వాసిలి వాకిలి

నేను.. అర్ధాంగిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-1-
నేను
అర్ధాంగిని
సరస బంధాన్ని
సమ సంసారాన్ని
సరిసగ సమాసాన్ని
ద్వంద్వాన తొలిభాగాన్ని
బంధాన మలిభాగాన్ని
పుట్టినింట అద్వితీయాన్ని
మెట్టినింట ద్వితీయాన్ని
-2-
నేను
సతిని
సహ్య మతిని
సంసార గతిని
ఏడడుగుల గమకాన్ని
హంసతూలికా తల్పాన్ని
మాటలేని వౌనముద్రను
హద్దులను చెరిపేసిన చేతను
అరచిత శృంగారనైషధాన్ని.
-3-
నేను
సప్తపదీయాన్ని
స్నేహాంకాన్ని
సౌశీల్య సౌరభాన్ని
స్వరూప సౌందర్యాన్ని
సాభిప్రాయ శక్తిని
సప్తరాగ సంపదను
సంతోష శ్రీకారాన్ని
సహస్రార శ్రీకరాన్ని.
-4-
నేను
అమలను
సంసార సింధువును
కనపడని కేంద్ర బిందువును
కన్నవారి హిమాలయాన్ని
కనినవారి మహిమాలయాన్ని
పతికి సమర్పణమయ్యే నైవేద్యాన్ని
మదిన నిలిచే ప్రసూతి వైరాగ్యాన్ని
-5-
నేను
శ్రీమతిని
అన్నమయ వరాన్ని
ప్రాణమయ ప్రాంజలిని
మనోమయ మానినిని
విజ్ఞానమయ విధాత్రిని
ఆనందమయ విభూతిని
సామాజిక వొరిపిడిని
సర్దుబాట్ల సరాగాన్ని
సాంసారిక జీవకృతిని
-6-
నేను
ఒడిని
నిశ్శబ్దాక్షర బడిని
శైశవ పథ వాకిలిని
పదగుంఫన విహారిని
కౌటుంబిక అక్షర క్రీడని.
-7-
నేను
అంకిత పుటను
కరగని చరిత్రను
ఆశీర్వచన శతకాన్ని
కౌటుంబిక కథా స్రవంతిని
బహుముఖీన నవలా జగత్తుని
సాంసారికరంగ నాటక ప్రయోక్తని
సమవ్యక్తిత్వంతో రాసుకున్న
పెళ్లి పుస్తకాన్ని.
-8-
నేను
సిరిని.. మగని సిరిని
సరి సంగమాన్ని.. సుర స్వరాగాన్ని
అవును
నేను అర్ధాంగిని.. అర్ధనారీశ్వరాన్ని
నాభీ మంత్రాన్ని.. నాడీ తంత్రాన్ని
గగన సదృశాన్ని.. గణించని జాతకాన్ని
సామరస్య గణితాన్ని..
గుణింతాల గమనాన్ని
సామూహిక వాదాన్ని..
సాంసారిక వేదాన్ని.
-9-
నేను
ఇరు సంధ్యల శుభసంధ్యను
ప్రాక్పశ్చిమ బంధ ఆయువును
గంగాధర చంద్రరేఖను
మహిమాతల గంగమ్మను
శీతల కుటుంబ లవకుశ మాతను
మృత్యుంజయ సత్యపథ సతిని
అదృశ్య రుషి జీవన అరుంధతిని
ఆచరణ కొచ్చిన దాంపత్య గీతను.
-10-
నేను
మాంగల్యానికి మనసైన ముడిని
స్వకీయ వ్యక్తిత్వ సంపన్నను
దాంపత్యాయువును
వెనకన ఒదిగిన అడుగును
పతిని చేరిన ముందడుగును
మురిపించిన ఏడడుగులను.

-విశ్వర్షి 93939 33946