భక్తి కథలు

హరివంశం 31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటు రండిరా అని నలుగురు పిల్లలను ఒక చోటికి చేర్చి వాళ్ళ జుట్లు ఒకదానితో ఒకటి ముడిపెట్టి వాళ్ళు గింజుకుంటూ ఉంటే కేకలు పెడుతూ కహకహ నవ్వుతాడు. ఈ విధంగా వ్రేపల్లెలో కృష్ణుడు భరించలేనంత అల్లరి సృష్టిస్తున్నా, దుడుకు చేష్టలు చేస్తున్నా నందుడి పట్ల మొహమాటంవల్ల గోపాలురు ఈ పిల్లవాణ్ణి కట్టడి చేయటం ఎట్లానా? అని కలవరపడ్డారు. కాని రోజురోజుకూ కృష్ణుడి ఆగడాలు ఎక్కువ కావటంవల్ల గోప వనితలంతా కూడబలుకుకొని యశోద దగ్గరకు వెళ్లి తమ గోడు వెళ్ళబోసుకున్నారు.
‘నీ కొడుకంటే నీకు ఇంతా అంతా కానిగారాబం సరే, కృష్ణుడు చేసే కోతి పనులు ఇన్నీ అన్నీ కావు. కనక కనక భలే కొడుకును కన్నావు. వీడు నీ గారాల కూచి. మేము వీడితో పడే పాట్లు ఎవరికి తెలుస్తాయి. నీవు నమ్మవు. కాని కృష్ణుడు చేసే ఆగడాలు ఇన్నీ అన్నీ కావు. నీవేమో కృష్ణుణ్ణి ఊరిమీదికి విడిచిపెట్టి ఇంట్లో పదిలంగా, హాయిగా ఉన్నావు. నీకు కొంచెం కూడా దయా, దాక్షిణ్యాలలు లేవు కదా! ఇపుడు విను, నీ కొడుకు దుండగపు పనులు ఆనందించుదువుగాని అని ఇట్లా అందరూ యశోద చుట్టూ చేరి దెప్పి పొడవటం ప్రారంభించారు. అపుడొక గోపాలాంగన యశోద ముందుకు వచ్చి చేతులతో అభినయిస్తూ ఇట్లా అన్నది. ‘నా ఇంట్లో పది కడవల పాలు, పెరుగు, నేయి కనపడటంలేదు. ఏం చేశాడో నీ దుండగపు కొడుకు. అంతేకాదు వాటిని బోర్లించాడు. అసలే మేము పేదవాళ్ళం. ఇక మా బతుకులెట్లా వెళ్ళదీసుకోవాలే తల్లీ! నీ కొడుకుతో మా పాట్లు ఇన్నీ అన్నీ కావు’ అంటూ ఉండగానే, ఇంకొక గోప వనిత ముఖం ఎర్ర చేసుకొని యశోద నుద్దేశించి చేతులు విదిలిస్తూ ‘ఏమమ్మా! నీ కొడుకుది దయ్యపు కడుపులాగా వుంది. పది బానలలో పదిలంగా ఉంచుకున్న వెన్ననంతా మింగేశాడు. ఎట్లా మింగాడో ఏమో! ఆ బానలన్నీ దొర్లిపోయేట్లు చేశాడు. ఉట్లు చూదామా అంటే వాటి తాళ్ళు తెంపివేశాడు. ఎట్లా వేగుతాం గోకులంలో నీ కొడుకు మమ్ముల్ని పాలుజేస్తున్న తిప్పలతో’. మేము ఇక్కడ బతకలేం! ఇట్లా ఆమె మొత్తుకుంటూ ఉండగానే ఇంకొక గోపభామ నాట్యం చేస్తున్న భంగిమలో తక్కిన వాళ్ళను తోసుకుంటూ ముందుకు వచ్చి యశోదకిట్లా మొర పెట్టుకుంది. మా ఇంట్లో వంట ఇంటి గోడ వారన నేతి కుండలు వరసగా భద్రపరచి ఉంచాను. ఇంటి తలుపు తాళం వేసుకొని వీధిలోకి వెళ్ళాను పనిమీద. ఇంటికి వచ్చి చూద్దునుగదా తలుపులు బార్లా తెరచి ఉన్నాయి. తాళం లేదు గీళం లేదు.
ఏం చేశాడో, తాగాడో తలకు బోసుకున్నాడో ఒక్క బొట్టు కూడా నెయ్యి లేదు. నేతి కుండలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంత మాయ ఎక్కడా చూడలేదే గోపమ్మా! వీడు మంత్రాల మాయలమారి సుమా! ఇక్కడే పడి ఉండాల్సిన గతి ఏముంది మాకు? ఊళ్ళు కొల్లబాయినాయో! పాడు పడ్డాయో! మా గొడ్లు మాకుంటే మేము నీ ఊరు విడిచిపెట్టి ఎక్కడకైనా పోయి బతకలేమా! ఇక్కడ మా కొంపలు కొల్లగొట్టుకోవటం కంటే ఎక్కడకైనా పోయి బతకటం మంచిది’ అని ఈమె చెపుతుండగానే, ఇంకొక అతివ ఆగ్రహంతో ఊగిపోతూ ఏం చెప్పేదమ్మా? నీ కొడుకు దుండగాలు! చెవులార విను! మా ఇంట్లో పాలు పెరుగూ నెరుూ్య నేల మీద మడుగులు కట్టించాడు. వచ్చి చూదువుగాని రా! కుండలన్నీ పగలగొట్టాడు. వాడి జట్టు ఆకతాయిలనంతా పోగేసుకుని వచ్చి కూడూ కూరలూ నేరుూ పాయసమూ ఒక్క పిసరూ మిగల్చకుండా పొట్టన పెట్టుకున్నారు. వీడి కడుపులో దయ్యపు పిల్లలున్నాయో! ఏమి పాడో! లేకపోతే ఇంతింత రాసులు ఎట్లా మెక్కుతాడు!

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు