Others

ఎందుకింత వక్రీకరణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా కథను హీరోచుట్టూ తిప్పే విషయంలో నిర్మాత,
దర్శకుడూ భారతదేశ ఇతిహాసాలను కూడా వదిలిపెట్టడం లేదు. ద్రౌపదిని బంధకీ అని పిల్చినవాడు కర్ణుడు. ఆ సాధ్వి వస్త్రాపహరణానికి ముఖ్యకారకుడూ కర్ణుడే. అటువంటి వాడిని పాంచాలి భర్తగా కోరుకుందా? ఘోష యాత్రలో, ఉత్తర గోగ్రహణంలో ఓడిపోయినవాడు మహావీరుడా?

కొద్దిరోజుల క్రితం ‘ఎయిర్ లిఫ్ట్’ పేరిట ఒక సినిమా విడుదలైంది. విజయం సాధించింది కూడా. 1990లో సద్దాం హుస్సేన్ కువైట్‌ని ఆక్రమించినపుడు, ఆ దేశంలో తిండికి కరవై, రక్షణలేక అలమటిస్తున్న లక్ష మందికి పైగావున్న భారతీయులను విమానాల ద్వారా స్వదేశానికి పంపడానికి రంజిత్ కాత్యాల్ అనే పేరున్న సినీ కథానాయకుడు చేసిన మహత్తర ప్రయత్నమే ‘ఎయిర్ లిఫ్ట్’ కథ. ఈ చిత్రం ద్వారా దేశభక్తిని పెంపొందించడమే తమ ఉద్దేశ్యమని సినీ నిర్మాత, దర్శకులు చెప్పారు. భారతదేశంలో ప్రభుత్వమూ, ప్రభుత్వ యంత్రాంగమూ, ప్రభుత్వ విమానయాన సంస్థలూ మూడింటినీ ఒక్కతాటిమీదకు తెచ్చిన మహోత్తమ వ్యక్తి రంజిత్ కాత్యాల్. తమది మైనారిటీ ప్రభుత్వమని విదేశాంగ మంత్రి చేతులెత్తెయ్యగా, తనకు మంత్రి దర్శనం కావడమే కష్టమని సంయుక్త కార్యదర్శి చెప్పగా, ఎయిర్ ఇండియా పైలట్లు మజా చేసుకోవడంలో నిమగ్నంకాగా, ఒక్క సినిమా హీరో తప్ప ఎవరు లక్షమందిని రక్షించగలరు? ఇక్కడ ముఖ్య విషయం -హీరోగారి గొప్పతనం పెంచడానికి పది లక్షల మందిని రక్షించినట్టు చూపనందుకు సినిమా తీసిన వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
‘ఎయిర్‌లిఫ్ట్’ సినిమా చూసిన యువతకు ఏమనిపిస్తుంది? (ఈ సినిమాకు విజయం ఆపాదించిన యువ ప్రేక్షకుల్లో చాలామంది 1990 నాటికి జన్మించి ఉండరు. లేదా పసిపిల్లలుగా ఉండి ఉంటారు.) భారతదేశ ప్రభుత్వ యంత్రాంగమూ, మంత్రాంగమూ ఎందుకూ కొరగానివని అనిపిస్తుంది. వాస్తవంగా జరిగిందేమిటి? నాడు మన దేశ విదేశాంగ మంత్రి ఐకె గుజ్రాల్ కువైట్ ఆక్రమణ జరిగిన వెంటనే అమెరికా వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో, ఐక్యరాజ్య సమితితో చర్చలు జరిపారు. ఇరాక్ సేనలు కువైట్‌ని వదిలిపోతే భారతీయుల రక్షణకు ఢోకా ఉండదు. అమెరికా యుద్ధం చెయ్యడానికే నిర్ణయించుకుంది. గుజ్రాల్ వెంటనే అమ్మాన్ మీదుగా బాగ్దాద్ చేరుకున్నారు. ఆయనవెంట అడిషనల్ సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీ ఉన్నారు. సద్దాం హుస్సేన్‌తో మాట్లాడి భారతీయులు అందరినీ స్వదేశానికి పంపడానికి అంగీకరింపచేసి, కువైట్ చేరుకున్నారు. అక్కడ ఆందోళనకు దిగబోతున్నవారిని శాంతపర్చి, బాగ్దాదు మీదుగా అందరినీ స్వదేశానికి పంపించారు. ఇరాక్‌లోవున్న భారత రాయబారి వీరందరికీ ఆహారాన్ని సమకూర్చారు. ఈ జరిగిన విషయాలన్నీ వదిలిపెట్టి.. అందరూ అసమర్ధులూ, పట్టించుకోనివారూ అని చిత్రిస్తే కథానాయకుడి గొప్పతనం వల్ల సినిమా ఆడవచ్చును. కానీ యువ ప్రేక్షకులకూ, గతాన్ని మర్చిపోయే పెద్దవారికీ అందే సంకేతమేమిటి? మన పాలకులు పనికిరాని వారనే కదా.
1990లలో భారత విదేశాంగ శాఖలో జాయింట్ సెక్రెకరీగా పనిచేసిన కెపి ఫేబియన్ ఈ వాస్తవాలను పత్రికాముఖంగా, టీవీ చానెళ్ళ ద్వారా తెలియచెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి కొందరైనా నిజం తెలుసుకుని ఉంటారని ఆశించవచ్చు. పాతికేళ్ళనాటిది కాకుండా నాలుగైదు వందల ఏళ్ళనాటిదైతే అసలైన చరిత్ర ఎలా తెలుస్తుంది? ఉదాహరణగా సాహితీ సమరాంగణ చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్పుకోవచ్చు. ‘తెనాలి రామకృష్ణ’ అనే చిత్రం చాలా ఏళ్ళనాడు వచ్చింది. తెనాలి రామకృష్ణుణ్ణి గొప్ప వ్యక్తిగా చిత్రించాలి. అందుకని కృష్ణరాయలను శత్రువు పంపిన కాంత వ్యామోహంలో పడి రాజ్య పాలనను విస్మరించినట్టుగా చూపించారు. అంతేకాక కృష్ణరాయలకు సహాయం కోసం రామకృష్ణుడు బాబరుని అర్థించినట్టు చిత్రీకరించారు. మొదటి పానిపట్టు యుద్ధం (1526) తర్వాత అప్పుడప్పుడే భారతదేశంలో కాళ్ళూనుకుంటున్న బాబరు విజయనగర సామ్రాజ్యాధీశునికి సైన్య సహాయం చేయడమా? గయలో రాయలవారి శాసనముందని నిర్మాతలకు తెలియదా? తెలుసుకోదల్చుకోలేదా? తెలియనట్టు నటనా?
కథానాయకుడి చుట్టూ కథ తిరగాలి కాబట్టి అతి దుష్ట పాత్రనైనా ఉత్తమ రాజుగా చిత్రీకరించడం తప్పదు. ఇందుకు ఉదాహరణ ‘టిప్పుసుల్తాన్’ పేరుతో చాలాకాలం నాడు వచ్చిన టివి సీరియల్. హైదరాబాదు నైజాంకూ, టిప్పుసుల్తాన్‌కూ మధ్య జరిగిన యుద్ధాలలో నైజాం బ్రిటీషువారినీ, టిప్పు ఫ్రెంచి వారినీ ఆశ్రయించారు. ఫ్రెంచి విప్లవం కారణంగా టిప్పుకు సహాయం కరవై బ్రిటిషువారి చేత ఓడింపబడి మరణించాడు. బ్రిటిషుతో యుద్ధం చేసినంతలో టిప్పు దేశభక్తుడూ, ప్రజలను ప్రేమతో పాలించినవాడూ కాదు. టిప్పు, అతని తండ్రి హైదరాలీ దక్షిణ దేశాలను మట్టుపెట్టినప్పుడు పంటలనూ, పశుసంపదనూ సర్వనాశనం చేశారు. తమిళనాడు ధాన్యాగారమనదగిన తంజావూరు ప్రాంత గ్రామీణులు, నేటికీ కరవుకాలాన్ని హైదర్‌కాలం అంటారు. వాస్తవాలు ఇలాఉండగా టిప్పును హీరోగాచేసి చరిత్ర వక్రీకరించడం ఏవిధంగా న్యాయం?
సినిమాలలో, సీరియళ్ళలో కథ హీరోచుట్టూనే తిరుగుతుంది. అందుకని కథను ఎంత అసందర్భంగా తీర్చిదిద్దినా ఫరవాలేదన్న బలమైన నమ్మకమున్నట్టుగా కన్పిస్తోంది. సాంఘికాలూ, జానపదాలూ ఎలా కావలిస్తే అలాతీసుకోవచ్చును. భారతదేశ చరిత్రను వక్రీరించకుండా ఉండటం ముఖ్యం. నిర్మాతలు సాహసిస్తున్నారంటే, వారికి లాభార్జన ప్రధానం. సెన్సారుబోర్డు సభ్యులు నిష్క్రియాపరులవడం నిజంగా శోచనీయం. ఇటీవల వచ్చిన ‘బాజీరావ్ మస్తానీ’ సినిమా విషయమై బాజీరావు వంశస్థులు కోర్టుకు వెళ్ళాలనుకున్నారన్న వార్త వచ్చింది. సినిమా కథను హీరోచుట్టూ తిప్పే విషయంలో నిర్మాత, దర్శకుడూ భారతదేశ ఇతిహాసాలను కూడా వదిలిపెట్టడం లేదు. ద్రౌపదిని బంధకీ అని పిల్చినవాడు కర్ణుడు. ఆ సాధ్వి వస్త్రాపహరణానికి ముఖ్యకారకుడూ కర్ణుడే. అటువంటి వాడిని పాంచాలి భర్తగా కోరుకుందా? ఘోష యాత్రలో, ఉత్తర గోగ్రహణంలో ఓడిపోయినవాడు మహావీరుడా? సినీ హీరో కర్ణుడి పాత్ర ధరిస్తే కథ అనుకూలంగా మార్చక తప్పదు. భీముడు కీచకుణ్ణి కత్తితో పొడిచి చంపినా తప్పులేదు. సినీ నిర్మాతలకూ, సెన్సారుబోర్డు సభ్యులకూ చిన్న విన్నపం. ఇతిహాసాలనూ, చారిత్రకాలనూ చిత్రీకరించేటప్పుడు వాస్తవాలను మాత్రమే చూపే ప్రయత్నం చెయ్యాలి. వాస్తవానికి చిత్రీకరణ దూరంకాకుండా సెన్సారుబోర్డు బాధ్యత వహించాలి. నేటి యువతలో దేశంపై, దేశ చరిత్రపై గౌరవం పెంచే రాజమార్గం వాస్తవాలను తెలియచెయ్యడమే కానీ మహోత్తమ, వీర, శూర, దేశభక్త కథానాయకులను సృష్టించడం కాదు.

(శక చకవర్తి అయిన విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన శకానికి నాంది పలికిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవితాన్ని (?) చారిత్రాత్మక చిత్రంగా తీస్తున్నారన్న కథనాలకు స్పందన ఈ వ్యాసం)

-పాలంకి సత్య