భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! ..40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ సమయంలోనే విజయుడు ఆమెను కలుసుకోవటం, ఆమె అతనికి మార్గోపదేశం చేయడం జరిగాయి!
మణికంఠుడు మహిషిని వధించిన తర్వాత పులివాహనంమీద శబరికి దర్శనం ప్రసాదించాడు!
అంతవరకు ఎంతో ఓపికతో వేచి వున్న శబరి చిరకాల వాంఛితం నెరవేరింది! ఒళ్లంతా కళ్లు చేసుకుని ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ భక్తి పారవశ్యంతో తన్మయురాలైంది!
‘‘హే! పరబ్రహ్మరూపా! నీ దివ్య మంగళ రూపాన్ని దర్శించి ధన్యురాలినైనాను! నాకింకే కోరికా లేదు! నన్ను నీలో ఐక్యం చేసుకో స్వామి!’’ అని ప్రార్థిస్తూ కన్నులరమోడ్చింది!
ఆమెపై కృపావృష్టి కురిపించాడు స్వామి! ‘‘శబరీ! నీవు కోరినట్లు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. నీ నిర్మలమైన భక్తి విశ్వాసాలను భావి తరాలవారు గుర్తుంచుకునేలా ఈ గిరి ప్రాంతమంతా నీ పేరుతో శబరిగిరిగా ప్రసిద్ధి పొందుతుంది! దానిపై నేను శబరీశునిగా పిలువబడుతూ వెలిసి భక్తుల పూజందుకుంటాను!’’ అన్న స్వామి పలుకులు అమృతపు జల్లులా సోకాయి శబరి కర్ణపుటాలను! ‘‘్ధన్యురాలిని స్వామి! ధన్యురాలిని!’’ అంటూ అంజలి ఘటించింది! ఆమె ఆత్మ పరమాత్మలో లీనమైపోయింది!
శబరి పార్థివదేహాన్ని దహనం కావించి చితాభస్మాన్ని ఆ ప్రాంతంలోనే ప్రవహిస్తున్న ఒక కొలనులో నిమజ్జనం కావించారు ఆమె బంధువర్గంవారు! ఆ కొలను శబరి భస్మకొలనుగా ప్రసిద్ధికాంచింది!
***
‘‘ముని పుంగవులారా! ఇదీ భక్తురాలు శబరి పుణ్యచరితం! కాలక్రమేణా భక్తులందరూ శబరి గిరీశునిగా స్వామి వెలిసిన ఆ పవిత్ర ప్రాంతాన్ని దర్శించి తమ జీవితాలు ధన్యం కావించుకోసాగారు!’’ అంటూ చెప్పటం ఆపాడు సూతమహర్షి
‘‘మహర్షి! అగస్తుని ఉపదేశంతో తేరుకున్న రాజశేఖరుడు తర్వాత ఏ విధంగా తన కర్తవ్యపాలన కావించాడో తెలుసుకోవాలన్న ఆత్రుతు కలుగుతున్నది! దయచేసి ఆ విషయాలను గూడా చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను!’’ అంటూ వింటున్న వాళ్లంతా కోరడంతో చెప్పటం కొనసాగించాడు సూత మహర్షి!
***

అయిదవ అధ్యాయము
రాజుకు ధర్మశాస్తా దర్శన ప్రాప్తి- ఆలయ నిర్మాణము
అగస్త్య మహర్షి ఉపదేశంతో స్వస్థుడైన రాజశేఖరుడు నిండు సభ నేర్పాటుచేయమని మంత్రికి ఆదేశించి, ప్రజలను, రాజ పరివారాన్ని ఉద్దేశించి ఆ సభలో తన సంకల్పం గురించి తెలియబరిచాడు!
‘‘పందల రాజ్య ప్రజలారా! రాజప్రముఖులారా! మనకందరికి ప్రియతముడైన మణికంఠుడు మన మధ్య లేకపోయినా, విగ్రహ రూపంలో అవతరించి మనల్నందరిని ఎప్పటిలాగా అనుగ్రహిస్తూ వుంటానని మాట ఇచ్చిన విషయం మీకందరికీ తెలిసిన విషయమే! నా మూర్ఖత్వంవల్ల ఆ విగ్రహం వెలవడానికి తగిన విధంగా ఆలయ నిర్మాణం కావించడంలో కొంత ఆలస్యం జరిగినందుకు చింతిస్తున్నాను! ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లి మణికంఠుడు సంధించి వేసిన బాణం పడిన చోటును గుర్తించి అక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభించాలని నిశ్చయించుకున్నాను! ఈరోజే తగిన ముహూర్తం నిర్ణయించటం జరిగింది! మీరందరూ కూడా నా వెంట రాదలచుకుంటే రావచ్చును!’’ గంభీరంగా రాజు చెప్పింది విని అందరూ హర్షం వెలిబుచ్చారు! ‘‘మహారాజా! తిగిన నిర్ణయం తీసుకున్నారు! మేమూ మీ వెంటే వస్తాము! మా ప్రియతమ నాయకుడే మాకు తండ్రి! తండ్రిలాగా మా అందరిని వాత్సల్యానురాగాలతో పాలించి వెళ్లిపోయినా మా వెంటనంటే ఎల్లప్పుడు యోగ క్షేమాలు విచారిస్తూ వుంటానని వాగ్దానం చేసిన ఆ స్వామి మాకు అయ్య, అప్ప (ఆ ప్రాంత వాడుక భాషలో తండ్రిని సంబోధించే పదాలు)! ఇకపై అయ్యప్ప స్వామిగా మేమందరం భక్తిశ్రద్ధలతో పూజించుకుంటాము మా మణికంఠస్వామిని!’’ అంటూ తమ మనస్సులో మాటను విన్నవించుకున్నారు!
‘‘అయ్యప్పస్వామి అయ్యప్పస్వామి! ఆ దయాముయుడికి తగిన పేరు సూచించారు. ప్రజాలారా! పదండి! ఆ స్వామి ఆలయ నిర్మాణానికి తరలి వెళదాం!’’ అంటూ ఉత్సాహంగా అరణ్యంలోకి దారి తీశాడు రాజశేఖరుడు ప్రజలందరూ వెంటరాగా!
***
అరణ్య ప్రాంతాన్ని చేరేసరికి రాత్రి అయింది!

-ఇంకాఉంది

.................................
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-డా. టి.కళ్యాణీ సచ్చిదానందం 40