విజయవాడ

పున్ని గుడిశ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడే తూరుపు తెలతెలవారుతోంది. ఆ మసక వెలుతురులోనే పున్నమ్మ లేచి కోడిపిల్లలను గంప ఎత్తి బయటకి వదిలింది. మనవడిని, మనుమరాలిని 3లెగండిరా.. తెల్లారిపోయింది. మోకాలు కడుక్కుని కాస్త సద్దన్నం తిని పనికి వెళ్లండి2 అని కేకలేస్తూ లెగ్గొట్టింది.
పున్నమ్మకి దాదాపుగా తొంభై ఏళ్లుంటాయి. అయినా ఆమె తన పనులు తాను చేసుకుంటూ మనవడికి, మనవరాలికి సాయంగా వుంటూ వాళ్లు బయటికి పనికి వెళితే ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఖాళీ సమయంలో తన తొంభయ్యేళ్ల జీవితకాలంలో అనుభవమైన తీపి జ్ఞాపకాలను, చేదు అనుభవాలను నెమరువేసుకుంటూ ఒక్కోసారి ఆనందపడుతూ, మరోసారి వేదనకు గురవుతూ వుంటుంది. పున్నమ్మను 3పున్ని2 అని ఆమె ఇంటిని 3పున్నిగుడిసె2 అని ఊరి వారంతా పిలుస్తూ వుంటారు.
పిల్లలు బయటకు పనికి వెళ్లిపోయారు. పున్నమ్మ వుంటున్న ఇల్లు ఊరికి అర కిలోమీటరు దూరంలో వుంటుంది. చుట్టూ పంట పొలాలే. ఆ చేలకి కావలిగా వుండేవాడు ఒకప్పుడు ఆమె కొడుకు. ప్రమాదవశాత్తూ చెట్టు నుండి కాలుజారి కిందపడి చనిపోయాడు. అది గతంలో జరిగిపోయిన విషాధ ఘటన. ఆ పంట పొలాల మధ్యలో పది సెంట్ల దిబ్బ ఆమె స్థలం. ఒకపక్క చిన్న పూరిగుడిసె. మిగతా చోటంతా చెట్లూ, కూరగాయల మొక్కలు. ఆ దిబ్బకి ముందర చిన్న పంట కాలువ. ఆ కాలువలో చేపల మావులు పెట్టి చేపలు పట్టి అమ్ముకుంటుంటారు పున్నమ్మ పిల్లలు. పంట పొలాల మీదుగా వచ్చే గాలి చల్లగా, ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది. పొలాల్లో పనిచేసే కూలీలు ఆ దిబ్బమీదికి వచ్చి కూర్చుని అన్నాలు తిని, కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ పనిలోకి వెళ్లిపోతారు.
పున్నమ్మ నులక మంచం వేసుకుని వేపచెట్టు కింద నడుంవాల్చింది. ఆమె మనసు గత జీవిత జ్ఞాపకాల పొరల్లోకి చొరబడింది!
లక్ష్మమ్మ, పార్వతమ్మ చెరో తట్టా చంకలో పెట్టుకొని దగ్గరలో వున్న ఊరికి పెరుగు తెచ్చారు అమ్ముకోవటానికి. కాలువ కట్టనే బయలుదేరి నడుచుకుంటూ వెళుతూ 3అక్కా! మరొక అడుగు వేయి. ఈపాటికి 3పున్నిగుడిసె2 దాటేవాళ్ళం. ఈరోజు ఆలస్యమైంది, తెల్లారిపోతోంది. నడూ నడూ..2 అనుకుంటూ వెళుతున్నారు. ఈ మాటలు విన్న పున్నమ్మ 3మావా! పెరుగొళ్లు కూడా వెళుతున్నారు. తొందరగా లెగు. మావులెత్తు. చేపలెన్ని పడ్డాయో. ఈమధ్య చేపలస్సలు పడటంలా. కాసిన్ని పడ్డా మావుల్లోకి పాములు దూరి చేపల్ని కొరికి తినేస్తున్నాయి. లేలే..2 అంది తన మగడైన సంజీవిని. సంజీవి లేచి కాలువలో దిగి మావులెత్తాడు. పున్నమ్మ చేపల తట్ట తీసుకుని ఒడ్డున కూచ్చుంది చేపల కోసం.
చేపలేమీ పెద్దగా పడలేదు. పాములు మాత్రం నాలుగు దూరాయి. వున్న నాలుగు చేపలను కొరికి తిన్నాయి. చాలా నిరాశ చెందారు వారు. మరుసటిరోజు చేపలు పడటం కోసం మావులలో ఎరవేశాడు. గట్టిగా బిగించి మావులు పెట్టాడు చేపలు జారిపోకుండా. మావులకి కాస్త ఎడంగా కర్రలు పాతి వల ఏర్పాటు చేశాడు ఎగిరిన చేపలు వలలో పడే విధంగా. 3నా సామిరంగా! రేపొద్దున చూడు. మావుల నిండా చేపలు నిండిపోకుంటే నా పేరు సంజీవిగాదే2 అంటూ ధీమాగా చెప్పాడు పున్నమ్మతో మీసాలు దువ్వుకుంటూ!
ఆరోజు రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. కాలువ నీటితో నిండిపోయి కట్టలు తెగి నీళ్లు చేలమీదికి పోతున్నాయి. తెల్లవారుజాముకల్లా వాన కాస్త వెలిసింది. లక్ష్మమ్మ, పార్వతమ్మ పెరుగు తేవటం కోసం కాలువ కట్టనే నడక ప్రారంభించారు. కాలు నిలవటం లేదు. అంతా బురద. కాలు జారిందంటే ఏకంగా కాలువలో పడిపోవటమే. 3అక్కా! జాగ్రత్తగా నడు. కాలి బొటనవేలు నేలకు గుచ్చి నడు2 అంది పార్వతమ్మ. 3అక్కా! పున్నిగుడిసె దగ్గర పెద్ద గండి పడినట్టుంది. నీటి మోత వినిపిస్తా వుంది2 అంది చెల్లెలు. పున్నిగుడిసె దగ్గరకు చేరారు ఇద్దరూ. గండికి కొంచెం అవతల మావులు కనిపించాయి. మావులకు కట్టిన వలలో చేపలు ఎగిరిపడుతున్నాయి. వాటి బరువుకి వల తెగిపోయేలా వుంది. అది చూసిన వీళ్లు పున్నమ్మను లెగ్గొట్టారు. అప్పుడు పున్నమ్మ సంజీవిని లెగ్గొట్టింది. సంజీవి వచ్చి వలలో చేపలను బుంగలో వేసుకున్నాడు. ఆ తరువాత వాళ్లను గండి దాటించి అవతల వైపుకి పంపించాడు.
తరువాత మావులెత్తాడు. మావు చేతికి లెగవటం లేదు. అది చేపలతో నిండిపోయి వుంది. ఇక సంజీవి, పున్నమ్మ ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. ఆరోజు చేపలను ఊరిలోకి తీసుకెళ్లి అమ్ముకుని బాగా డబ్బులు సంపాయించారు వారు. ఇంటిలోకి కావలసిన సరుకులన్నీ కొని పున్నమ్మకు ఇచ్చి షావుకారి దగ్గర వేరే కూలిపని వుందని పున్నమ్మను ఇంటికి పంపించి తను ఊరిలోనే వుండిపోయాడు సంజీవి.
3డబ్బులొచ్చాయి గదా అని తాగి తందనాలడకుండా తిన్నగా ఇంటికేరా! ఆఁ..2 అంటూ ఒక విసురు విసురుకుని వెళ్లిపోయింది పున్నమ్మ.
పొద్దుగూకి పోయింది. మగడు ఇంటికి రాలా. పున్నమ్మకి మనసులో ఏదో దిగులు, భయం. బాగా చీకటిపడింది. ఊరంతా కరంటు దీపాల వెలుగులో మెరుస్తా వుంది. పున్నమ్మ మాత్రం సీసాబుడ్డి వెలుగులో మగని కోసం కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తా వుంది. 3దారి బాగోలేదుగా! ఏ సామి దగ్గరో సావిట్లో పడుకుండిపోయి వుంటాడేమో?2 అని తన మనసుకి తానే సమాధానం చెప్పుకుంది.
తెల్లగా తెల్లారిపోయింది. కాలువకట్ట మీద జనం గుమిగూడారు. 3అరెరే! సంజీవి మందెక్కువ తాగి నడవలేక జారి కాలువలో పడిపోయాడు. ఎంత కష్టమైన పనైనా సునాయాసంగా చేయగలిగిన బలమైన మనిషి. మంచి మనసున్న మనిషి. ఈ దురలవాటు వల్ల బలైపోయాడు. అయ్యో పాపం!2 అంటూ అందరూ బాధపడ్డారు. షావుకారు కూడా అక్కడికి వచ్చాడు. 3కట్టంతా బురద గదా. అందులోనూ మందు తాగి వున్నావు. ఈ రాత్రికి మా సావిట్లో పడుకుని పొద్దునే పోరా.. అన్నా వినకుండా, మాయాడది ఎదురుచూస్తుంది.. అని చెప్పి వచ్చేశాడు2 అంటూ చెప్పుకొచ్చాడాయన. సంజీవిని నీటిలో నుంచి తీసి ఒడ్డున పడేశారు జనం. ఈ జనాన్ని చూసి పున్నమ్మ పరుగు పరుగున వచ్చింది. కాలువలో పడి చేపలు పీక్కుతిన్న సంజీవి నిర్జీవ దేహాన్ని చూసి పున్నమ్మ గుండె పగిలేలా రోదించింది. అది చూసినవారి హృదయం బాధతో బరువెక్కింది.
3మామ్మా!2.. అంటూ వినిపించిన పిలుపుకి జ్ఞాపకాల పొరలను తోసుకొని ఈ లోకంలోకి వచ్చింది పున్నమ్మ. 3ఏంటి మామ్మా! మొఖం అట్టా వుంది. కళ్లనిండా నీళ్లేంటి?2 అడిగాడు మనవడు. వాడి మాటలు ఆమె పట్టించుకోలేదు. కానీ వాడి నోటి వంకే చూస్తా వుంది. వాడు ఏదో పళ్ల సందుల్లో పెట్టుకున్నాడు. ఎర్రటి ఉమ్మి వేస్తున్నాడు.
3ఒరేయి! అలాంటి చెడలవాట్లకు బానిసలు కాకండిరా2 అని బిగ్గరగా అరిచింది. మామ్మ అలా కోపంగా అరవటం వాడు ఎప్పుడూ చూడలేదు. ఆమె కళ్లు నిప్పుకణికల్లా మండిపోతున్నాయి. ఆమె వైపు చూడాలంటే భయంగా వుంది వాడికి. 3ఒరేయి2.. అని మరోసారి బిగ్గరగా గర్జించినట్టు అరిచింది. ఉలిక్కిపడ్డాడు వాడు.
3ఒరేయ్! ఈ చెడ్డ అలవాట్లకు బానిసలు కావటం వల్లేరా మీ తాత, మీ నాన్న అద్ధంతరంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏం ఆనందం వుంది అందులో. మీరు రోగాలపాలు కావటం ఆనందమా? భార్య బిడ్డలను అనాథలుగా మార్చటం ఆనందమా? ఏముంటుంది అందులో చెప్పవేరా, చెప్పు?2 అంటూ ఆవేదనతో ప్రశ్నించింది మనవడిని. మామ్మ కేకలకు మనవడు ఆలోచనలో పడ్డాడు.
పున్నమ్మ ఆవేదనతో వాడిమీద అరుస్తూనే వుంది. అప్పుడు మామ్మకు చెప్పాడు వాడు- 3ఈరోజు నుండి చెడ్డ అలవాట్లను మానేస్తాను మామ్మా2!.. అంటూ చేతిలో చెయ్యి వేసి మాటిచ్చాడు!

- వంగర యతేంద్రబాబు,
ఐలవరం, గుంటూరు జిల్లా.
చరవాణి : 7893353816

చిన్న కథ

మామ్మ - మనవరాలు!

బాల్యంలో తల్లిదండ్రుల ప్రేమ, పెళ్లయ్యాక భర్త ప్రేమ, బిడ్డలు కలిగాక వారి ప్రేమలో మార్పులు కనిపిస్తున్నాయి. కోడలు, అల్లుడు వచ్చాక నాకు వారిచ్చే ప్రేమలో కోత! అప్పుడొచ్చింది పవిత్రప్రేమ.. చంకలో పలకనుంచుకుని ‘మామ్మా! బలికి పోతున్నానం’టూ గడప దాటుతున్న పవిత్రను ఆపి, ఎదురింటి బన్నీని, వాడి ఆటవస్తువుల సంచీని తీసుకొచ్చి తన ముందుంచాను. పట్టాలు రౌండుగా అమర్చి వాడు రైలును పరుగెట్టిస్తే, కీ ఇచ్చి బస్సును వదిలింది పవిత్ర. వాళ్లిద్దరూ పూర్తిగా ఆటలో మునిగిపోయాక పుస్తకం చేతిలోకి తీసుకున్నా.
పవిత్ర చదువు పూర్తయింది. సంబంధాలు చూస్తున్నారు. ‘అమ్మా! నాన్న తెచ్చిన ఏ సంబంధమూ నచ్చడం లేదెందుకు? వాళ్లు నన్ను అమెరికానో, ఆస్ట్రేలియానో పంపేయాలని చూస్తున్నారు. నేను నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా వుండలేను మామ్మా!’
ఆశ్చర్యంగా చూశాను. ‘అదెలా కుదురుతుందే..! అయితే అసలు పెళ్లి చేసుకోవా?’
‘ఎదురింట్లో నేవున్నాననుకో. అప్పుడు గేట్లో నిలబడితే చాలు, రోజూ కనబడతావు కదా!’ ముసిముసిగా నవ్వుతూ అంది.
విషయం అర్థమైంది. ‘అమ్మా, నాన్నా ఒప్పుకోరు కదే!’
‘అందుకే వాళ్లతో చెప్పకుండా ఈరోజు రాత్రి లబ్బీపేట వెంకటేశ్వర స్వామి గుళ్లో మా ఫ్రెండ్స్ సహకారంతో...!’
‘ఇంత ధైర్యం నీకెక్కడ నుంచి వచ్చిందే?’
‘నీ దగ్గర నుంచే! ముహూర్త సమయానికి ఫోన్ చేస్తాను. అమ్మా, నాన్న వాళ్లతో నువ్వు కూడా..’
రాత్రి తొమ్మిదింటికి హడావుడిగా బయటికి వెడుతున్న కొడుకు, కోడలి వెనగ్గా నడుస్తూ ‘నేను కూడా వస్తానురా’ అన్నా.
‘మేమెక్కడికి వెడుతున్నామో తెలుసా?’ అడిగేడు ఆశ్చర్యపోతూ!
‘ఆవిడకి తెలియకుండా ఏమీ జరగవు’ నన్ను కోపంగా చూస్తూ అంది కోడలు. అయోమయంగా మా ఇద్దరి వంకా చూశాడు మావాడు.
‘ముహూర్తానికి టైమయిపోతోంది త్వరగా పదండి’ అంటూ ముందడుగు వేశాను. అప్పుడే ఎదురింటి ముందునుంచి ఒక ఆటో కదిలింది.
‘మగ పెళ్లివారికి కూడా ఇప్పుడే తెలిసింది. వాళ్లు బయలుదేరిపోయారు. ఏమిటాలస్యం చేస్తున్నారు?’ కోపంగా అన్నాను. తలొంచుకుని నా వెనుక కొడుకూ, కోడలు...!

- కాశీభొట్ల సరస్వతమ్మ,
నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా.

పుస్తక పరిచయం

మానవత్వపు తడి కోసం తపించే ‘దిగివచ్చిన గగనం’

డా. సిహెచ్ ఆంజనేయులు మంచి మనసున్న కవి. ప్రేమైక జీవి. వృత్తి తెలుగు అధ్యాపకులు. ఆ తెలుగునే అభిమానిస్తూ, ఆరాధిస్తూ.. ఎందరో విద్యార్థులకు తెలుగుభాష పట్ల మక్కువ కలిగేలా సరళంగా, సూటిగా బోధించడంలో నేర్పరి. తన అణువణువును తెలుగుమయం చేసుకొని, ప్రవృత్తిగా కవిత్వాన్ని స్వీకరించారు. వీరి 30 సంవత్సరాల సాహిత్య కృషిలో ముచ్చటగా మూడో కవితా సం పుటి ‘దిగివచ్చిన గగనం’ వెలువరించారు. అందుకు శుభాభినందనలు.
సమకాలీన సంఘటనలు, సామాజిక రుగ్మతలే కాదు, మనిషితనాన్ని కోల్పోతున్న మానవాళి తీరుపై దృష్టి సారించారు కవి. ‘ఇప్పుడు మనిషి మాటలో తడి లేద’ని ఓ కవితలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాత్రి రాలిన పుష్పాల్లా’.. పొట్టచేత పట్టుకొని బతుకు తెరువు కోసం వలసపోతున్న కూలీలను కవిత్వం ద్వారా దర్శించారు. కష్టజీవుల పట్ల సానుభూతిని ప్రకటించారు. బతుకు వెనె్నల ప్రవాహంలా హాయిగా, ఆనందంగా సాగిపోవాలనే బలమైన కాంక్షను వ్యక్తపర్చారు.
మనిషి బాహ్య క్రియలను అంచనా వేయడం, పసిగట్టడం చాలా తేలిక. కానీ మనసు ప్రదర్శించే లీలలను అవగతం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనసుది అంతరంగ స్వరూపం. ఈ కవి రవి గాంచనిచోట కవిగాంచును అన్న నానుడిని రుజువు చేస్తూ.. మరో కవితలో మనసు విభిన్న పార్శ్వాలను స్పృశిస్తూ ‘మనసు ఒక రహస్య పేటిక’ అంటూ అద్భుతంగా కవిత్వీకరించారు. ప్రపంచీకరణ విలయతాండవానికి విలవిల్లాడుతున్న పచ్చని పల్లెల దుస్థితిని అర్ధ్రంగా తడిమారు ఓ కవితలో. ‘నిన్నటి వరకు మమకార తీగలతో/ మనషుల చుట్టూ అల్లుకున్న పల్లె/ నేడేమో నగరం ఎడారి ఆత్మల మధ్య ఏకాకిగా మారింది’.. అంటారు. పల్లె పట్ల తనకున్న వల్లమాలిన అభిమానాన్ని తల్చుకుంటూ తల్లడిల్లారు.
అవనికి అన్నం పెట్టే దేవుడు కర్షకుడు. ఊహించని అవరోధాలు సాగుకు అడ్డుపడుతూ రైతుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్న సందర్భమిది. ‘మనిషి మీద మనిషికి భరోసా లేక లోకంలో/ క్రిందపడ్డ మట్టి మనిషిని కాస్త లేవదీసి/ నిటారుగా నిలబెట్టండి/ కొత్త ఊపిరిలూది ధైర్యాన్నివ్వండి చాలు’ అంటూ రైతు పక్షాన నిలబడి సమాజానికి హితబోధ చేయటం కన్పిస్తుంది.
ఈ సంపుటికి కవిత్వపు సొగుసులు అద్దిన కవితల్లో ‘తడీ పరిమళం’ ఒకటి. ‘తడి అంటే నాకిష్టం/ గుండె కింద తడి లేకపోతే/ ఏవీ మనల్ని హత్తుకోవు.. ఆకర్షించలేవు’ అంటూ ఆర్ధ్రత కలిగిన పదబంధాలతో పాఠకుల మనస్సులో ఆలోచన తరంగాలను సృష్టించారు. మనిషికి మనిషికి మధ్య దూరం పెరిగితే మిగిలేది దుఃఖమేనని, మానవత్వంతో, మనిషితనంతో మనుగడ సాగిస్తేనే జీవితానికి అర్థం, పరమార్థమని చక్కటి భావాన్ని ప్రోది చేశారు. ‘తడి స్పర్శ తగిలినప్పుడే/ ఏ నేలైనా మొలకెత్తి, చిగురించి/ పల్లవించి విరిసి పూలు కాయలై/ ఫలాలు పండేవి’ అంటారు ఈ కవితలో. నిజమే. తడిలేని మనిషి జీవములేని రాయిలాంటి వాడు. ఈ కవికి మంచి అభివ్యక్తి ఉంది. చక్కటి శైలి ఉంది. కవి ఊహాల్లోంచి ఊపిరి పోసుకున్న అక్షరాల్లో గాఢత పరిమళిస్తుంది.
యాంత్రిక జీవనం, పరారుూకరణ, ప్రపంచీకరణల నుండి బయటపడి, బుద్ధిజీవుల్లో వికాసం జరగాలని ఈ సంపుటిలోని 81 కవితలు దిశా నిర్దేశం చేస్తున్నాయి. అందమైన ముఖ చరిత్రంలో పాటు, ఆచార్య బన్న అయిలయ్య, వంశీకృష్ణ గార్లు అందించిన పీఠికలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. కవి కలం నుండి మంచి రసాస్వాదన కలిగించే ఇలాంటి కవిత్వ ధార మున్ముందు మరింత జోరుకావాలని, పాఠక లోకానికి కవి ఇంకా చేరువకావాలని కోరుకుందాం.

- రాచమళ్ల ఉపేందర్,
ఖమ్మం.
చరవాణి : 98492 77968

వేదిక

21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సభ

టూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెలా నిర్వహించే 3ప్రతి మాసం - రచన కోసం2 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సభ నిర్వహిస్తున్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో అన్నమయ్య కళావేదికపై మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సభ జరుగుతుంది. సభకు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య అధ్యక్షత వహిస్తారు. గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కెవి శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
అనంతరం 3‘దేశభాషలందు తెలుగు లెస్స’2 పేరిట శ్రీకృష్ణదేవరాయల సభ జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయలుగా గుంటూరు శ్రీనాథ పీఠం సంచాలకులు పిఎస్‌ఆర్ ఆంజనేయప్రసాద్, తిక్కన సోమయాజిగా విజయవాడకు చెందిన విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు పింగళి వెంకటకృష్ణారావు, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగా విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, కవయిత్రి మొల్లగా విశ్రాంత ప్రాచార్యులు డా. వి నాగలక్ష్మి, గురజాడ అప్పారావుగా విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు జంధ్యాల మహతీశంకర్ పాల్గొంటారు. యువ కవులు, రచయతలు సాహితీ మిత్రులంతా పాల్గొని సభను విజయవంతం చేయాలని గుంటూరు జిల్లా రచయితల సంఘం ఒక ప్రకటనలో కోరింది.

మనోగీతికలు

ఆత్మనాదం
తెలుగు వేదం!
సీ. శాసనారణ్యాల సరసాల మురిపాల
దివ్వెలై-రవ్వలై-నవ్వుభాష
జ్ఞానపథంబులౌ జానపదాలలో
అందమై-అరవిందమైన భాష
విన్నాణపున్ రుచిన్ వెన్నపూసై-స్వచ్ఛ
‘నీతిచంద్రిక’లతో నెగడు భాష
వలయుచో పిడుగుగా-వనె్నల వెనె్నల
గొడుగుగా-వాడుక నడరుభాష
అభ్యుదయభావ విప్లవంబైన భాష
‘పెద్దబాలశిక్ష’గ వెల్గు ముద్ద్భుష
పూర్ణ ‘ముత్యాలసరవౌ’చు మురియుభాష
కలిత వాత్సల్యసురయోష-తెలుగుభాష!

సీ. భవ్యోరు రసమహోత్పలము నాదు తెలుంగు
పరిమళభరిత చంపకము తెలుగు
గర్జనశార్దూల ఘనము నాదు తెలుంగు
ఊర్జిత మత్త్భేమోయి! తెలుగు
మేలైన రంగు సీసాలు నాదు తెలుంగు
కందమాకందంబుగాదె! తెలుగు
లలితయోగిని ఆటవెలది నాదు తెలుంగు
కేతనంబౌ తేటగీతి తెలుగు
వెలుగు ఇహపర సాధన ద్విపద తెలుగు
కల్పతరువోజ తీరగాదె! తెలుగు
నవవినోదాత్మనాదంబు నా తెలుంగు
చేతనోద్దీప్తవేదంబు నా తెలుంగు!

సీ. శారదాపతకమ్ము-సంఘజాతకము-్భ
క్తిపతాక-శతకమే తెలుగు గాదె!
భువనైక విజయాది నవరూపక ప్రద
ర్శన దివ్యదీప్తియే తెనుగు గాదె!
‘నటనాలయై’క విస్ఫుటమానవానుబం
ధన సుదర్శన కాంతి తెనుగు గాదె!
బహుళావధాన సర్వవ్యాప్త పద్యపు
దీప్తిమత్ ‘తిరుపతి’ తెలుగు గాదె!
మనలఁజెవికోసికొనఁజేయు మహితమైన
‘ఏడు చేపల కథ’గాదె! ఎల తెలుంగు
ఘనము కర్ణాటక సంగీతకంబు తెలుగు
హరికథయె-బుర్రకథయె పో! అసలు తెలుగు
వందనంబులు - సాహితీ చందనములు!

- డా.రామడుగు వేంకటేశ్వరశర్మ,
గుంటూరు.
చరవాణి : 9866944287

మరో మాతృమూర్తి మన భాష
తెలుగంటే వెలిగే కిరణం
తెలుగంటే సాహితీ సమరం
తెలుగుజాతికి మూలధనం
ఆదికవి విరబూయించిన అక్షరమాలలు
జీవనదిలా ప్రవహించే మనభాష
తరతరాలకు తరగని పెన్నిధిలా
తెలుగుభాషలోని తియ్యదనం
తెలుగు పలుకుల కమ్మదనం
తెలుగంటే ఉవ్వెత్తున ఎగసే గోదారి
తెలుగంటే పసిడి పంటల మాగాణి
సరిగమ పదనిసలలో కొలువై
సాహితీ పరిమళాలు వెదజల్లిన వేదసరస్వతి
అమ్మకన్న మధురమైనది
అవని అంతా పరుచుకొన్నది
నన్నయ కాలంలో కావ్యమై
త్యాగయ్య గళంలో శ్రావ్యమై
తెలుగుతల్లిని కీర్తించిన కృష్ణదేవరాయల
ఘనతకెక్కిన చరిత్ర శాశ్వతమై
విలువలు తరిగిపోతున్న సమాజానికి
అక్షర సంస్కృతిని నరనరాన నింపి
నిలువెత్తు జాతి గర్వపడేలా
సంస్కృతి సంప్రదాయాలకు కంచుకోటలా
అన్యభాషలెన్ని ఉన్నా.. మరువకు మాతృభాష
అచ్చతెలుగు పదాలలో ఒద్దికగా దిద్దుకొన్న
ఓనమాల భాష.. మరో మాతృమూర్తి తెలుగుభాష
తెలుగు భాషామతల్లి కావ్యమందారాలై
అమ్మప్రేమలా అజరామరమై
అక్షరాలు అంతరించకుండా
అ,ఆ నుంచి గుణింతాలు, దీర్ఘాలతో
నిత్యం ప్రవహించే తెలుగుగంగ నా భాష!

- ఉపద్రష్ట మానస,
గుంటూరు.
చరవాణి : 9550486434

మన భాషను మనం
రక్షించుకుందాం..
తెలుగు రాష్ట్రానికి కావాలి భాష వెలుగు
పరభాషా మాధ్యమాలు చాలించండి, చాలు
తెలుగు అక్షరానికి కలగాలి సంపెంగ సౌరభం
సాహితీపరులకు తెలుసు భాష మెరుపు
ప్రభువులకు పట్టాలి మాతృభాష భవిత
నాయకులకు కలగాలి భాషపై పటిమ
ఎరుగండి దండిగా భాషపై ఆలోచన
నామమాత్రపు ఒదుగు మంత్రిత్వ శాఖ
ఆదరణ దిశలోన అధ్యయనదారులు
సాంస్కృతిక శాఖ తెలుగు భాషాశాఖలు
విడివిడిగా చేసి అమలుపర్చండి బాబులు
భాష ప్రాబల్యాన్ని భావితరాలకు
విహరింపజేయండి హరివిల్లు సొగసున
కవులు మాత్రమే కలవరింతురు భాషపై ప్రీతిని
పెంపు చేయండి భాషను విద్యాలయములందు
ఆంగ్లమును వదలండి కార్యాలయలందు
పెంచండి తెలుగును పేరోలగమున
వ్యాప్తిచెందించండి వ్యాకరణ దశను
భాష తెలియని దశన భారమైయుండును విద్య
మాతృభాషకు కలదు మాధుర్యపు సౌరభం
జ్ఞానపీఠము పొందిన ఆచార్యులున్నారు
భాష భావ మెరిగిన వారు బహుమంది కలరు
కూడగట్టండి అందరిని కూరిమి దిశన
నిలపండి వారిని కూరిమి మంత్రాన
దేదీప్యమానాన వెలిగించండి భాషను
తెలుగువారలమై యుండి తెగువలేకుండా
భాష తెలియకున్నారు భగీరథులుగాను
కనికరించండి కవులను భాష వెలుగుల జోరుకు
పెంచండి భాషను ప్రచండ వెలుగుల
అందలం ఎరుగక భాష అణగారియున్నది
నిబంధనలు నిజముగా నీటివ్రాతలు గాక
అమలుపర్చండి భాషను అందలాల మూలల
రాజమకుటం లేక రాణించునా భాష
తెలుగుభాషకు పెట్టండి ప్రత్యేక అకాడమీ
ఆలోచించండి ప్రభువులు భావయుక్తమున
జయముచేకూర్చండి భాషకు వాగ్దేవిరాణిగా!

- తన్నీరు సీతారామాంజనేయులు,
జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా.
స్థిరవాణి : 08654 224726

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

email: merupuvj@andhrabhoomi.net

- వంగర యతేంద్రబాబు