విజయవాడ

గురువుల జ్ఞాపకాల్లోకి.. పులి వనె్న మేకలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను చిన్నప్పుడు అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో ఐదో తరగతి చదివేటప్పుడు ఒక మాస్టారు ఉండేవారు. ఆయన పేరు కాంతారావు. ఆ స్కూల్ హెడ్‌మాస్టర్. ఆయన ఎప్పుడూ గంభీరంగా ఉండేవారు. స్కూల్‌లో ఉన్నప్పుడు అసలు నవ్వేవారు కాదు. ఆయన్ని చూడగానే పిల్లలంతా హడలిపోయి ఆటలు ఆపేసి, పరుగెత్తుకుంటూ వచ్చి పుస్తకాల ముందు కూర్చునేవారు. ‘నాకు మీరంతా చదువుకుంటూనో, రాసుకుంటూనో కనబడాలి. ఖాళీగా కనబడ్డారంటే చీరేస్తాను’ అనేవాడు. ఎప్పుడు చూసినా చీరేస్తాను, చంపేస్తాను అనడమే కానీ ఏనాడూ పిల్లల మీద చెయ్యి చేసుకోలేదు.
నేను ప్రతిరోజూ ‘దేవుడా! మా హెడ్‌మాస్టారు చేతికి తేలుకుట్టేటట్లు చెయ్యి. ఆయన బడికి రాకపోతే ఎంచక్కా ఆడుకోవచ్చు’ అని కోరుకునేవాడిని. కానీ దేవుడు ఒక్కరోజు కూడా నా మొర ఆలకించలేదు. ఆయన ఎంతో ఆరోగ్యంతో బడి తొమ్మిది గంటలకి అయితే అరగంట ముందే వచ్చి కుర్చునేవాడు. ఆయన ఇంటి ముందు పెద్ద ఆటస్థలం ఉండేది. ఆయనకి ఇద్దరు కొడుకులు. వాళ్లతో కలిసి సాయంత్రం పూట ఆడుకునేవాళ్లం. ఏదో పని మీద ఆయన అటురాగానే భయంతో బిగుసుకుపోయి చేతులు కట్టుకుని నిలబడిపోయేవాడిని. మాస్టారు నవ్వి ‘ఇది బడి కాదు, ఇల్లు. ఆడుకో! పైగా ఇది ఆడుకునే సమయం. ఆడుకునే సమయంలో ఆడుకోవాలి, చదువుకునే సమయంలో చదువుకోవాలి’ అనేవారు. దాంతో ధైర్యం వచ్చేది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ‘మాస్టారు కొట్టరు’ అని అనుకునేవాడిని.
ఒక్కోసారి ఆడుకోటానికి వచ్చిన పిల్లలతో సరదాగా పిచ్చాపాటీ మాట్లాడుతూ ఉండేవారు. ‘ఏరా! ఈరోజు మీ ఇంట్లో ఏం కూర?’ అని ఒక పిల్లాడిని అడిగారు. ‘ఈరోజు మా నాన్నకి జ్వరం. పనిలోకి వెళ్లలేదు. అన్నంలోకి నీళ్లు పోసుకుని తిన్నాను’ అన్నాడు ఆ పిల్లాడు. ‘నీళ్లు పోసుకుని తినటం ఏమిట్రా!’ అంటే ‘నీళ్లతో కూడా తినొచ్చండీ! భలే బాగుంటుంది’ అన్నాడు ఆ పిల్లాడు అమాయకంగా. మాస్టారు ఒక్కక్షణం జాలిగా చూసి భార్యను పిలిచి ఆ పిల్లవాడికి భోజనం పెట్టమని చెప్పారు.
తన పిల్లల కోసమని చందమామ కథల పుస్తకం ప్రతినెలా తెప్పించేవారు. నేను కూడా వాళ్లతోపాటు చదువుతుండేవాడిని. నేను స్పీడ్‌గా చదువుతుంటే ‘అలా కాదు, ఇలా చదవాలి’ అని నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని ప్రతి పదం స్పష్టంగా, అర్థమయ్యేటట్లు కామాలు, ఫుల్‌స్టాప్‌లు పాటిస్తూ చదివి చూపించేవారు.
అలానే హైస్కూల్‌లో చదివేటప్పుడు ఇంగ్లీష్ మాస్టారు పానకాచార్యులు అనే ఆయన ఉండేవారు. మేం పిల్లలం ఇంగ్లీష్ చదవటానికి భయపడుతుంటే ‘ఇంగ్లీష్ చాలా ఈజీ. తిప్పితిప్పి కొడితే మొత్తం ఇరవై ఆరు అక్షరాలే! తెలుగులో అయితే యాభై ఆరు అక్షరాలు. వాటికి గుణింతాలు, వత్తులు, అబ్బో! చాలా కష్టం. మరి తెలుగు నేర్చుకున్నప్పుడు ఇంగ్లీష్ మాత్రం ఎందుకు నేర్చుకోలేవు?’ అనేవారు. అయిపోయిన పాఠంలో వారంవారం పరీక్ష పెట్టేవారు.
అర్థం కాకపోతే రెండోసారి, మూడోసారి అడగండి. పదిసార్లు అయినా చెబుతాను. కాపీ మాత్రం కొట్టవద్దు’ అని చెప్పేవారు. ఒకసారి ఒక విద్యార్థి కాపీకొడుతూ పట్టుబడిపోయాడు. అతడిని నిలబెట్టి చడామడా చివాట్లు పెట్టారు. పట్టుబడ్డాననే ఉక్రోషం ఒకవైపు, నలుగురిలో అవమానం ఒకవైపు.. అతని కళ్ల వెంట బొటబొటా నీళ్లు వచ్చేశాయి. అప్పుడు ‘నీ బాగు కోసమేరా నేను చెప్పేది. నీ మీద నాకు ద్వేషం ఎందుకుంటుంది? నువ్వు నాకేమీ అపకారం చేయలేదే!’ అన్నారు.
తప్పు చేస్తే కన్నకొడుకునైనా కఠినంగా శిక్షించేవారు. ఒకసారి వాళ్ల అబ్బాయి పెన్ తీసుకురావటం మర్చిపోయి, తండ్రి పెన్ అడిగాడు. చెళ్లున చెంపకు పెట్టి కొట్టి ‘నీకు పెన్నులు, పుస్తకాలు అన్ని కొని ఇచ్చానా! వచ్చేటప్పుడు ఎందుకు తెచ్చుకోలేదు? ఈ పీరియడ్ అంతా నిలబడు’ అని బయట ఎండలో నిలబెట్టారు. సాధారణంగా మేం పిల్లలం ఆయన ఉగ్రరూపం చూడటానికి ఇష్టపడే వాళ్లం కాదు. అంతవరకు రాకుండా క్రమశిక్షణగా ఉండేవాళ్లం.
పైకి మంచిగా కనబడుతూ, మన వెనక గోతులు తీసేవాళ్లని ‘మేక వనె్న పులులు’ అంటాం. కానీ ఈ ఉపాధ్యాయులు మాత్రం అందుకు వ్యతిరేకం. పైకి నిర్దయగా, కఠినంగా కనిపించినా మనసు మాత్రం వెన్న లాంటిది. ఆ కఠినత్వం వెనక విద్యార్థుల క్షేమమే కనిపిస్తుంది. వీరిని ‘పులి వనె్న మేకలు’ అంటే బాగుంటుందేమో! వాళ్ల మాటలు అప్పట్లో నాకు అర్థంకాలేదు గానీ, ఇప్పుడు ఆలోచిస్తే నిజమైన గురువులు అంటే వీరేనేమో అనిపిస్తుంది. ఈనాటి నా చదువు, ఉద్యోగం వారు పెట్టిన భిక్షే కదా! అనుకుంటాను. ఇప్పుడు ఆ ఉపాధ్యాయులు ఎక్కడ ఉన్నారో తెలియదు. కానీ నా మనసులో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారు.

- గోనుగుంట మురళీకృష్ణ,
రేపల్లె, గుంటూరు జిల్లా.
చరవాణి : 9701260448

చిన్నకథ

తోడు దొరికిందిరా..
‘మీ దొడ్లో ఒక గది ఖాళీగా వుందని తెలిసింది. పెద్దగా అద్దె ఇచ్చుకోలేను. ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయలు ఇస్తాను. నా కొడుకు జీతం తక్కువ. వాడికిద్దరు పిల్లలు. భార్యా పిల్లలను చూసుకుంటూ ఇంటి అద్దె కట్టేసరికి వాడికి భారమైపోతోంది. అందుకే బయటకి వచ్చేశాను. ఇద్దరు తమ్ముళ్లు రెండు వేలు పంపుతారు. స్టోరులో బియ్యం తీసుకుని ఎలాగో కాలం గడపాలని ఇలా బయటకి వచ్చేశాను’ మూడు ముక్కల్లో తన కథ చెప్పింది తులసమ్మ.
‘తల్లిని చూసుకోవలసిన బాధ్యత నీ కొడుక్కి వుంది. పోలీసులకు చెపితే నీకు అతను కూడా ఎంతోకొంత సర్దుబాటు చేయవచ్చు’ అంది భ్రమరాంబ.
ఆందోళనగా చూసింది తులసమ్మ. ‘నన్ను చూడనని వాడు అనలేదు. వాడి ఆర్థిక స్థితి బాగుండనందున నేనే బయటకి వచ్చేశాను. వాడు చాలా మంచివాడు’ చెప్పిందామె.
‘అంటే అసమర్థుడు. తల్లిగా ఇంట్లోంచి బయటికి వచ్చేసినా నీ తల్లి ప్రేమ వాడిని కాపాడుతోంది. లేకుంటే ఈపాటికి పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ చేసేదాన్ని. నాకూ ఒక కొడుకు ఉన్నాడు. పెద్ద చదువు చదివించి వాడిని నేనే దూరం చేసుకున్నాను. వాడికి అమెరికా నచ్చింది. అక్కడే నచ్చిన పిల్లను వివాహం చేసుకున్నాడు. తండ్రిపోతే వచ్చి కార్యక్రమాలన్నీ శ్రద్ధగా చేసి బంధువులందరి ప్రసంశలు పొందాడు. నన్ను అమెరికా రమ్మని పిలవలేదు. నీకు నచ్చినవారిని దగ్గరుంచుకోమని సలహా ఇచ్చాడు. బంధువులు నా ఇంటి కోసం నా మీద ప్రేమని పోటీపడి చూపించారు. అందరినీ పంపించేశాను. ప్రశాంతంగా వుంది. ఆయన పెన్షన్ పదిహేను వేలు వస్తుంది. మనిద్దరికీ అది చాలు. నీ డబ్బు నాకవసరం లేదు. నాతోపాటు వుంటూ ఇల్లు నీట్‌గా వుంచడం, వంట రుచిగా చేయడం, వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసి ఉతికి మడతలు పెట్టే వరకు పనులు చూసుకోవాలి. సాయంత్రం గుడికి ప్రతిరోజూ నాకు తోడుగా రావాలి. నా కొడుకు కూడా చాలా మంచివాడు. కానీ నా దగ్గర లేడు. మనిద్దరం ఒకరికొకరు తోడుగా వుందాం’ ఆహ్వానించింది భ్రమరాంబ.
ఆనందంతో ఆమె కాళ్లమీద పడిపోయింది తులసమ్మ. ఆ రాత్రి కొడుక్కి ఫోన్ చేసింది భ్రమరాంబ. ‘నాకు మంచి తోడు దొరికిందిరా. నే పోయాక వచ్చి నీవు చేయవలసినవి చేసి వెళ్లు చాలు’ ఆమె గద్గద స్వరం వణికింది.
- వేమూరి సీతారామలక్ష్మి, విజయవాడ.

వేదిక

మేలో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం
ఆవిర్భావ దినోత్సవ సభ
సాహిత్య సభలు .. కవి సమ్మేళనాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల కవులు, రచయితలను అనుసంధానం చేస్తూ, వారి సమస్యల్ని సంఘం పరిధిలో పరిష్కరించేందుకు కృషి చేయాలనే సంకల్పంతో రూపుదిద్దుకున్న ‘రచయితల సంఘం - ఆంధ్రప్రదేశ్’ ఆవిర్భావ సభ, వేడుకలు మే 13, 14 తేదీల్లో విజయవాడలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, 13 జిల్లాలకు చెందిన ప్రఖ్యాత కవులు పాల్గొని సందేశాలిస్తారు. ఈ వేడుకల్లో రచయితల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొంటారు. కొత్త పుస్తకాల ఆవిష్కరణలు ఉంటాయి. ఈసందర్భంగా ప్రత్యేక శతాధిక కవి సమ్మేళనం జరగనుంది. ఈ కవి సమ్మేళనంలో పాల్గొనే కవులకు అల్పాహార, భోజన ఏర్పాట్లు చేస్తారు. జ్ఞాపిక, దుశ్శాలువా, ప్రశంసాపత్రంతో కవులను సత్కరిస్తారు. ఆసక్తి కలిగిన కవులు, రచయితలు ఏప్రిల్ 20లోగా ఫోన్ ద్వారా గాని, పోస్టుకార్డు ద్వారా గానీ పేర్లు నమోదు చేసుకోవాలి. ఫోన్ ద్వారా అయితే 9247475975, 9246415150 నెంబర్లలో నమోదు చేసుకోవచ్చు. పోస్టు ద్వారా నమోదు చేసుకునేవారు ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం, పోస్ట్ బాక్స్ నెం. 5, 11-57/1-32, సెకండ్ ఫ్లోర్, జెఆర్ కాంప్లెక్స్, రజక వీధి, విజయవాడ-2’ చిరునామాకు కార్డు రాయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, కోశాధికారి కలిమిశ్రీ ఒక ప్రకటనలో సూచించారు.

పుస్తక పరిచయం

శ్రీ గాయత్రీ మంత్రాక్షర వివరణము

బ్రహ్మ విద్యలలో ఉన్నతమైనది గాయత్రీ విద్య. అన్ని మంత్రములకు మూలమంత్రం గాయత్రీ మంత్రం. అందుకే గాయత్రిని మించిన మహామంత్రం, తల్లిని మించిన దైవం లేరు. గాయత్రీ మంత్రం ప్రతి నిత్యం జపించటం వల్ల సాధకునికి సేవాభావం, వివేకం, ఆత్మజ్ఞానం కలుగుతాయని చెప్పటంలో సందేహం లేదు. గాయత్రీమాత త్రిశక్తి రూపిణి. అందువల్లనే మూడు సంధ్యలలో గాయత్రీ మాతను పూజించమంటారు. గాయత్రీ, సరస్వతి, సావిత్రి రూపాల్లో దర్శనమిస్తుంది. అంతటి మహిమాన్వితమైన గాయత్రీ మంత్ర పఠనం వల్ల బుద్ధి వికసించటమే కాకుండా చదువుల్లో, పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఉపనయనం చేస్తారు. దీంతో గాయత్రీ మంత్రాన్ని జపించటం వల్ల జ్ఞాననేత్రం వికసిస్తుందని, దానితో సాధకుడు గొప్ప జ్ఞానం పొందుతాడని విశ్వాసం.
శ్రీమతి బలభద్రపాత్రుని భానుమతి కేశవరావు కలం నుండి కాక మనోనేత్రం నుండి ప్రవహించిన అక్షరమాల ‘శ్రీ గాయత్రీ మంత్రాక్షర వివరణము’. ఇందులో గాయత్రీ మాతకు సంబంధించిన అనేక విషయాలను పాఠకులకు అర్థమయ్యేలా సులభతరమైన భాషలో రచించారు రచయిత్రి. గాయత్రీ మంత్ర మహిమ, అసలు గాయత్రీ మంత్రం అంటే ఏమిటి? గాయత్రీ మంత్రం ఎందుకు సాధన చేయాలి? గాయత్రీ మంత్ర సాధన వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? గాయత్రీదేవి అంటే ఎవరు? వంటి విషయాలనేకాక బ్రాహ్మణులు నిత్యం చేసే సంధ్యావందనం అంటే ఏమిటి? అనే అంశాలను ఆమె సోదాహరణంగా వివరించారు. గాయత్రీ మంత్రంలోని యోగ రహస్యాలు, బ్రహ్మరంధ్రము అంటే ఏమిటి? ఇష్టకార్య సిద్ధికి గాయత్రీ మంత్రం.. వంటి అనేక ఆసక్తికరమైన అంశాలను తీసుకొని వాటిని సోదాహరణంగా వివరించారు రచయిత్రి. ఇవికాక త్రికాల సంధ్యావందనం, యజ్ఞోపవీత ధారణ, యజ్ఞోపవీత ధారణ వివరణము, శ్రీ గాయత్రీ శతనామ స్తోత్రమ్, గాయత్రీ కవచం వంటివి ఇందులో విపులంగా, పాఠకులకు చక్కగా అర్థమయ్యేలా వివరించారు రచయిత్రి. ఏదిఏమైనా గాయత్రీ మాతకు సంబంధించి మనకు తెలియని అనేక విషయాలను ఇందులో పొందుపర్చటం వల్ల ఈ పుస్తకం భక్తులకు, శాస్త్రం గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఉపయుక్తం. భక్తికి సంబంధించి మరెన్నో గ్రంథాలు రచయిత్రి కలం నుండి రావాలని ఆశిద్దాం.

గాయత్రీ మంత్రాక్షర వివరణము
వెల: రూ.155/-
రచయిత్రి:
శ్రీమతి బలభద్రపాత్రుని
భానుమతి కేశవరావు,
తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9494593472,
8297508710

- విష్ణ్భుట్ల రామకృష్ణ,
విజయవాడ.
చరవాణి : 9440618122

తిరోగమనం నుండి...
అంతరిక్షంలో ఆవాసం కోసం
మానవుడు ఆరాటపడ్తున్న వర్తమానంలో
సాంకేతిక శాస్త్ర పురోగతి ముందు
శకునాల శకలాలేమిటి?
మూఢనమ్మకాలతో మనుగడను
మధ్యలోనే మాపుకోవటమేమిటి?
డబ్బు దాహార్తిలా ఖర్చుపెట్టటమేమిటి?
బలులతో బలైపోతున్న జీవులెన్నో!
మూఢ భక్తి, మూఢాచారాల్లో
మునుగుతున్నదెందరో!
సమాజం రీతిని, నీతిని విప్పిచెప్పి
మూఢాన్ని విభేదించిన వేమన
చెప్పిందేమిటి, మనం చేసేదేమిటి?
నిర్వాకమంతా అజ్ఞానంతోనేగా
అనాది నుంచీ కొనసాగుతున్న
ఆచారాల్లో, వ్ఢ్యౌం నూటికి నూరు
యంత్రస్థాపన చేస్తే
దశ తిరుగుతుందా?
ధనం, కాలం హరించటం
తదనంతరం పశ్చాత్తాపం తప్ప
చేకూరేదేమిటి?
మానసికంగా బలహీనుల్ని చేసి
తాయెత్తులు, తంత్రాలు వేసి
జనావళిని మోసం చేయటం మినహా
జరిగేది శూన్యం
మానవతా దృష్టి సారిస్తే
కొందరి ఇక్కట్లైనా గట్టెక్కుతాయిగా
శ్రమయేవ జయతే సూక్తిని
పాటించాలిగాని
మంత్రోచ్ఛారణ,
జలాభిషేకంతో జరిగేదేమిటి?
జ్ఞానకిరణాలతో
అజ్ఞాన తమస్సును ఛేదించి
వాస్తవాన్ని వెదికి పట్టుకునేందుకే
ప్రయత్నించాలి
ఎవరైనా!

- అచ్చుల,
సంతగుడిపాడు, గుంటూరు జిల్లా.
చరవాణి : 9704889494

మనోగీతికలు ..

జన్మకు రెండోతల్లి
చిగురించిన ఆశల పూలతోరణం
చారిత్రక ఆనవాళ్ల శిలాఫలకం
అరిస్టాటిల్ చెప్పిన మనిషిగా
ఈ జన్మకు రెండోతల్లి
నాకంటే ముందే పుట్టి
నాతో కలిసి పెరిగిన సహోదరి
ఎన్నో ఊసులు భాషలు చెప్పి
బాధలో కన్నీరై.., అంతలోనే ఓదార్పై
ఆనందంలో అశ్రుకణమై
చిరునవ్వును పంచుకుని
విశాల బాహువులు పరిచి
తన అమృత పరిష్వంగంలో
సేదతీర్చిన నెచ్చెలి!

నిరాశ నిస్పృహదారుల్లో భీతిల్లిన క్షణాన
వెన్నుతట్టి కరదీపికై వెలుగుతోవల వరకు
తోడువచ్చిన స్నేహమయ
నా సమస్త అనుభూతులకు,
అనుభవాలకు
అక్షర సాక్ష్యం
తలలో నల్లటి జిఎన్‌టి 5వ పాపిడిదారి
మెడలో తూరుపులాకు పరిచిన
గుర్రపుడెక్కల పచ్చల తోరణం
సిగలో పడమటిలాకు తురిమిన
తూటిపూల సింగారం!
శరీరం మధ్యగా బాధలోను, ఆనందంలోనూ
మేము అనుభూతులు కలబోసుకున్న
ఆనవాలుగా.. కృష్ణ కాలువ కన్నీటి ప్రవాహం
దేవుళ్లను సైతం అబ్బురపరిచే
అగరు పొగల సోయగం
జాతిని కొంచెమైనా సేదతీర్చాలన్న
చిరు ప్రయత్నంగా నేత కంబళ్ల నైపుణ్యం
ఎన్నని చెప్పను నాగురించీ..,
కాదు నా మనసు గురించి,
కాదుకాదు., నా తనువు గురించి,
అదీకాదు.. నాదైన నా ఊరి
అణువణువు గురించీ..!

బంగార్రాజు కంఠ,
విజయవాడ.
చరవాణి : 8500350464

ఆశ
అడియాసల అంపశయ్యపై
అనురాగపు ఉత్తరాయణం కోసం
నిరీక్షిస్తూ - కనుమూసిన నిశీథిలో
నీవు వెలుగై విస్తరిస్తూ
ఆత్మీయ స్పర్శాలేపనాలద్దుతూ
ఒక్కొక్క ముల్లునీ ఒడుపుగా తీస్తూ
సంతోషాల పూశయ్యపై పవళింపజేస్తూ
తీయని పలుకుల వీవనవై వీస్తూ
గాయాలను గేయాలుగా చేసి
బతుకు విపంచిని శ్రుతి చేసి
హత్తుకున్న నీవు - నేననుకున్నట్టు
‘కల’వూ కాదు! ‘భ్రమ’వూ కావు!
కాలం కాగితంపై అనుభూతి కవనాలు
రచించిన నీవు - భ్రమకాదని తెలిశాక
నీవనే ఊహారేఖకు సమాంతర రేఖనయ్యా!
అన్వయం కుదరని తాత్పర్యాన్నయ్యా!
అంతుపట్టని చిత్తరువయ్యా!
పెద్దరికపు బాధ్యతల వలయంలో
చిక్కుకుని ప్రేమ కేంద్రకానికి పరిధినయ్యా!
కట్టుబొట్ల ప్రవాహంలో కొట్టుకుపోతూ
అస్తిత్వాన్ని ఆవలి ఒడ్డుకు విసిరేశా!
ఆహ్వానించని పెదవుల నుంచీ జారిన
పేలవపు చిరునవ్వు నుంచీ వీడ్కోలుకు
చేతులు కలిపిన నీ నుంచీ ‘నిన్న’ల్లోకి
వెళ్లిపోయిన నా మంచి నేస్తం!
నేను గీసుకున్న గీతను దాటి
నాకు నేను విధించుకున్న శిక్ష బాపి
భ్రమలాంటి ‘వాస్తవం’గా మిగిలిపోవా?!
మళ్లీ నన్ను మనిషిని చేయవా!
బతికించవా?!

- కె దేవికా రత్నాకర్,
తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9908706218

వినతి
మనసా! మనసా..
ఎటుపోదువే మనసా
దారీతెన్ను తెలియక
ఎటుపోదువే మనసా?
మోహమనే వలలో
చిక్కుకుంటివే మనసా
మాయని వీడవే మనసా
అన్నీ నావే అంటూ
అన్యాక్రాంతం చేయటం
తగునా మనసా?
మహిలో మాయను దాటి
ముందుకు మంచిగ
నడవవే మనసా
ముల్లులాంటి జీవితాన్ని
పువ్వులా మల్చుకో మనసా
మాటల గారడీ మాని
మంచిగ మారవే మనసా..!

- జనస్వామి నాగవల్లి
కొల్లూరు,
గుంటూరు జిల్లా.

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

- గోనుగుంట మురళీకృష్ణ