విజయవాడ

అంతేమరి! (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుంచం అంత కూతురుంటే.. మంచం మీదే కూడు! అనే సామెత ఇప్పుడు రామచంద్రుడు దంపతులకి వర్తించదు. దుర్గాంబకి మోకాళ్ళ ఆపరేషన్ చేయించారు. ఈ విషయం ముగ్గురు కూతుళ్ళకీ తెలియపర్చలేదు. కారణం వాళ్ళు రాకుంటేనే ఇల్లు ప్రశాంతం. బిపి పెరక్కుండా ఆరోగ్యంగా వుంటారా దంపతులు. ఒకసారి పెద్దమ్మాయి సెలవులకి పిల్లలతో వచ్చింది. సినిమాకి వెళ్ళడానికి ఆటోలు తెచ్చాకా మనవడు బాత్‌రూంకని చెప్పి దొడ్లోకెళ్లి వాటర్ మోటార్ స్విచ్ వేసి వచ్చి ఆటో ఎక్కేడు. ఇంట్రవెల్ టైముకి మీ ఇల్లు మునిగిందని పక్కింటాయన ఫోన్. ఇక రెండో కూతురి కొడుకు రాగానే టివి రిమోట్ చేతిలోకి తీసుకుంటాడు. తాతగారిని న్యూస్ చూడనివ్వడు. అమ్మమ్మని వాడున్న వారం రోజులు భక్తి ఛానల్ పెట్టుకోనివ్వడు. ‘పిల్లవాడితో గొడవ పడతారేమిటి?’ అంటూ పేరెంట్స్‌నే విసుక్కుంటుంది కూతురు. ఇక మూడో కూతురి పిల్లాడిది పాకే వయసే. వాడు డబుల్ కాట్ కింద దూరాడు. వాడిని ఏదో కుట్టింది. గుక్కపట్టి ఏడుస్తున్నాడు. బయటికి రమ్మంటే వాడికి అర్థంకాదు. పాపం ఆవిడ వంగలేదు, కింద కూర్చోలేదు. పిల్లాడి బాధ చూసి ఆవిడ కూడా రోదించడం. మాష్టారు వచ్చి భార్య పరిస్థితి చూసి చలించిపోయారు. ముగ్గురు అమ్మాయిలకి క్లాస్ తీసుకున్నారు. ‘మిమ్మల్ని మేము చాలా క్రమశిక్షణతో పెంచాం. మీరు వచ్చి పిల్లల్ని తల్లి మీద వదిలి షికార్లు! మీ పిల్లల వల్ల మాకు బిపి, అనేక ఇబ్బందులు. మీరు ముగ్గురూ సంక్రాంతికి వచ్చి మూడు రోజులుండి వెళ్ళండి. ఈలోగా కనిపించకండి’ అని శాసించారు. భార్యకి ఆపరేషన్ చేయించినా పిల్లలకి తెలియపరచలేదు. జాబ్‌కి సెలవుపెట్టి తానే..! కొందరి జీవితాలంతే మరి!

- ఎం దుర్గ్భావాని, నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా.

పుస్తక పరిచయం

కన్నయ్య కథలు
శ్రీకృష్ణుని పేరు విన్నంతనే మనకు భారతం, భాగవతంలో ఆయన చేసే అనేక తుంటరి చేష్టలు, అనేక మహిమలు మన కళ్ల ముందు కనిపిస్తాయి. చిన్నికృష్ణుని అల్లరి పనులు ఆనందాన్ని కల్గించినా, ఆయన లీలలు చూసి ఆయనపై భక్తిని పెంచుతాయి. అన్ని తెలిసినా, కృష్ణుని మాయ ప్రభావంతో ప్రాపంచిక విషయాల్లో తేలి ఆయన్ను మామూలు కన్నయ్యగానే భావిస్తాం. శ్రీకృష్ణుని గురించి అనేక మంది అనేక కథలు వ్రాసినారు. అలాగే కృష్ణునిపై భక్తితో యన్ని మనసారా ధ్యానించి, పూజించి ఆయనపై అపార నమ్మకంతో ఆయనే వ్రాయించిన కథలుగా ‘కన్నయ్య కథలను’ పాఠకుల ముందుకు తీసుకొచ్చారు రచయిత ఎంఎస్ శాయిబాబు (మోహనవంశీ). ఇందులో మొత్తం 36 కథలున్నాయి. ఈ కథలన్నీ ధ్యానమాలిక, చిత్సుధ పత్రికలలో ప్రచురింప బడినవే. ప్రతి కథలోను రచయిత తనకు కృష్ణునిపై తనకు గల ప్రేమను అభిమానాన్ని తెలియజేయటమే కాక, ఒక విలక్షణమైన సందేశాన్ని అందించారు. దీనివల్ల పాఠకులు కన్నయ్య కధలు చదువుతున్నా... కథతో పాటు అంతర్లీనంగా వున్న సందేశాన్ని మనస్సులో నింపుకొంటారు. రచయితగా ఉన్న అనుభవం మరియు శ్రీకృష్ణునిపై భక్తి, ఆయన ప్రేరణతో ప్రతి కథను పాఠకుల మనస్సుకు హద్దుకొనే విధంగా మలిచారు. కన్నతల్లి యశోద కృష్ణుని చంటి బిడ్డగా, చూసింది కాని ఆయనలో దైవాన్ని చూడలేక పోయింది. కారణం ఆయన మాయవల్ల మాత్రమే అని తెలియజేసే కథ మాతృప్రేమ ఇందులో కృష్ణుడు నేను చావు పుట్టుకలు... తల్లిదండ్రులు లేని వాడనే .. తల్లిప్రేమ తెలియదు... కాని కన్నయ్యగా అవతారం ఎత్తిన తరువాత నాకు మాతృహృదయం అర్ధం అయింది అనే కృష్ణుని మాటలు మాతృప్రేమను తెలియజేస్తాయి. అలాగే ఉత్తమ భక్తుడు అనేక కథలో కృష్ణుడు తన లీలలను చూపుతూ దాన్ని మాయగా తన తండ్రిని ఇతరులను నమ్మించాడు. అంటే మాయలో ఉన్నంతకాలం కృష్ణుని మనం గుర్తించలేము అనే సందేశాన్ని ఇచ్చారు రచయిత. ఇలా ప్రతి కథలోను ఏదో ఒక అంశాన్ని తీసుకుని దాన్ని శ్రీకృష్ణుని ద్వారా గొప్ప సందేశాన్ని ఇవ్వటం శాయిబాబా గారి కథలలో ప్రత్యేకం. దాదాపు అన్ని కథలు భక్తిని పెంపొందించటమే కాక అంతర్లీనంగా సందేశాన్ని ఇస్తాయి. చివరగా విశ్వరూపం కథలో కాలం అంటే భగవానుని వారాట్ స్వరూపమే అనే గొప్ప సందేశంలో ముగించారు రచయిత. కృష్ణుని గురించి మంచి కథలు చదువుకోవాలి అనుకునే వారికి ఇది మంచి పుస్తకం.
పుస్తకం: కన్నయ్య కథలు, వెల: రూ. 120/-
రచయిత: యం.యస్. శాయిబాబు
డోర్ నెం.3-603, అయ్యప్పస్వామి గుడి వీధి
ఉండవల్లి సెంటర్, తాడేపల్లి మండలం.
గుంటూరు జిల్లా. చరవాణి: 9949553303

- విష్ణ్భుట్ల రామకృష్ణ,
విజయవాడ.
చరవాణి : 9440618122

విహారి కథలు

సామాజిక సమస్యలకు పరిష్కార సూచికలు!
కథాసంపుటి : ‘వి’గతం
వెల : రూ. 100
ప్రతులకు : చినుకు పబ్లికేషన్స్,
డోర్ నెం. 26- 7- 11,
గరికపాటి వారి వీధి,
గాంధీ నగర్, విజయవాడ-3.
చరవాణి : 98481 32208
మొత్తం 17 కథలున్న కథా సంపుటి ‘వి’గతం. ఏ కథ చదివినా గుండె బరువెక్కడం ఖాయం. ఈ కథలన్నీ విషాదాంతాలేనా? అనిపిస్తాయి. కానీ, తరచి చూస్తే మనసు లోతుల్ని తడుముతూ, జీవిత వాస్తవాల్ని ఒప్పిస్తాయి. మధ్యతరగతి జీవితాలతో ముడి వేసుకున్న ఆర్థిక సమస్యలు, మానవ సంబంధాల మూలాల్ని ప్రశ్నిస్తాయి. ‘వి’గతం, ఆకురాలు కాలం, నెత్తుటి కన్నా చిక్కినిది, ఒంటికి దుఃఖం కథలలో..
‘ఎవ్వరి చేతా ప్రేమించబడకుండా ఎందుకు బతుకుతున్నాం?’
‘గతంలో బతక్కు, ప్రస్తుతంలో జీవించు’
‘ఇప్పుడు ఏడుస్తూ, నన్ను శపిస్తూ, నా తదనంతరం సుఖపడటానికి ఎందుకు ఎదురుచూడాలి వీళ్లంతా?’.. అంటూ సూటిగా వాస్తవాల్ని చెపుతూ తనదైన శైలిలో అంతే సూటిగా మనశ్శాంతికి పరిష్కారం చూపిస్తారు రచయిత ‘వి’గతం కథానికలో!
నిండైన మనస్సుతో, సేవా భావంతో, మానవత్వంతో అందించే సేవల్ని అర్థం చేసుకోలేని వాళ్లకి అవసరమైన సేవలు ఎలా ఇవ్వచ్చో చెప్తుంది సీత ‘నీటిమబ్బు’ కథలో. డబ్బిచ్చి పని చేయించుకోవటం, డబ్బు తీసుకుని పనిచేయటం వెనుక ఎన్నో రహస్యాలున్నై గ్రహించమని చెస్తారు పనిలో పనిగా.
ఈ కథానికలలో ‘కొలేజ్’ నిర్మాణ రీతిలో రాసిన ‘చిత్తగించవలెను’ కథానిక చివరి వరకూ ఆసక్తిగా చదివింపచేస్తుంది మన బుర్రకు పదును పెడుతూ. అరుదుగా కనిపించే నిర్మాణ రీతి ఈ ‘కొలేజ్’. ‘ఈ కన్నీటి వెల - ఒంటిపూట భోజనాలు’, ‘చక్రనేల క్రమంలో ఇది ఆకురాలు కాలం’.. లాంటి వాక్యాలు ఆకట్టుకుంటాయి. వ్యాపారస్తులూ మోసపోతారు నష్టాలు వస్తాయనే సత్యాన్ని నమ్మలేక. కొన్ని నిజాలు అస్సలు మింగుడు పడవు ఎంత ప్రయత్నించినా.. అంటూ మధ్యతరగతి మనస్తత్వాన్ని చూపుతారు. ‘నిజానిజాలతో ముఖాముఖీ’లో వోల్డేజ్ హోమ్స్‌కి కావాల్సింది ఫండ్స్ కాదు, వెంకమ్మ లాంటి మనుషులు కావాలి’ అని నిగూఢమైన సందేశాన్ని రెండు మాటల్లో దాచి చెప్పడం విహారి గారి విలక్షణ శైలి.
‘సందర్భమూ, సన్నివేశమూ సంకల్పం మీదే ఆధారపడి వుంటాయి’ అంటూ ఒక పేజీ సందేశాన్ని చిన్ని మాటల్లో చెప్పగలిగే ప్రతిభకి మరో నిదర్శనం. పల్లెటూరిలోకి సొంత ఇంటిని ఎవరెవరో ఆక్రమించుకుని తలదాచుకుంటే పోనే్ల! అభాగ్యులకి ఉపయోగపడుతోంది అని సంతోషం. పట్నంలో తమ అద్దె ఇల్లు కోసం వెతుక్కోవటం - జీవితంలోని మెలోడ్రామాని ఏ ఆర్భాటమూ లేకుండా చేప్తారు ‘ఇల్లు’ కథలో రచయిత.
మధ్యతరగతి జీవితాల్లోని అన్ని సమస్యల్ని మానవీయ కోణంలోంచి, సామాజిక కోణంలోంచి చూపిస్తూ విలక్షణ పరిష్కారాలు చూపిస్తారు రచయిత. సూటిగా చెప్పే శైలి, ఆ సూటిదనంలో మళ్లీ తెలియని సున్నితత్వం, మనసుల్ని మెలిపెట్టే మెత్తదనం.. వెరసి విహారి గారి కథాశైలి. చదివించే ఒరవడి, చదివాక లోతుగా ఏదో అర్థమైన భావనతో పాఠకులు అనిర్వచతీయ అనుభూతిని పొందుతారు. ఇది ఆయన రాసిన కథలన్నింటిలో చూస్తాము. ప్రతీ కథలోనూ ముగింపు ఇలాగే వుండాలని పాఠకుడు కచ్చితంగా తీర్మానించుకుంటాడు.

భట్టిప్రోలు వసుంధర,
చరవాణి: 9866798204
వెంటాడే కవులు ..

అభినవ తిక్కన.. దుర్భా సుబ్రహ్మణ్యశర్మ!
దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారు 1875 అక్టోబర్ 1న జన్మించారు. వీరి తల్లిదండ్రులు సాంబయ్య, కామాక్షమ్మ. వీరి బాల్యం ఎట్లా గడిచిందో తెలియదుగాని, చదువు పూర్తయిన తరువాత మొదట నెల్లూరు కలెక్టర్ వారి కార్యాలయంలో ఉద్యోగం చేసినట్లు, 1920లో వెంకటగిరి రాజావారి కళాశాలలో తెలుగు పండితుడుగా చేరినట్లు, ఆ శాఖాధ్యక్షుడుగా పదవీ విరమణ చేసినట్లు ఆయనే ఒకచోట చెప్పివున్నారు. ఆయన మంచి ఉపాధ్యాయుడే కాదు, గొప్ప పండితుడు, కవి, వేదాంతి, జ్యోతిష్కుడు కూడా. వీరికి అభినవ తిక్కన, మహామహోపాధ్యాయ బిరుదులు కూడా వున్నాయి. అవధానాలు కూడా చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే 20వ శతాబ్దం ప్రథమార్ధంలో నెల్లూరి సారస్వత రంగానికి మకుటం లేని మహారాజులా వ్యవహరించారు. దువ్వూరి రామిరెడ్డి, వేపకొమ్మ ఆదిశేషయ్య, కొలకుల నారాయణరావు, దుర్భా రామమూర్తి, భట్టారం మల్లిఖార్జునుడు మొదలైనవారు వీరి శిష్యులే. వీరు దాదాపు 25 సంస్కృత గ్రంథాలు అనువదించినట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యమైనవీ, అందుబాటులో వున్నవి ‘అమృతానందనాథుని లక్ష్మీ శృంగారమంజరి, శంకరాచార్యులవారి వివేక చూడామణి, సౌందర్యలహరి. వీరి పద్యాలు మృదుమధురంగా వుంటాయి. వీరి గొప్పతనం గురించి తెలుసుకొనేందుకు వారి శిష్యులలో మేలిముత్యమనదగిన వకీలు మోచర్ల రామకృష్ణ కవి కృతమైన ఒక పద్యం చూస్తే సరిపోతుంది.
‘కవితాతత్త్వ విదుండు పద్యరచనా కౌశల్య మెవ్వాడు నా
కవలీలన్ లభియింపజేసె, నెవడాధ్యాత్మాది విద్యా రహ
స్య విశేషజ్ఞుడు, శిష్యవత్సలునెదన్ ధ్యానింతు దుర్భాన్వయా
ర్ణవ చింతామణి, ధీమణిన్, సుగుణి, సుబ్రహ్మణ్యవిద్వన్మణిన్’!
సుబ్రహ్మణ్యం గారు పద్యం చదువుతూ వున్నా, మామూలుగా మాట్లాడుతూ వున్నా కూడా ఎంతో సొగసుగా వుండేదట. ఆరోజుల్లో రచనా వ్యాసంగంలో కృషి చేస్తున్నవారికి వీరు మార్గదర్శకులుగా వుండేవారట. అనేక సాహిత్య ప్రసంగాలు చేశారు. వీరి కవిత్వ కరవాలానికి రెండువైపులా పదునేనట. పెద్దల కోసం ప్రౌఢ కవిత్వం, బాలల కోసం సరళ కవిత్వం రాశారు. బద్దెన సుమతీ శతకంలో కొన్ని అశ్లీల పద్యాలున్నాయని తలచి, తమ స్నేహితుల కోరిక మేరకు అభినవ సుమతీ శతకం రచించారు. ప్రస్తుతం అందులో కొన్ని పద్యాలు చూద్దాం.
సాధారణంగా పిల్లలు దేవుడున్నాడా? ఎక్కడ వున్నాడు? ఉంటే మనకు కనపడడేం?.. అని అడుగుతూ వుంటారు. దానికి సమాధానం ఒక్కమాటలో చెప్పవచ్చు. ఈ విశ్వంలో కనపడీ, కనపడకుండా వున్న చైతన్యమే దేవుడనవచ్చు. కానీ అలాచెపితే పిల్లలకు అర్థం కాదని, వాళ్లకర్థమయ్యే భాషలో పద్యాలు రాశారు.
ఇలక్రుంకకుండ, వారా
సులు మేరలు మీరకుండ, సూర్యాదులు దా
రులు తప్పకుండ నెవ్వడు
తెలివిన్ నియమించెనతడె దేవుడు సుమతీ!
సాధారణంగా పిల్లలు తమనెవరూ చూడటం లేదనుకొని చెడుపనులు చేస్తూ వుంటారు. వాటిని నివారించటానికి ఎల్లప్పుడూ దేవుడు మనలను చూస్తూనే వుంటాడని ఒక పద్యం..
ఒరులెవరు చూడలేదని
దురితంబులు సలుపబోకు దుష్టాత్ముడవై
నిరతము వేగన్నులతో
పరమేశుడు చూచుచున్న వాడుర సుమతీ!
ఉపాధ్యాయులను భక్తితో పూజించటం మన కర్తవ్యం అని చెపుతూ మరో పద్యం.
భౌతిక దేహంబునకున్
మాతాపితలట్ల జ్ఞానమయతనువునకున్
హేతువు గావున నొజ్జల
జేతమునన్ నిలిపి భజనసేయుము సుమతీ!
‘ఒరులేయవి యొనరించిన, నరవర యప్రియము తనమనంబునకగు’ అనే భారతంలోని తిక్కనగారి పద్యానికి దీటుగా అలతి పదాలతో ఒక పద్యం.
‘ఎది ఎదిరినీ కొనర్చిన
నెదయుమ్మలికమ్మునొందు నెదిరికి నీవ
య్యది సేయకుండు మిదియే
సదమల ధర్మోపదేశ సారము సుమతీ!’
ప్రయత్నపూర్వకంగా విద్యావంతులు శుద్ధమైన భాష మాట్లాడటం చాలా అవసరం అని చెపుతూ ఇంకో పద్యం.
‘స్నానమున మేని మురికియు
జ్ఞానమున మనోమలంబు శబ్దాగమవి
జ్ఞానమున నుడి దొసంగులు
పూని తొలంగించుకొనుము పూర్ణత సుమతీ!’
అవతలివాడికి ధనముందని ఏడ్చినా ప్రయోజనం లేదు. నీవు కూడా పట్టుబట్టి అంతవాడివి కావటానికి ప్రయత్నిస్తే ధనవంతుడివవుతావని మరొక పద్యం.
‘నీకన్న నధికులంగని
శోకించిననేమి ఫలము? సుస్థిరమతివై
యాకొలది వాడవగుటకు
వీకన్ యత్నింపుమీవు విసువక సుమతీ!’
మనిషికి ఎన్నివున్నా ఏమి ప్రయోజనం? గుణం ప్రధానమని చెపుతూ వేరొక పద్యం.
‘్ధనమున్న ధాన్నమున్నన్
ఘనవైభవమున్న శాస్త్ర కౌశలమున్నన్
గొనమొకటి లేకయుండిన
ననయమ్ము నిరర్ధకమ్ములన్నియు సుమతీ!’
అన్నీ నశించేవే కాని సత్కీర్తి చెడనిది. దాన్ని సంపాదించటమే ధ్యేయం కావాలని ప్రబోధించిన పద్యం.
‘చెడు గలిమి, చెడును గృహములు
చెడు మడులును మాన్యములును చెడు వాహనముల్
చెడు బలము, చెడును సర్వము
చెడనిది సత్కీర్తియొకటె సిద్ధము సుమతీ!’
ఈవిధంగా పిల్లల కోసం వారి కోణంలో ఆలోచించి ఎంతో సరళంగా, చక్కగా, నీతి బోధకంగా శతకాన్ని రచించారు దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారు.
ఈయన రాసిన రెండో శతకం- దీన చింతామణి. ఇందులోని పద్యాల్లో భగవంతుని అగణ్య దాక్షిణ్యం, కారుణ్యం, వైభవ శోభను అత్యద్భుతంగా వర్ణించారు. కవిత్వం ప్రౌఢంగా వుంది. ఈ శతకం చదివిన వారికి మనశ్శాంతి లభించిందట. ఇందులో కొన్ని పద్యాలు చూద్దాం.
‘నిగమంబుల్ నిను చెప్పగా దొడగియున్ నేర్పేది? నేతీతి వా
క్యగతిన్ నీవెవికావొ వానిసకలం బవ్యాహతిన్ జెప్పెగా
నిగుణాతీతము నీస్వరూపమభివర్ణింపలేకుండె, నే
వగనన్యుల్ నినువాకొనంగలరు దేవా! దీన చింతామణీ!’
వేదాలు నీవు (న+ఇతి+ఇతి=నేతీతి) ఇదికాదు, ఇదికాదు అని ఏవికావో ఖండించటానికి వీలులేని విధంగా చెప్పాయి కాని, త్రిగుణాలకు అతీతుడవైన నీ స్వభావాన్ని ‘ఇదిగో నీవు ఇది’ అని వర్ణించలేకపోయాయి. ఇక మానవ మాత్రులు నీగురించి తెలుసుకొనుట సాధ్యమా దేవా!.. అని దీని భావం.
‘పదముల్ భూమి, నభంబుపొక్కిలి, నభస్వంతుండు ప్రాణమ్ము చం
ద్రదినేంద్రుల్ నయనమ్ము, లాశలు చెవుల్, నాకమ్ము మూర్ధమ్ము త
ద్వదనంబగ్ని, పయోధి వస్తియగు, త్వద్ బ్రహ్మాండకాయమ్ములో
నొదుగున్ సర్వచరాచరమ్ములు, శుభాంయూ! దీన చింతామణీ!’
శుభంతో కూడుకున్న వాడా! దీన చింతామణీ! భూమే నీ పాదములు, ఆకాశమే నీ నాభి, వాయువే నీ ప్రాణము, సూర్యచంద్రులే నీ కళ్లు, దిక్కులే నీ చెవులు, స్వర్గమే నీ తల, ముఖమే అగ్ని, నీ నివాసమే సముద్రము. అందుకే నీ బ్రహ్మాండమైన శరీరంలో సకల చరాచర జగత్తు ఇమిడిపోయింది. పరిమిత జ్ఞానంగల మేము నీవెంత వాడివో ఎట్లా ఊహించగలం? అని దీని అర్థం. నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు. నీ భయం లేకపోతే ఎవరూ ఏ పనీ చేయరు.. అంటూ మరో పద్యం.
‘వీచున్‌గాలి నీ భయమ్మునన, నావిర్భూతుడౌ సూర్యుడా
ప్రాచిన్ నీవెఱనే, మరుత్వదనలున్ వర్తింతు నీభీతినే
గ్రాచున్ మృత్యువు నీ దరమ్ముననలోకశ్రేణి నీయాజ్ఞలే
కేచీమైన చిటుక్కనన్ వెఱచు దండ్రీ! దీన చింతామణీ!’
పరమ శాంతిని పొందాలంటే కొంత కష్టపడక తప్పదని ఇంకో పద్యం.
‘నీటన్ మున్గక, నీళ్లు మ్రింగక, యటే నిన్‌బైని గాల్గేలబో
రాటన్ సల్పక, రుూతనేర్వగదరంబా? యట్లె సంసారపుం
బాటన్ ద్వందసహిష్ణుతన్ గఱవకే బ్రహ్మాఖ్యవౌ శాంతినె
ప్పాటన్ బొందవలంతియే నరుడు దేవా! దీన చింతామణీ!’
భగవంతునితో పోల్చిచూసుకుంటే మనమెంతవారమని మరొక పద్యం.
‘సికతారేణువుకన్న నల్పుడట నీ సృష్టిన్ దినేశుండు వా
నికి గోట్యంశతమమ్ము భూమి, మరిక్షోణిన్, న్యర్బుదప్రాణివ
ర్గకదంబమ్మున నొక్కచుక్క నరుడౌరా! వీనిత్రుళ్లింత విం
తకు నీ పెంపు నెఱుంగమిన్‌గద! అనంతా! దీన చింతామణీ!’
ధనమే సరస్వం అనుకొని కష్టపడి దాన్ని పోగేసి చివరకు దాన్ని వదిలిపోయే సమయంలో లుబ్ధుడు పడే బాధను ఏవిధంగా వర్ణించగలం అని ఇంకో పద్యం.
‘పదటన్ దూతలు రమ్మురమ్మనుచు నిర్బంధింప నాకేమి చె
ప్పెదు నాకేమని యాలుబిడ్డలు తమిన్ బీడింప గష్టార్జితం
బిది సర్వస్వము మూటగట్టుకొని పోనేక్రంతయున్ లేనియం
త్య దశన్ లుబ్ధుని వంత ఏమనగదేవా! దీన చింతామణీ!’
ఈరకంగా వేందాంత ధోరణిలో సాగిన అన్ని పద్యాలు ఎంతో మధురంగా వున్నాయి. పైన చెప్పిన రెండు శతకాలు వీరి స్వతంత్ర రచనలు.

- ప్రయాగ కృష్ణమూర్తి,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.
చరవాణి : 8179063842

మనోగీతికలు

అక్షరం
అక్షరమొక ఆయుధం
అజ్ఞానపుటంధకార
చీకటి రాత్రులను
చీల్చి చెండాడుతూ..
వెలుగురవ్వలను వెదజల్లుతుంది

అక్షరమొక అగ్నికణం
అన్యాయపుటక్రమాల
దోపిడీ దొంతరలను
ఆరని మంటలకాహుతి చేస్తూ..
న్యాయజ్యోతిని వెలిగిస్తుంది

అక్షరమొక అంకుశం
అధికారపుటహంకార
ధన మదపుటేనుగులను
తరిమితరిమి గెలుస్తూ..
విజయాన్ని చాటుతుంది

అక్షరమొక జనసైన్యం
పాలకవర్గాల పాచికపై
యుద్ధ్భేరి మోగిస్తూ
సమరనాదమినిపిస్తూ..
విజయఢంకా మోగిస్తుంది

అక్షరమొక జలప్రవాహం
ఎత్తుపల్లాలను ఏకం చేస్తూ
ఎగుడుదిగుడులను సదనం చేస్తూ
ప్రతి మెదడు/రాయికి పదునెడుతూ..
ప్రతి మనిషిని పరవశింపజేస్తుంది

అక్షరమొక ఐక్యనినాదం
కోటిగొంతులను ఏకం చేస్తూ
సప్తస్వరాల సంగీత శాసనమై
సమస్త జగతిని ఓలలాడిస్తూ..
జనరంజక పాలన చేస్తుంది

అక్షరమొక నిరంతర చైతన్యం
అజ్ఞానపు మెదళ్లలో
విజ్ఞానం నింపుతూ
స్వేచ్ఛా సహజీవన సమరంతో
లక్ష్యం ఛేదిస్తుంది!
- జె విశ్వ,
గార్ల, ఖమ్మం జిల్లా.
చరవాణి : 779398907

ఆ సత్తా మనకున్నది..
సాకి : ఏమున్నదీ.. విడిపోతే మన చెంత ఏమున్నదీ
పల్లవి: పోనివ్వు పోనివ్వు.. విడిపోతే పోనివ్వు //2//
అని అన్నారే.. విడిపోతే మన చెంత ఏమున్నదీ
అనుపల్లవి: తెలుగు తల్లి తీపిగుర్తే.. మనకంటు మిగిలున్నది
తెలుగుగడ్డ ముక్కలైతే.. కన్నీరే మిగిలున్నది //2//
ఏమున్నదీ.. ఏమున్నదీ..
పల్లవి: పోనివ్వు.. పోనివ్వు
చరణం: ఒక్క తరం చచ్చిపోనీ.. ఒక్క యువతరమే నష్టపోనీ
మిగిలున్నదీ మిగిలున్నదీ.. నవతరమే మిగిలున్నదీ
ఇనపకండ కరగనీ.. ఉక్కునరం అరగనీ..
అలసిపోక, సొలసిపోక.. నవయుగపు బాటవేయ్ //2//
ఆ ఆశ ఒక్కటే మిగిలున్నదీ.. అందుకే యువతరమా మేలుకో
ఆ ఆశ ఒక్కటే మిగిలున్నదీ.. అందుకే నవతరమా మేలుకో
పల్లవి: పోనివ్వు పోనివ్వు..
చరణం: కృష్ణమ్మ మనచెంత.. గోదావరి మన ఇంట..
తిరుగుతున్న ప్రతిపూట
మరో మహాభాగ్యనగర నిర్మాణపు తృష్ణొక్కటే మిగిలున్నదీ
అలలతో ఎగసిపడే విశాల విశాఖ మనది
కళలలోన మునిగితేలు విజయాల వాడ మనది
రాయల రతనాల సీమ మనకు మిగిలివున్న ధీమా
అందుకే పోనివ్వు.. విడిపోతే పోనివ్వు..
నీ ఆశనే శ్వాస చేసి భావితరపు భవిత కొరకు
బంగారు బాట వేసే శక్తియుక్తి మనకున్నది
ఆ సత్తా మనకున్నది..

ఎస్‌కె మస్తాన్ వలీ
జంతుశాస్త్ర అధ్యాపకులు.
చరవాణి : 9948357673

రెప్పల చప్పుడు
కదులుతున్న
కాలనీలా..
రాత్రిపూట నడిచే
రైలుబండి

కాశ్మీర్ ఆపిల్
కొరికిచూద్దును గదా
గడ్డకట్టిన
నెత్తురు

ఆంధ్రా కన్నా
అమెరికా గొప్పా?
ఒక్కరోజు
అక్కడ కరెంటు పోతే..!

- కోసూరి రవికుమార్,
దాచేపల్లి, గుంటూరు జిల్లా.
చరవాణి: 8520009858

అడవి
అక్షరం ఉసూరుమంటూ
ఈడిగిల బడిపోదు
తెగిన గాలిపటంలా..
సుషుప్త చేతనావస్థలో వున్న
అక్షరం పురివిప్పింది
అది నివురుగప్పిన నిప్పులా దాగి వుంది
నిలువెత్తు మంటలా..
అలుముకుంటుంది ఎప్పుడో ఒకప్పుడు
తొలకరి చినుకు కోసం
వేచి చూస్తున్న
నెర్రెలుబారిన నెలలా..
తుడుం మోగిస్తున్న అడవిలా
ఆర్తనాదం చేస్తోంది!

- అల్‌ఫతా, విజయవాడ.

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి.

email: merupuvj@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

- ఎం దుర్గ్భా భవాని