వాసిలి వాకిలి
నేను.. సిద్ధయోగిని
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
-1-
ఇంద్రియ క్రతువుల మట్టి ప్రమిదను
సిరా ధమనుల అర్ఘ్య తటాకను
ఇడా పింగళుల సుషుమ్న వాహికను
బ్రాహ్మీ ముహూర్త అగ్ని శిఖను
ప్రత్యూష పవన ప్రణవాన్ని.
*
నేను
మట్టిని ముద్దాడిన సిద్ధయోగిని
గాలిని స్నేహించిన ధ్యానశీలిని
నీటిని చిలకరించిన తపస్విని
అగ్నిని ఆవహించిన అమర్త్యుడను
గగనాన్ని చుంబించిన లయకారుడను.
*
నేను
చీకటి వెలుగుల అంతర్లయను
సూర్యోదయ చంద్రాస్తమయాన్ని
చంద్రోదయ సూర్యస్తమయాన్ని
జరామృత్యు అంతర్గమనాన్ని
జీవన చాపాన్ని - మృత్యు చారికను.
*
చివరకు..
నాలో నేనే ప్రవహిస్తాను
సవికల్ప సమాధిగా
నాకు నేనుగా మిగులుతాను
నిర్వికల్ప సమాధిగా.
-2-
నేను
తురీయాతీత అమాత్రను
పసిమిప్రాయ పసితత్త్వాన్ని
రుషివిరచిత శూన్య బంధాన్ని
ఇరుసంధ్యల అగ్ని నేత్రను
త్రిపాద విశ్వావతారాన్ని.
*
నేను
దృశ్యంగా మహా విస్ఫోటనాన్ని
అదృశ్యంగా చైతన్య ప్రభంజనాన్ని
రూపంగా ఇంద్రియ కూడలిని
అరూపంగా శక్తిమండలిని
సూర్యచంద్రుల గగన తాపాన్ని.
*
నేను
సబీజ నిర్భీజ జననాన్ని కాను
ప్రకృతి రచిత బీజ మూల్యాంకనాన్ని
సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధిని కాను
నిత్య జ్వలిత కుండలినీ గుంఫనాన్ని
భవిష్య మానవ ‘శాశ్వతత్వ’ పూనికను.
*
అవును, నేను
యమ నియమ ఆసన బాల్యాన్ని
ప్రాణాయామ ప్రత్యాహార కౌమారాన్ని
ధ్యాన ధారణ వనాన్ని
ఆనంద అస్మిత వృద్ధత్వాన్ని
నిర్వితర్క నిర్విచార పూర్ణత్వాన్ని.
*
అవునవున, నేను
పరంగ ప్రత్యక్ చేతనల సంయోగాన్ని
క్షణం క్షణం పరిణమిస్తున్న ప్రయోగాన్ని.
అయినా, నేను
కర్మశేషాన్ని కాను
కారణ జన్ముడను కాను
ఆత్మ త్యాగిని కాను.
*
నేను
సాకార యోగ జీవనాన్ని
నిరాకార గికపథాన్ని
కోశ కోశాన యోగ ప్రజ్ఞానాన్ని
దేహ దేహాన గిక ప్రాసాదాన్ని
భృక్తరహిత తారక రాజయోగాన్ని.
-3-
నేను
నిమీలిత నేత్రాన్ని
అవును
కనురెప్పలు కలిస్తేనే
ఆ ఒంటికన్ను విప్పారేది
ఆజ్ఞను దాటిన స్థితిలోనే
ఆ అస్తిత్వం వెల్లువయ్యేది
అక్షర ప్రపంచం ఇంకితేనే
ఆ ప్రమోదం వౌనమయ్యేది
కణ సముదాయం అగ్నితప్తమైతేనే
ఆ త్రినేత్రం ప్రజ్ఞానమయ్యేది
*
అవునవును
నేను ప్రశ్న కావాలి
ఆ నేత్రం సమాధానం కావటానికి
నేను సమాధానం కావాలి
ఆ నేత్రం సంవిధానం కావటానికి
నేను సంవిధానం కావాలి
ఆ నేత్రం సమీక్ష కావటానికి
నేను సమీక్ష కావాలి
ఆ నేత్రంలో చూపు కావటానికి
నేను లోచూపు కావాలి
ఆ నేత్రం లయకారకం కావటానికి
నేను లయకారకం కావాలి
ఆ నేత్రం లయకారి కావటానికి
నేను లయకారి కావాలి.
*
అవును,
నేను లయకారుడ్ని
త్రికాలాతీత లయకారుడ్ని.
నేను నిమీలిత నేత్రుడ్ని
తురీయాతీత నిమీలిత నేత్రుడ్ని.
నేను త్రినేత్రుడ్ని
గిక సంపన్న త్రినేత్రడ్ని.