మెయిన్ ఫీచర్

భారతీయ సినిమాకు తరగని కథాకలశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వందేళ్ల సినిమాకు
400 ఏళ్ల బంధమేమిటి?
ఒకటి కాదు.. వంద కాదు.. వెయ్యి సినిమాలకైనా ఇతివృత్తమూలం ఆ పది నాటకాల నుంచే ఉండటమేంటి?
అతను -తెలుగు రచయిత కాదు. భారతీయ రచయిత అంతకంటే కాదు. ఈ శతాబ్దం వాడు అస్సలు కాదు. కానీ -అతని అక్షరాలోచనలు ఇప్పటికీ సజీవం. అతను వండిపెట్టిన కథావస్తువు ఎప్పటికీ నిత్యనూతనం. ఎప్పుడో విక్టోరియా కాలంనాటి ఆ మహా రచయితే నేటికీ -్భరతీయ సినిమాకు స్ఫూర్తి. అతను షేక్స్‌పియర్.

భారతీయ సినిమాను నడిపించినది, నడిపించేది, నడిపిస్తున్నది -ప్రేమ కథే. ఎన్ని వందల వేల సినిమాలొచ్చినా, వస్తున్నా వాటి ఆద్యంతాలు ఆ ప్రేమతో ముగియాల్సిందే. అది సఫల ప్రేమ కావొచ్చు. విఫల ప్రేమా కావొచ్చు. జానపద, సాంఘిక, పౌరాణిక చిత్రాల్లోని ప్రేమానుబంధమైనా కావొచ్చు. మూలం ఒక్కటే అయినప్పుడు, అది కాస్తా బలంగా ఉన్నప్పుడు.. ఎంతటి కథా సౌధాన్నయినా నిర్మించుకోవచ్చు. పాత్రోచిత సన్నివేశాలతో భావోద్వేగ దృశ్య కావ్యాలుగానూ మార్చొచ్చు. మహాకవి షేక్స్‌పియర్ ఘనత ఇదే. ఆయన రచించిన నాటకాలు దేనికైనా లొంగే, ఏ వాతావరణానికైనా సరిపడే, ఎలాంటి స్వభావంలోనైనా ఇమిడిపోయే లక్షణాన్ని కలిగివున్నాయి. దైవకణం నుంచి విశ్వం పుట్టినట్టు.. ఆ విశ్వానికి ద్రవ్యరాశి అందినట్టు -షేక్స్‌పియర్ రచనా మూలాలనుంచే భారతీయ సినిమాకే కాదు, ప్రపంచ సినిమాకూ తఅక్షయ పాత్ర తరహా ఇతివృత్తాలు అందాయి. వాటినుంచే వేనవేల కళాఖండాలు, చిత్రరాజాలు, అజరామరమైన దృశ్యకావ్యాలు వెండితెరపై వెలుగులు చిమ్మాయి. హాలీవుడ్ సినిమాను సైతం ప్రభావితం చేయలేనంత స్థాయిలో భారతీయ సినిమాతో షేక్స్‌పియర్ నాటకాల బంధం అనంతమే. ప్రాంతమేదైనా.. భాష ఏదైనా ఆయన నాటకాల నుంచి, అందులోని పాత్రల నుంచే వందలు వేలుగా కథలు పుట్టుకొచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇటీవలికాలంలో జాతీయ అవార్డులు సాధించిన చిత్రాలన్నీ షేక్స్‌పియర్ కథామూలాలకు నకళ్లే. ప్రతి రెండేళ్లకోసారి మన భారత ప్రభుత్వం ఆయనకు మరణానంతర జాతీయ అవార్డు ఇచ్చినా సముచితమేనన్న రీతిలో ఆయన కథల నుంచి పుట్టిన ఎన్నో సినిమాలు నేటికీ ప్రేక్షకాదరణ పొందుతూనే ఉన్నాయి. షేక్స్‌పియర్ నాటకాల్లోని గొప్పతనం, ఆ పాత్రల్లోని సంక్లిష్టత.. ఎలాంటి కథనైనా తీసుకుని ఆ స్వభావాలతో రక్తికట్టించగలిగే విశ్వజనీనత. అంటే -ఆయన రాసిన ప్రతి నాటకం వందలాది సినిమాలకు పెట్టు. ప్రతి పాత్రా విలక్షణ తరహాలో కొన్నివేల కొత్త పాత్రలు పుట్టించడానికి తొలిమెట్టు. ఈవిధంగా భారతీయ సినిమా షేక్స్‌పియర్ కథలతో, నాటకాలతో, ఆయన సృష్టించిన పాత్రలతో పరిపుష్టమైంది. నాలుగు వందల సంవత్సరాలు దాటినా నిన్న మొన్న వచ్చిన భారతీయ సినిమాలు కూడా ఆయన నాటకాల ఆధారంగానే జాతీయ అవార్డులు పొందడాన్ని ఏవిధంగా పరిగణించగలుగతాం. కాలాతీతమైనా పాత్రల చిత్రీకరణలో ఎలాంటి కథలోనైనా ఇమిడిపోయే స్వభావాలను ఆవిష్కరించడంలో అందెవేసిన చేయిగావున్న షేక్స్‌పియర్ నాటకాలే మన సినిమాను అలరిస్తున్నాయి. ఆ నాటకాల కొలమానంతో సరికొత్త ప్రమాణాలను సంతరించుకుంటూ జాతీయ అంతర్జాతీయ ఖ్యాతినీ ఆర్జిస్తున్నాయి. మిగతా రచయితల నాటకాల సొంతం చేసుకోవాలన్నా, వాటిని తమదైన శైలిలో మలుచుకోవాలన్నా రచయితలకు కత్తిమీద సాము. కానీ, షేక్స్‌పియర్ నాటకాల్లో ఈరకమైన సంక్లిష్టత లేదు. ఆయన సృష్టించిన పాత్రల్లో సంక్లిష్టత ఉందేమోగానీ, రచనల్లో మాత్రం విశ్వజనీనత ఉంది. అంటే, మూలాన్ని పట్టాలేగానీ... షేక్స్‌పియర్ నాటకాల నుంచి ఎన్ని కథలనైనా అల్లుకోవచ్చు. ఎన్ని పాత్రలనైనా సృష్టించుకోవచ్చు. అన్నింటికీ మించి ఆయన నాటకాలనే పదేపదే తీసి కొత్త రూపంలో అలరిస్తూ జాతీయ అవార్డులు కొట్టేయవచ్చు. బాలీవుడ్‌కి సంబంధించినంత వరకూ షేక్స్‌పియర్ ముద్ర తిరుగులేనిదే. ఆయన నాటకాలను భిన్నరూపాల్లో తెరకెక్కించి విజయం సాధించిన భారతీయ సినీ నిర్మాతలు, దర్శకులు ఎందరో ఉన్నారు. అన్నింటికి మించి షేక్స్‌పియర్ నాటకాల్లో అత్యంత ఆదరణ పొందిన ‘హామ్లెట్’.. అలాగే ‘రోమియో అండ్ జూలియట్’లు.. ఆ పేర్లతోనే కాకుండా అందులోని పాత్రల స్వభావంతో కూడిన కథలతో తెరకెక్కి అద్భుత విజయాన్ని సాధించిన సినిమాలు ఎన్నో. నిన్నమొన్నటిలో కూడా -షాహిద్‌కఫూర్ హీరోగా వచ్చిన హైదర్ చిత్రమే నిదర్శనం. హామ్లెట్ కథను విషాల్ భరద్వాజ్ తెరకెక్కించిన తీరు మాతృకకు ఏమాత్రం తీసిపోనిదిగానే సాగింది. కాశ్మీర్ నేపథ్యంలో టబు, కెకె మీనన్ తదితరులు హైదర్ చిత్రాన్ని రసవత్తరంగా రూపొందించడానికి దోహదం చేయడమే కాదు, హామ్లెట్‌ను మరింతగా ప్రేక్షకులకు సన్నిహితం చేశారు. అలాగే ఒథెల్లో నాటకం ఆధారంగా రూపుదిద్దుకున్న ఓంకార కూడా దర్శకుడిగా భరద్వాజ్ సృజనకు అద్దంపట్టింది. హిందీ సినిమా చరిత్రలోనే ఎన్నడూ చూడనంత అద్భుత దృశ్యకావ్యంగా అది రూపుదిద్దుకుంది. ఓంకార చిత్రం ఒథెల్లో ఆధారంగా రూపుదిద్దుకుంటే, అందులో నటించిన అజయ్ దేవగన్, సైఫ్‌అలీఖాన్, కరీనా కఫూర్‌లకు విశేషమైన పేరు తెచ్చిపెట్టింది. టబు, ఇర్ఫాన్ ఖాన్ నటించిన మక్బూల్ చిత్రాన్ని షేక్స్‌పియర్ రాసిన మేక్‌బెత్ ఆధారంగా తీశారంటే ఎవ్వరూ కాదనలేరు. అయితే, కొంతమేర మాతృక నుంచి దూరంగా వెళ్లేందుకు దర్శకుడు ప్రయత్నించినా మూలకథకు పూర్తి న్యాయమే చేశారని చెప్పాలి. పాత్రధారులు అందరినుంచీ ప్రేక్షకులు ఆశించిన రీతిలోనే కథానుగుంణగా నటనను రాబట్టడంలో ఆయన కృతకృత్యులయ్యారు. ఇవి ఇటీవల వచ్చిన చిత్రాలైతే -60వ దశకం ద్వితీయార్థంలోనే షేక్స్‌పియర్ నాటకాలు అప్పటి బాలీవుడ్ చిత్ర నిర్మాతలను, దర్శకులను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఏ కామెడీ ఆఫ్ ఎర్రర్ అనే నాటకం నుంచే తనూజ, కిషోర్ కుమార్ నటించిన దో ధూనీ చార్ అనే చిత్రం పుట్టుకొచ్చింది. అదే కథను ఆలంబనగా చేసుకుని సంజీవ్‌కుమార్, దేవన్‌వర్మ ప్రధాన పాత్రధారులుగా గుల్జార్ ‘అంగూర్’ చిత్రాన్ని నిర్మించి విజయాన్ని సాధించారు. అయితే, కథలో కొన్ని మార్పులు చేసినా మొత్తంమీద షేక్స్‌పియర్ ముద్ర మాత్రం ఆద్యంతం కనిపించింది. అన్నివర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిత్రంగా అంగూర్ సుస్థిర స్థానాన్ని సంతరించుకుంది. మిడ్‌సమ్మర్ నైట్స్ డ్రీమ్ ఆధారంగా రూపొందిన 10 ఎంఎల్ లవ్ అనే చిత్రం కూడా ఎంతగానో ప్రేక్షకులను అలరించింది. అయితే, క్లైమాక్స్‌లో కొంత తొట్రుపాటు కనిపించడం వల్ల షేక్స్‌పియర్ నాటకాన్ని ఇతివృత్తంగా తీసుకున్నా అంత న్యాయం జరగలేదన్న అభిప్రాయాలూ ఆ చిత్రం పట్ల వ్యక్తమయ్యాయి. ఇక ప్రేమికుల విషయనికి వస్తే అలాంటి కథలకు పుట్టినిల్లుగా రోమియో జూలియట్‌ను తీసుకోవచ్చు. ఎన్నో వందలాది చిత్రాలు, వాటి విజయాల వెనుక ఈ అద్భుత రంగస్థల కావ్యం మూలవిరాట్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఖయామత్ సే ఖయామత్ మొదలుకుని రామ్ లీలా, ఇష్కజాదే, ఇసాక్ వంటి ఎన్నో చిత్రాలు విసుగులేకుండా ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చాయి. శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ మూల కథ కూడా మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ నుంచి తీసుకున్నదే అన్నది వాస్తవం.
ఒక దశలో షేక్స్‌పియర్ గోస్ టు బాలీవుడ్ అన్న రీతిలో హాలీవుడ్‌లోనూ ప్రచారం జరిగింది. ఆయన నాటకాల పట్ల భారతీయ సినిమా ముఖ్యంగా హిందీ సినిమా ఇంతగా ప్రభావితం అయిపోయిందా? అన్న చర్చ సాగింది. ఇక 1940వ దశకంలోనే షేక్స్‌పియర్ నాటకం మర్చంట్ ఆఫ్ వెనీస్ ఆధారంగా జహానరా పేరిట ఓ చిత్రం రూపుదిద్దుకుంది. ఆ తర్వాత క్రమంగా ఆయన నాటకాలే చాలా సినిమాలకు తరగని కథా సంపదగా మారుతూవచ్చాయి.
కాలంతో నిమిత్తం లేకుండా ఏ కాలానికైనా, ఏ సమాజానికైనా వర్తింప చేసుకునే వెసులుబాటును షేక్స్‌పియర్ నాటకాలు సినిమా పరిశ్రమకు అందించాయనడంలో సందేహం లేదు. ఇప్పటికీ ఆయన కథల ఆధారంగా రూపొందించిన చిత్రాలకే జాతీయ అవార్డులు లభిస్తున్నాయంటే భారతీయ సినిమా ఎంతగా ముడిపడిందో కళ్లకు కట్టేదే.

-బీఆర్పీ