విజయవాడ

నివాళి .. గాన గంధర్వుడు... ఘంటసాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దినకరా.. శుభకరా.. అంటూ సూర్యభగవానుని గురించి పాడాలన్నా, వాతాపిగణపతింభజే.. అంటూ వినాయకుని పూజించాలన్నా, నమో వెంకటేశా.. నమో తిరుమలేశా.. అంటూ ఏడుకొండల వెంకన్నను ఎలుగెత్తి పిలవాలన్నా, హరహరహర శంభో.. అంటూ శివుడ్ని నోరారా కీర్తించాలన్నా, పాడవోయి భారతీయుడా.. అంటూ ప్రజల మదిలో దేశభక్తిని నింపాలన్నా, జానపద పాటలు, ఎంకి పాటలు వినాలన్నా, ఒక పుష్పవిలాపంతో మనస్సులోని బాధను బయటపెట్టాలన్నా, నీవేనా నను పిలిచినదీ.. నీవేనా నను తలచినదీ.. అంటూ ప్రియురాలి గుండెల్లో ప్రేమమాటల ఈటెలను దింపాలన్నా, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం.. అంటూ జీవితంలోని నగ్నసత్యాన్ని తెలుసుకోవాలన్నా, బావా.. ఎప్పుడు వచ్చితివి.. అంటూ ప్రేమగా పలకరించే కమ్మని సొగసైన పద్యం వినాలన్నా, లేచించి.. నిద్రలేచించి మహిళాలోకం.. అంటూ స్ర్తి సమాజాన్ని ఉత్తేజపరచాలన్నా, మనకు వినిపించే ఒకే ఒక స్వరం.. అది ఘంటసాల వెంకటేశ్వరరావు యుగళం.
1922 డిసెంబరు 4న సూర్యనారాయణ, రత్నమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో జన్మించారు ఘంటసాల. తండ్రి కోరిక మేరకు విజయనగరం సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకోటానికి చేరారు. 1944లో సావిత్రి గారితో వివాహం జరిగింది. ఈయనకు మొత్తం 8 మంది సంతానం. నలుగురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు.
1942లో స్వర్గసీమ సినిమాలోని ‘ఒహో నారాజ’ పాట ద్వారా ఘంటసాల తన గళాన్ని తెలుగు చిత్రసీమలో ప్రారంభించారు. ఇదే 1942లో ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొని తన దేశభక్తిని చాటారు స్వర్గీయ ఘంటసాల. ఒకనాటి అగ్రశ్రేణి నటులు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ వంటి ప్రముఖ నటులకే కాక చలం, గుమ్మడి, ఎస్పీ రంగారావు వంటి గొప్ప నటులకు తన గానామృతంతో అద్భుతమైన పాటలు అందించారు ఘంటసాల. స్వర వైవిధ్యం కోసం అప్పట్లో ఘంటసాల పడిన శ్రమ అంతాఇంతా కాదు. అక్కినేనికి ఒకలా, ఎన్టీఆర్‌కు మరోలా పాటలు పాడి సినీ అభిమానులందరినీ మెప్పించారాయన. ఘంటసాలకు పాడటం అంటే మహా ఇష్టం. దాన్ని ఒక వ్యసనంగా మార్చుకున్నారు. మంచి పాటలు పాడటం కోసం ఘంటసాల కఠోర తపస్సు చేసేవారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు. ఘంటసాల పాటలు పాడటంలో తీసుకున్న శ్రద్ధను నేటి యువ గాయనీ, గాయకులు ఆదర్శంగా తీసుకుంటే తెలుగులో మంచి పాటలు వస్తాయి. ఆ పాటలు చిరస్మరణీయంగా నిలుస్తాయనటంలో సందేహం లేదు. అందుకు ఉదాహరణ జగదేకవీరుని కథలో శివశంకరి పాట. ఈ పాటను 14రోజులు రిహార్సల్స్ వేసి పాట మొత్తాన్ని ఒకే టేకులో రికార్డింగ్ జరిపించిన ఘనుడు ఘంటసాల. అధునాతన రికార్డింగ్ సదుపాయాలు లేని ఆనాడే సంగీతప్రియుల హృదయాన్ని దోచిన మహా మాయగాడు ఘంటసాల వెంకటేశ్వరరావు. తెలుగు, తమిళ భాషల్లో ఆయన దాదాపు 13వేల పాటలు పాడారు. అంతేకాదు దాదాపు 100 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాలన్నీ చిరస్థాయిగా నిలిచిపోయినవే. ఉదాహరణకు షావుకారు, లవకుశ, గుండమ్మకథ, దేవదాసు వంటి చిత్రాలకేగాక మాయాబజార్ వంటి గొప్ప పౌరాణిక చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి చిరస్మరణీయంగా మిగిలిపోయారు ఘంటసాల. ఈయన గానానికి మెచ్చి తిరుమల - తిరుపతి దేవస్థానం వారు తమ ఆస్థాన సంగీత విద్వాంసునిగా గౌరవించారు. ఆయన తిరుమల - తిరుపతి దేవస్థానం తరపున అనేక వందల అన్నమాచార్య కీర్తనలను స్వామివారిపై పాడి భక్తిరసాన్ని ప్రపంచమంతా కురిపించారు. ఈ మహాగాయకునికి అతి ఇష్టమైన గాయకుడు ఎవరో తెలుసా? ప్రముఖ హిందుస్థానీ గాయకుడు బడే గులాం అలీఖాన్. ఘంటసాల గారితో ఎంతోమంది సినీ గాయనీ గాయకులు ఒక్కపాటైనా పాడటానికి పోటీపడేవారు. అలా అవకాశం దక్కించుకున్న వారిలో పి సుశీల, ఎస్ జానకి, భానుమతి, ఎస్పీ బాలసుబ్రమణ్యం, మాధవపెద్ది సత్యం వంటి గాయనీ గాయకులు ఉన్నారు. ఎన్నో స్వరాలను కూర్చిన, పాడిన ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రతిభకు భారత ప్రభుత్వం 1970లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1971లో యుఎస్‌ఎ ప్రభుత్వం శాంతి పతకాన్ని అందజేసింది.
అది 1974వ సంవత్సరం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవితంలో చివరి అంకం. ఈ చివరి మజిలీలో కొన్ని విశేషాలు జరిగాయి. వాటిలో ఒకటి తన అంత్య దశలో తెలుగు ప్రజలు మరచిపోలేని, ఎన్నిసార్లు విన్నా తనివితీరని అజరామయమైన ‘్భగవద్గీత’ను ఘంటసాల పాడారు. భగవద్గీత వింటుంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఘంటసాల రూపంలో వచ్చి మనకి (అర్జునుని) భగవద్గీత బోధిస్తున్నారా అన్నట్లు ఉంటుంది. మరో సంఘటన ఏమిటంటే గొంతుకు సంబంధించిన వ్యాధితో ఘంటసాల గారు మద్రాసులోని ఆసుపత్రిలో చేరగా ఆయన అభిమాన గాయకుడు బడే గులాం అలీఖాన్ అదే రకమైన వ్యాధితో అదే ఆసుపత్రిలో చేరటం. 1974 ఫిబ్రవరి 11న మద్రాసు ఆసుపత్రిలో గుండెపోటుతో ఘంటసాల తుదిశ్వాస విడిచారు.
తెలుగు మాటను, తెలుగు పాటను తనదైన స్వరంతో అలరించిన మహానుభావుడు ఘంటసాల. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా, తెలుగువారి పెదాలపై నాట్యం చేసేది ఘంటసాల పాటలే. స్వర్గంలో శారద, తుంబుర గానం మనం వినలేకపోవచ్చు. కానీ భువిపై గానగంధర్వుడి గానం వినే అదృష్టం మనకు మాత్రమే దక్కిందని సగర్వంగా చెప్పుకోవచ్చు. తెలుగువారు గర్వించదగిన, స్వచ్ఛమైన తెలుగు గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మాత్రమే. వారి పాటలు మన ఆస్తి. అలాంటి గానగంధర్వుడిని ప్రతిరోజూ ఏదో ఒక సందర్భంలో, ఎక్కడో ఒకచోట మనం తలుచుకొంటూనే ఉంటాం. కాని ఫిబ్రవరి 11న ఆ మహానుభావుడిని మనసారా తలుచుకొని ఆయన ఆత్మశాంతి కోసం శ్రద్ధాంజలి ఘటించవలసిన ఆవశ్యకత అందరిపై వుంది. మంచి సాహిత్యం, మంచి సంగీతం, పదికాలాలు నిలిచే పాటలు తీసుకురావటం ద్వారా ఆయనకు నిజమైన అంజలి ఘటించిన వారమవుతాం.

- విష్ణ్భుట్ల రామకృష్ణ,
విజయవాడ.
చరవాణి : 9440618122

చిన్న కథ

అమ్మ రాదు పెద్దమ్మా..

ఫంక్షన్‌లో అచ్చు భారతిలా వున్న అమ్మాయిని దగ్గరకి పిలిచాను. ‘పెద్దమ్మా!’.. అంటూ కౌగిలించుకుంది ఆ అమ్మాయి.
‘అయితే నువ్వు భారతి కూతురివే అన్నమాట. మీ అమ్మని చూసి ముప్ఫై ఏళ్లు దాటిపోయింది. కవల పిల్లల్లా ఒకరిని విడిచి ఒకళ్లం ఉండేవాళ్లం కాదు. ఇద్దరం ఎన్నో ఉత్తరాలు రాసుకునే వాళ్లం. మీ అమ్మ ఉత్తరమయితే అది వచ్చి ఎదురుగా నిలబడి మాట్లాడినట్లే వుండేది. అప్పటికి ఈ సెల్‌ఫోన్లు లేవు’ చెప్పాను. తమ్ముడి పెళ్లిలో కలుసుకున్నాం. నేను మేనత్త కొడుకునే చేసుకున్నా. భారతిని బావ బాగా ఆటపట్టించే వాడు. రూపంలో కూడా ఇద్దరం ఒకలానే ఉండేవాళ్లం. బంధువులు చాలామంది నన్ను భారతి అని, దాన్ని భవానీ అని పిలిచిన సందర్భాలున్నాయి.
ఎప్పుడో నిన్ను చూసి మీ అక్క అనుకుని.. అంటూ జోక్ చేశారు బావ. అది విన్న మీ నాన్న మీ అమ్మని తీసుకుని పెళ్లికి వుండకుండా వెళ్లిపోయాడు. ఆ తరువాత అమ్మా, నాన్న దాని దగ్గరకి ఢిల్లీ వెళ్లి వచ్చేవారు. అది ఇటువైపు రాలేదు. ఒక్కసారి మీ అమ్మని చూడాలని ఉందే. మీ ఇంటికి పిలిచి ఏదైనా పార్కులో దూరం నుంచి దానిని చూస్తానే’ చెప్పాను బరువైన హృదయంతో.
నన్ను కౌగిలించుకుని ఏడ్చింది పావని.
‘నీకెలా చెప్పను పెద్దమ్మా! కొనే్నళ్ల క్రితం నా ఇంటికి వచ్చారు. అమ్మా, నాన్న, మేమంతా దూరంగా వున్నాం. లుంబినీ పార్కుకు నా కొడుకుని తీసుకుని వెళ్లిన అమ్మ బాంబ్ బ్లాస్ట్‌లో మనవడిని ఎత్తుకుని అలానే పైలోకాలకి వెళ్లిపోయింది. పెదనాన్న వచ్చారు. అప్పటికే నీకు ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్పారు. దూరంగా వుండి మాటలు లేనందుకే వేదన పడుతున్నది, అసలు ఈ లోకంలోనే లేదని తెలిస్తే నువ్వు బతకవనీ, ఈ విషయం అందరికీ చెప్పవద్దని కట్టడి చేశారు. అమ్మమ్మ పోయినప్పుడు కూడా అమ్మని పంపలేదని, తనొక్కడే వచ్చాడని నాన్నని చాలా మాటలన్నావు. కాని అప్పటికే అమ్మ చనిపోయి రెండేళ్లు అయింది. తాతయ్య ఇప్పుడైనా నీకు అమ్మపోయిన సంగతి చెపుతానంటే.. మీ రెండో కూతుర్ని కూడా పోగొట్టుకుంటారా? తల్లిపోయిన దుఃఖంలో దానికి మళ్లీ ఎక్కడ హార్ట్‌ఎటాక్ వస్తుందోనని భయపడిపోతున్నానంటూ నిన్ను తీసుకుని వెళ్లిపోయారు పెదనాన్న’ వివరించింది పావని.
‘అమ్మ ఆరోగ్యం బాగోలేదు. కొన్నాళ్లాగి మనమే వెళ్లి అమ్మను చూద్దాం’ అన్నాను.
‘తప్పకుండా! నన్ను మీ అమ్మ దగ్గరకి తీసుకెళ్లు పెద్దమ్మా!’ అని మాట తీసుకుంది.

- చావరి సూర్యం,
ఆర్.ఐ, విజయవాడ.

మనోగీతికలు

అమ్మే అందమైన
బడి అయితే ..
క్రయ విక్రయాల మదుపర్ల జాగాలో
విద్య అనే రెండక్షరాల సంద్రంలో
ఈత నేర్పకుండానే వేటగాళ్ల రక్కసి గాలంలో
గిలగిలలాడి రాలిపడిన మట్టగిడిశను నేను
కార్పొరేట్ చదువుల సంతలో
ఎదురు విలువ చెల్లించి
కొత్త బానిసత్వ సంకెళ్ల చెరలో
ఎర్రబారిన తెల్లగులాబీని నేను
ప్రభుత్వ పాతవాసంలో
కొత్తగా తెచ్చిన ప్రైవేటీకరణ,
నవకల్పన, సాంకేతికతల
కంప్యూటర్ కిటుకల కటకటాల
ఇరుకు సందుల ఇనుప యంత్రాల మధ్య చిక్కి
చిందిన మానవ సింధూర కపాలం నేను
నయా బడి అంగడిలో
దిష్టి తీసేసిన మృత కొబ్బరిచిప్పను నేను
ఎడ్యుకేషన్ ఇనె్వస్టర్ల సింహద్వారాలకు
అందంగా అలంకరించిన
ఎర్రతోరణాల లేడిపిల్లను నేను
‘విత్త చైతన్య’ ఉద్యమ రాతి పాదాల కింద
నలిగి పగిలిపోయిన ‘్ఫతిమా జాఫ్రి’ని నేను
నిర‘లక్ష’ నోట్ల కట్టల ప్రవాహంలో
కొట్టుకొచ్చిన నెత్తురు మడుగును నేను
ఎంత వగచి వగచి ఏడ్చినా
రాలేని వాడిపోయిన కుల్గుకుల జ్ఞాపకాల
ఊహా జగత్తుని నేను
అమ్మే అందమైన బడి అయితే
నాకు ఈ అకాల మృత్యు
గీతాలాపనలెందుకు?

- దొడ్డా ఇమ్మానియేలు
కంచికచర్ల, కృష్ణా జిల్లా.
చరవాణి : 9866483795

మూడు కోతులు
మూడు కోతులు ఓ కొబ్బరి చెట్టు మీద
దీర్ఘంగా చర్చిస్తున్నాయి ఓ విషయం మీద
ఓ ముసలి కోతి అంది గంభీరంగా
‘విన్నారా! ఈ విడ్డూరం వివరంగా
మనిషి పుట్టాడంట
గొప్పదైన మన జాతిలోన’
‘్ఛ...్ఛ... ఈ రాక్షసుడా?
మన జాతికి వారసుడు
నమ్మరాదు నమ్మరాదు
ముమ్మాటికీ నిజంగా’ అంది
నడి వయసు మర్కటం కర్కశంగా
‘ఏ కోతైనా ఏనాడైనా
కట్టుకున్న పెళ్లాన్ని కాల్చిందా!
ప్రేమించిన ప్రియురాల్ని
పీక కోసి చంపిందా?
మన జాతిలో నిర్దయగా
ఏ తల్లైనా తన పిల్లను
చెత్తకుండీలో వేసిందా?
ఏ చెట్టుకు? ఏ పుట్టకు?
ఏ కాయకు? ఏ పండుకు?
యజమానిని నేనంటూ
ఇనుప కంచె నాటిందా!
కత్తులు కటారులు చేతబూని
తుపాకులు చెవాకులు పేలుస్తూ
తన జాతిని తానే మింగిందా?
ఈ రాక్షసుడు
దెయ్యాలకూ బయ్యాలకు వారసుడు
కాదు కానేరడు మన జాతికి వారసుడు’
ఆవేశంగా ఆక్రోశించింది
నవయవ్వనపు మూడో కోతి!

- మండవ సుబ్బారావు, కొత్తగూడెం. ఖమ్మం జిల్లా.

ఫీనిక్స్
ఆలోచనల సుడిగుండాలు
అంతరంగంలో ‘క్యుములోనింబస్’
ఎద ఓ కడలి.. అంతర్భాగంలో ‘వల్కనో’
ప్రతిరోజూ ఫీనిక్స్ పక్షే.. పునరుజ్జీవనం
ఏవో స్మృతులు.. గాయాలు, సెల్ఫ్ హీలింగ్
నా మది గదిలో తిష్టవేసిన మగువ
మోనాలిసాలా గుండె గనులను ఆక్యుపై చేసింది
మల్టీ డైమన్షనల్ థింకింగ్స్‌ని ప్రవోక్ చేస్తూ...
నా ఎదను అల్లుకుపోయి దహిస్తూనే ఉంది
అర్ధాంగి ఆసరాతో
‘్ఫరానా’ల్లా ముసురుకున్న ఆలోచనల దొంతరలు
అలాఅలా తొలగిపోతున్నాయి
‘పొంతన’ కుదరని తక్కెడ కాటా నా ‘చింతన’
నిరంతర దహనంలో ఎప్పటికప్పుడు ‘్ఫనిక్స్’!

- ముక్కా సత్యనారాయణ, టీచర్
పెనుగంచిప్రోలు, కృష్ణా జిల్లా.
చరవాణి : 9441120047

పుస్తక పరిచయం

నూతన సమాజ సృష్టికి దిశానిర్దేశం.. ‘వత్తావా మా వూరికి’ కవిత్వం!

కవిత్వానికి కనువిప్పు కలిగించే శక్తి మెండు. ఇదే గుండె లోతుల్లోని అలజడి నుండి ఉద్భవించిన కవిత్వమైతే కాలుతున్న దివిటిలా వెలుగుతూ ఉంటుంది. చీకటి శక్తులపై వెలుగు కొరడాయై విజృంభిస్తుంది. సమసమాజ స్థాపనకు పరవళ్లు తొక్కుతుంది. ఇవన్నీ పుష్కలంగా తన కలంలో నింపుకున్నాడు ఐనాల సైదులు. అందుకే ‘చేయిచేయి కలిపి కదం తొక్కుదాం రండంటూ’.. జాతిని మేల్కొలిపే పదునైన, పటిష్టమైన, సాంద్రత కలిగిన కవిత్వం రాయగలిగాడు.
హృదయంలో ప్రకంపనలు చెలరేగినప్పుడల్లా.. మదినిండా మానసిక సంఘర్షణ పోటెత్తినప్పుడల్లా.. బాకుల్లాంటి కవితలను అక్షరాలతో అందంగా చెక్కాడు. ఇలాంటి 44 కవితలతో ‘వత్తావా మా వూరికి’ కవితా సంపుటిని వెలువరించాడు. ప్రతి కవితా విలక్షణమైనదే. ఈ పుస్తకానికి ముఖచిత్రం అత్యద్భుతంగా వుంది. ఒక్కో కవితకు వాడిన శీర్షిక వినూత్నంగా వుంది. కవిత్వంలోని కొత్తదనం పఠితలను ఆకట్టుకోవడమే గాక, ఆలోచనా సముద్రంలో ముంచేస్తుంది. ఈ పుస్తకం చదువుతుంటే దగాపడ్డ జీవితాల బతుకు చిత్రాలు, అంటరానివాళ్ల ఆకలిదప్పులు, అణచివేతకు గురైనవారి కన్నీళ్లు కళ్లెదుట మెదుల్తాయి. గుండెను తడి చేస్తాయి. అంత బాగా రాశాడు ఐనాల.
ఈ పుస్తకంలో తొలి కవిత ‘అంటరాని స్వప్నాలు’లో భావ వ్యక్తీకరణ బలంగా వుంది.
‘నేనొక
సమూహాన్ని
శక్తిని
తరతరాల
వారసత్వపు సొత్తునేమో? అంటూనే
ఏమో
ఏదైనా
ఏమైనా కావచ్చు
నేనెప్పుడూ తలెత్తే ఉంటాను’.. అని పోరాట స్ఫూర్తిని రగిలించారు.
మరో కవిత ‘గ్లోబలీకరణలో..’
‘తడిమినా దొరకని
మట్టివాసన కోసం
ఓ పువ్వై
పరిమళిద్దాం’ అనటం చాలాచాలా బాగుంది.
ప్రేమానురాగాలు పాతరేసిన రోజులివి. నేటి సంబంధాలన్నీ ఆర్థిక అనుబంధాలేనని చెప్తూ ‘తడారని అమ్మ మనస్సు’ కవితలో అమ్మ అంతరంగ ఆవేదనను అద్భుతమైన వర్ణనతో ముగించారు.
‘నాటి సజీవ సంబంధాల్ని
ఎండిన నాలుకపై చప్పరిస్తూ...
జ్ఞాపకాల పద్మవ్యూహంలో
చిక్కుకున్న దృశ్యాల్ని
ఏరుకుంటోంది’.. అన్నాడు.
ఈ సంపుటిలో మరో గొప్ప కవిత ‘నాయన నాల్గు బొక్కలు’ నాన్నలోని అనురాగాన్ని, ఆప్యాయతను జ్ఞప్తికి తెచ్చుకుంటూనే నాన్న అమాయకత్వానికి అంతర్లీనంగా కుమిలిపోవటం కన్పిస్తుంది.
‘పనులన్నీ చక్కబెట్టి
పాలు పితికిన నాయనకి
మాదిగోనికి చల్లబోస్తే
దూడలు చస్తాయని
మాడిసిన కారం వేసినప్పుడు
గా మర్మమేంటో తెల్సుకోలేని
అమాయకుడు
మా ‘నాయన’.. అనే పంక్తులు పాఠకుల కళ్లు చెమర్చేలా చేస్తాయి.
‘గాయపడ్డ నినాదం’ అనేక ప్రశ్నల సంధించిన కవిత.
‘నాగేటి సాల్లలోని విత్తుల్ని
ఉరితీస్తే ఊరుకుంటాయా?
మహావృక్షాలై తన్నుకురావూ’.. అంటూ పీడితుల పక్షాన తన గొంతెఒత్తి..
‘నీవు కూల్చాలని చూసినప్పుడల్లా
మేం లేవాలని నేర్చుకుంటున్నాం
నీవు నిలువరించినంత మాత్రాన
అంతటితో ఆగిపోతుందా?
అదక్కడే నిలిచిపోతుందా?
ప్రపంచాన్ని కలియచుట్టి
మెరుపై
చినుకై
ఉరుమై
ఉరిమిందిక్కడ!
ఇప్పుడేమంటావ్?’.. అంటూ సవాల్ విసిరాడు ఐనాల సైదులు.
ఈ సంపుటిలో వస్తువైవిధ్యం వుంది. మిగతా కవితలన్నీ కూడా రసాస్వాదన కలిగించేవే. ఈ కవితల్లో వ్యంగ్యం, చమత్కారం తళుక్కున మెరిశాయి. తెలంగాణ ముఖచిత్రం ఆవిష్కరించిన కవితలు పాఠకుని మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. మంచి భావంతో ప్రతి వస్తువును కవిత్వీకరించడంలో ఐనాల సఫలీకృతుడయ్యాడు.
గ్లోబలైజేషన్ పట్ల పూర్తిస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ.. అంటరానితనం, అస్పృశ్యతలను రూపుమాపాలనే కాంక్షను వ్యక్తపరిచాడు. తన కవిత్వం ద్వారా అరాచకవాదుల పాలిట నినాదమై.. ‘వత్తావా మా వూరికి’ కవితా సంపుటి ద్వారా నూతన సమాజ సృష్టికి దిశా, నిర్దేశం చేసే ప్రయత్నం చేసిన క్రాంతదర్శి ఐనాల సైదులుకు శుభాభినందనలు.

- రాచమళ్ల ఉపేందర్, ఖమ్మం.
చరవాణి : 9849277968

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007.
vijmerupu@gmail.com

- విష్ణ్భుట్ల రామకృష్ణ