వీరాజీయం

ఉపగ్రహ కొరియర్ సర్వీస్.. జయహో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవాళ ఎవరైనా- ‘ఈసురోమని మనుషులుంటే’ అని అన్నా, ‘మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్’- అని అనబోయినా, ఆ మాత్రం.. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ వున్నవాడు సైతం చెంపలు ఛెళ్లు ఛెళ్లుమనిపించేస్తాడు. గత జూన్ నెలలోనే ఆంధ్రప్రదేశ్‌లోని ‘షార్’ రేంజ్ నుంచి ఒక్క రాకెట్ విసురున ఏకంగా ఇరవై శాటిలైట్స్‌ని (కృత్రిమ ఉపగ్రహాల్ని) రోదసి కక్ష్యలోనికి తీసుకుపోయి వదిలిపెట్టింది. ఆ ఇరవైలో 13 ఘనత వహించిన అమెరికా వారివి. కాగా- 39 బుల్లి బుల్లి చందమామల్ని అంతరిక్ష కక్ష్యలో ఒకేసారి పంపిన రికార్డు రష్యాకుంది.
ఐతే, గత బుధవారం నాడు ఆ రికార్డుని మన ‘ఇస్రో’ 104 శాటిలైట్స్‌ని భూపరిభ్రమణంలోకి పంపించేసి చితక్కొట్టింది. మన పి.ఎస్.ఎల్.వి.సి. 37 రాకెట్ చోదిత శకటం మీద ఒక్క ఊపుతో ‘104 శాల్తీల్ని’ ముక్కున కరచుకుని గంటకి 27 వేల కిలోమీటర్ల వేగంతో పట్టుకుపోయి, నిర్ణీత కక్ష్యలలోకి అమర్చివేసింది. అదీ, అరగంట వ్యవధిలో టకటకా ఈ ఘనకార్యం పూర్తిచేసి- చైనావాడితో సహా, అగ్రరాజ్యాల వాళ్లందరూ కనుబొమలెగురవేసేలా చేసింది!
ఇది ఒక నూతన అధ్యాయం. మనమంతా- ‘ఇస్రో’మని మనుషులుంటే రోదసీ ప్రస్థానం జేగీయమానమోయ్’ అని పాడుకొనేలా చేసింది. ఇది కేవలం గొప్ప కోసం చేసిన ప్రగల్భ చేష్టకాదు. కిరణ్‌కుమార్ ‘ది ఇస్రో బాస్’ చెప్పినట్లు- ఇండియా రోదసీ విపణిలో ఒక ముందడుగు వేసింది. ఈ ‘39వ విషన్’లో మన అంతరిక్ష పరిశోధక నిపుణులు అంబరయానంగా పంపిన బుల్లిచందమామలలో ఒక్కటే 714 కిలోగ్రాముల బరువున్నది మనది కాగా, మిగతావన్నీ కలిపి 614 కిలోగ్రాముల బరువు మాత్రమే వున్నాయి.
మన ‘ఇంటర్ స్పేస్ కొరియర్ సర్వీసు’ ఈ విధంగా మరో అడుగు ముందుకువేసింది. మనకి పైసలిచ్చి, రోదసీ కక్ష్యలోకి తీసుకుపోయి- తమ తమ కృత్రిమ శాటిలైట్స్‌ని చక్కగా పనిచేసేలా ‘ఒగ్గేయమని’ ఏర్పాటుచేసుకున్న దేశాలలో అమెరికాతోపాటు ఇజ్రాయెల్, కజకిస్తాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యు.ఎ.ఇ దేశాలున్నాయి. ఈ విధంగా మన ఆదాయం 965 కోట్ల రూపాయలు! దీంతో 1995లో మనవాళ్లు ఏర్పాటుచేసుకున్న ‘రోదసీ విపణి సంస్థ’ ఆకాశమార్గాన ఇవాళ లాభసాటిగా రాణించింది అన్నమాట.
ఈనాటి దృశ్యాన్ని- 1975 ఏప్రిల్ 19 నాటి దృశ్యాన్ని- అంటే ‘ఆర్యభట్ట’ ప్రయోగ దృశ్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుని బేరీజు వేసి చూసుకుంటే ‘ఇండియన్’ అన్నవాడు భూమీద ఎక్కడున్నా వాడి ఒళ్లు పులకరించిపోతుంది! నలభై సంవత్సరాలలో ఎంత ప్రగతి! మనవాళ్లు తొలిసారి ప్రయోగించిన దేశవాళీ ఉపగ్రహం ‘ఆర్యభట్ట’. మన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట (షార్) రేంజి నుంచి జరిగిన ఈ చారిత్రాత్మక సంఘటనని ‘కవర్’ చేసే భాగ్యం నాకు కలిగింది. శ్రీహరికోట నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట దగ్గర వున్న బెస్తదీవి. అయినా దీనికి సెక్యూరిటీ పాస్, గవర్నమెంట్ సమాచార శాఖ వారి వాహన సదుపాయం వగైరాలు నాడు మద్రాస్ నుంచే జరిగాయి. ఆనాటి మన తొలి ఉపగ్రహం రూపకర్త- యు.ఆర్.రావుగారు స్వయంగా ‘షార్’లో ఆనాడు వున్నాడు. ఐతే ఈ ‘ఆర్యభట్టు’ని మనం ఇవాళ- ఆయా దేశాలు- మన పి.ఎస్.ఎల్.వి.సి.-37 మీద ప్రయోగించుకున్నట్లే- రష్యాలోని కజికిస్తాన్ ‘కాస్ఫుటెన్‌యార్’లోని కాస్మోడ్రోమ్ నుంచి కక్ష్యలోనికి రష్యన్ రాకెట్‌మీద పంపించుకున్నాం. ఇక్కడ మానిటర్ చేస్తూంటే- షార్ కేంద్రంలో రావుగారి బృందం- ‘‘అదుగో 96న్నర నిమిషాల్లో భూమి చుట్టూ తిరిగింది- మన ఆర్యభట్ట’’- అంటూంటే పైకి చూశాం. ‘ఆంటెన్నా’లు ‘జలదరింపు’గా ఆడటం మాత్రం కనపడ్డది. నాటికి ఈ అంతరిక్ష టెక్నాలజీ గొప్ప తప్ప, ఆఖరికి ‘డైరెక్ట్ డయలింగ్’ డబ్బా ఫోన్‌లు కూడా లేవు మన దేశంలో. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రావుగారు చెప్పింది వినడం ‘షార్’ లోపల అంతా తిరిగి, చిన్న చిన్న రాకెట్లు వగైరాలు వరండాలో చిందర వందరగా పడేసి వుంటే, లోపల కంప్యూటర్ల బారుని చూసి మురిసిపోవడం- అంతే చేశాం. ‘పిటీ’ ఏమిటంటే, ఎంతమంది స్పెషల్ విలేఖర్లు వెళ్లినా- పత్రికల ఆఫీసులకి, పిటిఐ వార్తలే వెళ్లాలి. ‘టిక్కర్’ వే (టెలిప్రింటర్‌లు) ఆధారాలు. అటువంటి దశ నుంచి ఇవాళ మనం అమెరికాకి ‘సాఫ్ట్‌వేర్ టాలంట్’నీ, ప్రపంచంలోని చిన్న దేశాలకి అంతరిక్షయాన సౌకర్య సౌలభ్యాన్ని అందజేస్తున్నాం అంటే.. ఎంతో గ్రేట్?
‘101 ఉపగ్రహాలని కొరియర్ బుకింగ్‌లో రోదసీ మెయిల్‌లో పంపేశాం అన్నమాట’- అన్నాడో బుజ్జిగాడు. ఇటువంటి అవగాహన కలిగిన కుర్రాళ్లే కావాలి. ఇవాళ అరిచేతిలోనే ప్రత్యక్ష ప్రసారాలుగా, టెక్నాలజీ ప్రగల్భాల్నీ, ప్రయోగాల్ని తిలకిస్తున్నాం. ఇంటర్నెట్ టెలిఫోన్ సంస్థల్లాంటివెన్నో మనకి ఈ మన సైంటిస్టుల తపో ఫలితాలకి నీరాజనాలందిస్తూన్నాయ్. బిజినెస్సు కూడా ఇస్తున్నారంటే - అబ్దుల్ కలామ్‌గారి సాక్షిగా మన విక్రమ్ సారాభాయ్‌గారినీ, సతీష్ ధావన్‌గారినీ, యు.ఆర్.రావుగారినీ- ‘ప్రవర’లో చెప్పుకోవాలి.
లోగడ- ‘పేదలకి అన్నదానం చెయ్యొచ్చునుగా, ఇంత డబ్బును తగలెయ్యకపోతే?’’ అన్న శాల్తీలు కూడా వున్నాయి. ‘పేదలకి అన్నం కాదు, అసలా పేదరికమే లేకుండా చేయడానికే ఈ ‘బడీ’, ‘పెట్టుబడి’, రెండూనూ’’- అని ధీమాగా ఇవాళ చెప్పగలుగుతున్నాం.
మన రోదసీ పంచకళ్యాణి పి.ఎస్.ఎల్.వి (పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్) 180(ఇతర) దేశాల శాటిలైట్స్‌ని అంతరిక్ష కక్ష్య చూపెట్టింది యింతవరకూ-
‘అమ్మక చెల్ల!’ అహోయ్! అదరహో! అనొద్దా? ఏవీ ఆ సంబరాలు? శశికళ కారాగార ప్రస్థానం ‘లైమ్‌లైట్’ని తినేసిందా? ఘోరం కదూ!
అసలు చంద్రయాన్, మంగళయాన్- వీటిని సాధించిన మన సైంటిస్టులు ఎంత పొదుపరులు? చంద్రుడిమీద ‘నీటి ఊట’ని పసిగట్టిన చంద్రయాన్‌కి గానీ, అంగారకుని ఆనుపానులు తెలుసుకున్న మంగళయాన్‌కి గానీ మనం పెట్టిన పెట్టుబడి చూస్తే నమ్మలేం. ‘మార్స్ మార్చ్’కి గానీ మనం పెట్టిన పెట్టుబడి చూస్తే నమ్మలేం. ‘మార్స్ మార్చ్’కి 458 కోట్ల రూపాయల ఖర్చు అయింది (ఇంతే!). ఒక సినిమా తియ్యడానికి ఈ డబ్బు ఏ మూలకీ సరిపోని రోజులివి. కానీ, సెలబ్రేషన్స్ ఏవీ? నాయకుల పుట్టినరోజులకి పేజీలకి పేజీల ప్రకటనలు, అనుబంధాలు వస్తాయి కానీ గవర్నమెంటు మన ఇస్రోని శ్లాఘిస్తూ ప్రింట్ మీడియాకి చాలినన్ని ప్రకటనలు ఇవొచ్చునుగా?
మన దేశంలోని టాలెంట్ రుూ రంగంలోనే మన యింట నిలబడి వున్నది. సాఫ్ట్‌వేర్ ప్రతిభ అంతా పరాయిదేశంలోనే రాణిస్తున్నది. 1963 నవంబర్ 21న కేరళలోని తిరువనంతపురంనుంచి తొలి బుల్లిరాకెట్ ‘నైక్ అపోచీ’ని మనవాళ్లు ప్రయోగించారు. ఆరోజు నుంచి ‘ఆర్యభట్ట’ దాకా ప్రజ్వలించిన ఒక మహాధ్యాయం రెండోది- నాటినుంచీ నేటి నూట నాలుగు ఉపగ్రహాల జాతర దినం దాకా మరో మహోజ్వల ఘట్టం.
అమెరికా, రష్యా, యు.కె, ఫ్రాన్స్ దేశాలు ముక్కున వేలేసుకుని యిటు చూస్తున్నాయి. బెంగళూరు జైలులో శశికళకు ఇచ్చిన ఖైదీ నెంబర్ మంచిదా? కాదా? అని కాలక్షేపంగా మనం చర్చించుకుంటున్నాం. నో.. నో.. ఇస్రో ఘనత ఐదో తరగతి నుంచీ ఐ.ఏ.ఎస్‌దాకా ప్రతీ పరీక్షా పత్రంలోనూ తగిన స్థాయిలో ‘కంపల్సరీ’గా వుండాలి. ఇదే ఘనతని ఇతర రంగాలకి విస్తరించడంలో మన గవర్నమెంట్, జనం కూడబలుక్కోవాలి.
లెట్ దిస్ టెక్నాలజీ ప్రోవెస్ షైన్ ఎవ్వెరివేర్!
*