వాసిలి వాకిలి

నేను.. శిఖర వౌనాన్ని !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-1-
తొలి బీజంగా ‘నేను’
తొలి ఇజంగా ‘నేను’
తొలి నిజంగా ‘నేను’
*
అక్షరానికి అందని
చీకటి వెలుగుల పారవశ్య ప్రబంధం...
తపనతో పల్లవించిన విశ్వసృజన!
పంచభూతాలుగా రూపించిన భూతలం!!
మానవ తత్వంతో సృష్టిమగ్నమైన ‘నేను’!!
-2-
నేను
సిగ్గిలని నగ్నతను
విరామ మెరుగని మగ్నతను
*
నేను
నగ్నత్వ వలువను
మగ్నత్వ విలువను
*
నేను
వలువ వందనాన్ని
విలువ ప్రార్థనను
*
నేను
ఓజస్సును
తేజస్సు తమస్సుల సృజనను
*
నేను
ఓంకారాన్ని
ప్రామాణిక స్వర సంహితను
*
నేను
సృష్టిని
అవతార రహస్య గర్భను
*
నేను
తపస్సును
భౌతిక అధిభౌతిక భృకుటిని
*
నేను
వౌనాన్ని
నిశ్శబ్ద శబ్దతల సరిరేఖను
*
నేను
యోగాన్ని
దృశ్య అదృశ్యతల సంయోగాన్ని
*
నేను
అనంతాన్ని
అర్ధనిమీలిత అంతర్వాహినిని
*
నేను
శూన్యాన్ని
గగనతల అంతఃచైతన్యాన్ని
*
నేను
ఖగోళాన్ని
గ్రహమండల శక్తిచాలనాన్ని
*
నేను
నక్షత్రాన్ని
దివ్యజీవన జ్యోతిమండలాన్ని
*
నేను
ఋషిని
గురుమండల విశ్వదర్శనాన్ని
*
నేను
మనిషిని
విశ్వవిలసన అంతస్తత్వాన్ని
*
నేను
అతిథిని
చరాచర అచేతనాచేతనను
-3-
నేను
కొత్తగా
క్షణం క్షణం కొత్తగా
కణం కణం కొత్తగా
*
నేను
అదృశ్యంగా
అలుముకున్న పరమ నిశ్శబ్దంగా
మనసు మాయమైన కణక్షణంగా
*
నేను
నేనుగా
ఏదీ తెలియని స్థితిగా
దేనినీ పోగు చేసుకోకుండా
*
నేను
అమాయకంగా
దేన్నీ తెలుసుకోవాలనుకోకుండా
తపించకుండా.. నిర్లిప్తంగా...
*
నేను
నేనే వివరంగా
ఏ వివరాలు తెలుసుకోకుండా
తెలియని దానిలోకి నిర్భయంగా అడుగిడుతూ
*
నేను
నిరంతరంగా
నిరంతరం బ్రతికేస్తూ
జీవిత గమనంలో దూసుకుపోతూ
*
నేను
నిజంగా
నేనుగా నిర్మితమవుతూ
నాకు నేను నకిలీ కాకుండా
*
నేను
చీకటిగా వెలుగుగా
చీకటిని భరిస్తూ ధరిస్తూ
వెలుగును చేదుకుంటూ
చేరుకుంటూ
*
అవును,
నేను ఒంటరిగానే
నన్ను నేను నమ్ముకుంటూ
నాలోని నమ్మకాల్ని నమ్ముకుంటూ
*
నేను
సజీవాన్ని
మృత్యుగరిమని
మృత్యువుకే మృత్యువుని
*
నేను
సమాధిని
కట్టుకున్న సమాధిని కాను
కట్టించుకున్న సమాధిని కాను
*
అయినా
నేను సమాధిని
సజీవ సమాధిని
*
నేను
జీవాన్ని
తెలిసినదాన్ని జీవాన్ని కాను
తెలియనిదాని సజీవాన్ని
*
నేను
మరణాన్ని
నిన్నటి మరణాన్ని
నేటి మరణాన్ని
రేపటి మరణాన్ని
*
నేను
పునరుత్థానాన్ని
పూర్వజన్మనూ కాను
పరజన్మనూ కాను
*
నేను
అస్తిత్వాన్ని
గెలుపులోని ఓటమిని
ఓటమిలోని గెలుపుని
*
నేను
అమాయకతను
నిన్నటి జ్ఞాపికను కాను
రేపటి జ్ఞానశకటాన్ని కాను
*
నేను
ఆత్మను
అంతరంగ స్వభావాన్ని
బాహిర మేధావిని కాను
*
నేను
కొత్తను
నిన్నటి నీడను కాను
రేపటి కొత్తనూ కాను
వర్తమాన వర్తన కొత్తను
-4-
నేను
వౌనాన్ని
వౌన శిఖరాన్ని
శిఖర వౌనాన్ని
*
అవును, నేను
అనంత విభావరిని
అనంతర ఆహార్యాన్ని
ఆవలితీర అంతరంగాన్ని
*
నేను
శబ్ద పరత్వాన్ని
నిశ్శబ్ద పర్వతాన్ని
నిష్క్రమణ పర్వాన్ని
*
అవును, నేను
శబ్దించని అరూపాన్ని
హృదయ లేఖినిని
అవ్యక్త అక్షరాస్త్రాన్ని
*
నేను
వౌన రాగాన్ని
రాగ సంసారాన్ని
సంసార సరాగాన్ని
*
అవును, నేను
శూన్య పల్లవిని
చరణగతిని
గీత గరిమని
*
నేను
సాంద్ర సంకల్పాన్ని
చైతన్య స్రవంతిని
నిమీలిత కాలవాహినిని
*
అవును, నేను
కనుపాపల నిశ్చలతను
కనురెప్పల సమాధిని
కనుదోయి కరుణాకరాన్ని
*
నేను
వాసన లేని వాసాన్ని
నిర్వ్యాపార నివాసాన్ని
నియతిలేని ఉపవాసాన్ని
*
అవును, నేను
మానవ రహస్యాన్ని
రహస్య వౌనాన్ని
అక్షర వౌనాన్ని
*
అవునవును
నేను నిష్క్రమణ వౌనం
నేను అస్తిత్వం వౌనం
నేను వౌనం.
వౌనం వౌనం వౌనం

-విశ్వర్షి 93939 33946