హోంవర్క్ చేయించేది నేనే! అన్నయ్యకు అరడజనుసార్లు కాఫీ ఇచ్చేది నేనే! వదిన రెండుసార్లకంటే ఇవ్వదు. ఆవిడ పరిభాషలో ఆవిడ డ్యూటీ రెండుసార్లు కాఫీ, రెండుసార్లు భోజనం, ఒకసారి టిఫిన్. ఆపైన ఏదీ ఆవిడ డ్యూటీ కాదనేది. కనీసం తను ఇవ్వకపోతే అన్నయ్య కాఫీ తాగడం తగ్గిస్తాడని ఆవిడ ఉద్దేశ్యం. కాని అది నెరవేరేది కాదు!
ఇలా ప్రతివాళ్ళ దైనందిన జీవితంలోనూ ముడిపడిపోయాను. అందుకే అందరికి చిత్రమైన ఫీలింగ్స్ కలుగచేసింది నా పెళ్లి.
పైకి చెప్పకపోయినా, అందరి మనసులో ఒక రకమైన సంతోషం ఆవరించింది. నా పెళ్లి నాకు తగిన వ్యక్తితో జరుగుతోందని. చిన్నప్పటినుంచి, నాకు చదువంటే చాలా ఇష్టం. అన్నింట్లో మంచి మార్కులు వచ్చేవి. అమ్మే ఆడపిల్ల అని పట్టుపట్టకపోతే, పై ఊర్లల్లో ఏ ప్రొఫెషనల్ డిగ్రీకో వెళ్ళేదాన్ని. అందుకనే చదువులో అంత తెలివైనవాడు, అందగాడు దొరికేటప్పటికి అందరూ సంతోషంగా ఉన్నారు.
అందరూ వారం రోజులనుంచి నా అదృష్టాన్ని, అతని అర్హతలనూ పొగుడుతూ ఉంటే నా మనసు కూడా తెలియకుండానే ఆకర్షితురాలైంది. ఎప్పుడు జరిగిందో తెలియకుండానే నా మనసు అతని చుట్టూ పరిభ్రమించడం మొదలైంది. అతనితో జరగబోయే సంఘటనల వైపు, గడపబోయే భవిష్యత్తు వైపు ఆలోచనలు దారి తీశాయి.
ఈ విధంగా పెళ్లి చేసుకోవడం సరైనది కాదని నా మనసు ఎంత మొత్తుకున్నా, మామ్మ మాటలు చెవిలో జొరపడసాగాయి. ఏది జరిగినా మామ్మ ఎప్పుడూ ‘దైవఘటన’ అనేది. నేను కూడా ఒప్పుకునే స్థితికి దిగజారాను. ‘‘ఇలా జరగాలని ఉంది’’ అనుకున్నాను.
పెళ్లివాళ్ళు ఊళ్లోకి వచ్చారు. జీవితాన్నంతా శాసించే ఆ ఘటన అనుకోని రీతిగా, అనుకోని సమయంలో, అనుకోని విధంగా పూర్తయింది. వచ్చి పీటలమీద కూర్చున్నాను. మామయ్య బుట్టలో తీసుకురావలసిందే అని పట్టుబట్టి మరీ మోసుకువచ్చాడు. చిన్నమామయ్యలిద్దరూ తోడు పట్టారు.
మంత్రాలు వల్లిస్తున్నారు. వాయిద్యాలు మోగుతున్నాయి. మమ్మల్ని చేయమన్న పనులు అన్నీ చేస్తున్నాం. చిత్రంగా మనసులో అలజడి అంతా మటుమాయమైంది. మంత్రాల మహిమో, మనస్సుకున్న సర్దుకుపోయే శక్తో నాకు తెలియదు. ఏం జరిగిందో అన్నది మానేసి, జరుగుతున్నదాన్ని గమనించడం మొదలుపెట్టాను.
ఎంత తక్కువ వ్యవధిలో జరిగినా, అతని తల్లి మాత్రం ఎందులోనూ కాంప్రమైజ్ అవలేదు. అన్ని తంతులూ యధావిధిగా జరిగేట్లు చూసింది. అతను మాత్రం చాలా పూర్తిగా ఆక్యుపైడ్‌గా అనిపించాడు. వాడుండేది ఇక నాలుగు రోజులు. ఈ నాలుగు రోజులు అక్కడే ఉంటూ, వాళ్ళతోపాటు నేను అక్కడే అంది అతని తల్లి.
ఆ కాస్త టైంలోనే కనకదుర్గ గుడికి వెళ్లాలని బయలుదేరాం. పసుపుబట్టలతోనే కనకదుర్గ గుడికి వెళ్లాం.
కారులో అతని పక్కన కూర్చుని వెడుతుంటే కారు నా కాలేజీ మీదుగానే వెళ్లింది. అంతవరకు, అతనితో ఒక్క మాట కూడా మాట్లాడని నేను అప్రయత్నంగా ‘ఇదే నా కాలేజీ’ అన్నాను.
తలెత్తి అతను, అతని అమ్మ, నాన్న అందరూ అటువైపు చూచారు. అతను మాత్రం, ‘స్టడీ వెల్’ అన్నాడు! పక్కపక్కనే మెట్లు ఎక్కుతుంటే చాలా తేడాగా అనిపించింది. ఎప్పుడూ గబగబా ఎవ్వరికోసం ఆగకుండా ఒక్క ఊపులో ఎక్కేసేదాన్ని. అటువంటిది, ఎంతో కుదురుగా అందరితో కలిసి చాలా పెద్దరికంగా ఎక్కుతున్నాను. నాకే నవ్వు వచ్చింది. అప్రయత్నంగా, తలెత్తి అతనివంక చూచాను. అతను కూడా నా వంకే చూచి చిరునవ్వు నవ్వాడు. నా ఆలోచనలు అతనికి తెలిసిపోయాయా అని భయం వేసింది.
చేతులు కట్టుకుని, శ్రద్ధగా గుడిలో నుంచున్న అతనిని చూస్తూ, అతనికి ఇలాంటివాటిమీద పెద్ద నమ్మకం ఉన్నవాడిలా కనిపించలేదు కాని, పెద్దవాళ్ళు చెప్పినట్లు చేసేస్తున్నాడు. అతని అమ్మ, నాన్నగారు ఏదో చర్చించుకుంటున్నారు. అతను, అప్రయత్నంగా, బయట గోడవైపు నడిచాడు. అతని వెనకే నేను నడిచాను.
ఎదురుగా కృష్ణానది ప్రశాంతంగా ప్రవహిస్తోంది. గట్టున చాలా కొద్దిమంది కనిపిస్తున్నారు. సంధ్య కిరణాలు, బంగారు తీగల్లా మెరుస్తున్నాయి. గుడిలో ఎంత రణ ధ్వనిగా ఉన్నా, మా ఇద్దరిమధ్యా నిశ్శబ్దంగానే క్షణాలు పరుగెడుతున్నాయి.
సడెన్‌గా, చెయ్యి చాచి నది వంక చూపుతూ, చిన్నప్పుడు అక్కడే కాలు జారిపడ్డాను. మళ్లీ నీళ్ళల్లోంచి బయటకు వస్తానని అనుకోలేదు- అన్నాడు.
ఏమయిందన్నట్లుగా తలెత్తి అతని వంక చూచాను.
‘‘అప్పుడు పుష్కరాలు అనుకుంటాను. చాలా రద్దీగా ఉంది. అమ్మతో వచ్చాను. అమ్మ నా చెయ్యి పట్టుకునే ఉంది. వెనక నుంచి ఎవరో తోశారు. దాంతో అమ్మ చేతిలోంచి నా చెయ్యి విడిపోయింది. దభీమని నీళ్ళల్లో పడిపోయాను. ఎవరో ఒక పెద్దాయన నన్ను లేవదీశారు. ఆ లోపలే నాలుగు గుటకలు నీళ్ళు కూడా తాగేశాను.

-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి