విజయవాడ

ప్రతి ఏటా పండగ పుస్తకాల సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి పుస్తకాలలోని విషయాలు అక్షరాలు. అంటే శాశ్వతాలు. అక్షయ పరమాత్మ తత్త్వానికి ప్రతీకలు. అవి సారస్వత యశఃపతాకలు. నిరంతరం అక్షర రచనార్చన చేసేవారే కవులూ, రచయితలూ. అక్షర ప్రసాదాలను అందజేసే కార్యాలయాలే పుస్తక ప్రచురణ సంస్థలు. అంబరాన్ని అంటే సంబరంతో ఆ సువర్ణ ప్రసాదాన్ని పాఠక భక్తులు అందుకునే పండుగే పుస్తకాల సంక్రాంతి. ఇది ప్రతి ఏడాదీ సంవత్సరాంతంలో, సంవత్సరాదిలో కనుల నిండుగా, ఆనందాల దండిగా ‘్భగ్యనగరం’గానో, ‘విజయాలవాడ’గానో జరిగే అక్షరాల పండుగ. ఇది సువర్ణ ప్రసాదం కాబట్టే అర్ణవమంతటి సువర్ణాలను ఇవ్వలేకపోయినప్పటికీ - ఎందుకంటే అందరూ రత్నాకరులు కాదు కాబట్టీ - యథాశక్తిగా అందరి ఆమోదాల సెంటు పరిమళాలు వీచే రీతిలో ప్రకటించే పర్సంటేజీకి స్టేజీలై పాఠక భక్తులూ, పుస్తక ప్రియులూ అమూల్యాలైన మూల్యాల్ని ఈజీగా అందజేయడానికి వీలును కల్పించే ఆనందాల మకర సంక్రాంతి ఇది.
ఈ ప్రచు‘రణ’ ప్రచార యుగంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఎనె్నన్నో తాజా పుస్తకాల రోజాలు గుప్పుమనే పరిమళాలతో ఫ్లవర్‌వాజుల్లాంటి సభల్లో ఆవిష్కృతవౌతూనే ఉన్నాయి, ఉంటాయి కూడా. వీటికీనాడు కుటుంబ నియంత్రణ అనేది లేనేలేదు. పాపం! ‘కలం’కారులందరూ ఎక్కడ సభలూ, సమావేశాలూ జరిగినా సరే అక్కడికల్లా వెళ్లి నిండుగా, దండిగా తమ పుస్తకాల దండలతో సరి వారి మెడల్ని ఉద్దండంగా అలంకరించి అండదండల్ని పండించుకుంటూనే వున్నారు పరస్పరం. కవి సమ్మేళనాల్లో అయితే ఈ ఉత్సాహమేళం మిన్నంటి మారుమోగుతూనే ఉంటుంది. అలమరాల్లో సరియైన అరమరికలు లేక, అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్నట్లుగా అలరి వున్న పుస్తకాలను ఎన్నింటినో విడుదల చేశామని అనుకుంటూ ఉండగానే మళ్లీ వెంటనే అంతకుమించి వచ్చి చేరుతుంటాయి - కొందరిళ్లల్లోకి. ఇక రోజూ పత్రికల్లో పుస్తకాల సమీక్షలు చేసేవారి ఇళ్లల్లో అయితే ఈ ఈ(నీ)తి బాధా గాథాలహరి హరిహరీ! వర్ణనాతీతమే మరి! రోజూ వారి గృహ ద్వారాలకు నేనాగనన్నట్లుగా సశాస్ర్తియంగా వచ్చి చేరుతూ ఉంటుంది - ఏదో ఒక పుస్తకం. వారూ వాటితో తమ పని అయిపోగానే ఇలాగే ఎలాగో అలాగు ఆ పుస్తకాలను సద్వినియోగం చేస్తారనుకోండి - ప్ర‘పంచే’తంత్రులై.
ప్రతి నట్టిల్లూ ఎంత ‘నెట్టి’ల్లయినప్పటికీ అంతర్జాల మాయాజాలంలో ఎంతోమంది కొట్టుమిట్టాడుతున్నప్పటికీ పుస్తకమే సమస్తమంటూ, మస్తకాలకు నచ్చిన నేస్తమంటూ సంభావించేవారు ఎందరో ఉన్నారు. టెక్నిక్ ఎంతగా పెరిగినా అక్షరాలు పురుడుపోసుకున్నవి మొదట్లో తాళపత్రాల్లో అయితే, ఆ తర్వాత పుస్తకాల్లోనే గదా! తాళపత్రాలు ఇప్పుడు దొరకవు కాబట్టి పుస్తకాలే ఇప్పుడు అందరికీ మాతృమూర్తులు. అంతేకాదు, సుద్దాల అశోక్‌తేజ గారన్నట్లుగా ‘వీసా లేకుండా విశ్వదర్శనం చేయించే పుష్పక విమానం - పుస్తకం’! అలాంటి అక్షర ప్రసాదాలను వ్యర్థం చేయకూడదు.
నగదు రహిత లావాదేవీలకు కేంద్రం ఇప్పటి మన కేంద్ర ప్రభుత్వం. ఇదేదో మన ‘కేం.ప్ర.’మే కనిపెట్టిందని మీరు అనుకోనక్కర్లా! ఎప్పటి నుండో దాదాపుగా నేటి ప్రతి కలంకారుడూ, కలంకారిణీ తనలో ‘లావా’లా సెగలూ, పొగలూ గక్కే అక్షరాల ‘దేవీ’ని ఇలా పుస్తకాల రూపంలో విడుదల చేసి, నగదు రహితంగానే పక్కన ఉన్న కలంకారునికీ, కలంకారిణికీ అందించే లావాదేవీ సాగుతూనే ఉంది. ఉంటుంది కూడా. కేంద్ర ప్రభుత్వ నగదు రహిత లావాదేవీ బహుళార్థ సార్థకం. ఈ కళాత్మక లావాదేవీ పగటి‘కలా’త్మకం. ఒక్కొక్కప్పుడు నిరర్థకమేమో కూడా.
కానీ - ఒక్కమాట:- నగదు రహితంగా ఈ కలంకారాలను అందుకోవటం ఏమాత్రం సంభావ్యమో చెప్పండి. కాదుగదా! కాబట్టి ఓ పాఠక భక్తులారా, పుస్తక ప్రియులారా.. అక్షరాలా సువర్ణ ప్రసాదాలను అందించే ఈ ఉత్సవాన్ని ఓ నవ్యాంధ్ర సంవత్సర కాంతిగా, ఓ మకర సంక్రాంతిగా, ఓ ‘నవోదయ’ విక్రాంతిగా, ఓ ‘విశాలాంధ్ర’ హృదయోత్తేజంతో సద్వినియోగం చేసుకోండి మరి! మరోమాట చెప్పమంటారా! రంగురంగుల రంగవల్లికలే పుస్తక ప్రదర్శనశాలలు. ఇక్కడ ఎనె్నన్నో అక్షరాల బంతులున్నాయి. చేమంతులున్నాయి. మల్లెలున్నాయి. మొల్లలున్నాయి. సన్నజాజులున్నాయి. విరజాజులున్నాయి. లిల్లీలున్నాయి. కాలక్షేపానికి పల్లీలు కూడా ఉన్నాయి. ఇవేవీ ఇరుకూ, మురికీ పల్లీలు కావు. కల్లాపి చల్లి అలంకరించిన ఆకర్షించే ముగ్గుల ప్రాంగణాలు! కళాత్మకంగా, సహృదయతతో ఈ ముగ్గులోకి దిగి, ఈ అక్షర సంక్రాంతుల్ని సొంతం చేసుకోండి! జనానికి కడుపు నిండేలా వడ్డించే అక్షర భో‘జన’ రూపమైన ‘వరి’ విశ్రాంతి ఇది. ఇది పుస్తకాల సంక్రాంతి. ఇది ఆంధ్రభూమి సువర్ణాల ‘మెరుపు’గా అందించే స్వాగతానంద శుభకాంతి. ఓం శాంతి!!

- డా.రామడుగు వేంకటేశ్వరశర్మ,
గుంటూరు.
చరవాణి : 9866944287

పుస్తకానే్న ధ్యానిస్తూ.. శ్వాసిస్తూ..!

విజయవాడ పుస్తకాల పండుగ 1988లో మొదలైంది. నవోదయ రామ్మోహన్‌రావు గారు అధ్యక్షులు. పేరులోనూ, నా దృష్టిలోనూ అది పుస్తకాల పండగే. పిబ్ల్యు డి గ్రవుండ్ మొత్తం కర్రలతో నిండిపోయి, రేకుల షెడ్లయి, అందులోకి పుస్తకాలు బొమ్మల కొలువులా తీర్చినట్లు పెట్టేశారు. నేను ప్రతిరోజూ చూశాను. ఉదయం డైలీ పేపర్‌లో నా ఉద్యోగం. నైట్ డ్యూటీ. ముందర ఇటువచ్చి ఆ పుస్తకాల షాపులన్నీ తిరిగి చూసేవరకూ మనసంతా అక్కడే. ఒక మనిషికి ఒక వృత్తి, ప్రవృత్తి వుంటాయి. ఒక జీవితం, ఒక కెరీర్, ఒక ఇష్టం.. ఇవన్నీ వేర్వేరుగా ఉండచ్చు. కానీ నాకు పుస్తకాలే మొత్తం. ఎప్పుడో చిన్నప్పుడు తెనాలి సరళా పబ్లికేషన్స్‌లో మొదటిసారి బాపూ బొమ్మలతో వచ్చిన జనార్ధనాష్టకం ముట్టుకొని చూశాను. మొదటిసారి పుస్తకం పైన ప్రేమ పుట్టింది. అప్పటికే మా అమ్మ సీరియస్ పుస్తకాల పురుగు. కొమ్మూరి, కొవుల అద్దె నవలల నుంచి, వీక్లీలో వచ్చే యద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, కౌసల్యాదేవి సీరియల్స్ అన్నీ చదవటం ఆమె నుంచే అందిపుచ్చుకున్నాను. నా చుట్టూ ఒక అద్భుతమైన ప్రపంచం. ప్రపంచాన్ని స్వయంగా అర్థం చేసుకుంటున్న వయసులో నా చేతికి అందిన అపురూపమైన వరాలు పుస్తకాలు. కానీ పుస్తకాలే నా ఊపిరి.. శ్వాస. ఆ వెర్రి ఎంతదూరం పోయిందంటే మావూరు జగ్గాపురంలో ఉండే బుక్స్ అన్నీ చదివేసి గుంటూరు జిల్లా లైబ్రరీలో రెండు మూడు మెంబర్‌షిప్‌లు కట్టి ఎప్పటెప్పటివో బైండ్ చేసిన భారతులు, యువలు, చందమామలు దగ్గర నుంచి తెలుగులో వచ్చిన ఏ సాహిత్య రూపాన్నయినా చదవటం, కృష్ణశాస్ర్తీ, శ్రీశ్రీని కంఠతా పట్టటం వరకూ. ఆ ఇష్టం జీవితానే్న ఆక్రమించుకుంది. మాలతీచందూర్, రంగనాయకమ్మగారి వరకు నేను పాఠకురాలినే. మహీధర రామ్మోహనరావుగారి నవలలు చదువుతూ ఏదో ఒక పుస్తకం మధ్యలో మిస్ అయిందనిపించి విశాలాంధ్ర పబ్లికేషన్స్‌కు ఒక కార్డు రాయటంతో నేనింకో ప్రపంచంలోకి మళ్లాను. ఆ పల్లెటూరిలో నా పుస్తకాలు చదివే వాళ్లెవరూ..? అని మహీధర ఆరా తీయటంతో పరకాల పట్ట్భా రామారావు, ఏటుకూరి బలరామ్మూర్తిగారు జీవితంలోకి వచ్చేశారు. నా మొదటి రచన నవలే సుప్త్భుజంగాలు. నండూరిగారు ఆంధ్రజ్యోతిలో డైలీ సీరియల్‌గా వేశారు. ఎంత చదివానో అంత మనసు పెంచుకోగలిగాను. మంచి కథలు రాయగలిగాను. ఇదంతా చదవటం వల్లనే. పుస్తకాల పట్ల మమకారం వల్లనే. మార్కెట్‌లోకి అశ్లీలమైన నవలలోస్తే కోపంకొద్దీ ‘అక్షరాలు మరచిపోండి’ అన్న హెడ్డింగ్‌తో ‘ఆంధ్రభూమి’లో వ్యాసం రాస్తే దాన్ని జిరాక్స్ తీయించి బుక్ ఎగ్జిబిషన్‌లో మొత్తం అందించేలా చూసుకోమన్నారు ఆత్మీయులు నవోదయ రామ్మోహన్‌రావు గారు. ప్రతి సంవత్సరం ఈ పండగ వచ్చేది. పుస్తకాలు కొనుక్కోండి, చదవండి అని చెప్పేందుకు ఎన్నో వ్యాసాలు, రేడియో ప్రసంగాలు, పేపర్‌లో రిపోర్టింగ్ ఎంతో ఇష్టంతో, గౌరవంతో చేశాను. ఫెస్టివల్ స్టాల్స్‌లో ఉండే పలు మంచి పుస్తకాలు నా దగ్గర ఉన్నా ఆ స్టాల్స్ చుట్టూ తిరిగి చూడటం, అక్కడే అందరు స్నేహితుల్ని, రచయితల్ని కలుసుకోవటం ఒక ఆనందం. అవన్నీ నా జీవితంలో సంక్రాంతి, దీపావళి, క్రిస్మస్. సంవత్సరాల తరబడి పబ్లిషర్లు దాన్ని వేడుకలా నిర్వహిస్తున్నారు. స్టాల్స్‌లోని పుస్తకాలు రెండు చేతులా ఆహ్వానిస్తాయి. కమ్మని కొత్త పేజీల వాసనలో ఆకర్షిస్తాయి. కళ్ళు మిరిమిట్లు గొలిపే విజ్ఞాన సంపదని దాచి, ప్రేమగా ప్రతి పేజీని జాగ్రత్తగా ముట్టుకో అంటాయి. ఆ ఉద్యానవనంలో తిరగటం ఒక గొప్ప అనుభూతి. అది అక్షరాల ప్రపంచం. అడుగు పెట్టటం తప్ప తిరిగి వెనక్కి రానివ్వని పద్మవ్యూహం. అక్షరాలు మనల్ని మోహపెడతాయి. చీకటి లేని ప్రపంచాన్నిస్తాయి. ఆ అక్షర ప్రపంచంతో నాకు 50 సంవత్సరాల పరిచయం ఉన్నా ఆత్మీయ బంధం నా హితులు, సన్నిహితులు, ఉద్యోగం, వృత్తి, పేరు ప్రతిష్ఠ, తినే భోజనం.. అన్నీ ఈ పుస్తకాలే ఇచ్చాయి. పారిజాతపు వృక్షం కింద నిలబడితే ఉదయపు వేళ పూవులు జారిపడినట్లు ఇనే్నళ్లుగా పుస్తకాలు నే సాచిన చేతుల్లో రాలిపడుతూనే ఉన్నాయి. ఈ సాహిత్యం ఒక అక్షయ పాత్ర. తీసినకొద్దీ సరికొత్త పరిమళంతో ఎంతో సాహిత్యం వస్తూనే వుంది. ఇప్పుడు విజయవాడ పుస్తక మహోత్సవంలో పుస్తకాలతో నిండిపోయిన స్టాల్స్, ఒక్కో రచయిత పేరుతో ఒక్కో ప్రాంగణం. ప్రతి సాయంత్రం ఒక వేడుకగా పుస్తక పరిచయాలు, ఆవిష్కరణలూ. మొత్తంగా రచయితల కుటుంబానికి ఆహ్వానం. నా అదృష్టం. నేనూ ఈ ఇంట్లో మనిషిని. ఈ మహోత్సవంలో నా ఉనికి ఉంది. నా జ్ఞాపకం, నా సంతోషం, నేను నడిచిన దారులు అన్నీ వున్నాయి. రెండు చేతులు జాపి, రెండు చేతులతో నమస్కరించి ఈ పుస్తకోత్సవం కోసం, స్వాగతం పలికేందుకు ఈ అక్షరాల వరసలు రాయటం నా అదృష్టం. నా జీవితంలో పుస్తకం నాకు అందిన అత్యంత విలువైన, అపురూపమైన బహుమానం.

- సి.సుజాత,
రచయిత్రి, తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9948960009

అక్షర దర్పణం
‘లోకో భిన్న రుచిః’ అన్న సూక్తికి ప్రత్యక్ష నిదర్శనం - పుస్తక ప్రదర్శనం. విజయవాడకే ప్రత్యేక శోభనిస్తూ వచ్చింది. బాల సాహిత్యం నుంచీ రేపటి తరానికి ఆవశ్యకమైన శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక విషయాల మీది ప్రచురణలతో అనంతమైన వైవిధ్యం కనిపిస్తున్నది - చూడండి. వేదాలు, విమర్శలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, వివిధ వాదాలూ, ధోరణులకు సంబంధించిన గ్రంథాలూ ఉన్నై. ప్రపంచమంతటా సామాజికంగా, సాంస్కృతికంగా వస్తున్న పరిణామ వికాసాల్ని పరిచయం చేస్తున్న పుస్తకాలూ కుదురుకున్నై. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ఉద్యోగార్థులకు, మేధావులకు, మధ్యతరగతి వారికి జ్ఞాన ప్రదాయకంగా వుండే పదకోశాలూ, పరిశోధక పుస్తకాలకూ కొదువ లేదు.
అక్షరం ఎప్పుడూ స్ఫూర్తిదాయకమే. అది అనంతకోటి ఆలోచనలకు - విద్యుత్ మీట వంటిది. అందుకనే ఈనాటి యువతరం పుస్తకాన్ని ప్రేమిస్తోంది. ఫ్రీవెబ్ బుక్స్, ఈబుక్స్, వెబ్ మేగజైన్లు - ఎన్ని వచ్చినా యువతీ యువకులు ప్రత్యక్ష పుస్తక పఠనం మీద ఆసక్తిని చూపెడుతూనే ఉన్నారు. దీనికి కారణం - పుస్తకపు విలువ దాని ‘పొసెసివ్’ లక్షణంతో ముడివడి ఉండటమే! అది నికరమైన సొంత ఆకరం - అనే భావన. సంపదల పట్టికలో పుస్తక భాండాగారానికి పెద్దపీటే వేసింది మన వారసత్వం. మనిషిని ఉన్న స్థితి నుంచీ ఉన్నత స్థితికి నడిపించే సాధనం పుస్తక అధ్యయనం అనే అవగాహన ఈనాటి యువతరంలో నెలకొంది. పుస్తక పఠనం ఆత్మవిశ్వానికీ, ఆత్మగౌరవానికీ కూడా చోదకశక్తినిస్తుందనీ యువతీ యువకులకు తెలుసు. అందుకనే ఉత్తమ రచనలూ, సత్తావున్న రచయితల పుస్తకాలూ ఈ ప్రదర్శనలో విరివిగా అమ్ముడుపోతున్నాయి. పుస్తక ప్రదర్శనలు నిజానికి గ్రామస్థాయిలో, మండల కేంద్ర స్థాయిలోనూ నిర్వహింపబడాలి. అప్పుడు ‘ప్రజల వద్దకు పుస్తకం’ అనే నినాదం వాస్తవ రూ పం దాలుస్తుంది. పుస్తక ప్రదర్శనలో భాగంగా ప్రతిరోజూ అనేక సాహిత్య, సాంస్కృతిక సమావేశాలూ, కళా ప్రదర్శనలూ, చర్చాగోష్టులూ ఏర్పాటవుతున్నాయి. దృశ్యశ్రవణ మాధ్యమాలు వ్యక్తి చైతన్య పరిధిని విస్తరింపజేస్తాయి. పుస్తక ప్రియులంతా ఈ కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి. రచయితలే ప్రచురించుకొన్న పుస్తకాల్ని పాఠకులు ఒకింత ఎక్కువ ఆదరణ పూర్వకంగా కొనాలి. చదవాలి. వారి సృజననీ, చిత్తశుద్ధినీ, వ్యయప్రయాసల్నీ అభినందించాలి, ఆదరించాలి. ప్రతి ఏటా నిండు పండుగలా జరుగుతున్న పుస్తక ప్రదర్శనకు ‘జయహో’ అందాం!!

- విహారి
చరవాణి : 9848025600

సాగాలి నిండుగా..
కనువిందుగా...

ప్రతి సంవత్సరం జనవరి 4న నగరంలో ‘విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ’ ఆధ్వర్యంలో జరుగుతున్న పుస్తక ప్రియుల పాదయాత్రలో పుస్తక ప్రియులు కానరావటం లేదు. జాతీయ స్థాయిలో కోల్‌కత్తా బుక్ ఫెయిర్ తర్వాత అంతటి భారీ స్థాయిలో జరిగే బుక్ ఫెస్టివల్ విజయవాడదే కావడం విశేషం. అంతటి ప్రశస్థి కలిగిన ఈ బుక్ ఫెస్టివల్ నిర్వహించే పుస్తక ప్రియుల పాదయాత్రలో పుస్తక ప్రియులు కరువవ్వడం విచారకరం. పుస్తక ప్రియుల పాదయాత్ర నిర్వహిస్తున్నప్పటి నుంచీ ఒక ప్రసిద్ధ రచయిత గానీ, ఆ ఏడాదిలో ప్రత్యేకత కనబరిచిన ప్రముఖులతో జెండా ఊపి ప్రారంభించడం, దీనికి మరో ప్రముఖుడు నాయకత్వం వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. దీనికి నగరం, మారుమూల ప్రాంతాల నుండి కవులు, రచయితలు, పుస్తక ప్రియులు, నగరంలోని పాఠశాల, కళాశాలల నుండి విద్యార్థులు, కవులు, కళాపోషకుల విచిత్ర వేషధారణలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొంటూ ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని కలిగించేవారు. దీనికి మీడియా కూడా భారీ ప్రచారం ఇచ్చేది.
కానీ రానురాను పాదయాత్రలో పుస్తక ప్రియుల కంటే పుస్తకేతరులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల ప్రమేయమే ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో పాదయాత్ర లక్ష్యం నీరుగారుతోంది. అసలు సందేశం ఎవరికి చేరాలో, ఎవరికి చేరుతోందో అర్థంకాని విషయంగా మారింది. దీనికి ఈ కార్యక్రమ నిర్వాహకుల్ని తప్పుపట్టలేం గానీ, దీని రూపకల్పనలో సరైన విధానం అవలంభించట్లేదేమోననే సందేహం కలిగిస్తోంది. గతంలో పాదయాత్రకి నగరంలోని సాహితీవేత్తలకు ఆహ్వానాలు అందేవి. కొందరికి అందకపోయినా సాహిత్య కార్యక్రమం అంటే మన కార్యక్రమం అనే రీతిలో పాదయాత్రలో పాల్గొని తమవంతు సాహిత్యాభిమానాన్ని చాటుకునేవారు. కానీ రానురాను సాహితీవేత్తల్లో కూడా ‘పిలవని పేరంటానికి మనమెళ్లడం ఏం బాగుంటుంద’నే ధోరణి కనిపిస్తోంది. ఒకవేళ ఎవరన్నా ముందుకొచ్చి నగరంలోని సాహితీవేత్తలకు ఎస్‌ఎంఎస్ మెసేజ్ రూపంలోనో, ఫోన్లు చేసి పిలిస్తే ‘సొసైటీ వారు పిలవనిదానికి మీకెందుకు అంత ఆరాటం, ఆర్భాటం’ అనే నిరసన ధ్వనీ వినిపిస్తోంది. ముందుగా సాహిత్యకారుల్లో ఇలాంటి సంకుచిత ధోరణి పోవాలి. పుస్తకం అంటే, అది మనందరిదీ అనే ఆలోచన కలగాలి. అలాగే సొసైటీ వారు కూడా కార్యక్రమం ఎలాగోలా జరుగుతుంది కదా అనే రీతిలో కాకుండా కనీసం నగరంలోని కవులు, రచయితలకు ఆహ్వానాలు పంపాలి. వీలైనంత ఎక్కువ మందిని ఇందులో పాల్గొనేలా చేయాలి. వీలైతే నగరంలోని అనేక సాహిత్య సంస్థలకి, కళా సంస్థలకి తెలియజేసి ఎక్కువ సంఖ్యలో పుస్తక ప్రియులు పాదయాత్రలో పాల్గొనేలా ప్రయత్నం చేయాలి. అంతేగాని విజయవాడ బుక్ ఫెస్టివల్ వారి పుస్తక ప్రియుల పాదయాత్ర అంటే దేశంలోనే భారీగా, గర్వకారణంగా చెప్పుకునే రీతి నుండి, రానురాను గతం కంటే తీసికట్టుగా జరుగుతోందని నవ్విపోయే పరిస్థితిని తప్పించాలి. ఇది పుస్తక ప్రియులందని బాధ్యత. దీన్ని తక్షణం గుర్తించటం ప్రతిఒక్కరి కర్తవ్యం!

చిత్రం... పుస్తక ప్రియుల పాదయాత్రలో పాల్గొన్న ప్రముఖులు (ఫైల్ ఫొటో)

- చలపాక ప్రకాష్,
విజయవాడ.
చరవాణి : 9247475975

email: merupuvj@andhrabhoomi.net

- డా.రామడుగు వేంకటేశ్వరశర్మ