Others

నవరాత్రి ( ఫ్లాష్‌బ్యాక్@50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లాష్‌బ్యాక్ @ 50

కథ: ఏపి నాగరాజన్
కెమెరా: పియస్ శెల్వరాజ్
నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
ఎడిటింగ్: జె కృష్ణస్వామి
స్టంట్: రాఘవులు అండ్ పార్టీ
సంగీతం: టి చలపతిరావు
మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ
కళ: జివి సుబ్బారావు
నిర్మాత: ఎవి సుబ్బారావు
దర్శకత్వం: తాతినేని రామారావు

....................
ఎల్‌వి ప్రసాద్ దర్శకత్వంలో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై ‘పెంపుడు కొడుకు’తో చిత్ర నిర్మాణం ఆరంభించారు నిర్మాత ఏవి సుబ్బారావు. పలు విజయవంతమైన చిత్రాలు పలువురు దర్శకులతో రూపొందించారు. ప్రత్యగాత్మ వద్ద సహాయకునిగా పనిచేసిన తాతినేని రామారావును దర్శకునిగా పరిచయం చేస్తూ వీరు నిర్మించిన చిత్రం -నవరాత్రి. మహానటి సావిత్రి సొంత సంస్థ విజయ చాముండేశ్వరీ పిక్చర్స్, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ కలిసి రూపొందించిన చిత్రమిది. ఏప్రిల్ 22, 1966న విడుదలైంది. పెదనాన్నగారి అబ్బాయి తాతినేని ప్రకాశరావు ప్రోత్సాహంతో సినీ రంగ ప్రవేశం చేసి ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్‌లో ప్రత్యగాత్మ వద్ద సహాయకునిగా పనిచేసిన తాతినేని రామారావు -నవరాత్రి తరువాత 50కి పైగా తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించి పేరుపొందారు. ప్రసిద్ధ తమిళ దర్శక నిర్మాత ఏపి నాగరాజన్, తమిళ నటుడు వికె రామస్వామితో కలిసి కొన్ని చిత్రాలు నిర్మించారు. తరువాత నాగరాజన్ శ్రీవిజయలక్ష్మీ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ప్రారంభించి ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ తొమ్మిది పాత్రలు పోషించగా సావిత్రి కాంబినేషన్‌లో తమిళంలో నవరాత్రి (1964) నిర్మించారు. అఖండ విజయం సాధించిన ఆ చిత్రం ఆధారంగా తెలుగులో అక్కినేని, సావిత్రిల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం నవరాత్రి.
..................

చిత్రం ప్రారంభానికి ముందు జగ్గయ్య వాయిస్ ఓవర్‌తో ప్రేక్షకులను ఉద్దేశించి -నవరసాలైన శృంగారం, హాస్యం, కరుణ, వీర, భయానక, బీభత్సం, రౌద్రం, అద్భుతం, శాంతం నవరాత్రి చిత్రంలో తొలిసారి చూపటం జరిగిందని తెలియచేశారు. టైటిల్స్‌లో మొదట అతిథి నటులు నాగయ్య, గుమ్మడి, జగ్గయ్య, ప్రభాకరరెడ్డి, రమణారెడ్డి, రేలంగి, చలం ఫొటోలు, అతిథి నటీనటులు జమున, కాంచన, జయలలిత, సూర్యకాంతం, ఛాయాదేవి, గిరిజ, గీతాంజలి, హేమలత, కుట్టిపద్మిని ఫొటోలు చూపటం, తరువాత మిగిలిన నటీనటులు, సాంకేతిక వర్గం పేర్లు వస్తాయి.
నవరాత్రులలో తొలిరోజు రాత్రిపూట సావిత్రి (రాధ) బొమ్మలకొలువు పేరంటం స్నేహితురాళ్ళతో కలిసి చేస్తుంది. -నవరాత్రి శుభరాత్రి నెలరాజు చిగురించే కొలువుతీరే రాత్రి (గానం: పి సుశీల, రచన: దాశరథి) అని బొమ్మలను చూపుతూ వాటి విశేషాలు తెలియచేస్తూ, చంద్రుని బొమ్మలో సావిత్రిని చూపుతూ, దీపాలు, లైట్ల వెలుగులో అద్భుతంగా చిత్రీకరించారు. పాట పూర్తయ్యాక రాధ తండ్రి భీమశంకరం (గుమ్మడి) ఆమె బిఏ పూర్తయింది కనుక, తన స్నేహితుని కుమారునితో మరునాడు పెళ్ళి నిశ్చయ తాంబూలాలని చెబుతాడు. అంతకుమునుపు తన క్లాస్‌మేటు వేణు (ఎఎన్నాఆర్)ను ప్రేమించిన రాధ, తన తండ్రి తనకు నిశ్చయించిన వరుడు, తన ప్రియుడు ఒకరేనని తెలియక ఇల్లువదిలి వెళ్తుంది. కాలేజీలో వేణు కలియకపోవడం, అతని స్నేహితుడు రాజు (చలం) వేణుకు వివాహం నిశ్చయమైందని చెప్పటంతో, నిరాశతో ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. ఓ సహృదయుడు ఆనందరావు (ఏఎన్నాఆర్) ఆమెను కాపాడి బుద్ధిగా ఇల్లు చేరమని సలహాయిస్తాడు. మరునాడు ఉదయం అక్కడ నుంచి బయలుదేరి ఓ వేశ్య (ఋష్యేంద్రమణి) వద్ద, ఓ విటుడు దేవదాసు (ఏఎన్నాఆర్)ను, ఆ తరువాత పోలీస్‌స్టేషన్, పిచ్చాసుపత్రికి చేరి డాక్టరు (ఏఎన్నాఆర్)ను, తరువాత రైతు శాంతన్న (ఏఎన్నాఆర్)ను, కుష్టురోగి సుందర రామయ్య (ఏఎన్నాఆర్)ను, వీధి భాగవతాలు ఆడే భాగవతార్‌ను (ఏఎన్నాఆర్)ను మగ వేషంలో బయలుదేరి పోలీసు సూపర్నెంటు (ఏఎన్నాఆర్)ను కలిసి, చివరకు తనకోసం బెంగతో తపిస్తున్న ప్రియుడు వేణును కలవటం, పెద్దలు కుదిర్చిన పెళ్ళి ముహూర్తానికి వీరందరూ వచ్చి ఆశీస్సులు అందించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
భార్య మరణిస్తుండగా ఆమెకిచ్చిన మాటకోసం, కూతురికోసం జీవిస్తున్న ఆదర్శమూర్తి ఆనందరావు, క్షయ వ్యాధిగ్రస్తురాలైన భార్యను విడిచిపెట్టక వ్యసనాలకు అలవాటుపడ్డ దేవదాసు, రోగుల్ని స్నేహంతో దారికి తేవాలనే పిచ్చాసుపత్రి డాక్టరు, తమ్ముని అన్యాయంగా హత్యచేసిన జమీందారును చంపి, రౌడీల, పోలీసుల కాల్పుల్లో మరణించిన కోపిష్టి రౌడీ గోపన్న, ధర్మదాత, దానకర్ణుడన్న పొగడ్తలతో సర్వస్వాన్ని పోగొట్టుకొని, కుష్టువ్యాధి సంక్రమించగా అందరూ తనని దూరం చేశారని బాధతో చావుకోసం ఎదురుచూసే సుందర రామయ్య, అమాయకుడైన రైతు శాంతన్న, నీతి నిజాయితీగల భాగవతార్, జనాలను పీడిస్తున్న పులిని మట్టుబెట్టిన ధైర్యవంతుడు పోలీస్ సూపర్నెంటు వీరభద్రం, భగ్నప్రేమికుడై ప్రేయసి దూరమైందని ఆత్మహత్యకు సిద్ధపడిన వేణు... ఇలా చిత్రంలోని తొమ్మిది పాత్రలను, దేనికదే ఎంతో వైవిధ్య భరితంగా, ముఖ్యంగా వారికి పేరుతెచ్చిన దేవదాసు పాత్రలో ‘నిషాలేనినాడు’ పాటలో ఏది పాపమో ఏది పుణ్యమో చరణంలో, రోగిష్టి గోపన్నగా తన కథను వివరించటంలో, డాక్టరుగా అతి శాంతంగా, కరుణతో సావిత్రి కథకు రియాక్షన్‌లతో పలు విధాలుగా అక్కినేని నటనలో రక్తికట్టించారు.
నటి శిరోమణి సావిత్రి, ఈ తొమ్మిది పాత్రలకు, సన్నివేశాలకు తగ్గ రియాక్షన్ చూపటం, ‘చెప్పనా కథచెప్పనా’లో పిట్టకథ ద్వారా డాక్టరుకు తన కథను చెప్పటం, హాస్యాన్ని పిచ్చిని కలిపి నటనతో పోలీస్‌స్టేషన్‌లో డాక్టరువద్ద, వీధి భాగవతంలో సావిత్రిగా తన పాట, మాట, నృత్యంతో రంజింప చేసింది.
వేణు తల్లితండ్రులుగా నాగయ్య, హేమలత; సుందర రామయ్య వలన అమెరికాలో డాక్టరు చదివి కృతజ్ఞతాభావం, మంచితనంకల వ్యక్తిగా జగ్గయ్య; పోలీస్ ఇన్‌స్పెక్టరుగా ప్రభాకరరెడ్డి; కానిస్టేబుల్‌గా చదలవాడ; ఆనందరావు కుమార్తెగా కుట్టిపద్మిని; రైతు శాంతన్న అక్కగా నిర్మల; తమిళం నవరాత్రిలో నాగేష్ పోషించిన భూతవైద్యుడిగా తెలుగులో రేలంగి; ఇంకా భాగవతార్‌వద్ద నటులుగా నల్ల రామ్మూర్తి, సీతారాం, రాజబాబు, రామచంద్రరావు, అప్పారావు కాంట్రాక్టర్‌గా రమణారెడ్డి నటించారు.
చిత్ర దర్శకులు తాతినేని రామారావు సన్నివేశాలను పట్టుతో ఆకట్టుకునేలా రూపొందించారు. సావిత్రి వేశ్య ఇంటిలో పడకగదిలో ప్రవేశించగా అద్దాలలో ఆమె ప్రతిబింబాలు తిరిగి, ఏఎన్నాఆర్‌ను, మరలా సావిత్రిని అద్దాలలో చూపటం, పాట చిత్రీకరణ, సావిత్రి ఒట్టి చేతులలో ఏఎన్నాఆర్‌ను కొట్టగా ఆమె కాలు పట్టుకొని మన్నించమని ఏఎన్నాఆర్ కోరటం, చెరసాల గురించి ఆడ పిల్లకు అన్వయించి చెప్పించే మాటలు, ‘వలపులు పొంగారు బంగారు వయసులో కౌగిలియే చెరసాల’ (మెరపు తునక) భాగవతార్‌కు విసనకర్రతో విసురుతూ నిద్రమత్తులో నటుడు భాగవతార్‌ను విసనకర్రతో కొట్టడం పలుమార్లు చూపటం, ఏఎన్నాఆర్ విసుగు, కోపం ఎంతో సహజంగానూ, ఇక తమిళ చిత్రానికంటే ఎంతో విపులంగా పిచ్చాసుపత్రి సన్నివేశం ప్రముఖ నటీమణులతో వైవిధ్యంగా చిత్రీకరించారు. సహజ నటి జమున హరికథ భాగవతారిణిగానే అన్ని సహవాయిద్యాలు నోటితో వాయించి (ప్రేమకోసమై వీధిన పడెనే పాపం పసిబాలా) ఆకట్టుకుంది. ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసిన కాంచనచే ‘ది ఇండియన్ ఎయిర్‌లైన్స్’ అనౌన్స్‌మెంటు చెప్పించటం, జమున, జయలలితచే ‘చలివేస్తోందా’, ‘గౌరమ్మా నీ కొడుకెవరమ్మా’ అంటూ డ్యాన్స్‌లు, కాంచన, జయలలిత, గిరిజ, గీతాంజలి, ఛాయాదేవి నటన, ఇక అత్తగా సూర్యకాంతం దాష్టీకం, సావిత్రి ఇన్‌వాల్వ్‌మెంటుతో మెచ్చుకునేలా సాగింది. ఇంతమంది ప్రముఖ నటీమణులు సన్నివేశంలో పాల్గొన్నందుకు వారిని బంగారు ఉంగరాలతో, పట్టుచీరలతో సత్కరించటం సావిత్రి ఉదారతకు నిదర్శనం. ఇక చిత్రం క్లయిమాక్స్‌లో వేణు, రాధలు కలుసుకునే సన్నివేశంలో రాధ కళ్ళల్లో, ముఖంలో చిరునవ్వు, ఆనంద భాష్పాలు పలువిధాలుగా మార్చిమార్చి చూపగా దానికి ప్రతిగా ఏఎన్నాఆర్ ముఖంలో అదే రియాక్షన్ శివపార్వతుల బొమ్మను గోడపై చూపటం (వేణు, రాధ) వారిరువురూ ఆనందంతో, తన్మయంతో కౌగలించుకోవటం చక్కని అనుభూతిని కలిగించటం విశేషం.
ముళ్ళపూడి వెంకటరమణ మాటలు సన్నివేశాలకు మరింత బలం, అర్ధం చేకూర్చాయి. ‘్భగవంతుడు మనిషికి ముఖం ముందుకుపెట్టాడు. అంటే మనల్ని ముందుకే చూడమని గతం మరచిపొమ్మని’ అన్న డైలాగు చిన్న ఉదాహరణ మాత్రమే.
నవరాత్రిలోని గీతాలు:
పిచ్చాసుపత్రిలోని పేరడి గీతం -అద్దాల మేడ వుంది (పి.సుశీల, బి.వసంత, జి.మనోహరి, రాము, రచన- శ్రీశ్రీ). రైతు శాంతన్నగా ఏఎన్నాఆర్ బృందం, సావిత్రిలపై చిత్రీకరించిన గీతం -ఏం పిల్లో ఎక్కడికిపోతావు (ఘంటసాల, పి.సుశీల బృందం- కొసరాజు). కుట్టి పద్మిని, సావిత్రి, అక్కినేనిలపై చిత్రీకరించిన గీతం -చెప్పనా కథ చెప్పనా (పి.సుశీల- దాశరథి). సావిత్రి, ఏఎన్నాఆర్‌లపై చిత్రీకరించిన గీతం -నిషాలేనివాడు, హుషారేమిలేదు (ఘంటసాల, దాశరధి). ఉర్దూ పదాలతో అందంగా సాగుతుంది.
వీధి భాగవతాన్ని ఏఎన్నాఆర్, సావిత్రి, రాజబాబు, నల్లరామ్మూర్తి బృందంపై చిత్రీకరించారు. సావిత్రి ఈ పాటలో స్వయంగా గానం చేయటం విశేషం. -రాజు వెడలె సభకు, ఇరుప్రక్కల డాల్, కత్తులు మెరయ (రచన -కొసరాజు, గానం -ఘంటసాల, టిఆర్ జయదేవ్, ఎన్‌ఎన్ కృష్ణ, నల్లరామ్మూర్తి, సీతారాం). ఈ చిత్ర గీతాలు నేటికీ అలరించటం విశేషం. ‘నవరాత్రి’ చిత్రం శత దినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో 1974లో పయాదిన్ నరుూరాత్ పేరుతో ఎస్‌పి ఆలీ నిర్మించారు. దర్శకత్వం ఎ భీమసింగ్ వహించారు. సంజీవ్‌కుమార్, జయబాధురి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రానికి దిలీప్‌కుమార్ పరిచయ వాక్యాలు చెప్పారు.

-సివిఆర్ మాణిక్యేశ్వరి