రివ్యూ

బోల్తాకొట్టిన పార్టీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* కిరాక్ పార్టీ
*
తారాగణం:
నిఖిల్, సిమ్రాన్ పరీంజా,
సంయుక్త హెగ్డే,
రాకేందు వౌళి, బ్రహ్మాజీ,
హేమంత్, షాయాజీ షిండే తదితరులు
కథ: రిషబ్ శెట్టి
మాటలు: చందూ మొండేటి
సంగీతం: అజనీష్ లోక్‌నాధ్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
స్క్రీన్‌ప్లే: సుధీర్ వర్మ
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
*
తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలలో ఉన్న నిఖిల్ విభిన్నమైన సినిమాలతో సాగిపోతున్నాడు. తాజాగా కన్నడలో విజయవంతమైన ‘కిరిక్ పార్టీ’ చిత్రాన్ని ‘కిరాక్ పార్టీ’తో రీమేక్ చేశాడు. నిఖిల్ మిత్రులు చందూ మొండేటి.. సుధీర్‌వర్మ రచనా సహకారంతో శరణ్ కొప్టిశెట్టి అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది. శివ, హ్యాపీడేస్ తరహా కాలేజీ స్టోరీలా తెరకెక్కిన ఈ సినిమాలో మరి కిరాక్ పార్టీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కృష్ణ (నిఖిల్) ఇంజనీరింగ్ తొలి సంవత్సరంలో చేరిన కుర్రాడు. స్నేహితులతో కలిసి సరదాగా కాలేజీ జీవితాన్ని గడిపేసే అతను, తన సీనియర్ అయిన మీరా (సిమ్రాన్ పరీంజా)ను ఇష్టపడతాడు. ముందు అతడిని దూరం పెట్టినప్పటికీ మీరా కూడా ఆ తర్వాత అతడికి చేరువవుతుంది. అలాంటి సమయంలో ఒక అనూహ్య ఘటన జరుగుతుంది. అదేంటి? దానివల్ల కృష్ణ జీవితం ఎలా మలుపుతిరిగింది? ఎప్పుడూ సరదాగా ఉండే కృష్ణ కఠినంగా మారిపోతాడు. ఎప్పుడూ గొడవల్లోనే ఉంటుంటాడు. అలాంటి అతన్ని సత్య (సంయుక్త హెగ్డే) అనే జూనియర్ ప్రేమిస్తుంది. కానీ కృష్ణ మాత్రం మీర జ్ఞాపకాల్లోనే ఉండిపోతాడు. అలాంటి అతన్ని సత్య ఎలా మార్చింది. అసలు మీర కృష్ణకు ఎలా దూరమైంది? అతడి మిగతా కాలేజీ లైఫ్ ఎలా సాగింది... ఆ బాధతో కృష్ణ ఎలా తయారయ్యాడు అనేది మిగతా కథ.
ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఫ్రెషర్స్ డే నుంచి.. నాలుగో ఏడాది ఫేర్‌వెల్ డే వరకు ఒక కుర్రాడి జీవితాన్ని చూపించే సినిమా కిరాక్ పార్టీ. పూర్తిగా కళాశాల నేపథ్యంలోనే సాగుతుంది. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేయడం.. క్లాస్ క్లాసంతా కాలేజీ బంక్ కొట్టి సినిమా చూడడం.. స్టూడెంట్స్ మధ్య గొడవలు.. ప్రిన్సిపాల్ దగ్గర పంచాయితీలు.. కాలేజీ బ్యూటీ వెంట అబ్బాయిలందరూ మూకుమ్మడిగా పడటం.. అందరిలోంచి హీరో ఆమెను ఇంప్రెస్ చేయడం.. వీళ్లమధ్య రొమాంటిక్ ట్రాక్.. ఇలా ఒక కాలేజీ కథ నుంచి ఆశించే అంశాలే కిరాక్ పార్టీలో కనిపిస్తాయి. ఇందులోని మూమెంట్స్ కొత్తగా అనిపించవు కానీ ఓ మోస్తరుగా ఎంటర్‌టైన్ చేస్తూ సాగుతాయి. ఇక హీరోగా నిఖిల్ నటన సినిమాకు ముఖ్య ఆకర్షణల్లో ఒకటి. నటుడిగా అతడిలోని పరిణతిని ఈ సినిమాలో చూడొచ్చు. డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్రను సమర్థవంతంగా పోషించాడు. కాలేజీలో మొదటి సంవత్సరం చేరినపుడు ఉండే అల్లరి.. అత్యుత్సాహం.. తెలియనితనాన్ని చక్కగా చూపించాడు. అలాగే ఏళ్లు గడిచాక వచ్చే మార్పులకు తగ్గట్లు పరిణతితో నటించాడు. తనలో తాను సంఘర్షణకు గురయ్యే పతాక సన్నివేశాల్లో నిఖిల్ చాలా బాగా చేశాడు. హీరోయిన్ సిమ్రన్ పరీంజా నటనలో జస్ట్ ఓకె అన్పిస్తుంది. ఆమె అందంగా ఉంది కానీ నటనాపరంగా ఏమంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక సంయుక్త హెగ్డే కూడా అంతంత మాత్రమే. మిగతా పాత్రల్లో రాకేందు వౌళి, హేమంత్, బ్రహ్మాజీ, సిజ్జు, షాయాజీ షిండే వారి పరిధిలో బాగా చేశారు.
ఇక సాంకేతిక విషయాలకివస్తే, ఒరిజినల్ ‘కిరిక్ పార్టీ’ సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథే దీనికి సంగీతాన్నందించాడు. పాటలు బావున్నాయి. గురువారం సాయంకాలం పాట వెంటాడుతుంది. మిగతా పాటలూ ఓకె. నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. అద్వైత గురుమూర్తి ఛాయాగ్రహణం మాత్రం సోసోగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. ఒరిజినల్ కథను పెద్దగా మార్చలేదు. సుధీర్‌వర్మ స్క్రీన్‌ప్లే, చందూ మొండేటి మాటలు కథాంశానికి తగ్గట్లుగా ఉన్నాయి. కొత్త దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి కొన్నిచోట్ల తన మార్క్‌ని చూపించే ప్రయత్నం చేశాడు. ఐతే మన నేటివిటీకి తగ్గట్లుగా సినిమాను మలచే విషయంలో తడబడ్డాడు.
చివరగా.. సినిమాకు ప్రధాన మైనస్ స్టోరీలైన్. ఒక సినిమాకు కావాల్సిన పూర్తిస్థాయి మెటీరియల్ అందించే విధంగా తయారుచేయలేకపోవడమే. ఇంటర్వెల్ సమయానికి బలంగా బయటపడే కథను దర్శకుడు శరన్ కొప్పిశెట్టి సెకండాఫ్ మొత్తం అంతే బలంగా నడపడంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. ప్రథమార్థానికి మంచి స్క్రీన్‌ప్లే అందించిన సుధీర్ వర్మ ద్వితీయార్థానికి ఆ స్థాయి కథనాన్ని ఇవ్వలేదు. సెకెండాఫ్‌లోని కీలకమైన సన్నివేశాలు చాలావరకు రొటీన్‌గానే అనిపిస్తాయి. కొన్నైతే చాలా బలహీనంగా కూడా ఉంటాయి. దీంతో చూసే ప్రేక్షకుల్లో కొంత నిరుత్సాహం ఆవరిస్తుంది. విరామ సమయానికి అసలు కథ ఓపెన్ అయినా ద్వితీయార్థంలో అదెక్కడా పెద్దగా కనిపించదు. కాలేజ్ ఎలెక్షన్స్ గొడవలు అంటూ సినిమా సైడ్ ట్రాక్‌లోకి వెళ్లిపోతుంది. పోనీ ఆ అంశాలనైనా ఎఫెక్టివ్‌గా చూపించారా అంటే పేలవమైన సన్నివేశాలతో అరకొరగా చూపించి వదిలేశారు. దాంతో కథానాయకుడి పాత్ర గమనం, వ్యక్తిత్వం ఏమిటనేది అర్థంకాని పరిస్థితికి వచ్చేస్తుంది. నిడివి ఎక్కువ కావడం.. మధ్యలో కథనం దారి తప్పడం.. అనాసక్తికరమైన కొన్ని సన్నివేశాలు కిరాక్ పార్టీ గ్రాఫ్‌ని తగ్గిస్తాయి. ‘కిరిక్ పార్టీ’ కన్నడ ప్రేక్షకులకు కొత్తగా ఉండి ఉండవచ్చేమోకానీ.. మనం ఇప్పటికే ఇలాంటి సినిమాలు చూశాం కాబట్టి కొత్తగా ఏమీ అనిపించదు.

-త్రివేది