భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! 37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇక్కడనుండి ఈశాన్య దిశగా వెళ్లు! ఆ త్రోవలో ప్రయాణించడం చాలా కష్టంతో కూడిన కార్యం! అయినా నీవు ఆ దిక్కుగా ప్రయాణిస్తూ పోగలిగితే కొండపైనుండి పడుతున్న ‘కుంభదళ’ అనే జలపాతం కనిపిస్తుంది!
ఆ జలపాతం నీటిలో స్నానం ఆచరించి ఈ మట్టి పాత్రలో నీరు పట్టుకుని త్రాగు! ఆ జలపాతం నీరు చాలా మహిమ గలది! ధర్మశాస్తాగా తారకబ్రహ్మ ఆవిర్భవించినపుడు కైలాసంలో దేవతలు, మునిగణాలు పుష్పవృష్టి కురిపించి పవిత్ర గంగాజలాలతో అభిషేకం చేయగా ఆ అభిషేక జలాలు ఈ కుంభదళ జలపాతంగా భూమిపైకి ప్రవహించటం జరిగింది! అందుకే ఆ పవిత్ర జలాలు త్రాగడంవల్ల నీ కోర్కె ఫలిస్తుంది! వెళ్లు!’’ అంటూ తన దగ్గర వున్న ఒక మట్టి పాత్రను అందించి ఆశీర్వదించింది శబరిమాత!
‘‘నీకు నా కోటి కోటి ప్రణామాలు మాతా! నాకు మార్గదర్శకం చేసిన గురుమూర్తివి. నీకు ప్రణామాలర్పించడం తప్ప వేరే ఏమీ ఇవ్వలేనివాడిని! క్షమించు మాతా! అంటూ పాదాభివందనం చేసి మట్టిపాత్రను కళ్లకద్దుకుని ఈశాన్య దిశగా సాగిపోయాడు విజయుడు!
***
విజయుడు తారకబ్రహ్మను దర్శించుట విజయుడు సాగిపోతున్న మార్గం చాలా కష్టంగా, ముళ్లపొదలతో నిండి వుంది! వాటిని జాగ్రత్తగా దాటుకుంటూ వెళుతుంటే ఏవేవో వికృతమైన అరుపులు చేస్తూ భూతపిశాచాలు మీదకు వస్తున్నట్లు భయానకమైన అనుభూతులు కలగడంతో కళ్లు గట్టిగా మూసుకుని ఓంకారానే్న ధ్యానిస్తూ ఎలాగో శబరిమాత చెప్పిన జలపాతాన్ని చేరుకున్నాడు విజయుడు!
జలపాతం మీదనుండి సాగివస్తున్న చల్లని గాలులు అప్పటివరకు పడ్డ శ్రమను మరచిపోయేలా చేసాయి.. తనివితీరా ఆ నీటిలో స్నానం చేసి శబరిమాత ఇచ్చిన మట్టిపాత్రలో నీరు నింపుతుంటే ఆ నీటిలో తనవైపే చూస్తూ నవ్వుతున్న పపిపాపడు కనిపించాడు! ఆ బాలుడు సామాన్యుడిలా లేడు! దివ్యమైన తేజంతో వెలిగిపోతున్నాడు! మెడలోని మణిహారం నుండి వెలువడుతున్న కాంతి కిరణాలు ఆ ప్రాంతాన్నంతా వెలుగుతో నింపివేసాయి!
‘ఆహా! ఈ బాలుడేనేమో తాను చూడాలనుకుంటున్న తారకబ్రహ్మ! ఓంకారనాదం యొక్క సగుణ రూపం!’ అనుకునేసరికి మనస్సు అలౌకికానందంతో పులకించిపోయింది!
‘హే పరబ్రహ్మరూపా! నీవే తారకబ్రహ్మవు, ఓంకారనాదానివి! నాపై కరుణతో దర్శనమిచ్చిన కరుణా సముద్రుడివి! నీకివే నా కోటి కోటి ప్రణామాలు! నీవే సృష్టి స్వరానికి మూలాధారుడవు! అయినా పసిపాపడిగా దర్శనమిచ్చి నన్ను కటాక్షించిన కరుణా సముద్రుడివి! నాపట్ల దయాదృష్టిని ప్రసరింపజేయ స్వామి!’’ అంటూ పరిపరివిధాలుగా ప్రార్థించాడు!
పరబ్రహ్మరూపుడైన పసిపాపడు విజయుని ప్రార్థన విని వుండాలి! అందుకే ఆ పాపాడిలో దివ్యజ్యోతి, అందులో స్వామి విరాట్ స్వరూపం ఒక్క క్షణం కనిపించి అంతర్థానమైనాయి! అదే సమయంలో ఆకాశవాణి పలుకులు వినవచ్చాయి!
‘‘విజయా! నిర్మలాత్ముడివై నీవు చేసిన ఓంకార ధ్యానానికి ప్రసన్నుడినైను! నీకేం కావాలో కోరుకో!’’ అని!
‘‘స్వామీ! ఇంతకాలంగా సంతానం కోసం ధ్యానించాను, నా కోర్కె తీర్చమంటూ! కానీ హే! జ్యోతిరూపా! పరబ్రహ్మా! నాకిప్పుడు నినే్న పుత్రునిగా పొందాలన్న కోర్కె బలంగా నాటుకుంది హృదయంలో! నీకు తండ్రినై, నిన్ను ‘పుత్రా’ అంటూ నోరారా పిలుస్తూ ఒడిలోకి తీసుకోవాలన్న ఆశ కలుగుతున్నది! అది పేరేశ కావచ్చును! అయినా నిన్ను వేడుకునే సాహసం చేస్తున్నాను! నీవు నాకు పుత్రుడివై నన్ను ధన్యుడిని చేయి!’’ అంటూ మనస్సులోని మాటను విన్నవించుకున్నాడు విజయుడు!
‘‘అసాధారణమైన కోరికను వెల్లడించావు! అందుకు నీ పుణ్యబలం చాలదు! మరుజన్మలో నీ కోరిక తీరగలదు! నీ పుత్రునిగా పిలువబడతాను!’’ అని వరం ప్రసాదించాడు!

-ఇంకాఉంది

...............................................................
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

- డా. టి. కళ్యాణీ సచ్చిదానందం