మెయిన్ ఫీచర్

‘కనెక్ట్’ అయతేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినీ కథ ఓ బ్రహ్మపదార్థం. ఒక పట్టాన అర్థం కాదు, అంతు చిక్కదు. అదో అంతు తెలీని మిస్టరీ.
* * *
ఏళ్ల తరబడి ‘సినీ’ కథ తాలూకు ఆనవాళ్లని
పట్టుకోటానికి ఇండస్ట్రీ దిగని లోతుల్లేవు. ఎక్కని శిఖరాలూ లేవు. ఏ యుగంలోనైనా ‘ఏడు’ కథలే రాజ్యమేలతాయన్న సిద్ధాంతాన్ని ఔపోసన
పట్టినప్పటికీ, ఎటు రీళ్లు తిప్పి ఏం చేసినా -ఏ కథ మూలాన్ని అనే్వషించినా.. ఆ ‘ఏడు’ చట్రం నుంచీ బయటికి తొంగి చూడదన్నది మరో సూత్రం.
కనుకనే -కసరత్తుల మీద కసరత్తులు చేసి, ఇండస్ట్రీ వీర విజృంభణ చేసి కథలు సృష్టించినా.. సగటు ప్రేక్షకుడు ‘తూచ్’.. ఇది ఫలానా కథకి కాపీ
అనేస్తాడు. ఇక కథలెక్కడ్నుంచీ పట్టుకురావాలి. ‘కంచి’లో కూడా పాత కథలు దొరకటం లేదూ అనేస్తోంది పరిశ్రమ. భారీ బడ్జెట్.. భారీ
తారాగణం.. భారీ లొకేషన్స్.. ఇవన్నీ
మాకక్కర్లేదు -ఆ పరి‘శ్రమ’ ఏదో ‘కథ’పై పెడితే అదే మహద్భాగ్యం అనేస్తాడు కూడా. దీంతో
ప్రేక్షకుడికి ఏంకావాలన్నది కాకుండా.. ప్రేక్షకుడి ‘దారి’లో వెళ్లకుండా.. ‘మా దారి రహదారి’ అంటూ ఇండస్ట్రీ తన ధోరణిలో కథల్ని
సృష్టించేస్తోంది.
* * *

ఏ సినిమాలోనైనా.. హీరో ఇంట్రడక్షన్ ‘హిట్’ అయ్యిందంటే.. ఆ కథానాయకుడు ఏ సినిమా చేస్తే... ఆ సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ ఏ ఫారిన్‌లోనో... అందమైన ముప్పాతిక నగ్న సుందరీమణులతోనో చిత్రీకరించటం ఆనవాయితీగా మారుతుంది. దీంతో -ప్రతిరోజూ ఒకే కూరతో అన్నం తినంగా.. అలాగే- మా టేస్ట్‌కి తగ్గట్టు ‘ఎంట్రీ’ ఇవ్వండి అంటూ ఛీత్కార బాణాల్ని వదుల్తాడు ప్రేక్షకుడు.
* * *
ఏ మాటకామాటే చెప్పుకోవాలి.
ఇక్కడ ప్రేక్షకుడికి ఏం కావాలో తెలీదు.
ఏ కథ అతగాడికి నచ్చుతుంది? ఏ కథ ఏ మలుపు తిరిగితే -ఒప్పుకుంటాడు అన్నది అతడి వద్ద కూడా ఇతమిత్థమైన సమాచారం లేదు. ఇటీవలి కాలంలో ‘కనెక్ట్’ మాట బాగా వినిపిస్తోంది ఇటు ఇండస్ట్రీలోనూ.. అటు ప్రేక్షకుల్లోనూ.
సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్ సబ్జెక్ట్. ఒకనాటి మాటేమోగానీ -జాతికి సందేశాలూ.. నీతి బోధలు చెబితే ఏ ప్రేక్షకుడూ మడిగట్టుకొని థియేటర్‌కి వెళ్లటంలేదు. అతడికి కావల్సింది తనతో ఆ సినిమా ‘కనెక్ట్’ అయ్యిందా? లేదా? అన్నదే. తనలో ఒక హీరోని చూసుకుంటాడు. లేదా హీరోయిన్‌తో కలిసి ‘స్టెప్’ వేయాలనుకొంటాడు. అదీకాదు- విలన్‌తో వీరోచిత ఫైట్స్ చేద్దామనుకొంటాడు. థియేటర్‌లో కూర్చున్నప్పటికీ- అతగాడి దృష్టి అంతా హీరో ‘ఇడియట్’గా ప్రవర్తించటం పైనే. ఉదాహరణకు -రవితేజ ‘ఇడియట్’ చూద్దాం. ఆ హీరోకి వెటకారపుపాళ్లు జాస్తి. అది ఇంట్లో తండ్రితోనైనా.. బయట పోలీస్ సూపర్నెంట్‌తోనైనా. సూపరింటెండెంట్ కూతురితో ‘ప్రేమాయణం’ సాగించాలని ‘నిజ’ జీవితంలో ఊహించినప్పటికీ.. అది ఊరి పొలిమేరల్లోనే ఆగిపోవాలి తప్ప.. ఆయన ఇంటి ఆవరణలోకి సైతం వెళ్లలేదు. ఇక్కడ హీరోగారు పరమ ‘ఇడియాటిక్’గా ‘ఏవే?!’ అనేసి.. ఖాళీగా ఉంటే ప్రేమించెయ్ అనేస్తాడు. దీంతో ఆ పాత్రతో ప్రేక్షకుడు కచ్చితంగా ‘కనెక్ట్’ అయ్యి.. ఊహల్లో తేలుతూ థియేటర్‌లోంచి బయటికి వచ్చేస్తాడు. సరిగ్గా ఇదే థియరీ అన్ని సినిమాలకీ పనిజేస్తుంది. అయితే ప్రేక్షకుడు ఏ సినిమాకి ‘కనెక్ట’వుతాడో.. ఏ సినిమాకి ‘్ఫల్’అవ్వడో తెలీదు. అతణ్ని అంతగా ఇంప్రెస్ చేయగలిగితేనే ఇది సాధ్యం.
* * *
తాజాగా ‘బిచ్చగాడు’ తెగ ఆడేస్తోంది. పోస్టర్లపై ఈ టైటిల్ చూసినప్పుడు -జనం పెదాలపై ఓ వెటకారపు నవ్వు. ‘బిచ్చగాడు’ అంతగా కనెక్ట్ కాని సబ్జెక్ట్. పైగా ‘మల్టీ మిలియనీర్’ అనే టాగ్. చూట్టానికి విజయ్ ఆంథోని -పరమ నీరసంగా.. నిస్తేజంగా -జీవితంలో అన్నీ కోల్పోయి -ఎందుకొచ్చిన జీవితంరా బాబూ! అనుకొంటున్నట్టు భావన. ఈ చిత్రాన్ని కొనటానికి డిస్ట్రిబ్యూటర్లు సైతం ముందుకు రాలేదన్నది ఇండస్ట్రీ మాట. అయితే- ప్రేక్షకుడు ఆ ‘బిచ్చగాడు’తో కనెక్టయ్యాడు. వెరైటీ కానె్సప్ట్. ‘బిచ్చగాడి’పై ఇంత కథ ఉందా? అనిపిస్తుంది. కథలో ‘ఇన్‌వాల్వ్’ కావటానికి ఇది దోహదపడి.. ‘బిచ్చగాడు’కి కోట్ల వర్షం కురిపిస్తోంది. అది విడుదలయ్యే నాటికి.. విడుదలయిన తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా థియేటర్లలోంచి కదలకుండా ‘వసూలు’ చేసేస్తున్నాడీ ‘బిచ్చగాడు’. జనం మెచ్చిన ‘బిచ్చగాడు’ అయ్యాడు. కథలో కొత్తదనం ఓ కారణమైతే.. కానె్సప్ట్‌ని తీసిన తీరు.. జనాన్ని మెప్పించిన తీరు ఈ సినిమాకి ప్లస్ పాయింట్.
* * *
ఒక్క ‘క్షణం’ ఆగుదాం. లోబడ్జెట్ సినిమా. భారీ తారాగణం లేదు. అందరూ అడపాదడపా కనిపించేవారే. కానీ- ‘క్షణం’ కథ నిలబెట్టింది. ఈ కథలోనూ కొత్తదనం లేదు. ఇదొక అనే్వషణ కథ. విదేశాల్నుంచీ వచ్చిన హీరో.. కిడ్నాప్ అయిన పాపని వెతకటం. అంతే. ఇక్కడ స్క్రీన్‌ప్లే ‘టానిక్’ మహత్తరంగా పనిచేసింది. ప్రేక్షకుడిని సీట్లలో కూర్చోనివ్వలేదు. కథానాయకుడి కంటే ముందే వెళ్లి ఆ ‘పాప’ని వెతికి పట్టుకొని.. కథని సుఖాంతం చేద్దామన్నంత ఆత్రుత. ఆ ‘టెంపో’ని క్షణక్షణం మెయిన్‌టెయిన్ చేస్తూ.. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో కథని నడిపించిన వైనంతో ప్రేక్షకుడు ‘కనెక్ట్’ అయ్యాడు.
* * *
ఈ ఉదాహరణల్లోకి మరాఠీ సినిమా ‘సైరత్’ వచ్చి చేరుతుంది. కేవలం 4 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీశారంటే హాశ్చర్యపడి.. ఆనక తేరుకొని- ఈ సినిమాలో ఏముంది? అని ఆలోచించారు. ఓ పల్లెటూరి కథ. ఆ నేపథ్యంలో ఓ ప్రేమికుల జంట. ప్రేమించి పెద్దలని ఎదిరించి -పట్నం వెళ్లి అక్కడ బతుకు సాగించిన కథ. సినిమా చూస్తున్న ఎవరైనా సరే.. ఆ వాతావరణంలోకి కచ్చితంగా వెళ్లాల్సిందే అన్నంతగా చిత్రీకరించారు. ఇండస్ట్రీలో చర్చకు వచ్చిన కథ. ఈ సినిమాలోని ప్రతీ పాత్రా ప్రేక్షకుడితో కలిసి నడుస్తుంది. లేదా తనతోపాటు తీసుకెళ్తుంది. ఆఖరికి -ఓ వంకర కాళ్ల యువకుడితో సహా. తనని ఎవరూ ప్రేమించరనీ.. ఓ విధమైన నిర్లిప్తతలో ఉన్నప్పుడు.. ఎదురింటి అమ్మాయి ఒక కాగితాన్ని విసరటం.. అది లవ్‌లెటర్‌గా భావించి -దాన్ని తన్నుకుంటూ వెళ్లి.. తీరా చూస్తే.. ఆ కాగితంలో చెత్త ఉండటం -ఫ్రెండ్స్ గొడవ చేయటం -ఇటువంటి సన్నివేశాలన్నీ నవ్విస్తూనే ఏడుపు తెప్పిస్తాయి.
ఆ కథకి ప్రేక్షకుడు ఎందుకు ‘కనెక్ట్’ అవుతాడూ అంటే.. ఆయా సన్నివేశాలన్నీ నిజ జీవితంలో ఎక్కడో జ్ఞాపకాల పొరల్లో ఉండి ఉండాలి. లేదా ఊహల్లో ఉండాలి. లేదూ అలాంటి అమ్మాయి ఎక్కడో పరిచయమై ఉండాలి. మర్చిపోలేని జ్ఞాపకాలు గానీ.. ఊహలేకానీ నిజాలుకానీ అనుభూతులుకానీ ‘తెర’పై కనిపిస్తే ‘కనెక్ట్’ అయిపోతాడు. ఈ సినిమాలోనూ అదే జరిగింది. ఈ ఫీల్ ఫ్రెష్ సినిమాలో ప్రతి సన్నివేశమూ ఫ్రెష్ ఫీల్‌ని ఇస్తుంది. సినిమాల గురించి చర్చకు వస్తే.. ఆయా సన్నివేశాలను ప్రతి కుర్రాడూ నెమరువేసుకోకుండా ఉండడు.
* * *
‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ -్భవుకతకూ తీయటి అనుభూతికి కేరాఫ్ అడ్రస్. ఈ కథలో ‘నిత్యా మీనన్’ ఎక్కడో పరిచయమున్న అమ్మాయిలా అనిపిస్తుంది. పిల్ల తెమ్మెరలా.. సంద్రపు అలలా.. ఏకాంతంలో వొలికే ప్రేమ పలుకుల్లా.. కదిలిస్తుంది. దానికి భావుకత్వం తోడై.. అందమైన ప్రేమకావ్యంలో ప్రేక్షకుడు ‘ఇన్‌వాల్వ్’ అయ్యాడు. అదే ఈ సినిమా హిట్‌కి కారణం. కమర్షియల్ విషయం పక్కనబెడితే.. ప్రతి కుర్రాడికీ ఆ ‘కాలేజీ కథ’ జ్ఞాపకాల తెరల్ని తొలగిస్తుంది. ఈ కథ కూడా రొటీన్‌దే. ప్రేమ -విడిపోవటం.. మళ్లీ కలవటానికి కొనే్నళ్ల తర్వాత ప్రియుణ్ని వెతుక్కుంటే అమ్మాయి రావటం. ఈ సినిమాలోని ప్రతి మాట ప్రేక్షకుణ్ని తడుముతుంది. ఒళ్లు పులకరించేట్టు చేస్తుంది. ఇక ‘కనెక్ట్’ అవకుండా ఎలా ఉంటాడు?
* * *
ఏ సినిమాని హిట్ చేస్తాడో? ఏ సినిమాని ఫట్ కొట్టేస్తాడో? తెలీని ప్రేక్షకుల ‘నాడి’ని పట్టుకోటానికి ఇండస్ట్రీ పోరాటం చేస్తూనే ఉంది. సీజనల్‌గా సినిమాలు తీస్తూనే ఉంది. ప్రేక్షకులకు అందిస్తూనే ఉంది. సంక్రాంతి మొదలుకొని.. మళ్లీ వచ్చే ‘సమ్మర్’ సీజన్ వరకూ. ఇక్కడో థియరీ ఉంది. సంక్రాంతికి ‘పంచెకట్టు’ హీరో వస్తే.. ఆ శోభే వేరని. ఈ థియరీని కాదని వేరే సినిమా వచ్చిందో.. కథ అడ్డం తిరుగుతుంది?! ‘సోగ్గాడే చిన్ని నాయనా’ -ఇందుకు తాజా ఉదాహరణ. సినిమా వచ్చింత్తర్వాత ప్రేక్షకులు ఎన్ని ‘లాజిక్’లు తీసినా.. ‘సోగ్గాడి’ వేషాలన్నీ తెగ చూసేశారు. ఇంత హీరోయిన్లు అవసరమా? ‘ఆత్మ’ వచ్చి నాటకాలు ఆడటం ఏమిటి? అన్న వారే.. ఆ సన్నివేశాలకు ముచ్చటపడ్డారు. కాబట్టి సంక్రాంతి ‘సోగ్గాడ’య్యాడు.
ఈ సీజన్‌లో సెంటిమెంట్.. పండుగ వాతావరణం. పంచెకట్టు తీరు ప్రేక్షకుల్ని అలరిస్తుంది. దీన్ని ఎవరూ కాదనలేని నిజం. ఇక్కడ ‘్ఫంటసీ’ అన్న క్వొశ్చన్ లేదు.
అలాని- ప్రతీ సంక్రాంతికి ‘పంచె కట్టు’ని దించితే.. అదే ప్రేక్షకుడు సినిమాని ‘్భగి’ మంటల్లో పడేస్తాడు. పంచభక్ష్య పరమాన్నం పెట్టినా సరే.
* * *
కథ అంటే- ఇండస్ట్రీకి కొన్ని ‘పడికట్టు’ సూత్రాలున్నాయేమో?! ఇంటడ్రక్షన్ సీన్ అదిరిపోవాలి. చప్పట్లతో మారుమోగిపోవాలి. ఓ పదిమంది అమ్మాయిల్తో సాంగో.. లేదా ఓ వందమందిని మట్టి కరిపించే సన్నివేశమో అనుకుంటారు. అక్కడ్నుంచీ.. అమ్మాయిని ప్రేమలో పడేయటానికి వేలంవెర్రి సన్నివేశాలు.. మధ్యమధ్య పాటలు.. ఆ తర్వాత కొద్దిగా ఫ్యామిలీ సెంటిమెంట్.. పగ ప్రతీకారం.. క్లైమాక్స్‌లో భారీ ఫైట్. ఇదే తరహాలో ‘్భరీ’ హీరో అయితే.. తాత ముత్తాతల నాటి ‘చరిత్ర’ గురించి డైలాగ్స్... కానీ - ఇవేవీ ప్రేక్షకుడికి అవసరం లేదు.
చిన్న కథనైనా - స్క్రీన్‌ప్లేతో చక్కగా చెప్పారా లేదా? అన్నది చూడటమే.
* * *
ప్రేక్షకుడికి హీరో తాలూకు తరాల చరిత్ర అవసరం లేదు. వీరోచిత నటన అక్కర్లేదు. సింపుల్‌గా తనకి మల్లే ఉండే హీరో కావాలి. కథే హీరో అయితే... ఇక అతగాడి ఆనందానికి అవధులుండవు. ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అంశాలూ.. సినిమాలూ చాలా ఉన్నప్పటికీ.. ఒక ‘బృందావనం’ తీసుకుందాం. ఈ కథలో ‘ఇమేజ్’ చట్రాలున్నాయి. కానీ- ఒక అమ్మాయిని ఓ కిరాతకుడి నుంచీ రక్షించటానికి.. కథని భుజాల కెత్తుకొన్న హీరోతో పాటూ ప్రేక్షకుడూ ఆ ఊరికి వెళతాడు. అదే ఈ సినిమా హిట్ రహస్యం.
* * *
‘పిల్ల జమీందారు’ ఓ కాలేజీ స్టోరీ. ఈ కథలో ఎనె్నన్నో జీవితాలు. వాళ్ల వాళ్ల ప్రవృత్తులు.. అన్నీ కూడా ‘కనెక్ట్’ అవుతూ వస్తాయి. అంటే- ఆయా జీవితాల్లోకి తొంగి చూడకుండానే.. ఫలానా పాత్ర ఫలానా సంఘటన.. మన జీవితంలో జరిగి ఉండటం.. లేదా అనుభూతి చెంది ఉండటంవల్ల.. ఆ కాలేజీ స్టోరీ - చిత్రాతిచిత్రంగా సక్సెస్ అయ్యింది.
* * *
ప్రేక్షకుడు ‘హిట్’ చేసిన ప్రతి సినిమా వెనుక ఇలాంటి ‘కనెక్ట్’ కథలు కచ్చితంగా ఉంటాయి. సహజంగా ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు... ఆ వ్యక్తి పట్ల ద్వేషం గానీ.. ప్రేమగానీ.. వ్యతిరేకత గానీ.. ఏవగింపుగానీ.. కలగటం వెనుక.. ఇటువంటి కనెక్టివిటీ బలంగా పని చేస్తుంది. అదే సినిమాకి కూడా వర్తిస్తుంది. కారణం ఇదీ అని ఇతమిత్థంగా చెప్పలేం. ఐతే అదే - ఇక్కడ ‘చిత్రం’గా పనిచేసి... జయాపజయాలను నిర్ణయిస్తుంది.

-BNK