వాసిలి వాకిలి

నేను ఆత్మస్రోతస్సును..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను’
ఆరు పదుల ఒరలో
అరిషట్ వర్గాల అరను
చీకటి వెలుగుల గమనంలో
ఉభయ సంధ్యల ఉనికిని.
దశావతార సహోదరత్వాన్ని
నవగ్రహ చిదంబరాన్ని
ద్వాదశ రాశుల అంతర్యామిని
అష్టదిగ్బంధన గర్భ జవజీవాన్ని.
అవును, నేను
శుక్ర ఆచార్యుల గురుత్వాన్ని
శుక మునీంద్రుల అక్షరత్వాన్ని
వాల్మీక పురుషుల ధర్మ రహస్యాన్ని
వ్యాస ప్రభువుల విశ్వ దర్శనాన్ని.
రమణుల అచలాగ్నిని
అరవిందుల మానసవరాన్ని
పరమహంస యోగానందాన్ని
రామకృష్ణుల వివేకసిద్ధిని
అవునవును, నేను
కణాలను రగిల్చి
క్షణాలను మేల్కొల్పి
శ్వాసను నిలిపి (నిగిడించి)
స్వరాల నిశ్శబ్దాన్ని వొంపి
నరనరాన వౌనాన్ని నింపి
ప్రయాణం సాగిస్తున్నాను
గగనాన్ని చీల్చుకుంటూ
గ్రహ మండలాలను దాటుకుంటూ
రుషి మండలాలను
చేరుకుంటున్నాను
గిక అక్షరంగా
అక్షర క్షణంగా
* * *
నేన...
జీవగంగా భగీరథ తపస్విని..
చైతన్య విస్ఫోటనా విశ్వమిత్రుడిని..
భౌతిక అధిభౌతిక లయకారుడిని
త్రిగుణ లలాట కాలరేఖను
కణప్రాయ కాంతిలేఖను..
తామసిక అధోచైతన్యాన్ని..
తాపసిక ఉన్నత చైతన్యాన్ని..
సాంసారిక సరూప చేతనను..
ఐహిక సంగమ చేతనా కెరటాన్ని..
ఆముష్మిక సాంద్రతా కెరట కిరణాన్ని
అవును, నేను..
భువన క్షణ ఇతిహాసాన్ని..
గగనతల మానవేతిహాసాన్ని..
నిన్నటి సెయింట్‌ను..
నేటి సెయింటిస్ట్‌ను..
కణరహిత, క్షణాతీత చైతన్య గర్భను
* * *
నేను
శిలువను
క్రీస్తు చేతనను
విశ్వక్రియా చాలనను
వియన్మండల నక్షత్రకాంతిని
ఆత్మన ఒదిగిన అనంతాన్ని
మతమతి మీరిన సమ్మతిని
భూగోళ గర్భాన దివ్యత్వాన్ని
మనుగడన ఏకతాసూత్రాన్ని
కరుణగ కదిలిన మానవత్వాన్ని
శిలువన పొదిగిన మృత్యునేత్రాన్ని
భువిన కనలిన ఆర్ద్రతను
జీవనగరిమన సంపూర్ణతను
మనసు వాకిట సర్వతంత్రను
సృష్టిగతిన స్వతంత్రేచ్ఛను
సమూహాన దివ్యస్పందనను
అస్తిత్వ వలయ వ్యక్తిమత్వాన్ని
ఆస్తిక రచనా మాధ్యమాన్ని
నవపల్లవ ప్రభాత లక్ష్యాన్ని
ఆత్మపథ సహోదరత్వాన్ని
మనిషిన అసంపూర్ణ చరిత్రని
అధిమానవ సంపూర్ణ ప్రతిపత్తిని
ఇహపర ఆత్మల జనన రహస్యాన్ని
నిజజన నవ మానవ తత్వాన్ని
ప్రేమ పంచిన సహోదరున్ని
లక్ష్యం పెంచిన స్నేహితున్ని
గమ్యం చూపిన మార్గదర్శిని
మత మెరుగని గురుమార్గాన్ని
భవిష్య మానవ భారమితిని
వర్తమాన శుద్ధ మానవతని
సంప్రదాయాన ఇమడని తత్వాన్ని
అంతర్యానాన పరిశుద్ధ సంకల్పాన్ని
ప్రాక్పశ్చిమల హృదయవందనాన్ని
కనురెప్పల కరుణారవిందాన్ని
సహస్రదళ వికసిత చిరంతనాన్ని
కాల కొలమాన క్రీస్తుశకాన్ని
* * *
నేను
కాలరేఖ తొలి బిందువును చేరటానికి
లక్షల వత్సరాలను తొలుచుకుంటున్నాను
భవిష్య జీవన పదిల ప్రస్థానానికి
పదుల సాహసయాత్ర నవుతున్నాను
మాయామోహిత చీకటిని చీల్చుకుంటూ
వెలుగు కిరణ ఆజ్ఞ నవుతున్నాను
విశ్వప్రజ్ఞ నుండి విడివడిన ఆత్మగా
అణువును ముద్దిడి భౌతికమవుతున్నాను
గగనం నుండి రాలిపడ్డ తేజస్సుగా
కణాన్ని రగిల్చి రూప జగత్తవుతున్నాను
శూన్యతల అనంత ప్రాణవాయువుగా
జన్యువుతో సంయోగించి జీవమవుతున్నాను
ఆవృత అధిభౌతిక తాత్వికతగా
ఆదితత్వ మానవ వాకిలి నవుతున్నాను
అవును, ‘నేను’
రూపంలో అరూప అవతరణను
శబ్దంలో నిశ్శబ్ద అవతరణను
చూపులో లోచూపు అవతరణను
స్వరఘరిలో వౌన అవతరణను
ఫాలభాగాన త్రినేత్ర అవతరణను
నడినెత్తిన ముల్లోక అవతరణను
కపాల కేంద్రాన సహస్రార అవతరణను
అవునవును, నేను
సంసార సంస్కరణా గిక సాధనన
అన్నట్టు, నేను
వేయిపడగల పర అవతరణకు
మహాకుండలిని నవుతున్నాను
మూలాధార నిప్పుసెగతో
మానవ కుండలిని నవుతున్నాను
చతుర్దశ మట్టితత్వంతో
త్రివాలయ హిమజ్వాల నవుతున్నాను
షట్దళ జలతత్వంతో
సుఖ సంసార మునక నవుతున్నాను
దశదళ అగ్నితత్వంతో
ఆత్మకలిత ఇచ్ఛాపూర్తి నవుతున్నాను
ద్వాదశ దళ వాయుతత్వంతో
ప్రేమనగర విశ్వంభర నవుతున్నాను
షోడశదళ గగనతత్వంతో
విశుద్ధస్వర సత్యసంధత నవుతున్నాను
ద్విదళ జ్ఞానతత్వంతో
ఆజ్ఞావర్తన అంతర్వీక్షణ నవుతున్నాను
సహస్రదళ ప్రజ్ఞాతత్వంతో
పారదర్శక ఆత్మస్రోతస్సు నవుతున్నాను

-విశ్వర్షి 93939 33946