విజయవాడ

దిబ్బరొట్టె (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాన్నగారూ! ఎల్లుండి మనం షిరిడీ వెళ్లబోతున్నామని నేను పెట్టిన పోస్టింగుకి వంద లైకులొచ్చాయండీ..’ ఆనందంగా చెప్పాడు మా పెద్దోడు అభిషేక్.
‘ఏమిటో ఈ ఫేస్‌బుక్ గోల. ప్రతి చిన్న విషయాన్నీ పదిమందితో పంచుకోనిదే నిద్రపట్టదేమో నీకు’ కాస్తంతా తీక్షణంగా వాడి కళ్లల్లోకి చూశాను.
‘డాడీ! అదే పోస్టింగుకి నాకైతే 121 లైకులొచ్చాయి’ అదేదో ఘనకార్యం చేసినవాడిలా చెప్పాడు మా చిన్నోడు చంద్రకాంత్ ఉరఫ్ చందూ.
‘డాడీ, గీడీ వద్దు. ముద్దుగా తెలుగులో ఎంచక్కా నాన్నా అని పిలువు. ఆతర్వాతే నువ్వేది చెప్పినా వినేది’ కసురుకున్నాను.
‘అలాగే నాన్నా...!’ నూతిలోంచి వచ్చినట్లుంది వాడి మాట.
‘ఇలా నువ్వెన్నిసార్లు చెప్పలేదూ. అయినా ఏరోజుకారోజు నీకు కొత్తే. అసలీ ఫేస్‌బుక్‌ను ఎవడు కనిపెట్టాడ్రా? నిద్ర లేచిన దగ్గర్నుంచీ పడుకోబోయే వరకు ప్రతిఒక్కరూ ఇళ్లల్లో కంప్యూటర్స్‌కు అతుక్కుపోతున్నారు. దీనివల్ల పిల్లలు పాడైపోతున్నారు’ ఒక్కసారిగా విసుగూ, అసహనం నాలోంచి తన్నుకొచ్చాయి.
‘పోయి చదువుకో. ఈసారి సెమ్‌లో మార్కులు అదరగొట్టాలి. ఆ తర్వాత వాటిని ఫేస్‌బుక్‌లో అప్‌డేట్ చేయాలి. సరేనా!’ అని చందూకి చెపితే ‘ఒకే.. ష్యూర్!’ అంటూ భారత్ క్రికెటర్ అశ్విన్‌లా గాల్లో బౌలింగ్ యాక్షన్ చేస్తూ లోపలికెళ్లాడు.
***
మేము షిరిడీ వెళ్లేరోజు రానేవచ్చింది. నా శ్రీమతి, నేను కలిసి రెండు బ్యాగుల్లో సామాన్లు సర్దేశాం. రైల్లో తినేందుకు ఫలహారాలు మా అమ్మగారు సమకూర్చగా, ఇతరత్రా చిరుతిళ్లను మా పిల్లలిద్దరూ బజారుకెళ్లి కొనుక్కొచ్చుకున్నారు.
మళ్లీ మామూలే! వాట్సప్‌లోనూ, ఫేస్‌బుక్‌లోనూ తాజా స్టేటస్ అప్‌డేట్ చేసేశారు.
ఆరోజు ఆదివారం. మధ్యాహ్నం ఒంటిగంటకల్లా భోజనాలు ముగించుకుని నర్సాపూర్ - నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌లో ఆ సాయినాథుడి దర్శనానికి బయల్దేరాం. రాత్రి రైల్లో తినేందుకు డిన్నర్ ఆర్డర్ చేద్దామని మా పెద్దోడు అడిగాడు. ‘వద్దు. పొద్దున తిన్న ఫ్రైడ్ రైస్ నాకింకా అరగలేదు. నాలుగు బిస్కెట్లు తిని కోక్ తాగి పడుకుందాం’ మధ్యలో కలగజేసుకున్నాడు మా చిన్నోడు.
‘అవేమీ కాదు కానీ.. మీ బామ్మ వండిన దిబ్బరొట్టె తీసుకొచ్చా. నలుగురం తలోముక్కా తిని మజ్జిగ తాగితే కడుపులో హాయిగా ఉంటుంది’ సూచించింది మా ఆవిడ.
పిల్లలిద్దరికీ ఇష్టం లేకపోయినా అమ్మ చెప్పిందన్న ఏకైక కారణంతో ‘సరే..!’ అంటూ తలలాడించారు.
కోచ్‌లో అంతా వెజ్ బిర్యానీలు తినడంలో నిమగ్నమయ్యారు.
‘మనం కూడా ఇక తినేద్దాం అమ్మా’.. పిల్లలిద్దరూ హడావుడి చేశారు.
మా ఆవిడ పాలిథిన్ కవర్‌లో చక్కగా చేసిన ప్యాక్‌ను విప్పుతుండగానే కోచంతా ఘుమఘుమలాడింది.
బిర్యానీలు తింటున్నవారంతా ఒక్కసారిగా తలెత్తి మావంక చూశారు.
మా ఆవిడ కళ్లల్లో ఏదో తెలియని ఆనందం.
నాలుగు పేపర్ ప్లేట్లలో నాలుగు ముక్కలు పెట్టి వెల్లుల్లి దట్టించిన ఆవకాయ పచ్చడి వేసింది నంజుకోవడానికి. ఇంకేముంది అందరి నోళ్లల్లో నీళ్లూరడాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. ఎర్రెర్రగా కాలిన రొట్టె ముక్కను పిల్లలిద్దరూ తుంచి పచ్చట్లో అద్దుకుని నోట్లో పెట్టుకుంటూ.. ‘వావ్.. అదుర్స్!’ అన్నారు ఒకేసారి.
‘అమ్మా! ఈ దిబ్బరొట్టె చాలా బాగుంది. మరి ఇంట్లో ఎప్పుడూ వండవేం?’ అనడిగాడు మా చిన్నోడు.
‘దూరప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా దిబ్బరొట్టెలు తీసుకెళ్లడం మీ బామ్మ అత్తగారి కాలం నుంచీ అలవాటట. మీ బామ్మ, తాతగారు ఊళ్లెళ్లేటప్పుడు ఇలాగే తీసుకెళ్లేవారు. ఆ తర్వాత మనం కూడా మీ చిన్నప్పుడు తిరుపతి, షిరిడీ, మదురై వెళ్లినప్పుడు దిబ్బరొట్టెల్ని కాల్చి తీసుకెళ్లి రైల్లో తిన్నాం. అయినా మీరు మర్చిపోయి ఉంటారులే’.. కాస్త విడమర్చి చెప్పింది.
టిఫిన్ తినడం పూర్తయింది.
‘బాహుబలి సినిమా చాలా బాగుంది.. శ్రీమంతుడు చాలాచాలా బాగుంది. మా బామ్మ చేసిన దిబ్బరొట్టె మరీమరీ మరీ బాగుంది’ అంటూ ఇద్దరూ మొబైల్‌లో ఫేస్‌బుక్ తెరిచి చకచకా స్టేటస్ అప్‌డేట్ చేసేశారు.
గంటసేపట్లోనే ఇద్దరికీ 90 వరకూ లైకులొచ్చాయి.
‘నాన్నా! ఇప్పటివరకు ఇంత స్పీడుగా లైకులొచ్చింది మన దిబ్బరొట్టెకే’.. ఆనందంగా అరిచారు. టెస్ట్ మ్యాచ్ గెలిచినప్పుడు ధోనీ కళ్లల్లో మెరిసే మెరుపులు మా చందూగాడి కళ్లల్లో కనిపించాయి.
***
బాబావారి దర్శనం పూర్తిచేసుకుని ఇంటికెళ్లేలోగానే దిబ్బరొట్టె మీద పెద్ద చర్చే నడిచింది మా నలుగురి మధ్యా.
అప్పటివరకు బిగ్ హాట్‌కేక్ తిన్నామని కాస్త స్టైలిష్‌గా పోస్టింగు పెట్టిన మా అభికి బోలెడన్ని ఫోన్‌కాల్స్ రావడంతో వెంటనే దాన్ని దిబ్బరొట్టెగా ఎడిట్ చేశాడు రవ్వంత గర్వంతో. రైల్లో తిరిగి వెళ్లేటప్పుడు మధ్యమధ్యలో నెట్‌వర్క్ కవరేజీ లేకపోవడంతో పిల్లలిద్దరూ ఒకింత అవహనానికి కూడా లోనయ్యారు - మంచి టాపిక్‌పై చేస్తున్న చాటింగ్‌కు బ్రేక్‌పడటంతో.
ఇంటికెళ్లాక వాళ్ల బామ్మ చేతులు పట్టుకుని ఊపేస్తూ.. ‘ఇన్నాళ్లూ ఆ దిబ్బరొట్టె రుచి మాకెందుకు చూపించలే’దంటూ గొడవ చేశారు.
‘దాందేముందిరా!.. మీకు నచ్చదేమోనని రొట్టె చేయడం మానేశాను. తింటామంటే నేనెందుకు చేయను. మళ్లీ సాయంత్రమే రొట్టె పోస్తాను. రేపు ఉదయం తిందురుగాని.. మంచి హుషారొచ్చింది మా అమ్మకు.
రేప్పొద్దున దాకా ఆగడమెందుకు? సాయంత్రమే తినేస్తాం.. ఆతృతతో అడిగాడు అభి.
‘రాత్రి రొట్టె కాల్చాక ఒక నిద్ర చేసి ఉదయం తింటే ఇంకా రుచిగా ఉంటుందిరా భడవల్లారా!’ చెప్పింది బామ్మ.
‘సరేలే బామ్మా.. అసలీ దిబ్బరొట్టె ఏకాలం నాటిది? దీనె్నలా తయారుచేస్తారు? కాస్త వివరంగా చెబితే రాసుకుంటా’ కలం, కాగితం తీసుకొచ్చడు చందూ.
బామ్మ చెబుతుంటే మనవడు రాసుకుంటూ పోతున్నాడు ఆసక్తిగా. ఆ తర్వాత ప్లేట్లో పెట్టిన దిబ్బరొట్టెను అన్ని కోణాల్లోంచి ఫొటోలు తీశారు.
వాళ్ల బామ్మ చెప్పిన తయారీ విధానాన్ని తెలుగులో టైప్ చేసి ఫొటోలతో సహా ఫేస్‌బుక్‌లో పెట్టారు.
కొద్దిసేపట్లోనే పోస్టింగుకు వందలాది లైకులు వచ్చిపడ్డాయి. చాలామంది పిల్లలేకాదు, పెద్దవారు కూడా ఆసక్తికరమైన కామెంట్లు రాశారు.
రెండు రోజుల తర్వాత కాలేజీకి వెళ్లిన మా చందూను స్నేహితులంతా ప్రత్యేకంగా అభినందించారు. అసలే పోజులుకొట్టే మా చిన్నోడు అప్పట్నుంచి జోరు మరికాస్త పెంచాడు.
రెండు రోజుల తర్వాత..
ఫేస్‌బుక్‌లో ఎక్కడ చూసినా దిబ్బరొట్టె ఫొటోలతో ఎడాపెడా పోస్టింగులు కనిపించాయి.
వాళ్లంతా మా అమ్మ చెప్పినట్లు ఇంట్లో దిబ్బరొట్టె చేయించుకుని తిన్నాక ఆనందానుభూతితో ఆ పోస్టింగులు పెట్టినట్లు నాకు అర్థమైంది.
ఇన్నాళ్లూ ఫేస్‌బుక్ అంటే కాలక్షేపం కోసమేనన్న తలంపు నుంచి నేను మెల్లగా బయటపడ్డాను. పిజ్జాలు తప్ప అనాది కాలం నుంచి ఉన్న ఈ దిబ్బరొట్టె రుచి తెలియని వారందరికీ ఫేస్‌బుక్ చేసిన మేలును చూసి సంబరపడ్డా. అప్పుడు తెలిసింది నాకు.. సోషల్ నెట్‌వర్క్ వల్ల ప్రమాదాలే కాదు.. ఇలాంటి ప్రమోదాలు కూడా ఉంటాయని!

- శర్మ సిహెచ్,
విజయవాడ.
చరవాణి : 9505507528

వెంటాడే కవులు..

‘విప్లవజ్వాలా’ తోరణం!

సీ. ‘డాబుదర్పంబులు ఠావుగా విలసిల్లు
పసిడి ఛాయల క్రొత్త పాంటు తొడిగి
అవధులు లేనట్టి అధికారమును చాటు
నీటు మీరెడి లాంగు కోటు దాల్చి
హోదాను, దర్జాను, హుందాను ప్రకటించు
పొల్పారు మేజోళ్లు, బూట్లు తొడిగి
దొరతనంబును చాటి, పరువంబు జూపించు
దొరటోపి తలపైన పరగదాల్చి
కోరమీసాలు సవరించుకొనుచు, తెచ్చి
పెట్టుకొన్నట్టి గాంభీర్య ముట్టిపడగ
పొంచు రక్షకభటుల వంచించి, చొచ్చె ...’
నిలుటద్దంలా, నిలువెత్తుగా సీసంలో రస సన్నివేశంగా ఇలా అక్షర చిత్రంగా నిలిచినది ఎవరనుకుంటున్నారా? ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే నినాదంతో తెల్లవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తింపజేసిన వీరసింహ కిశోరం సర్దార్ భగత్ సింగ్. అలా నిలిపిన వారు ‘సహజ కవితావిలాస’, ‘కావ్య రచనాధురీణ’ బిరుదాంకితులైన శ్రీ కలవకొలను సూర్యనారాయణ గారు (గుంటూరు). ఆయన రచించిన ‘విప్లవజ్వాల’ అనే పద్యకావ్యంలోనిది - ఈ పద్యం - ఛాయాచిత్రమైనా ఒక్కొక్కప్పుడు సరిగా వస్తుందో, లేదో సందేహమే. కానీ ఈ పద్యంలో భగత్‌సింగ్ చిత్రం మాత్రం అక్షరాలా అక్షరాత్మకమై ప్రశంసార్హంగా వచ్చింది.
ఇది తొమ్మిది ప్రకరణాల పద్య కావ్యం. ఇందులో నాలుగవదైన ‘విప్లవ జ్వాలా’ ప్రకరణంలో కర్తారుసింగు శరభ వర్ధంతి సభలో, సభ్యులనుత్తేజపరుస్తూ, నిరపమాన వాక్‌ఝరులను ప్రవహింపజేస్తూ, భగత్‌సింగ్ పలికిన..
‘వీర నృసింహులై, ప్రభల వెల్గు సహస్రమయూఖమూర్తులై
ఆరని మంటలై, పిడుగులై సమరమ్మును సల్పరండు! దు
ర్వార మదాంధులౌ దొరల పాతర వేయగరండు! రండహో!
బారులుబారులై విజయభారత కేతనమెత్తగా వడిన్’
అన్న వాక్యాల్లో ఒక ఉత్తేజముంది. వీరోచిత భాషణకనుకూలమైన - ఒక పదం గానీ, ఒక అక్షరం గానీ తీసివేయడానికి వీలులేని ఒకానొక శయ్యా సౌభాగ్యం పరచుకున్నట్లుగా కనిపిస్తుంది.
‘మారణహోమం’ ప్రకరణంలో జలియన్ వాలాబాగ్ హత్యలకు భగత్‌సింగ్ కలత చెంది, తన చెల్లెలు దుర్గను కూడా ఓదార్చవలసి వచ్చినప్పుడు ఆమెను ‘రావి’ నదీ తీరానికి తీసుకొనిపోయి..
‘నామదినిండియున్న కసి, నాపగలారునె? శాంతినిండునే?
ఆ మతిహీను లాబ్రిటీషు హంతక పాళుల రక్తమీగతిన్
భూమిపయిన్ ప్రవాహముగ పోడిమి మీరగ పారుదాక - నా
కామన తీరకే కునుకు కంటికి పట్టునె? కూడు గిట్టునే?’
అని కళ్లల్లో విస్ఫులింగాలు కురుస్తూ ఉండగా పలికిన ఈ పలుకుల్లో నాటకీయ దృశ్య రచనా శిల్పం పాఠకుల కళ్లకు కడుతోంది. చరిత్రను కావ్యంగా మలిచేటప్పుడు అనుసరించవలసిన మెళకువలలో ఇది ఒకటి.
‘అజ్ఞాతవాసం’ ప్రకరణంలో భగత్‌సింగ్ తనకు వివాహం వలదని తండ్రికి లేఖ రాసే సందర్భంలోని ‘లాఠీ దెబ్బలు పూలచెండ్లు, చెఱసాలల్ శ్వశ్రుగేహంబులా తూటామోతలు పెండ్లి వాద్యములు’ అన్న పద్యాన్ని చదివిన వారికి కరుణశ్రీ గారి ఉదయశ్రీ రెండవ భాగంలోని ‘లాఠీ పోటులు పూలచెండ్లు, చెఱసాలల్ పెండ్లి వారిండ్లు’ అన్న పద్యం జ్ఞప్తికి రాకమానదు.
ముఖ్యంగా ‘మారణహోమం’ ప్రకరణంలోని జలియన్ వాలాబాగ్ హత్యలకు కలత చెందిన భగత్‌సింగ్ పలుకులుగా ఉన్న..
సీ. ‘అభ్రంకషంబౌచు నలరారు శీతాద్రి
ముత్యాల మకుటమై మురువు జూప
శ్రీదయా రసపూర్ణ కేదారసీమలు
జిలుగుపచ్చని పట్టువలువ కాగ
భాగీరథీ సింధు భద్రాద్రి వాహినుల్
రమణీయ తారహారములు కాగా
పార్శ్వములను నిల్చి ‘బంగళారబ్బులు’
వింజామరంబులు వీచుచుండ
పాదపీఠమై శ్రీలంక ప్రభలు గులుక
మూడుపదుల కోట్ల సుతులామోద మంద
భద్ర సింహాసనాసీనవై వెలుంగు
భారత భవాని! జనని! తుభ్యం నమోస్తు!’ అని భారత దేశ స్వరూప నిరూపణను చాటే ఈ ఒక్క సీస పద్యం చాలు- ఈ ‘విప్లవజ్వాలా’ కావ్యం వీరభారతీ కంఠసీమలో తిలకాయమాన జ్వాలా పుష్పతోరణం అని చెప్పడానికి. శ్రీ గడియారం వెంకటశేషశాస్ర్తీగారి ‘శివభారతి’ కావ్య ప్రేరణతో వెలువడిన ఈ ‘విప్లవజ్వాల’ కావ్యానికి శ్రీ గడియారం వారి ఉత్తమ పద్యకావ్య పురస్కారం రావడం ఒక కొసమెరుపు.

- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ,
గుంటూరు. చరవాణి : 9866944287

మనోగీతికలు

జనవరి ‘26’
షష్ట్యబ్ది పైచిలుకు దాటినా
వత్సరం వత్సరం
గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకలు
జరుపుకుంటూనే ఉన్నాము ఆనవాయితీగా..
కృషి ఫలితాలు
సాధించిన విజయ పరంపరలు
సమరయోధుల సంస్మరణలు
లబ్దప్రతిష్ఠులయిన
నాయక శిఖామణుల
ఉపన్యాస మంత్రోచ్ఛరణులు
ప్రేక్షకుల దరహాసాల పూలహారాల అభిషేకాలు
సమతౌల్య భావాలు ప్రతిబింబించే
చందన కర్పూర పన్నీటి జల్లుల గుబాళింపులు.,
త్రివిధ సైనిక దళ కవాతుల ఆహ్వానింపులు
మంగళ తూర్యాలు శ్రావ్య సంగీత ఝరులు
పచ్చపచ్చని తోరణాలతో అలంకరించిన
సుసుందరమైన ఆకాశ పందిరిలో
కలబోసినట్లుగా సాక్షాత్కరించే
ఈ భారతావని వేదిక మీద
సత్యాహింసలు న్యాయధర్మాలు
సజావుగా సాగాలని
శాంతి సర్వత్రా పరిమళించాలని
సహజీవనపు కాడిని మోస్తూ
ఉగ్రవాద రుద్రతాండవాన్ని మట్టికరిపించాలని
మనిషి మనిషిలో ఆత్మవిశ్వాసం
వటవృక్షంగా విస్తరిల్లాలని
సూత్రప్రాయమైన ఆలోచనా లోచనం
గ్రహాంతర పరిధులు అధిగమించాలని
వయోభేదం లేకనే ముక్కుపచ్చలారని
పసికూనల సైతం
తమ కామవాంఛా కోరలకు
బలిచేసే మానవమృగాల
రాక్షస ప్రవృత్తిని సమూలంగా ఛేదించాలని
కాల్పనిక గాథలకు తావివ్వక
‘నవ్యాంధ్ర’ సౌధాన్ని అతి రమణీయంగా
శిల్పీకరించుకొని
సాంకేతికా పరిజ్ఞానానికి
సంస్కృతీ సంప్రదాయాలకు
దర్పణం పడుతూ
మనసా వాచా కర్మేణా భవిష్యద్యవనికపై
బతుకు చిత్రాన్ని దర్శించుకొంటూ
సర్వోత్కృష్టమైన అభివృద్ధి దిశగా
మనదేశ కీర్తి ఖండఖండాంతరాల్లో
ఇనుమడింపజేయాలని.. ఆశానువర్తినై..!

- డా. అవనిగడ్డ
సూర్యప్రకాష్,
విజయవాడ.
చరవాణి : 9908731648

సాధించిందేమిటి..?
నిజం అనే చెట్టుకు పూచిన
అబద్ధం అనే పువ్వు లాంటిది
అరవై ఎనిమిదేళ్ల మన స్వాతంత్య్రం
అది తెచ్చిందేమిటి - మనకిచ్చిందేమిటి?
ఆలోచించండి.. ఓ యువతా!

నెహ్రూ కాలం రష్యన్ కలలు
ఇందిరమ్మ చీకటిరోజులు
ముంబై పేలుళ్లు, రణబీర్ హత్యలు
చుండూరు, కారంచేడు, ఖైర్లాంజి కిరాతకాలు
మహిళలు, మైనార్టీలు, దళితులపై దమనకాండలు
అడుగడుగునా అనునిత్యం అమానుషాలు

గుజరాత్ మతవ్ఢ్యౌపు పెనుమంటలు
రగులుతున్న ఈశాన్యం
చల్లారని కాశ్మీరం
అక్షరం దరిచేరని బిహారీలు
అంధకారంలో ఆదివాసి గిరిజన తండాలు

పక్కలో బల్లెమైన పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదం
విజృంభిస్తున్న ఉల్ఫాలు, జిహాదీలు, టెర్రరిస్టులు
స్వదేశం కోసం తమిళ పులుల గాండ్రింపులు
పాలకవర్గాలు సృష్టించిన ప్రాంతీయ అసమానతలు

మురికికూపాలవుతున్న మహానగరాలు
విషవాయువులతో సహజీవనం-
ప్రజల మధ్యనే పరిశ్రమలు
వింత వ్యాధులు, అంతుచిక్కని రోగాలు
హరీమంటున్న ప్రాణాలు
సంక్షేమం ముసుగులో పాలకుల దోపిడీ వాగ్దానాలు

అంగట్లో చదువులు ఆకాశంలో ధరలు
సామాన్యుడికి తప్పని నిత్య జీవన పోరాటం
తవ్వినకొదీ అవినీతి అంతటా బంధుప్రీతి
యువతను కాటేస్తున్న ఎయిడ్స్ కోరలు
నిప్పులుగక్కుతూ మండుతున్న నిరుద్యోగం
గంగా, గోదావరి, కృష్ణా, కావేరీ
జీవనదులెన్నో పొంగిపొర్లుతున్నా
గుక్కెడు నీటికి బుక్కెడు బువ్వకి తప్పని కటకట

కోట్ల మంది ప్రజల కడుపుగొట్టి
పదిమంది పెట్టుబడిదారులకు పంచిపెడుతూ
ప్రపంచ బ్యాంక్ పల్లకీ మోస్తున్న పాలకవర్గాలు
వారికి వత్తాసు పలికే వామపక్షాలు

వల్లకాడవుతున్న పల్లెలు వలసబోతున్న జనాలు
జాతికి జీవంబోసే పల్లెతల్లికి పాడెకట్టే పరమ కిరాతకాలు
బషీర్‌బాగ్ బలిదానం నెత్తురోడిన నందిగ్రామ్
రక్తం చిందిన భద్రాచలం మృత్యువైన ముదిగొండ
ప్రజాసార్వభౌమాధికారాన్ని కుళ్లబొడిసే రాక్షసక్రీడలు
హింస చట్టమై రాజ్యమేలుతుంటే
పాలకవర్గాలకు రక్షణగా నిలిచే మరతుపాకుల మాటున
గుండెలవిసిపడేలా రోదిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు
బలిపీఠంపై మన స్వచ్ఛ భారతం!

- జె. విశ్వ, న్యాయవాది
రాష్ట్ర కార్యదర్శి,
తెలంగాణ విద్యావంతుల వేదిక
చరవాణి : 9949383407

నానీలు
కేస్ వచ్చిందంటే కాసుల పంటే
కార్పొరేట్ సంస్థల ఏర్పాట్లే అర్హత
తక్షణ చర్య నోటికి తాళం
బంధువరాలు బంధికానాల్లో
వైద్య వ్యాపారం
సేద్యంలా కాదు
ఏనుగు చచ్చినా
బతికినా వేల రూకలే!

- శ్రీమాన్ శ్రీకాశ్యప,
సెల్ : 9985520479.

కల్తీకాలం
కలికాలం
అది ఓ ఆకారం
వంకర్లుపోయిన వేళ్లతో
కొంకర్లు తిరిగి వేలాడే చేతులతో
చూపులు నిలుపలేక
మోకాళ్లు బిగిసి నిలువలేకున్నది
చెవి పరదాలు పిగిలి
రుచి మొగ్గలు రాలి
పొట్టలో పురుగులు తిన్న పేగులతో
మెలిపెట్టే బాధలు ఓర్వలేకున్నది
అన్నం మెతుకులు కతకలేక
రంగురంగుల మందుబిళ్లలు మింగుతూ
ఏదీ తినలేక ఏమీ కడుక్కోలేక
ప్రతి నిమిషం లెక్కిస్తూ
ఇతరుల్ని నిందిస్తూ
పోరుగా మారిన బతుకు సాగిస్తూ
కృశించిన ఆ మానవాకారం
ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుండు
స్వార్థ ప్రవృత్తి సాధించిన ఫలితమిదని
కల్తీకాలం విషం కక్కాక మానదని
త్వరగా మేలుకొని
మనిషిగా మారితే బాగుండు!

షేక్ బషీరున్నీసా బేగం,
గుంటూరు.
చరవాణి : 9985193970

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

email: merupuvj@andhrabhoomi.net

- శర్మ సిహెచ్