చిత్తూరు

రానున్న వర్షం ముప్పును తట్టుకోవడానికి సిద్ధంకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జిల్లాలో ఎక్కడా బోర్ల మంజూరు చేయొద్దు
* జిల్లా అధికారులకు సిఎం ఆదేశం
తిరుపతి, నవంబర్ 27: రానున్న ఐదు రోజుల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని విధాలా సిద్ధం కావాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చిత్తూరుజిల్లాలో తన రెండుల పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం తిరుపతికి వచ్చిన సిఎం స్థానిక పద్మావతి అతిథిగృహంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వర్షాల వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం అందిస్తున్న వరదసాయాన్ని మరింత వేగంగా పంపిణీ చేయాలని చెప్పారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడా బోర్లు వేసేందుకు అనుమతులు మంజూరు చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. బోర్లు అవసరమైన చోట, ఉన్న బోర్లనే కమ్యూనిటీ మొత్తం వినియోగించుకోవాలన్నారు. అన్ని చెరువులు, ప్రాజెక్టుల వద్ద నీటి మట్టంను ఎప్పటికప్పుడు నీటి పారుదల శాఖాధికారులు ముందుగా సేకరించుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట చెక్ డ్యాంలు, ఫారం పాడ్స్‌లు నిర్మించాలని, ప్రాజెక్టుల పనుల విషయంలో జాప్యం చేసే కాంట్రాక్టర్లును బ్లాక్‌లిస్టులో పెట్టాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల స్థానంలో నూతన భవనాలను నిర్మించాలని, శిధిలావస్థకు చేరుకున్న పాఠశాలలకు నోటీసులు జారీ చేసి పాఠశాలలను తరలించాలన్నారు. ఇందుకు స్పందించని పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని సిఎం ఆదేశించారు. తిరుపతిని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, ఇందులో భాగంగా అవిలాల,పేరూరు చెరువులను ఆక్రమణలను తొలగించి పరిరక్షించాలన్నారు. తిరుమల్లో వర్షాల వల్ల భక్తులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సి ఎం చంద్రబాబు నాయుడు, టిటిడి ఇ ఒ సాంబశివరావు ఆదేశించారు. ఈసందర్భంగా చిత్తూరుజిల్లాలో వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని, తీసుకున్న చర్యలను కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈకార్యక్రమంలో మంత్రులు బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, నారాయణ, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, ముద్దు క్రిష్ణమనాయుడు, ఎంపి శివప్రసాద్, ఎమ్మెల్యేలు శంకర్‌యాదవ్, తలారి ఆదిత్య, సుగుణమ్మ, టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, జడ్పీ ఛైర్మన్ గీర్వాణి, జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్ టిటిడి తిరుపతి జె ఇ ఒ పోలభాస్కర్, తిరుపతి నగరపాలకసంస్థ కమీషనర్ వినయ్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.

భారీ వర్షాలకు రూ. 3,400 కోట్లు నష్టం
* మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడి
శ్రీకాళహస్తి,నవంబర్ 27: భారీ వర్షాలకు రాష్ట్రంలోని 4 జిల్లాల్లో మొత్తం 3,400 వేల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర సమాచార శాఖామంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. శుక్రవారం శ్రీ కాళహస్తికి వచ్చిన ఆయన ఇటీవల గండి పడిన తెలుగుగంగ కాలువను తొట్టంబేడు మండలం, చిన్న కనపర్తి వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 99 సెంటీమీటర్ల వర్షం 3 రోజుల్లో నష్టం వాటిల్లిందని చెప్పారు. ఎక్కువగా ఉద్యానవన పంటలు 1000 ఎకరాల నష్టం జరిగిందన్నారు. 9,770 వేల హెక్టార్లలో పంటలు నష్టం జరిగిందని వివరించారు. 32 మంది చనిపోయారని, వారికి ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. 62 చెరువులకు గండ్లు పడ్డాయని, వాటికి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నామన్నారు. 462 పశువులు కూడా మృతిచెందాయని, 49,775 కుటుంబాలకు ఉచితంగా బియ్యాన్ని అందించామని తెలిపారు. వర్షాల వల్ల 10వేల చేనేత కుటుంబాలకు 6 కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగిందన్నారు. చేనేత కార్మికులను కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటోందని తెలిపారు. వర్షాలకు నష్టపోయిన ప్రతిరైతుకు పరిహారం అందిస్తామని, ఎవ్వరూ బాధపడాల్సిన అవసరంలేదని తెలిపారు. ఆయనతోపాటు తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మం, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నరసింహయాదవ్, స్థానిక టిడిపి నాయకులు మురళినాయుడు, చలపతి, శంకర్‌నాయుడు, జయరామయ్య, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

చింటూను త్వరగా అరెస్ట్ చేయండి

* జిల్లా పోలీసు అధికారులకు సిఐడి విభాగం డిజి ఆదేశం
చిత్తూరు, నవంబర్ 27 : చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రశేఖర్ అలియాస్ చింటూను త్వరగా పట్టుకుని అరెస్ట్ చేయాలని రాష్ట్ర సిఐడి విభాగం డైరెక్టర్ జనరల్ ద్వారకా తిరుమలరావు జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన చిత్తూరుకు వచ్చి మేయర్ హత్యకు సంబంధించి పలు అంశాలను పరిశీలించారు. తొలుత మేయర్ దంపతుల హత్య జరిగిన ఆమె ఛాంబర్‌తో పాటు పరిసరాలను పరిశీలించారు. అనంతరం రాయలసీమ ఐజి గోపాలకృష్ణ, ఎస్పీ శ్రీనివాస్, ఏఎస్పీ రత్న, డిఎస్పీ లక్ష్మీనాయుడు, పలువురు సిఐలతో ప్రత్యేకంగా సమావేశమై కేసు పురోగతి, కేసులో మిగిలిన హంతకులను పట్టుకోవడం వంటి అంశాలపై చర్చించారు.
అంగన్‌వాడీ వర్కర్లచే కలెక్టరేట్ ముట్టడి
* సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉద్ధృతం
* ప్రభుత్వానికి అంగన్‌వాడీ వర్కర్ల హెచ్చరిక
చిత్తూరు, నవంబర్ 27 : దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. సిఐటియు ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి భారీఎత్తున వచ్చిన వచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్ల సంఘం నేతలు వాణిశ్రీ, సుజని మాట్లాడుతూ గత కొనే్నళ్లుగా తమ కనీస కోర్కెలు నెరవేర్చకుండా అన్ని ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని వాపోయారు. అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకులకు పెంచిన వేతనాలకు సంబంధించి జీవోల విడుదల, ఇళ్ల స్థలాల కేటాయింపు, ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల మంజూరు, ఉద్యోగ భద్రత, అంగన్‌వాడీ కేంద్రాలకు పక్క్భావనాల నిర్మాణం, ఇతర అలెవెన్సుల చెల్లింపు వంటి అంశాలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి తమ సమస్యలపై మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని వాపోయారు. దీంతో ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజల వద్దకు సమర్థవంతంగా తీసుకెళ్లే తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోలేక సతమతమవుతున్న తమ న్యాయపరమైన కోర్కెలను వెంటనే నెరవేర్చాలని, లేనిపక్షంలో తమ ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పి చైతన్య మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్ల న్యాయపరమైన కోర్కెలు, సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఉదాశీనత అవలంబిస్తోందని ఆరోపించారు. గతంలోనూ తమ సంఘం ద్వారా ఎన్నో పోరాటాలు చేసి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు బైఠాయించి ధర్నా చేయడంతో కలెక్టరేట్‌లోకి వెళ్లాల్సిన ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో టూటౌన్ పోలీసులు రంగ ప్రవేశం చేసి సిఐటియు నేతలు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఈ క్రమంలో చిత్తూరు-వేలూరు రహదారి వద్ద కొంతసేపుట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
వర్కర్లు, హెల్పర్లు అరెస్ట్, విడుదల
కలెక్టరేట్‌లో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ముట్టడి కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారంటూ పలువురు అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్ నాయకులతో పాటు పలువురు వర్కర్లు, హెల్పర్లను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు.
ఏఐటియుసి మద్దతు
అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల కలెక్టరేట్ మట్టడి కార్యక్రమానికి ఏఐటియుసి తన మద్దతు ప్రకటించింది. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జె రామచంద్రయ్య, జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్ నాగరాజన్, నగర కార్యదర్శి బి ఆర్ముగం, నాయకులు ప్రేమ్‌రాజ్, రమేష్, బాబు, సుబ్రహ్మణ్యం, బాలాజీరావు తదితరులు ముట్టడి కార్యక్రమానికి హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించి ప్రసంగించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
గంగవరం, నవంబర్ 27 : మండలంలోని పలమనేరు-మదనపల్లె వెళ్లే రహదారిలో గంగవరంలోని సాయినగర్ వద్ద గురువారం రాత్రి ద్విచక్రవాహనం మహిళను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా వైద్య చికిత్సల నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శాలమ్మ (65) శుక్రవారం ఉదయం మృతి చెందింది. మహిళను ఢీకొన్న ద్విచక్రవాహన చోదకుడు రఘు (36)పై గంగవరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే నాల్గవ నెంబరు జాతీయ రహదారిలోని గండ్రాజుపల్లె సమీపం పెద్దఉగ్ని గ్రామం వద్ద మతిస్థిమితం లేని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గంగవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కెజిబిలో మరో ఇద్దరికి జ్వరం
* తిరుపతికి తరలింపు
* హెల్త్ సూపర్‌వైజర్ నియామకం
రొంపిచెర్ల, నవంబర్ 27 : మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబాగాంధీ బాలికా విద్యాలయంలో జ్వరంతో బాధపడుతున్న లత, రెడ్డి చందన అనే విద్యార్థినులను తిరుపతికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. విద్యాలయంలో జ్వరాలతో పలువురు విద్యార్థినులు బాధపడుతుండటం, సౌజన్య అనే విద్యార్థిని మరణించడం తెలిసిందే. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు కస్తూరిబాగాంధీ పాఠశాలలో ప్రత్యేక ఆరోగ్య చర్యలు తీసుకుని హెల్త్ సూపర్‌వైజర్ పార్వతమ్మను పాఠశాలలో నియమించారు. మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి ఎల్లయ్య శుక్రవారం పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పది మందికి ఆరోగ్య సమస్యలు ఉండటంతో వారికి చికిత్సలు చేశారు. జ్వరంతో బాధపడుతున్న లత, రెడ్డి చందన అనే విద్యార్థినులను తిరుపతి రుయాకు చికిత్స నిమిత్తం పంపించారు.
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై
కేసు నమోదు
* ఏడుగురు అరెస్ట్
గుర్రంకొండ, నవంబర్ 27 : మండల కేంద్రమైన గుర్రంకొండలో ఇండియన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. రెండేళ్ల కితం డ్రీమ్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ పేరున రిజిస్టర్ కాబడి గుర్రంకొండలో ఏర్పాటుచేసిన ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో సుమారు 250మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం భోజన సమయంలో భవన పైకప్పులు కూలిపోయి భోజనం చేస్తున్న ఓ చిన్నారి అఫ్సా (4) మృతిచెందడం, 8మంది చిన్నారులు తీవ్రంగా గాయపడటం తెలిసిందే. దీనిపై జిల్లాకలెక్టర్ సిద్ధార్థజైన్ పాఠశాల అనుమతులను పూర్తిగా రద్దుచేస్తూ ఈ పాఠశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని జిల్లావిద్యాశాఖ అధికారికి ఆదేశాలిచ్చారు. దీంతో మండల ఇన్‌ఛార్జ్ ఎంఇఓ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేయగా, శుక్రవారం డ్రీమ్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ కమిటీ కార్యదర్శి, కరస్పాండెంట్ ప్రదీప్‌కుమార్ (30), అధ్యక్షులు శివశంకర్‌ప్రసాద్ (33), కోశాధికారి, ప్రిన్సిపాల్ సుధారాణి (27), పాఠశాల సహాయ కార్యదర్శి రెడ్డి శేఖర్ (26), సొసైటీ ఉపాధ్యక్షులు నాయిని జగదీష్‌కుమార్ (34), డైరెక్టర్‌లు చిన్నరెడ్డెప్ప (35), శోభనాల రమేష్ (27)లను అరెస్టుచేసి వాల్మీకిపురం కోర్టుకు హాజరుపరచినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

ఏనుగుల దాడిలో
ఇద్దరికి తీవ్ర గాయాలు
కుప్పం, నవంబర్ 27 : గుడుపల్లె మండలం బోయనపల్లె సమీపంలో వ్యవసాయ పొలాల వద్ద నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులపై గురువారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు దాడి చేసింది. ప్రస్తుతం వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయనపల్లెకు చెందిన గణేష్, మురుగేష్ తమ వ్యవసాయ పొలాల వద్ద నిద్రిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి ఏనుగులు గడ్డి కుప్ప వద్దకు చేరాయి. ఆ సమయంలో అక్కడే నిద్రిస్తున్న ఇద్దరిపై దాడి చేశాయని స్థానికులు తెలిపారు. దీంతో వీరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గత కొంతకాలంగా ఏనుగుల దాడులు తగ్గుముఖం పట్టగా, మండలంలో మళ్లీ మొదలు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం సమీప అటవీ ప్రాంతంలోనే ఏనుగులు మకాం పెట్టాయని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. అటవీ అధికారులు స్పందించి ఏనుగుల దాడులను అరికట్టేందుకు తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.