Others

హరిశ్చంద్ర (ఫ్లాష్‌బ్యాక్ @50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ: టివియస్ శర్మ, వాలి
ఎడిటింగ్: తిలక్, వీరప్ప
కెమెరా: లక్ష్మణ్‌గోరె
నృత్యం: వెంపటి సత్యం
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
నిర్మాత: రాజ్యం
మేనేజింగ్ పార్టనర్: సివి కృష్ణమూర్తి.

వేద సాహిత్యంలో, భారత రామాయణ పురాణాల్లో హరిశ్చంద్ర ఇతివృత్తం గోచరిస్తుంది. సత్యానికి మారుపేరుగా నిలిచిన వ్యక్తి హరిశ్చంద్రుడు. గాంధీజీవంటి ఎందరో మహాపురుషులకు ఆదర్శప్రాయుడు. పురాణకాలం నుంచి ఆధునికయుగం వరకు ఎన్నో సాహిత్య ప్రక్రియల్లో ఈ వృత్తాంతం ఆధారంగా రచనలు సాగాయి. కందుకూరి వీరేశలింగం మొదలుకొని ఎందరో ఈ కథను నాటకాలుగా వ్రాసారు. వాటిలో బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచించిన నాటకం ‘హరిశ్చంద్ర’ ప్రఖ్యాతి పొందింది. హరిశ్చంద్రుడి కథ ఆధారంగా దాదాసాహెబ్ ఫాల్కే తొలి మూకీ చిత్రం రాజా హరిశ్చంద్ర (1913)లో నిర్మించారు. మూకీగా నాలుగుసార్లు, యావత్ భారతదేశ భాషల్లో టాకీగా ఇరవైసార్లు నిర్మింపబడింది. తెలుగులో స్టార్ కంబైన్స్‌వారు 1935లో బలిజేపల్లివారి నాటకం ఆధారంగా ‘హరిశ్చంద్ర’ నిర్మించారు. అద్దంకి శ్రీరామమూర్తి హరిశ్చంద్రుడిగా, కన్నాంబ చంద్రమతిగా నటించారు. ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. ఇదే బలిజేపల్లివారి నాటకం ఆధారంగా రాజ్యం పిక్చర్స్ పతాకంపై నిర్మింపబడిన చిత్రం ‘హరిశ్చంద్ర’. ఎస్‌వి రంగారావు, లక్ష్మీరాజ్యం నాయక, నాయికలుగా నటించారు. 1956 మే 31న విడుదలైన ఈ చిత్రానికి ఇప్పుడు 60 వసంతాలు.

‘శ్రీకృష్ణతులాభారం’ చిత్రం ద్వారా నటిగా చిత్రసీమలో ప్రవేశించిన లక్ష్మీరాజ్యం, తరువాత శ్రీ్ధరరావును వివాహమాడి 1951లో రాజ్యం పిక్చర్స్ స్థాపించారు. ఎన్టీ రామారావు, లక్ష్మీరాజ్యం కనకం ప్రధాన పాత్రలుగా ‘దాసి’ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం రజితోత్సవాలు జరుపుకుంది. ఆ తరువాత ఈ సంస్థ నిర్మించిన చిత్రం ‘హరిశ్చంద్ర’.
ఏలూరులో లెక్చరర్‌గా పనిచేస్తూ నవలలు విరివిగా వ్రాసిన జంపన చంద్రశేఖర్‌రావు ఈ చిత్రానికి మాటలు వ్రాసి దర్శకత్వం వహించారు. వీరి తొలి చిత్రం ‘వాలి సుగ్రీవ’. ఆ తరువాత భట్టివిక్రమార్క, కృష్ణలీలలు, మేనరికం చిత్రాలకు దర్శకత్వం వహించారు.
రైతులు, కూలీలు, కుల వృత్తులవారు తమ రాజ్యాన్ని, రాజును పొగుడుతూ ‘అయోధ్య రాజ్యమురా’ గీతాన్ని (మాధవపెద్ది, జిక్కి, పిఠాపురం, సుసర్ల బృందం- రచన కొసరాజు) ఆలపించటం ద్వారా చిత్రం ప్రారంభమవుతుంది. ఈ గీతంలో రైతు యువతిగా షావుకారు జానకి, చాకలివానిగా చలం అతిథి పాత్రలు పోషించారు. తరువాత ఒక ఇల్లాలు (సూర్యకళ) తులసీపూజ చేయటం -జననీ, జననీ జగన్మాత శుభ చరిత (పి.లీల), తరువాత హరిశ్చంద్రుడు (ఎస్వీ రంగారావు), చంద్రమతి (లక్ష్మీరాజ్యం) పూజాగృహంలో దేవుని పూజించటం చూపిస్తారు. తరువాత స్వర్గంలో ఇంద్రుడు (రఘురామయ్య) రంభ, ఊర్వశిల నృత్య గీతం -మధురం, మధురం మదవతి (స్వర్ణలత, సత్యవతి; రచన- జంపన) పూర్తయ్యాక సభికులను ఉద్దేశించి లోకంలో సత్యవ్రత నియమాన్ని పాటించేవారెవరని ప్రశ్నిస్తాడు. దానికి వశిష్టముని (సూరిబాబు) భూలోకంలోని హరిశ్చంద్రుడు అట్టి నియమాన్ని పాటిస్తున్నాడని తెలియచేస్తాడు. దానికి ఆగ్రహించిన విశ్వామిత్రుడు (గుమ్మడి) హరిశ్చంద్రుని సత్యవ్రతాన్ని భంగపరుస్తానని, అలాచేయలేని పక్షంలో తన తపోశక్తి సగం ధారపోస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అలా భూలోకం వచ్చిన విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని కలిసి, తాను తలపెట్టిన యాగానికి ఒక బలవంతుడు ఏనుగుపైకెక్కి ఒక రత్నాన్ని విసిరితే ఎంత ఎత్తుకెళ్తుందో అంత ధనం కావాలని కోరతాడు. ఆ ధనాన్ని సమయం వచ్చినపుడు తీసుకెళ్తానని చెబుతాడు. అడవిలో క్రూరమృగాలు సృష్టించి వేటకు వచ్చిన చక్రవర్తిని, తాను సృష్టించిన మాతంగ కన్యలను (కుచల కుమారి, రాజసులోచన) వివాహం చేసుకోమంటాడు. ఏకపత్నీవ్రతుడైన తాను రాజ్యాన్ని అయినా త్యజిస్తాను కానీ, ధర్మం తప్పనంటాడు హరిశ్చంద్రుడు. వెంటనే విశ్వామిత్రుడు రాజ్యాన్ని దానంగా స్వీకరించి, యాగానికి ఇస్తానన్న ధనంకోసం హరిశ్చంద్రుని వెంట తన శిష్యుడు నక్షత్రకుని (రేలంగి)ని పంపుతాడు. భార్య చంద్రమతి, కుమారుడు లోహితాస్యునితో దారిలో పలు కష్టాలు అధిగమించి హరిశ్చంద్రుడు కాశి నగరం వెళతాడు. విశ్వామిత్రుని బాకీ తీర్చడం కోసం భార్యను, బిడ్డను కాలకేశికుని (గౌరీపతి శాస్ర్తీ)కి అమ్మేస్తాడు. ఆ ధనం తన దారిఖర్చుకు సరిపోయిందన్న నక్షత్రకుడిని మాటతో, తనను తాను వీరబాహుడు (సుబ్బారావు)కి అమ్ముడుపోతాడు. విశ్వామిత్రుని మాయవల్ల లోహితాస్యుడు మరణించటం, స్మశానంలో భార్యను హరిశ్చంద్రుడు గుర్తించటం, కాటి సుంకం కోసం మాంగల్య విక్రయానికి వెళ్ళిన చంద్రమతిపై కాశి రాకుమారుని హత్యానేరం అపాదించబడటం, మరణ దండన విధింపబడిన ఆమెను భర్తే సంహరించాల్సి రావటం లాంటి పరిస్థితులు ఎదురైనా ధర్మం తప్పని హరిశ్చంద్రుని చూసి పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు. విశ్వామిత్రుడు చలించిపోతాడు. హరిశ్చంద్రుని దీవించి, కాశి రాకుమారుని, లోహితాస్యుని బ్రతికిస్తారు. విశ్వామిత్రుడు తన తపోశక్తిలో సగం ధారపోసి హరిశ్చంద్రుని ముందు ఓటమి అంగీకరిస్తాడు. హరిశ్చంద్రుడిని తిరిగి మహారాజుగా చూపటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో కాలకేశికుని భార్యగా సూర్యకాంతం, శిష్యునిగా నల్ల రామ్మూర్తి, వీరబాహుని జంటగా సీత, రంభ, ఊర్వశిలుగా ఇవి సరోజ, రీటాలు కనిపిస్తారు. సహనం, నిగ్రహం, కర్తవ్యదీక్ష, సత్యవ్రత నియమం, మాతంగ కన్యలు, కోరరాని కోరిక కోరినప్పుడు తప్ప ఆవేశకావేషాలకు లోనుకాని హరిశ్చంద్రుని స్వభావ లక్షణాలను ఎస్వీ రంగారావు తన నటనలో పరిపూర్ణంగా ఆవిష్కరించారు. చంద్రమతిగా లక్ష్మీరాజ్యం కరుణరస పూరితమైన నటన, ఆర్ద్రతతో మెప్పించారు. సాత్విక పాత్ర పోషణకు పేరుపడిన గుమ్మడి విశ్వామిత్రునిగా అహాన్ని, స్వాతిశయాన్ని నిండుగా ప్రదర్శించారు. దర్శకులు జంపన సన్నివేశాలను, పాత్రలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. నక్షత్రకుని పాత్ర మాతంగ కన్యలను వివాహం చేసికొమ్మని హరిశ్చంద్రుని కోరటం.. అడవిలో ఆకలి బాధ, భయానికి వగపు.. చంద్రమతిని అమ్మగా వచ్చిన ధనమంతా దారి ఖర్చు సరి అనటం.. చివర హరిశ్చంద్రుని వద్ద సెలవు తీసుకుంటూ తన తప్పు మన్నించమని కోరటం... ఈ పాత్ర పోషణలో రేలంగి, దర్శకుని మనోభావాలకు తగ్గట్టు నటించి మెప్పించారు. కాలకేశికుడు, అతని భార్య చేత చంద్రమతిని ‘కొండంత డబ్బుపోసి కొన్నాం’ అని పలుమార్లు అనిపించటం, లోహితుని కాటువేసిన నాగును తననుకూడా కాటువేయమని చంద్రమతి కోరటం, చంద్రమతిని బంధించి, వధ్యశిలకు తీసుకెళ్తుండగా మహారాణిగా ఆమె వైభవాన్ని పాటలో చరణాల్లో పలువిధాలుగా చూపటం ప్రశంసనీయం. ఈ చిత్రానికి సంగీతానికి సహాయకులుగా కోదండపాణి, అసోసియేట్ దర్శకులుగా నాగయ్యనాయుడు, ఎస్‌డి లాల్ వ్యవహరించారు.
చిత్ర గీతాలు:
మహారాజు, మహారాణిల ముందు మాతంగ కన్యలు పాడే నృత్యగీతం -చక్కదనాల చుక్కలం చందమామ రెక్కలం’ (జిక్కి, పి సుశీల- రచన జంపన). ఎస్వీ రంగారావుపై చిత్రీకరించిన పద్యం -అరయన్ వంశము నిల్పుటకేకదా వివాహంబు’ (ఘంటసాల- బలిజేపల్లి). హరిశ్చంద్రుని సభలో నృత్య గీతం -ఇది సమయమురా శుభ సమయమురా (జిక్కి బృందం- కొసరాజు). వశిష్టుడు (సూరిబాబు)పై ఇంద్ర సభలో పద్యం -ప్రళయ నిర్ఘాతమరచేత పట్టవచ్చు (పి సూరిబాబు- బలిజేపల్లి). విశ్వామిత్రునిపై అదే సభలో పద్యం -హిమశైలంబున వాయుభక్షణుడై (మాధవపెద్ది-బలిజేపల్లి). మరో పద్యం వశిష్టునిపై -శిరమెల్ల గొరగించుకొనుచు (పి సూరిబాబు- బలిజేపల్లి). హరిశ్చంద్రుడు దానమిచ్చే సందర్భంలోని పద్యం -దేవబ్రాహ్మణమాన్యముల్ (ఘంటసాల- బలిజేపల్లి). హరిశ్చంద్రుడు రాజ్యం విడిచి వెళ్తుండగా వచ్చే గీతం -అయ్యో ఇదే న్యాయమో. అడవిలో చంద్రమతి ప్రార్థన పద్యం -కట్టా ఎక్కడ లేరే దీనజనరక్షాదక్షులీ (పి లీల- బలిజేపల్లి). హరిశ్చంద్రునిపై స్మశానంలో పద్యం -కాబోలు బ్రహ్మరాక్షస సమూహంబు (ఘంటసాల- బలిజేపల్లి). బలిజేపల్లి రచించిన మరిన్ని పద్యాలు -చనుబాలిచ్చినతోడనే పొత్తులనుంచి (పి.లీల), -పత్యూషంబున లేచి నాధుని పదాజ్యాటంబులన్ (పి.లీల) చంద్రమతిపై చిత్రీకరణ, నక్షత్రకునిపై పద్యాలు -కొంపా గూడా ఇంత కూడే లేదు, -కలత వహించకయ్యా కలకాలము, -అలయక గుళ్ళు గోపురములు, -తన మహీరాజ్యమంతయు (మాధవపెద్ది గానం). హరిశ్చంద్రుడు, చంద్రమతిని అమ్మజూపే వేళ పద్యం -జవదాటి ఎరుగదీ యువతీ లలామంబుపతి, లోహితాశ్యుని జూసి -కొడుకా కష్టాలెన్ని వచ్చినను, -అంతంటి రాజచంద్రుని కాత్మజలైవై, -అకటా ఒక్కని పంచదాసియై (ఘంటసాల). చంద్రమతిపై పద్యాలు -ఆవుల్ మందలలోన నిల్వక (పి.లీల), కార్చిచ్చు అడవిలో పద్యం -శ్రీమన్ మహాయజ్ఞమూర్తి (స్వర్ణలత). దండకం- కాశీవిశ్వనాథుని కీర్తిస్తూ హరిశ్చంద్రులపై గీతం -జయకాశీ విశ్వనాథా (ఘంటసాల, పి లీల, సత్యవతి బృందం- జంపన). తుఫాన్‌తో వచ్చిన వర్షం ఆపమని చంద్రమతి ఆలపించే ప్రార్థన గీతం -ఏలమ్మా ఈ వర్షధార లోకమేనిండి (పి.లీల- జంపన). ఏవి సుబ్బారావు (సీ) వీరబాహుడిపై చిత్రీకరించిన గీతం -చిన్న కత్తి పెద్ద కత్తి నాదేనయ్యా (ఘంటసాల బృందం- కొసరాజు). గౌరీపతిశాస్ర్తీ, సూర్యకాంతంలపై గీతం -ఏమంటావ్, ఏమంటావ్ ఔనంటావా కాదంటావా? (పిఠాపురం, స్వర్ణలత- కొసరాజు). వీరబాహుని భార్య సీతపై చిత్రీకరించిన డప్పులతో కూడిన హుషారు గీతం -చెప్పింది చెయ్యబోకురా నాసామి రంగ (స్వర్ణలత-కొసరాజు). రఘురామయ్య గానం చేసిన పద్యం -తన సామ్రాజ్యము పోవనీ (బలిజేపల్లి). ఇక హరిశ్చంద్రుడు కాటికాపరిగా శ్మశానములో చిత్రీకరించిన పద్యాలు -కాబోలు నిధి బ్రహ్మరాక్షస, -చతురంభోది పరీతభూత, -చతురంభోది దిపరీత భూవలయ రక్షాదక్షచా. ఈ సన్నివేశంలోని అద్భుతమైన అజరామరమైన పద్యాలు -ఇచ్చోట ఏ సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో, -మాయామేయ జగంబె నిత్యమని సంభావించి (ఘంటసాల గానం- రచన బలిజేపల్లి). ఇవి నిత్యసత్యాలుగా నిలిచిపోయాయి. కాశీరాకుమారి హత్యానేరంపై చంద్రమతిని వధ్యశిలకు తీసుకెళ్తుండగా వచ్చే గీతం -ఏ ఇంట పుట్టావో ఏ ఇంట పెరిగావో (గానం ఘంటసాల, రచన- జంపన). హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు చిత్రంలో ఉపయోగించటం అవి జనాదరణ పొందటం జరిగింది.
ఓ నేపాళ మాంత్రికుడు, రాజ్యకాంక్షగల పినతండ్రి (జయసింహ), బంగారుపాప కోటయ్యలా.. ఎస్వీ రంగారావు నట జీవితంలో ఓ చిరస్మరణీయమైన పాత్ర ‘హరిశ్చంద్ర’. హరిశ్చంద్ర చిత్రం శత దినోత్సవాలు జరుపుకుని విజయం సాధించిన చిత్రంగా రికార్డు నిలుపుకుంది.

-సివి మాణిక్యేశ్వరి