వీరాజీయం

వానకాదు వరదలే కురిశాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జల దిగ్బంధంలో అపార్ట్‌మెంట్‌లు!’ ‘వరద’ ముంపులో జన జీవనం!’ తెలుగు రాష్ట్రాల అవినాభావ సంబంధం ఏమిటో గానీ, ఎండలొచ్చినా వానలొచ్చినా, వరదొచ్చినా- ప్రకృతి మాత రెండు ప్రాంతాలనీ ఒకే కంట చూసుకుంటున్నది.
ఇంచక్కా వేరు కుంపట్లు పెట్టుకుని కాపురాలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడయినా పరస్పరం ఆదుకుందామా అంటే- అక్కడా వాన- యిక్కడా ముంపు. అక్కడ రైలుపట్టాలు వరద నీట గల్లంతు- ఇక్కడ వాహనాలు ఎలా, ఎక్కడికి కొట్టుకుపోయాయో తెలియని స్థితి. బస్సులకు చక్రాలన్నీ నీట మునిగిన గేదెల్లాగా పడి వున్నాయి. వాన వెలిశాక- వెలిస్తే గానీ, వాటి క్రింది భాగాలు ఎలా వున్నాయో చెప్పలేము. శనివారం నాటికి కూడా యింకా హై అలర్ట్‌లోనే వున్నాయి- హైదరాబాద్, తెలంగాణా ప్రాంతం అంతా రికార్డు కాలం హెచ్చరిక కాలం అయింది యిది.
సిటీలో ఒక్క ఆరుగంటల కాలంలో- అరవై మిల్లీమీటర్ల వాన కురిసిందీ అంటే- కురిసింది వాన కాదు విలయం...- ‘‘మా వర్తమానం మీదనే కాదు- సమీప భవిష్యత్తుమీద కూడా కురిసి, మా బ్రతుకులను ముంచెత్తింది’’- అంటూ, అన్నిరకాల జనాలూ- తడి మంటల మధ్య పొడి నిట్టూర్పులు విడుస్తున్నారు.
వాగులూ, వంకలూ పొంగి- నదుల లాగ ముందుకు దూసుకుపోయే వరదలు వేరు. గణేశుడి వొళ్లుకూడా తడపలేక అల్లాడిపోయిన హుస్సేన్‌సాగర్- ఒక సాగరంగా పొంగి, ఊరుని ముంచేస్తాను అంటూ ఉరుకులెత్తడం వేరు.
ఎలాగోలా గుంటూరు జిల్లా దాకానైనా చేరుకుందామంటే- ఆ జిల్లాలో అన్ని ప్రాంతాలూ జలార్లవం క్రింద మూలుగుతున్నాయి. జన నష్టం కూడా అక్కడ ఎక్కువగానేవుంది. అటుపో దారీతెన్నూ లేవు.
ప్రాజెక్టులు, సాగర్‌లు పొంగి పొర్లడం వేరు. అలా అయితే గేట్‌లెత్తి సాగరంలోకి, వాటిని తోలేస్తాం గానీ హైదరాబాద్, రంగారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్‌లలో నీటి ప్రవాహం అరికాలి క్రింది నేలను కోరేస్తూంటే, తల దూర్చడానికి పొడి జాగా కానకుండా బడుగువర్గాలు కుమిలిపోతూంటే- ఆ నీటిని ఎక్కడికి త్రోసెయ్యాలి? నింగికీ, నేలకీ వాన చినుకులు కాదు- వరద ఉధృతంలాగే కురుస్తూంటే- రుూ శతాబ్దపు వింతను తిలకిస్తున్నట్లు జనాలు దిగులుపడిపోతూంటే- అధికార యంత్రాంగం కంగారుపడి పోతున్నారు- కింకర్తవ్యం?
సిటీ హైదరాబాద్‌ని మహావిశ్వనగరంగా చూడాలనుకుని కలలుగంటున్న మ్యునిసిపల్ మంత్రి కె.టి.ఆర్.- అడుగున రోడ్డుందో- సొరంగం వుందో- తెలియని స్థితిలో అర్ధరాత్రి సిటీ వానల్ని ఎదిరించి ఓదార్పుగా పర్యటిస్తూ వుంటే- గుండె చప్పుళ్లు ఆర్తనాదాలై వినబడ్డాయి.
ఈమధ్యకాలంలో పొంగమన్నా పొంగని మూసీనది- గోదావరి నదీ పరవళ్లని సవాలు చేస్తూన్నట్లు చెలరేగిపోతోంది. పాలూ, తిండీ, పొడి జాగాలూ లేవుగానీ నీళ్లున్నాయి. అంతటా నగరంలో అన్ని చెరువుల్నీ ఏనాడో మూసేసి, దూలాలు దింపేసి, దొంతర భవనాలను కట్టేసిన మానవుడు యివాళ- నాలిక్కర్చుకుంటున్నాడు. ఆ చెరువులకు చెందిన జలాలు వాటి జాగాల్లోకి ప్రవహించలేక- భవంతుల, భవనాల క్రింది సెల్లార్లను నింపేశాయి. అది వాటి అసలు హక్కు కాని, నర మానవుడు టాంక్‌బండ్ లోపల తప్ప అన్ని ‘‘ట్యాంకు’’లూ మూసేసి, బ్రహ్మాండమైన దొంతర భవనాలు నిర్మించుకున్నాడు. లిఫ్ట్‌లు- వాటి క్రింద సెల్లార్లూ దుకాణాలూ కట్టుకున్నాడు. కానీ, యిప్పుడు సొంత ప్రాంగణంలో, సొంత అపార్ట్‌మెంట్‌లోకి పోలేక- ఈత రాక- పడవలుపోక- నడి వీధుల్లో- బర్రెలాగా తడుస్తున్నానని బాధపడుతున్నాడు. అ‘్భగ్యనగరుడు’!
నగరంలో రోడ్లకి రోడ్లే నీళ్లక్రింద కోరుకుపోతున్నాయ్. బిలాలు, సొరంగాలు ఏర్పడి పోతున్నాయ్. తెల్లార్లూ గస్తీ ముమ్మరం చేసినట్లు వాన అలా- అత్యంత నాగరిక, ఆధునిక నగరం వీపుమీద బాదేస్తూనే వుంది వాన!
రాత్రివేళకూడా కుక్కలకీ, కార్లకీ రికార్డులున్న జంట నగరాలు- కుక్క అరుపులకీ, కారు హారన్‌లకీ కూడా నోచుకోలేదు. కరెంట్ ‘హుష్‌కాకీ’ అయిపోయినా- మోటర్‌ల్లోకి నీళ్లు వెళ్లిపోయి- అవి నీట మునిగి మంచినీళ్లు లేకపోయినా- ఎలాగోలా కొంపకి చేరితే చాలునన్నట్లు అయిపోయారు జనాలు.
సమయానికి లేకుండా ముఖ్యమంత్రీ, గవర్నర్ యిద్దరూ కూడా అక్కడ ఢిల్లీలో వున్నారు. అయినా కె.సి.ఆర్. ‘‘ముందు పాఠశాలలు మూసెయ్యండి. ఆర్మీకి- ‘‘హెల్ప్... హెల్ప్’’లు కొట్టండి’’-అంటూ పరిస్థితిని అజ్మాయిషీ చేయడంతో- జనం యింటి పట్టున వున్నవాళ్లు- సిటీ దుస్థితిని కనులారా టి.వి.ల మీద చూస్తూన్నారు. నెక్లెస్‌రోడ్ లాంటిది పోయింది. ఫ్లైఓవర్ల క్రింద నాలాజలం- వాన నీరు కలిసిపోయి కులకుల్లాడుతూంటే - ఆడా, మగా పిల్లా మేకా ధైర్యంగా- పైనుండే, వంతెనల మీదుగా, జోరుగా కొంపలకి పోయే ప్రయత్నాలు చేస్తున్నారు.
రోడ్ల క్రింద గొట్టాలు ఫట్‌ఫట్, రోడ్లు ఛిద్రం బిలాలు అహోమని నోర్లు తెరుచుకుంటూంటే- నెత్తిమీద వాన కరాళ నృత్యం చేస్తూంటే- యిలా వారం రోజులయింది శుక్రవారానికి- సహాయక చర్యలదాకా ఎందుకు? ముప్పునుంచి ఎడంగా జరగటానికి అవకాశం చిక్కలేదు.
అలవాటులేదు, యిటువంటి విపత్తులు హైదరాబాదుకి?
అద్భుతమయిన అష్టనాలాలుగల నగరం యిది. మద్రాసు ‘కూవం’ రివర్‌లంతేసి ‘‘కానా’’లున్న రుూ నాలాలు పొంగిపోతూంటే- రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగిపోతూంటే- చేతులెత్తేసిన మహానగరం ఆకాశంకేసి, ఆ రెండు చేతులు జోడించి- నిస్సహాయంగా నిలిచిపోయింది.
భాగ్యనగరమా? కాదు... అభాగ్యనగరమైంది. ఇప్పట్లో రుూ రోడ్లూ, రుూ సెల్లార్లూ, భవనాలూ లేచి నిలదొక్కుకుంటాయన్నది ఫక్తు ఆశావాదమే! పైగా డొక్కలో బల్లెంలాగా, ఎందుకూ కొరగాని మెట్రో భూతం ఒకటి- ట్రాఫిక్ పాలిట, ‘యములాడు’ అంటే అదే అంటున్నారు జనం.
నాట్ ఏ సిటీ ఆఫ్ పెరల్స్ బట్ ఏ సిటీ ఆఫ్ పెరిల్స్!