మంచి మాట

కాల మహిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలమే దైవము. కాల స్వరూపమును నిర్వచించుట దుర్లభం. అనేక నిర్వచనములు వాడుకలోనున్ననూ అవి కాలమున నిలబడునవి కావు. ‘్భత భవ్య భవత్ప్రభుః’ అని నుడివిన విష్ణు సహస్రనామము భూత, భవిష్యత, వర్తమాన కాలములు మూడూ ప్రభు స్వరూపమైన ఆ పరాత్పరుడే అని తెలియజేసినది. కాలము అమేయము, నిర్గుణము, నిరాకారము, ఆద్యంతములు కానరానిది. మనకు తెలిసిన కాల మానములన్నియూ అల్పమైన మన మేధ నుండి వెలువడినవే. చివరకు మన సనాతనము గణించిన యుగ విభజన కూడా ఈ అనంత కాల స్వరూపములో ఒక అణుమాత్రము.
శాలివాహన శకము, క్రీస్తుశకము, గ్రెగేరియన్ శకము ఇంకనూ అనేక కాల గణనములన్నియూ మన భ్రమ మాత్రమే అని గ్రహించాలి. అందుకే అన్నిటికంటే విలువైనది, మహిమాన్వితమైనది కాలము. గడచిన క్షణమును తిరిగి వెనకకు తేలేము. గతం గతమే!
తక్షణమును సద్వినియోగము చేసుకొనువాడే తెలివైనవాడు. ఇక సద్వినియోగమనునది కాలధర్మముపై ఆధారపడి యున్నది. చాణక్యనీతిలో చెప్పినట్లు సనాతన ధర్మములోని ఒక శ్లోకమును లేదా సగ భాగము కనీసము ఒక పదమైననూ నేర్చుకొనకుండా, దానము చేయకుండా, ధర్మకార్యము చేయకుండా గడిపిన కాలము వృథాయని తెలిపినది. చాణక్యుని నీతి శాస్తమ్రునందు కాలము యొక్క విలువ, వినియోగమును చాలా చక్కగా విశదీకరించుట జరిగినది.
కాలము విలువ తెలుసుకొని నిరంతరము శ్రమించువాని దరికి దారిద్య్రము చేరదు. విశ్రాంతి సమయమునందు పరమాత్మను ధ్యానించువారికి పాపమంటదు. వౌనమే ఆభరణముగా కాలమును అనుభవించువాడు అజాతశత్రువగును. ఏ కాలమునైననూ ఆత్మను గూర్చి జాగృతి కలిగినవానికి భయమనేది ఉండదు.
తమ సంతానమును ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దుటకు చాణక్యుడు సూచించిన కాలోపయోగము అద్భుతము. ఐదు సంవత్సరముల వయసు వచ్చువరకు తమ సంతానముపై ప్రేమను కురిపించవలెను. ఆరునుండి పదిహేను సంవత్సరముల వరకూ సంతానం యెడల కఠినముగా నుండి విద్యాబుద్ధులు నేర్పుటలో దండన విధించుటకు కూడా వెనుకాడరాదు. తదుపరి పదునారు సంవత్సరములనుండి ఒక స్నేహితునిగా తమ సంతానము పట్ల ప్రవర్తించవలెను. సమాజము యొక్క స్వరూపమును, న్యాయాన్యాయ విచక్షణను తెలియజేసి జీవితమును సత్యమార్గంలో పయనించునట్లు మార్గదర్శనము చేయవలెను.
కాని నేడు నీతి శాస్తమ్రుల ఊసే లేదు. ఒకవేళ ఉన్ననూ, అవి ధారణకు పరిమితమై ఆచరణకు దూరమైనవి. తమ సంతానమును అతి గారాబము చేయుచూ, అన్యాయ మార్గంలో సంపదలను చేకూర్చి వారిని సోమరులుగాను, నిర్లక్ష్యముగాను, అధర్మపరులుగాను తయారుచేసి అసుర స్వభావముతో సమాజ నాశనముకు కారకులగుచున్నారు. ఇది అత్యంత బాధాకరము.
సకాలమున తల్లిదండ్రులు సుబోధ చేయవలెను. ఆనందకర జీవనశైలి చూపు విద్య గరపవలెను. సనాతన ధర్మబోధనపట్ల శ్రద్ధ వహించవలెను. ఆనంద వైరాగ్యమే జీవిత సత్యమను భావన కలిగించవలెను. ఇవన్నియూ కార్యరూపము దాల్చవలెనన్న ముందు జననీ జనకులు అవిరళ సాధన చేయవలెను. ఈ కాలగమనములో శాశ్వతమైనది ప్రయోజనకరమైన విద్య. అట్టి విద్య కలవాడు సర్వకాల సర్వావస్థలయందు భాగ్యవంతుడే అగును. కాల విలువను తెలిసి సద్వినియోగము చేయువాని వద్ద అనంత నిధి ఉండును. కాలము పంచభూతములను హరిస్తుంది. అనగా కాలమే మరణమునకు కారణము. ఇది ఛేదించలేని రహస్యము. అలాగే కాలము మనిషిని జాగృతపరుస్తుంది. గాఢనిద్రనుండి మేల్కొపునది కాలము. ఈ కాల గమనములో కోరికలు సంపూర్ణముగా తీరిన జీవి ఉండదు.
అది అసాధ్యము. సమస్తమూ పరాత్పరుని ఆధీనములోనున్నది. అందుకే వర్తమానమును ధర్మమార్గములో అనుభవించుచూ ఆనందమును కలిగియుండుట సర్వజనులకూ శ్రేయోదాయకమని చాణక్యనీతి కాలమహిమను కొనియాడినది. కాలానుగుణముగా నైతిక జీవనము చేయుట మన కర్తవ్యము.కాలాన్ని గుర్తించక దాని మహిమను తెలుసుకొనక జీవించువారు వ్యర్థమైన సూక్ష్మజీవులతో సమానము. ఈభగవానుని సృష్టిలో వ్యర్థమగునది ఏదీ లేదు. కాని ఉతృష్టమైన మానవ జన్మను పొంది కూడా కాలాన్ని గురించి తెలుసకొనక వ్యర్థమాటలతో కాలయాపన చేసినట్లయతే అది వారి జన్మను వృథా పరుచు కున్నట్లే అని అర్థం.

- వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు