భక్తి కథలు

జైమిని భారతం - 102

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణా! అప్పటినుండీ నేను ఇక్కడే ఉండి తపస్సు చేసుకొంటున్నాను. అజ్ఞానం క్రమ్మినపుడు ప్రతివాడూ తానే బ్రహ్మాండ నాయకుణ్ణి అని అనుకొంటూ ఉంటాడు. గర్వాన్ని పొందుతాడు. కనుక గర్వలేశాన్ని కూడా మనస్సులోనికి చొరనీయకూడదు’’.
బకదాల్భ్యుడు చెప్పిన వృత్తాంతం అర్జునునికి తదితర రాజులకీ కనువిప్పు కల్గించింది. ఆశ్రమ స్థలంలో సంచరిస్తున్న యాగాశ్వాలను బకదాల్భ్యుని అనుమతితో తోలుకొని- అందరూ కృష్ణసహితంగా సముద్రాన్ని వెలువడి వచ్చేరు.
భూభాగంలో పాదం మోపిన అశ్వాలు నిరాఘాటంగా పరువెత్తి సైంధవుని రాజ్యంలోనికి ప్రవేశించాయి. సైంధవుని కుమారుడు ఆ రాజ్య పాలకుడు. అర్జునుడు సైన్య సమేతుడై మహారథికులతో తన రాజ్యానికి విచ్చేసేడని చారుల వల్ల తెలుసుకొన్న సైంధవ కుమారుడు భయంతో గుండెలు నీరై ప్రాణాలు విడిచేడు.
దుస్సల సైంధవుని పత్ని. ఆమె భర్తృ వియోగంతో వేదన పొందుతుండగా గోరుచుట్టుపై రోకటి పోటులా పుత్ర మరణం సంభవించింది. దుస్సల రోదిస్తూ కృష్ణుని పాదాలపై పడింది.
‘శ్రీకృష్ణా! కురుక్షేత్ర యుద్ధంలో నా భర్తని వధించేరు. ఇపుడు నా కొడుకు కూడా మరణించేడు. కౌరవ పాండవులకు ఏకైక సోదరిని. ఇప్పుడు అనాథనయ్యేను. నన్ను కాపాడు’ అంటూ రోదించింది దుస్సల.
అర్జునుడు ఆమెను ఓదార్చేడు.
‘సోదరీ! దుఃఖించకు. కృపాసముద్రుడైన కృష్ణుడు మన పాలినున్నాడు’’ అని అర్జునుడు శ్రీకృష్ణుని కీర్తించి దుస్సలాసుతుణ్ణి బ్రతికించుమని ప్రార్థించేడు.
మరణించిన దుస్సల కుమారుణ్ణి శౌరి ప్రేమతో తాకగానే అతడు లేచి శ్రీకృష్ణునకు ప్రణమిల్లేడు. సభలోని వారందరూ శ్రీకృష్ణునికిమ్రొక్కి నుతించి గీతవాద్యాలతో వైభవస్వాగతం జరిపించేరు.
అర్జునుడు తన సోదరియైన దుస్సలకు గజ అశ్వ ధన కనకరాశుల్ని కానుకలిచ్చి అశ్వమేధ యాగానికి రమ్మని వేడుకొన్నాడు.
శ్రీకృష్ణుడు యాగాశ్వాలను తీసుకొని యజ్ఞ ప్రారంభ దినానికి హస్తినకు చేరుకొమ్మని రాజలోకానికి చెప్పి తాను హస్తినకు బయలుదేరాడు.
కృష్ణుడు - హస్తిన
జాహ్నవీ తీరంలో నిర్మించిన రత్నకాంచన మంటపంలో యజ్ఞదీక్షితుడై ఉన్నాడు ధర్మరాజు. సంవత్సరకాలం నిత్య దీక్షా నిర్వహణలో ఉన్న ధర్మరాజుని చూసి మ్రొక్కి యోగక్షేమాలు అడిగేడు కృష్ణుడు.
‘‘్ధర్మరాజా! నీ ప్రతాపానికి సాటిలేదు. సమస్త రాజ్యాలలోని భూపాలురను గెలిచి అర్జునుడు త్వరలో నిన్ను సందర్శించనున్నాడు’’ అని చెప్పి హంసధ్వజునితో యుద్ధం మొదలుకొని చివరకు బకదాల్భ్యు చరిత్రదాకా పూసగుచ్చినట్టు చెప్పేడు శ్రీకృష్ణుడు.
అందరూ శ్రీకృష్ణ ముఖోద్గతమైన కదన కథాలహరిలో మునిగితేలారు. అనంతరం కృష్ణుడు తల్లులకు కుంతికి నమస్కరించి భీమ నకుల సహదేవ సుభద్రా ద్రౌపదులను పలుకరించి రుక్మిణీ సత్యభామాది నిజ కాంతలతో సల్లాపించేడు.
మరునాడు ధర్మరాజు అనుమతితో ప్రజలు బంధువులు పురోహితులు వారకాంతలు అర్హ ప్రకారాలతో ముందుకు సాగగా- భీమాది యోధ వీరులు చతురంగ బల సమన్వితులై వెంటరాగా శ్రీకృష్ణుడు బకదాల్భ్య మునిసత్తమునికి స్వాగతం పలికి ఎదురేగి తీసుకువచ్చేరు. మహా తపస్వియైన బకదాల్భ్యుని బంగారు పల్లకీలో ఉంచి స్వయంగా పాండవ పుత్రులు రాజముఖ్యులు పల్లకీ పట్టి తీసుకువచ్చారు.

- ఇంకా ఉంది

-బులుసు వేంకటేశ్వర్లు