రివ్యూ

మంచి ప్రయత్నమే కానీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు * * ఎంఎల్‌ఏ
**
తారాగణం:
కళ్యాణ్‌రామ్, కాజల్,
బ్రహ్మానందం, వెనె్నల కిషోర్,
అజయ్, పృధ్వీ,
మనాలీ రాథోడ్,
ప్రభాస్ శ్రీను, లాస్య తదితరులు
ఎడిటర్: తమ్మిరాజు
కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ
సంగీతం: మణిశర్మ
నిర్మాత: భరత్ చౌదరి, కిరణ్‌రెడ్డి
దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్
**
నందమూరి ఫ్యామిలీ నుండి కథానాయకుడుగా పరిచయం అయిన కళ్యాణ్‌రామ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ ఆ తరువాత వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. దాంతో ఆయనకు అవకాశాలు కరువయ్యాయి. అయితే గత ఏడాది ‘పటాస్’తో మంచి విజయాన్ని అందుకున్న కళ్యాణ్‌రామ్‌కు ఆ తరువాత వచ్చిన ‘షేర్’, ‘ఇజం’ సినిమాలు చేదు అనుభవాలు మిగిల్చాయి. ఈసారి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని ‘ఎంఎల్‌ఏ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్‌తో చేసిన సినిమాలో ఎంఎల్‌ఏగా కళ్యాణ్ కథేమిటో తెలుసుకుందాం..
కళ్యాణ్ (కళ్యాణ్‌రామ్) చదువు పూర్తిచేసి ఖాళీగా వున్న అబ్బాయి. అతడికి ఇందు (కాజల్ అగర్వాల్) అనుకోకుండా పరిచయమవుతుంది. ఆమెను కళ్యాణ్ మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. కళ్యాణ్ ఉద్యోగంలో చేరిన కంపెనీ చైర్మన్ కూతురే ఇందు అని అతడికి తర్వాత తెలుస్తుంది. ఆమె సమస్యలు తీర్చి నెమ్మదిగా తనకు చేరువవుతాడు. కానీ అతడంటే ఇష్టమున్నా పెళ్లి చేసుకోలేనని తేల్చేస్తుంది ఇందు. అప్పుడే ఇందు గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు బయటికి వస్తాయి. ఆ నిజాలేంటి? ఆమె కళ్యాణ్‌ను పెళ్లి చేసుకోలేననడానికి కారణాలేంటి? అసలు కళ్యాణ్ ఎందుకు ఎంఎల్‌ఏగా మారాడు అన్నది మిగతా కథ. కళ్యాణ్ పాత్రలో కళ్యాణ్‌రామ్ నటన బాగుంది. నటుడిగా ఆయన చాలా ఇంప్రూవ్ అయ్యారు. నందమూరి కళ్యాణ్‌రామ్ తనకు సూటయ్యే పాత్రను ఎంచుకున్నాడు. గత సినిమాలతో పోలిస్తే కొంచెం యూత్‌ఫుల్‌గా కనిపించాడు. క్యారెక్టర్ కొత్తేమీ కాదు కానీ.. అతడి బాడీ లాంగ్వేజ్, లుక్ మునుపటితో పోలిస్తే కొత్తగా అనిపిస్తాయి. యాక్షన్, ఎమోషనల్ సీన్లలో బాగా చేశాడు. కొంతవరకు కామెడీతోనూ మెప్పించాడు. కాజల్ అగర్వాల్ నటనాపరంగా జస్ట్ ఓకె అనిపిస్తుంది. గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. రవికిషన్ ‘రేసుగుర్రం’లో మద్దాలి శివారెడ్డి పాత్రకు కొనసాగింపులా అనిపిస్తుంది. పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, పృథ్వీ, వెనె్నల కిషోర్ తమ తమ పరిధుల్లో బాగానే నవ్వించారు. ప్రసాద్ మూరెళ్ళ కెమెరా పనితనం బాగుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన ఆయన ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. మణిశర్మ పాటలకు అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగానే వుంది. ఉపేంద్ర మాధవ్.. కొత్త దర్శకుడి నుంచి ఆశించే అంశాలు చూపించలేదు. చాలా మామూలు కథను కమర్షియల్‌గా డీల్ చేశాడు. అతను ప్రథమార్థంలో తన గురువు శ్రీను వైట్ల ఫార్ములాను ఫాలో అయిపోయాడు. ద్వితీయార్థంలో కాస్తయినా కొత్తదనం కోసం ప్రయత్నించి ఉండాల్సింది. ఉపేంద్ర మాధవ్ తను రాసుకున్న పిల్లలకు ఆస్తులు ఇస్తే అవి ఉంటేనే బ్రతుకుతారు, అదే చదువు ఇస్తే ఎలాగైనా బ్రతుకుతారు వంటి డైలాగ్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ సన్నివేశం బాగుంది. దానివలన సెకెండాఫ్‌మీద ఆసక్తి పెరిగింది. ఇక ద్వితీయార్థంలో పేద ప్రజలకు హీరో చేసే మేలు, వారికోసం ఆలోచించే విధానం బాగున్నాయి. అమ్మాయి ప్రేమను దక్కించుకోవడం కోసం ఎంఎల్‌ఏ అవ్వాలనుకోవడం కొత్త పాయింటే. కానీ దాన్ని సరైన విధానంలో చెప్పే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా లేవు. స్క్రీన్‌ప్లే రెగ్యులర్‌గా వుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కథకు పెద్దగా కనెక్ట్ కాలేడు. హీరో విలన్‌తో ఛాలెంజ్ చేసి ప్రజలకు మంచి చేయటం వంటి అంశాలని ఇదివరకే చాలా సినిమాల్లో మనం చూసాం. ఈ సినిమా కూడా అదే ధోరణిలో నడుస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో కంపెనీలో చాలా సన్నివేశాలు సినిమాకు అవసరం లేదనే భావన కలుగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగున్నా, అప్పుడే సినిమాలోని అసలు కథ మొదలైనా తర్వాత ఏం జరుగుతుందనేది ప్రేక్షకుల్లో సులభంగా తెలిసిపోతుంటుంది. దీంతో సినిమా పట్ల పెద్దగా ఎగ్జైట్‌మెంట్ అనేది కలుగదు. కొంత కామెడీ.. ఇంకొంత రొమాన్స్.. ఇంకా యాక్షన్.. ఎమోషనల్ సీన్స్.. ఇలా పక్కాగా కమర్షియల్ మీటర్ ఫాలో అయిపోయాడు కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్. ఐతే కళ్యాణ్‌రామ్ ఇంతకుముందు చేసిన ‘పటాస్’ కూడా కమర్షియల్ మీటర్‌ను ఫాలో అయిన సినిమానే. కానీ అందులో ఆద్యంతం వినోదం ప్రేక్షకుల్ని ముంచెత్తుతుంది. ప్రథమార్థం వరకు బాగానే టైంపాస్ చేయించే ఈ సినిమా.. ద్వితీయార్థంలో నత్తనడకన సాగుతుంది. ఒక దశ తర్వాత కథ కథనాలు మరీ ప్రెడిక్టబుల్‌గా తయారవడంతో ఆసక్తి సన్నిగిల్లిపోతుంది. కానీ ఒక నియోజకవర్గానికి కొత్త అయిన వ్యక్తి అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి.. అతడి ఇమేజ్‌ను దెబ్బతీసి.. అక్కడి జనాల్ని ఇంప్రెస్ చేసి తాను ఎమ్మెల్యే అయిపోవడం అన్నది తెలుగు సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే వ్యవహారం. ఇలా మన హీరోలు తరతరాలుగా ‘జనాల మనసుల్ని గెలుస్తూనే’ ఉన్నారు. ఇందులో ఇక ఆసక్తి ఏముంటుంది? శ్రీమంతుడు స్టయిల్‌లో ఎమ్మెల్యేలోనూ కొన్ని మంచి విషయాలు చెప్పే ప్రయత్నం జరిగింది కానీ.. ఆ మంచి విషయాల్ని కూడా కమర్షియల్ మీటర్‌లోనే చెప్పే ప్రయత్నం జరగడంవల్ల ఎమోషన్ అనుకున్న స్థాయిలో పండలేదు.

-త్రివేది