భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! 38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశవాణి మాటలు విని ఆనందంతో పులకించిపోయాడు విజయుడు!
‘‘తారకబ్రహ్మ నాకు పుత్రుడు కానున్నాడు! నా వంటి భాగ్యశాలి మరొకడు వుండబోడు!’’ అనుకుంటూ ఇంటిదారి పట్టాడు! తర్వాత కొంతకాలం దైవధ్యానంలో ప్రశాంతంగా కాలం గడిపి మరణించాడు విజయుడు!
***
కన్నులు తెరిచి చుట్టూ చూశాడు రాజశేఖరుడు! తనవైపే చూస్తున్న అగస్త్య మహర్షి కనిపించడంతో ఆయనకు నమస్కరించాడు!
‘‘రాజా! నీ పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకున్నావు గదా! విజయుడుగా నీవు కోరిన అసాధారణ వరానికి కట్టుబడి అందరిని తరింపజేసే తారకబ్రహ్మ నీకు శిశువుగా లభించి నీకు పుత్రుడై ఇంతకాలం నీకు ఆనందాన్ని ప్రసాదించాడు! సామాన్య మానవులకు లభించని అదృష్టం నీకు లభించినందుకు సంతోషించాలి కానీ ఈ విధంగా నిరాశ నిస్పృహలకు, వ్యామోహానికి గురై కర్తవ్యాన్ని విస్మరించగూడదు! లే, ఇకనైనా స్వస్థుడివై ఆ స్వామి నీపై మోపిన కార్యాన్ని నెరవేర్చు!’’ అంటూ ఉపదేశించాడు అగస్త్యుడు!
‘‘సమయానికి వచ్చి నన్ను మీ ఉపదేశంతో స్వస్థుడిని చేసినందుకు కృతజ్ఞుడిని మహర్షి! ఇక నాకే విచారమూ లేదు. మొదటిసారిగా అరణ్యంలో శిశురూపంలో నాకోసం అవతరించిన ఆ పరబ్రహ్మ ముఖాన్ని చూస్తూనే అంతకుపూర్వం ఎక్కడ చూసిన బాధ నాలో కలగడానికి కారణం ఇప్పుడర్థమైంది. ప్రణవ స్వరూపుడు, పరబ్రహ్మకు తండ్రిగా గౌరవింపబడే భాగ్యాన్ని ప్రసాదించిన మణికంఠునికి కోటి కోటి ప్రణామాలు’’ అంటూ భక్తిపూర్వకంగా నమస్కరించాడు రాజశేఖరుడు!
‘‘రాజా! పంబానది పాపాలను నశింపచేసే పావనమైన నది! ఆ నదీ సమీపంలోనే మణికంఠుడు నిర్దేశించిన స్థలంలో ఆలయ నిర్మాణం కావించి జీవితం ధన్యం కావించుకో!’’ అని చెప్పి వెళ్లిపోయాడు అగస్త్య మహర్షి!
‘‘మీ ఆజ్ఞానువర్తిని’’ అంటూ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుని కార్యోన్ముఖుడైనాడు రాజశేఖరుడు!
***
వింటున్నవారిలో ఒక మునికుమారుడు లేచి నిలబడటం చూసి చెప్పటం ఆపాడు సూతమహర్షి!
‘‘మహర్షి! శబరి విషయం మరికొంత వివరంగా తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను! మణికంఠుని దర్శన భాగ్యం ఆమెకు లభించిందా?’’ అని అడిగాడు వినయపూర్వకంగా నమస్కరించి!
‘‘అవును మహర్షి! మీ అందరి ప్రార్థన కూడా అదే!’’ అని వింటున్న మునులందరూ కూడా కుతూహలం వ్యక్తం చేయడంతో శబరి గూర్చి చెప్పసాగాడు సూత మహర్షి!
శబరి వృత్తాంతము
శబరస్య గృహేజాత శబరీ భాగ్యశాలినే!
చిరకాలేన సహ్యాద్రౌ జ్ఞానయ తపస్థితా!’’
(శబరి కులంలో పుట్టిన మహాభాగ్యశాలిని శబరి! ఆమె సహ్యాద్రి పర్వతంమీద చాలాకాలం జ్ఞానసిద్ధికోసం తపస్సు చేసింది)
‘‘నైమిశారణ్య వాసులారా! శబరి కారణ జన్మురాలు! కైలాసంలో హరిహర పుత్రుడు ప్రభవించినప్పుడు భూతగణాలు, ప్రమథ గణాలు పార్వతీదేవి శక్తిగణాలు ఆ స్వానిని సేవించి తరించారు! శక్తిగణాలలో పావని అమ్మవారి చెలికత్తెలలో ముఖ్యమైనది! ఆమె హరిహర పుత్రుడైన భూతనాథుని స్వయంగా భక్తిశ్రద్ధలతో సేవించాలని తహతహలాడుతూ పార్వతీదేవి సేవలో కొంత ఏమరుపాటుతో ప్రవర్తించి ఆ దేవి ఆగ్రహానికి గురైంది!
‘‘పావని! నీ కర్తవ్యాన్ని విస్మరించి నా సేవకు దూరమైనందున తక్షణమే కైలాసాన్ని విడిచి భూలోకంలో అరణ్యాలకు శబరుల ఇంట జన్మించు! భూలోకవాసమే నీకు తగినది!’’ అని శపించింది తీవ్రమైన కంఠంతో!
‘‘దేవీ! నున్న మన్నించండి! ఇంకెప్పుడూ పొరబాటు జరగనివ్వను!’’ అని పావని దీనంగా ప్రార్థించినా అమ్మవారు శాపాన్ని మరల్చలేదు! నిజానికి ఆ శాపం పావని పట్ల వరమే అయింది! భూతనాథుడు భూమిపై అవతరించినప్పుడు ఆ స్వామిని సేవించే అవకాశం ఇవ్వడానికే మాత అటువంటి శాపాన్ని ఇచ్చింది! ఆ విషయం భూతనాథునికి అర్థమైంది! అందుకే పావని కోర్కె తీర్చాలనుకున్నాడు!
***
పావని శబరి కులంవారి నాయకుడికి కుమార్తెగా జన్మించి శబరి అనే పేరుతో పెరగసాగింది!

-ఇంకాఉంది

..................................................................................................
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003