రాష్ట్రీయం

వీధికెక్కిన కార్మికులపై వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 23: గత ఏడేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతిపక్ష హోదాలో ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులపైనేగాక ప్రజా సమస్యలపై కూడా రోడ్డెక్కి రాజీలేని పోరాటం సాగించిన నారా చంద్రబాబు నాయుడుకు నేడు ఉద్యమాలంటే అసలు గిట్టడం లేదు. నగరం నడిబొడ్డులో క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ సమస్యపై కూడా ఏ ఒక్కరూ జెండా లేదా ప్లకార్డు చేతబట్టి పరిసరాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునేలా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే న్యాయమైన డిమాండ్లపై ఛలో విజయవాడ పేరిట రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది అంగన్‌వాడీలు ఈ నెల 18వ తేదీ తరలి వచ్చినప్పుడు దారుణాతి దారుణ హింసాకాండ జరిగిందనే చెప్పొచ్చు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రారంభమైన ర్యాలీ సాయుధ పోలీసు బలగాలు ఏ ఒక్కరినీ అడుగుముందుకు వేయనీయకుండా లాఠీలతో తమ ప్రతాపం చూపుతూ కాళ్లు విరగ్గొట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతం రక్తసిక్తమైంది. మహిళలనే సానుభూతి కూడా చూపకుండా మగ పోలీసులు బూట్ కాళ్లతో తన్నుతూ ఈడ్చుకుపోయారు. ఈ సందర్భంగా దాదాపు 100 మందిని పోలీసులు అరెస్టు చేయటం జరిగింది. పోలీసుల దాడిని అన్ని పక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. అదే రోజు శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అంగన్‌వాడీల వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటిస్తూ 2016 ఏప్రిల్ మాసం ఉంచి అమలు చేస్తామంటూ ప్రకటించారు. దీంతో అంగన్‌వాడీలు సంబరం చేసుకున్నారు. ఇదిలా ఉంటే విజయవాడలో ప్రదర్శనకు వచ్చిన అంగన్‌వాడీలందరినీ విధుల నుంచి తొలగించాలంటూ మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖకు చెందిన ఐసిడిఎస్ ప్రాజెక్టు స్పెషల్ కమిషనర్ కెఆర్ బిహెచ్‌ఎన్ చక్రవర్తి పేరిట మంగళవారం 13 జిల్లా కలెక్టర్లకు మెమోలు జారీ చేశారు. ఇందుకోసం కమిషనరేట్ పోలీసులకు ప్రత్యేక ఆదేశాల జారీ అయ్యాయి. తమ వద్దనున్న సిడిలు, ఫోటోల ద్వారా అంగన్‌వాడీలను గుర్తించి ఆయా జిల్లాల కలెక్టర్లకు తక్షణం నివేదికలు పంపించాలంటూ ఆదేశించారు. ఇంకేముంది పోలీసులు అత్యుత్సాహంగా వారిని గుర్తించేందుకుగాను అందుబాటులో ఉన్న అంగన్‌వాడీలను రప్పించి వేధించటం, బెదిరించటం ప్రారంభించారని తెలుస్తోంది.
రాష్ట్రంలో పనిచేస్తున్న 48 వేల 770 మంది అంగన్‌వాడీలు, 48 వేల 770 మంది హెల్పర్లు, 6837 మంది మినీ అంగన్‌వాడీలు కల్సి దాదాపు లక్షా 60 వేల మంది గత కొన్నాళ్లుగా చాలీచాలని జీతాలతోవిధులు నిర్వర్తిస్తున్నారు. అంగన్‌వాడీలకు రూ.4,200లు, హెల్పర్లకు రూ.2200లు, మినీ అంగన్‌వాడీలకు రూ.2950లు నెలవారీ వేతనంగా చెల్లిస్తున్నారు. కనీస వేతనాల కోసం ఆందోళనలు సాగిస్తుండగా సిఎం చంద్రబాబు గత మార్చిలో జరిగిన శాసనసభ సమావేశంలో వేతనాల పెంపుకు అంగీకరిస్తూ ఇందుకోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు.
ఈ సబ్‌కమిటీ అనేకమార్లు చర్చలు జరిపి కొత్త వేతనాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఆ మేర జీవోలు రాకపోవటంపై ఈ నెల 14వ తేదీ ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వం ఎక్కడికక్కడ ప్రత్యేక శిక్షణ పేరిట అంగన్‌వాడీలను ఈ నెల 14,15 తేదీల్లో నిర్బంధించడం జరిగింది. 16వ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తమ నిర్ణయాన్ని ప్రకటించగలరనే హామీతో చలో విజయవాడను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. తీరా ఆ మంత్రివర్గంలో వేతనం పెంపుపై నిర్ణయం కాకుండా కేంద్రంతో చర్చించాలంటూ ఆ అంశాన్ని వాయిదా వేయడంతో ఆగ్రహించిన అంగన్‌వాడీలు ఈ నెల 18వ తేదీ చలో విజయవాడకు పిలుపునిచ్చారు. కారణాలేమైనా అంగన్‌వాడీలకు రూ.7 వేలు, మినీ అంగన్‌వాడీలకు రూ.4,500లు, హెల్పర్లకు రూ.4,500లు చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేర ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభలో ప్రకటించారు. దీనివల్ల అదనంగా రూ.709 కోట్లు ఖర్చు కానుండగా ఇందులో కేంద్రం రూ.169.09 కోట్లు భరిస్తే, రాష్ట్రం రూ.540.85 కోట్లు భరించాల్సి ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వంపై రూ.311 కోట్లు భారం పడుతుందనేది ప్రభుత్వ వాదన.
ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న విపక్షాలు
వేతనాలు పెంచినట్లే పెంచి వారిని అకారణంగా తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుండటంపై విపక్షాలతో పాటు అంగన్‌వాడీ సంఘాలు భగ్గుమంటున్నాయి. విజయవాడలో పలుచోట్ల మెమో ప్రతులను తగులబెట్టారు. రాష్టవ్య్రాప్తంగా గురువారం పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు ఆర్.రవీంద్రనాధ్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ, లలితమ్మ, ఎఐటియుసి నగర కార్యదర్శి ఆసుల రంగనాయకులు, అంగన్‌వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, కార్యదర్శి ఎన్‌సిహెచ్ సుప్రజ, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎవినాగేశ్వరరావు, కార్యదర్శి స్వరూపరాణి, జిల్లా అధ్యక్షులు ఎన్‌సిహెచ్ శ్రీనివాస్, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పెన్మత్స గంగాభవాని, ఐద్వా అధ్యక్షురాలు డి.రమాదేవి తదితరులు ధ్వజమెత్తారు. తక్షణం ఆ మెమోను ఉపసంహరించుకోవాలంటూ రాష్టవ్య్రాప్తంగా గురువారం అంగన్‌వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నారు.