డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటి రాత్రికి ఆడపిల్లలే కాదు, మగ పిల్లలు కూడా నెర్వస్ అవుతారన్నమాట. హమ్మయ్య అనుకున్నాను.
నా చేతులు అతని చేతుల్లో ఉండిపోయాయి. మధ్య మధ్య అరచేతుల్లో చందమామను అతని పెదిమలు స్పృశిస్తున్నాయి.
ఆ రాత్రంతా కబుర్లతోనే గడిచిపోయింది. అతని చదువు, అతని ఆశలు, ఆశయాలు, ఒకటేమిటి- పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ ఇమిడి ఉన్నాయి అతని మాటల్లో. అతని హైలెవెల్ ఆలోచనలు, ఆశలు మాత్రం నాకు అర్థం కాలేదు. చాలా తెలివైన వాడయి ఉంటాడు. అయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ శ్రద్ధగా విన్నాను.
ఆ రాత్రి, అతని సంగతేమో కాని, నేను మాత్రం చాలా సంతోషించాను. అతను అంత ఓపెన్‌గా అతని ఆలోచనలు నాతో పంచుకోవడం చూచి.
ఏ తల్లిదండ్రులకయినా సగర్వంగా చెప్పుకొనగలిగే రకపువాడు. అతనితో మామూలుగా సంభాషణ చేస్తున్నా అతని తెలివితేటలు బహిర్గతం అవుతుందేమో! అతని స్థాయిలో అతని ఆలోచనా విధానానికి చేరువ అవ్వాలంటే బహుశా నేను బాగా ఎదగాలేమో! అంతలోనే భయం వేసింది. ఎప్పుడైనా తను అసలు ఆ స్థాయి చేరుకోగలనా? అసంభవం అనిపించింది.
అసహనంగా కనురెప్పలు కదులుతున్నాయి.
‘‘ఏమిటీ ఆలోచిస్తున్నావు?’’ అడిగాడు.
ఏమీ లేదన్నట్లు తల ఊగించాను.
‘‘అబద్ధం’’ అన్నాడు.
కళ్ళు ఎత్తి అతని వంక చూశాను. అతను సూటిగా నావంకే చూస్తున్నాడు. మనులో పరిగెత్తే భావాలు మొహంమీద స్ఫుటమవుతాయి తెలుసా నీకు?’’ అన్నాడు.
తెలియదని తల ఊగించాను.
‘‘తల ఊగించడం తప్ప మాట్లాడటం రాదా నీకు’’ అడిగాడు.
మళ్ళీ ఊగించాను. కాదు అన్నట్లు. నాకే నవ్వు వచ్చింది నా సమాధానానికి. అతను పక్కున నవ్వాడు. నెత్తిమీద చనువుగా కొట్టాడు. అచ్చం వదిన కొట్టినట్లే.
‘‘ఇప్పుడు సరేగానీ, ఆ రోజు నిన్ను చూడ్డానికి వచ్చినపుడు ఇలాగే నీ మొహంలో నవ్వు కనిపించింది ఎందుకు నవ్వావు? నన్ను చూసి’’ అడిగాడు. ‘‘ఈసారి మాటలతో సమాధానమివ్వు’’ అన్నాడు.
ఓ మై గాడ్! ఎంత గుర్తు అనుకున్నాను.
నాలాగే అతను ఆలోచిస్తున్నాడన్నమాట. కొంచెం సంతోషమనిపించింది నాకు!
‘‘ఏమీ లేదు ప్రత్యేకంగా చెప్పడానికి’’ అన్నాను!
‘‘అమ్మయ్య, మాట్లాడటం వచ్చన్నమాట!’’ ఇప్పుడు చెప్పు, అన్నాడు.
‘‘చెప్పానుగా ఏమీ లేదని’’.
తల అడ్డంగా ఊగించాడు. అది నిజం కాదని, అతనికి తెలిసినట్లు.
‘‘మీలాంటివాడు కథల్లోనో, సినిమాల్లోనో తప్ప రోజూ జీవితంలో ఎదురు పడరనుకున్నాను’’.
‘‘అంటే!’’ అన్నాడు.
ఆ రోజు వచ్చిన ఆలోచన ఇంకొంచెం వివరంగా చెప్పాను. పక్కుననవ్వాడు. రెండు చేతులతో చుట్టేసి గట్టిగా దగ్గరకు లాక్కున్నాడు. అతని నవ్వు నా చెవులకు మరీ దగ్గరగా వినిపించింది.
అతని నవ్వే. మెస్మరేజింగ్ స్మైల్. బిగ్గరగా నవ్వుతూ ఉంటే శరీరం అంతటికీ తాకుతూ గిలిగింతలు పెట్టినట్లయింది. అలా కబుర్లు చెప్తుంటేనే చాలా సమయం గడిచిపోయింది. ఎప్పుడో బాగా ఆలస్యంగా నిద్రపోయాడు.
కాని నాకు మాత్రం నిద్ర పట్టలేదు. హాయిగా నిద్రపోతున్న అతని మొహంమీద వెనె్నల పడుతోంది. పక్కనుంచి బెడ్‌లాంప్ లైటు, వెనె్నల రెండూ కలిపి లేత నీలిరంగు నీడ అతని మొహం మీద పడుతోంది. పైన ఫ్యాన్ గాలికి ఒత్తయిన జుట్టు నుదుటిమీదకి ఎగురుతోంది. అప్రయత్నంగా పైకి తోద్దామని చెయ్యి ఎత్తాను. వెంటనే ఆ ప్రయత్నం మానుకున్నాను. అతని మెలుకవ వచ్చేస్తుందేమో అని.
పెళ్లిచూపులనుండి ఇప్పటివరకు అతనివంక సరిగా చూడనే లేదు. గట్టిగా కళ్ళెత్తి చూద్దామంటే, పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని భయం.
మా వదిన మాత్రం శుభ్రంగా పైనుంచి ఎగాదిగా చూచిందట. చెంపకి, చెవికి మధ్య ఉన్న పుట్టుమచ్చ గురించి కూడా చెప్పింది పెళ్లిచూపులు జరిగిన సాయంత్రం.
‘‘నీకు సిగ్గనిపించలేదా- పరాయి మగాడి వంక అలా చూడ్డానికి?’’ రెట్టించాను నేను.
‘‘నాకేం సిగ్గు అంటూ నవ్వింది. నేను పెళ్లయినదాన్ని. పైగా కాబోయే బావగారికి ఏ వంకలు ఉన్నాయో పరీక్ష చేస్తే మీ అన్నయ్య సంతోషిస్తాడు కూడా!’’ అంటూ నెత్తిమీద మొట్టికాయ వేసింది.
రెండో రాత్రి కూడా ఇంచుమించు మొదటి రాత్రిలాగానే గడిచిపోయింది. కాని రోజంతా చాలా బిజీగా గడిచిపోయింది. దాదాపు రోజంతా ఎవరికో ఫోన్ చేస్తూ, ఏదో ప్రయత్నాలు చేస్తూ చాలా రెస్ట్‌లెస్‌గా గడిపాడు. బెంగుళూరు నుంచి రావలసిన కాగితాలేవో రాలేదు. ఇక ప్రయాణానికి పూర్తిగా రెండు రోజులు కూడా లేదు. నాకర్థమయినంత వరకు, ఆ కాగితాలేవో అతనితో వెళ్లాలి. ఈ ఏర్పాట్లతో పాటు వచ్చేపోయే వాళ్ళు ఎక్కువయ్యారు.
వాళ్ళ కుటుంబంలో ఇతనే మొదటిసారి అమెరికా వెడుతున్నాడు. అందులోనూ ఏదో స్కాలర్‌షిప్ మీద. అభినందనలు తెలిపేందుకు, సంతోషం వెలిబుచ్చేందుకూ, కొత్త పెళ్లికూతురిని చూచిపోయేందుకు, రకరకాల వాళ్ళతో ఇల్లు రోజంతా సందడిగా ఉంది.
నేను పెరిగిన ఇంటి వాతావరణానికి, ఆ ఇంటికి చాలా తేడా ఉంది. వీళ్ళు ప్రొఫెషనల్‌గా పెద్దవాళ్ళు మాత్రమే కాదు, ఊళ్ళో పొలిటికల్‌గా కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు! ఊళ్ళో చెప్పుకోతగిన వాళ్ళల్లో వీరొకరు. మామ్మ అన్నట్లు, ఇవన్నీ నిజంగానే ఘటనలేమో, లేకపోతే హాయిగా పల్లెటూరు మధ్య పాకిపోయే పిల్ల కాలవలాంటిది మా జీవితంలోకి ఒక్కసారి గంగా ప్రవాహం కొట్టుకొచ్చినట్లయింది.

-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి