విజయవాడ

నన్ని ఎవరైనా గుర్తించరా.. కళ్లకద్దుకుని దాచుకోరా! (చిన్ని కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయికుమార్ ‘కౌన్’లో ఎనిమిది లక్షలు గెలుచుకుని ఇంటికి చేరగానే దిష్టితీసింది ఇల్లాలు. పై నోటు తీసి ఆమెకిచ్చాను.
వీక్లీలో వుంచి ‘స్నానం చేసి రండి. భోజనం చేద్దాం’ అంది. కబుర్లు చెప్పకోవడంలోపడి వీక్లిని పక్కింటి పాప తీసుకెళ్లడం చూడలేదు.
తరువాత వాళ్లింటికెళ్లి చూస్తే నోటు మాయం. దారంతా వెదికాము. దొరకలేదు.
నోటు: వీక్లీలోంచి జారిపడిన నేను సైడు కాలువలో పడ్డాను గాలికి. కార్పొరేషన్ వాడు చెత్తతో కలిపి నన్ను బయటపడేశాడు. వళ్లంతా కంపు. చెత్తకుండిలో నుంచి ఊరి చివరకి చేరాను. అక్కడి కంపు భరించలేక ఎగిరి దూరంగా పోదామంటే నాపైన కాల్గేట్ ఖాళీ ట్యూబ్. మర్నాడు ఎవడో వచ్చి చెత్తకి నిప్పుపెట్టాడు. భయంతో వణికిపోయాను. ఇంతలో చెత్త ఏరుకునే కుర్రాడు వచ్చి ఖాళీ ట్యూబ్‌ని తీసుకుని సంచిలో వేసుకున్నాడు. సైడు కాలవలో తడిసి నా రూపం గుర్తించనంతగా మారిపోయింది. నన్ను ఎవరూ గుర్తుపట్టడంలేదు. గుర్తిస్తే కళ్లకద్దుకుని తీసుకునేవారు. కొద్ది గాలికే దూరంగా వెళ్లిపోయి ఊపిరిపీల్చుకున్నా కాలిపోకుండా బతికినందుకు సంబరపడ్డాను. ఈ రూపంలో బతక్కపోతేనేం? అనుకోలేదు. ఒక మామ్మ మనవడికి చెప్పిన కథ గుర్తుకొచ్చింది. బోధిసత్వుడు మరుజన్మలో ‘నేను ఒక పందికి పది పిల్లల్లో ఒక దానిగా పుడతాను. నా ముఖాన పెద్ద తెల్లని మచ్చ వుంటుంది. నన్ను గుర్తించి చంపేయండి’ అన్నాడట. భక్తులు అలాగేనని పంది సంతానాన్ని పరిశీలించి చంపబోయారు చనిపోయి పంది కడుపున పుట్టిన బోధిసత్వుణ్ని. ‘నాకీ జన్మ బాగానే వుంది. నన్ను చంపకండి’ అంటూ పారిపోయిందట పందిపిల్ల. నిన్నటి దాకా నన్ను ఎవరూ గుర్తించి కళ్లకద్దుకోలేదని, ఇప్పుడు కాలిబూడిద కాకుండా వికారంగానైనా బతకాలని..!

- కోట సావిత్రి, విజయవాడ

కథ

ఆప్యాయతలకే ఆరాటం

‘నాకు రెండు ముక్కలు’
‘నాకు ముక్కలు వద్దు, వట్టి పిండి మాత్రమే’
వేసవిలో పిల్లల సెలవులు.. తాత గారింట్లో దొడ్లో అరుగుమీద చద్దన్నాల తతంగం. పెద్ద మామయ్యకి ముగ్గురు.. చిన్న మామయ్యకి ముగ్గురు, పిన్నమ్మ పిల్లలు నలుగురు మొత్తం పది మంది. పిల్లలతో చాలా విసుగు కలిగించే ఆ సెక్షన్‌కి అత్తయ్యలిద్దరూ దూరం. నేనే ఆ కార్యక్రమం పూర్తిచేస్తాను. దొడ్లో పది కొబ్బరి చెట్లు. వారానికి మూడురోజులు కొబ్బరి పచ్చడి. అది లేనిరోజున ఆవకాయ, మాగాయ.. నాలుగు గేదెల పాలు పితికి తేగానే కాచే పని నాదే. పిల్లలందరికీ చద్దన్నాలలో ఉట్టిమీద కుండలోంచి గడ్డపెరుగు తీసి, ఆవకాయ అన్నంలో గడ్డపెరుగు అద్దుకుని.. మాగాయ పచ్చడిని రోట్లో వేసి.. నాలుగు పచ్చిమిర్చి వేసి తొక్కి, పెరుగు కలిపి.. అదంటే అందరికీ ఇష్టం.
కంచాలు తీసి నూతి దగ్గర పనమ్మాయికి వేసి చేతులు తుడుచుకుంటూ మధ్య గదిలోకి వచ్చేసరికి బుల్లిమామయ్య రామశర్మ ‘శ్రమైక జీవన సౌందర్యానికి సమానమన్నది లేనేలేదని’ అంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు.
ఆ ఇంటికి రాగానే గతమంతా కళ్ల ముందు మెదిలింది. పిల్లలు అమెరికాలో.. కొంతమంది దేశ రాజధాని ఢిల్లీలో..
ఒక్కసారి సొంత వూరిని (చిన్నప్పటి రోజుల్ని తలుచుకోవాలని) చూసి రావాలని అనిపించి వచ్చాను. రాముడు మామయ్య పొలంలో పాముకాటుతో..
చిన్న మామయ్య వాళ్లు అక్కడే ఆ ఇంట్లోనే. నన్ను పెంచింది చిన్నత్తే. అందుకే చిన్నత్త ఒక్కతే ఆప్యాయంగా పలకరించింది.
‘తొమ్మిదింటి వరకూ ఎవరూ నిద్ర లేవరమ్మా.. చల్లారిపోతుందని ఆలస్యంగానే టిఫెన్లు చేస్తాను’ అంది వంటావిడ.
చిన్నత్త లేచి కాఫీ కలిపి ఇచ్చింది. ఏడింటికి పెనం మీద ఫ్రిజ్‌లోని అట్లపిండి తీసి నాలుగు అట్లు వేసిపెట్టింది. ‘నీకు మినపట్లంటే చాలా ఇష్టం కదూ’ అంది నవ్వుతూ. నుదురు బోసిగా, గుండ్రని తెల్లని ముఖం మీద నయాపైసంత కుంకుమతో. కచ్చాపోసి చీరకట్టి తులసికోట చుట్టూ తిరుగుతూ.. ‘ఏమిటి.. మళ్లీ గతంలోకి వెళ్లిపోయావా?’ చిరునవ్వుతో అత్తయ్య పలకరింపు. తల్లి లేని నేను చిన్నత్తలో అమ్మను చూసుకున్నాను. ముఖ్యంగా ఆమె కోసమే వచ్చాను.
‘ఏమిటి బట్టలు సర్దుకుంటున్నావు. పదిరోజులు వుంటానన్నావుగా?’ అంది.
‘నువ్వు తప్ప ఎవరూ నన్ను పలకరించడం లేదు. నా రాక వాళ్లకి ఇబ్బందిగా వున్నట్లుంది అందుకే..’ అన్నాను.
‘తాతగారు నీకు కూడా ఒక ఎకరం పొలం రాశారు వీలునామాలో. నువ్వు - నాకేమీ ఆస్తులు వద్దు.. మీ ఆప్యాయతలు, అభిమానాలు చాలంటూ వుంటావు. ఇప్పుడు నువ్వు ఆ ఎకరం పొలం కోసం వచ్చావేమోనని వాళ్ల అనుమానం’ చెప్పింది.
‘లేదత్తా! నేను పెద్ద మామయ్య ఆశీస్సుల కోసమే వచ్చాను. ఆయన నన్ను చూసి రెండుమాటలు మాట్లాడదామంటే పొలానికెళ్లినవాడు ఇప్పటివరకూ ఇంటికి కూడా తిరిగి రాలేదు’
‘బావగారంతే! ఎక్కువగా పొలం దగ్గర ఇంట్లోనే. అప్పుడప్పుడు వస్తూ వుంటారు. పిల్లల అలవాట్లు ఆయనకి నచ్చవు. ఆయన్ని ఎవరూ గౌరవించడం లేదు. ఇక్కడుండి మనస్తాపం చెందేకంటే.. అక్కడే..’
‘నువ్వు నా వెంట రా అత్తయ్యా! పదిరోజులు సరదాగా కబుర్లతో గడిపేద్దాం’ ఆహ్వానించాను.
‘కుదరదే! నేను లేకుంటే ఈ ఇంట్లో ఏదీ జరగదు. ముఖ్యంగా పిల్లల స్కూలు టైముకి బాక్స్‌లు అందించడం’
‘పిల్లల సంగతులు కూడా చూసుకోదా నీ కోడలు’
‘ఉద్యోగం చేస్తోంది కదా. పూర్వం రోజుల్లో ఉద్యోగం పురుష లక్షణం.. ఇంటి పని, పిల్లల పని భార్య చూసుకునేది. ఇప్పుడు భార్య కూడా సంపాదనలో పడ్డాక పిల్లల్ని చూసుకునే బాధ్యత మాలాంటి పెద్దలపై పడింది’ వివరించింది.
‘నాకిక్కడి వాతావరణం నచ్చలేదు. వెళ్లిపోతున్నాను. నీకెప్పుడైనా రావాలనిపించినప్పుడు నా దగ్గరికి రా అత్తయ్యా’ మరోసారి అడిగాను.
‘తప్పక వస్తాను. పిల్లలు కొద్దిగా పెద్దవాళ్లయ్యాకా.. ఈ పదివేలు తీసుకో.. ఏమైనా కొనుక్కో’ అంటూ చేతిలో వుంచింది.
పిల్లలు నా వంక, నా చేతిలో డబ్బు వంక చూస్తున్నారు.
అందరికీ తలో నోటూ ఇచ్చాను.
‘ఈ డబ్బు తీసుకోకపోతే నువ్వు బాధపడతావని తీసుకుంటున్నా. నాకు మీ ఆశీస్సులు కావాలంతే. సుప్రియ పెళ్లికి శుభలేఖ పంపితే వస్తాను’ ముక్తసరిగానే చెప్పాను.
ఆటో తెచ్చాడు పెద్ద మామయ్య మనవడు. రైలెక్కుతూ వాడి చేతిలో రెండువేలు వుంచాను.
‘నాకు డబ్బు వద్దు. ఆప్యాయంగా పలకరించే వారు చాలు- అని మీ అమ్మానాన్నలతో చెప్పు’ అన్నాను.
తలూపాడు. వాడి కళ్లల్లో తడి. నా కోసం ఇక్కడ ఇద్దరు. చిన్నత్త.. వీడూ..!

- అపర్ణా దీక్షిత్

మినీకథ
పోలీసు ఉద్యోగం

అతను ఓ ప్రైవేటు ఉద్యోగి... బాగానే చదువుకున్నాడు... పోలీసు ఉద్యోగం అంటే చాలా ఇష్టం. ఈ వ్యవస్థను మార్చేది కేవలం పోలీసు మాత్రమేనని అతని అభిప్రాయం. అతని పేరు క్రాంతి. అతనికి ఎవరూ లేరు.. ఆస్తిపాస్తులు అంతకన్నా లేవు. ఉన్నది కేవలం తల్లి మాత్రమే...! నాలుగైదు తెలుగు పోలీసు సినిమాలు చూసి ‘అబ్బ’ ఏరోజుకైనా ఖాకీబట్టలు తనవంటిమీద ఉండాలని బలంగా నిర్ణయించుకున్నాడు. క్రాంతికి అమ్మ అంటే కూడా చాలా ఇష్టం. తండ్రి చనిపోయిన తర్వాత అమ్మ క్రాంతిని చదివించింది. తాను తిన్నా... తినకపోయినా నాలుగు ఇళ్లల్లో పాచిపని చేసి క్రాంతిని ముద్దుగా చూసుకుంది. తన ప్రైవేటు ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నా ఏమాత్రం సమయం దొరికినా... తల్లి దగ్గరే ఉండటానికి ఇష్టపడేవాడు. వయసు ఉడికిన తల్లి నేత్రాల్లో నిరాశ... దృశ్యాలు చూసి ఎలాగైనా తన తల్లిని సుఖపెట్టాలని అనుకునేవాడు. ఏదో పేరుకి తాను ఉద్యోగం చేస్తున్నా... ఇంకా పదో పరక తల్లి ఇస్తున్నప్పుడు తనకోసం తల్లి ఎంత బాధపడుతోందో అనే ఆలోచన కంటనీరు తెప్పించేది.
ఓ రోజు ఏదో పనిమీద ‘పలాస’ వెళ్లాడు క్రాంతి. సమయం చాలా అయ్యింది. అప్పుడు సమయం రాత్రి పది గంటలు. తెల్లవారి యశ్వంత్‌పూర్ రైలుకి మాత్రమే టిక్కెట్టు చార్జీలు ఉన్నాయి. క్రాంతి ఉండేది శ్రీకాకుళం. ఆ రాత్రి నీళ్లతో కడుపు నింపుకుని ‘పలాస’ రైల్వేస్టేషన్‌లో పడుకున్నాడు. రోజంతా శ్రమపడడం వలన బాగానే నిద్రపట్టింది. సరిగ్గా అంతకుముందే తల్లికి కాల్‌చేసి తెల్లవారే వస్తున్నా నాకు ఎంతో ఇష్టమైన ‘గోంగూర పప్పు’ కూర చేయమని కూడా చెప్పాడు. సమయం రాత్రి 2 దాటింది. ఎవరో ఇద్దరు వ్యక్తులు నిద్ర లేపారు... చూస్తే ఎదురుగా మదపుటేనుగుల్లాంటి ఇద్దరు పోలీసులు ‘‘లేరా చెత్తనాకొడకా... అంటూ ఒకడు నా డొక్కలో బూటుకాలితో తన్నాడు. మరొకడు అసహ్యంగా మానవజాతి వినలేని బూతుమాటలు తిట్టాడు. పదరా స్టేషన్‌కి అంటూ... ఏ తప్పూ చేయని నన్ను పోలీసు స్టేషన్‌లో ఆ రాత్రి వేళ అర్ధనగ్నంగా నిలబెట్టారు. పదివేలు అర్జంటుగా ఇవ్వకపోతే... నీ మీద అనేక రకాల కేసులు పెడతామన్నారు. నాకేం అర్థం కాలేదు. నేను చేసిన తప్పేంటి నాకు అర్థం కాలేదు. చాలా భయం వేసింది. నా శరీరంలో చాలా చోట్ల కుళ్లబొడిచారు... అమ్మ గుర్తుకు వచ్చింది ఏడ్చాను...! ఓ రాత్రి లాడ్జిలో ఉండటానికి కేవలం 100 రూపాయలు లేక... రైల్వేస్టేషన్‌లో నేను పడుకోవడమే నేరమా...? అప్పుడే సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వచ్చాడు, అందరూ బాగా మందుకొట్టి పదివేలు కోసం మరోసారి నా శరీరంతో ఆడుకున్నారు. తెల్లవారి పది గంటలకి అమ్మ వచ్చింది... అవసరం లేకపోయినా స్టేషన్‌లోని వారికి పదివేలు పైనే కట్టింది. నేను గాయాలతో బయటకు వచ్చాను. ఈ డబ్బులు ఎక్కడివమ్మా అని అడిగాను ‘మీ నాన్న చివరి ఆస్తి నా చెవుల బంగారం అమ్మేశాను’ అంది. నా మనసు కన్నీరైంది. పోలీసు ఉద్యోగం అంటే అసహ్యం వేసింది. రోజుకి వంద రూపాయలు వచ్చే కూలి పని బెటర్ అనిపించింది.

- కోనే సతీష్,
సెల్: 7675924944
పుస్తక పరిచయం

చమత్కార మృత్యుంజయం

‘మెడ నాగన్నకు ఒకటే బుసబుసల్; మేనన్ సగంబైన ఆ
విడతో నీకెపుడొక్కటే గుసగుసల్; వీక్షించి మీ చందమె
క్కడ లేనంతగ నెత్తిపై రుసరుసల్ గంగమ్మకున్; నీ చెవిన్
బడుటేలాగునొ? మా మొరల్; తెలియదప్పా! మాకు మృత్యుంజయా!’
ఈ పద్యం మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్ర్తీ గారి ‘మృత్యుంజయ శతకం’లోనిది. ఈయన ఆధునికాంధ్ర పద్యకవులలో పేరెన్నికగన్నవారు. వీరి ప్రతి రచనా కవితా ‘బృందావనమే’. రసభావాల పంచవటియే. చమత్కారాలకు చిరంజీవమే.
ఆంధ్ర సాహిత్యంలో శతక ప్రక్రియ ఎప్పటికీ చిరంజీవమే. దానికి ఏమాత్రం మరణం లేదు. అది ఏనాటికీ మృత్యుంజయమే. సమాజ జాతకాన్ని తెలియజేస్తూ హెచ్చరించి చైతన్యపరచే శతకాలతో పాటు తెలుగులో - సర్వ కుల మతాదులకతీతంగా భక్తి విషయంలో దేవుడి పట్ల చనవును ప్రదర్శించే శతకాలనేకం. ప్రాచీన కాలంలోనూ వచ్చాయి, ఆధునిక కాలంలో మరీ ఎక్కువగా వస్తూనే ఉన్నాయి. ఇక్కడ పైకి నింద - లోపల స్తుతి ఉండేలా పౌరాణిక గాథల్ని ఆధారం చేసుకొని చనవును ప్రదర్శించిన కాసుల పురుషోత్తమ కవి విరచితమైన ఆంధ్ర నాయక శతకం స్మరింపదగినది. కానీ - దేవుడితో పరాచికాలాడుతూ మరీ చనవునూ, స్వేచ్ఛను ప్రదర్శించిన శతకాలు నవీన కాలంలోనే అధికంగా వచ్చాయి. భక్తిరస శతకాలు వచ్చినంత అధికంగా హాస్యరస శతకాలు ప్రాచీన కాలంలో తక్కువ. అసలు లేవనే చెప్పవచ్చు. ఉంటే గింటే ప్రాచీనాంధ్ర శతకాలలో చమత్కారం ఉండవచ్చు. కానీ - ఆధునిక కాలంలో చమత్కార హాస్యాలను రెంటినీ జోడిస్తూ సామాజిక శతకాలూ వచ్చాయి. భక్తిరస శతకాలూ వెలువడినాయి. అదిగో! అటువంటి చమత్కార హాస్యాలను మిళాయిస్తూ దేవుడి పట్ల చనవును ప్రదర్శిస్తూ, అంత్యానుప్రాస రచనా రీతిలో పఠితులనూ ఆకర్షిస్తూ వెలువడిన శతక పద్యం - పైపద్యం.
సగుణ సాకారమైన ఈశ్వరుడు మెడలో సర్పాలను హారాలుగా ధరిస్తాడు. పార్వతీదేవి - శివుని శరీరంలో సగం ఆక్రమించుకొని నిజమైన అర్ధాంగిగా ఉంటుంది. ఈశ్వరుడి నెత్తిన సవతి భార్యగా గంగాదేవి చిందులు తొక్కుతూ ఉంటుంది. ఇదిగో ఇటువంటి శివుడి లక్షణాలను ఆధారంగా చేసుకొని, ఆ రూప లక్షణాలలో నిండా మునిగిపోయిన ఈశ్వరుణ్ణి ఉద్దేశించి తన మొర వినబడే అవకాశం లేదని చమత్కారంగా చెబుతూ ప్రశ్నిస్తున్నారు ఈ పద్యంలో - మాధవపెద్దివారు. బుసగొట్టడం పాముకు సహజ లక్షణం గదా! శివుని మెడలో ఉన్న నాగన్నకు ఒక్కటే బుసబుసలు; అలాగే అర్ధాంగి అయిన పార్వతితో శివుడికి ఒక్కటే గుసగుసలు. ఈ వరుస చూసి సహించలేక సవతి మాత్సర్యంతో గంగాదేవి శివుని నెత్తిపై చిందులు తొక్కుతూ ఒక్కటే రుసరుసలను ప్రదర్శిస్తోంది. ఇక నీ చెవిలో మా మొరలు ఎలా వినబడతాయో ఆ విషయం మాకు తెలియడం లేదంటారు కవి చనవుగా మృత్యుంజయునితో. శివుడి రూపమూ, ఇల్లూ- ఇల్లాలు విషయాలను ఈ కవీశ్వరుడు ప్రస్తావించడంలోనే చనవు తెలుస్తోంది. బుసబుసలు, గుసగుసలు, రుసరుసలు- అని ధ్వన్యనుకరణ రూపంలో అంత్యాను ప్రాసాలంకారంగా శబ్దాలంకారాన్ని అచ్చతెలుగు పదాల్ని ప్రయోగించడంలో చమత్కారం పండింది.
ఈ పద్యం పఠితల హృదయాల్ని దోచుకుంది. ఈశ్వరునితో కవీశ్వరుడు చనవుగా తన భక్త్భివాన్ని స్వేచ్ఛగా ప్రదర్శించిన కవితల ప్రస్తావన వచ్చినప్పుడల్లా నాకు ఈ చమత్కార పద్యమే గుర్తుకు వస్తుంది. కాబట్టి ఈ పద్యం చమత్కార మృత్యుంజయమే.

- డా.రామడుగు
వేంకటేశ్వరశర్మ,
చరవాణి : 9866944287

మనోగీతికలు

మూల్యాంకనం
పక్షుల కిలకిలారావాలతో
ప్రభాతసుందరి శుభోదయం పలికేవేళ
సుమసుగంధ పరిమళం
శూన్యాన్నంతటినీ ఆక్రమిస్తున్న సమయాన
ప్రవాహపు జలజలలు ప్రభవిస్తున్న
ఆకుల గలగలలను
ఆలింగం చేసుకుంటుంటే
వసంత యామిని
ప్రకృతిలోని పారవశ్యాన్ని
ప్రతిబింబిస్తున్న ఛాయలు
నన్ను పునీతుణ్ణి చేస్తున్నాయి
మానవాళికంతటికీ
ఇవన్నీ వరుమానాలై
ప్రభవిస్తున్నాయి
శిశిరాన్నీ చీదరించుకుంటూపోతే
శీర్ణపత్రాలు సైతం
చీవాట్లు పెడతాయి
హిమంతపు చలినెగళ్ల నైనాగానీ
హేయభావంతో చూడడమెందుకు?
గ్రీష్మాన్ని సైతం
గిరిగీసుకుని వుండాలనడం
ఎంతవరకు సమంజసమో ఆలోచించు
ఋతువర్తనాన్ని
రూళ్లకర్ర కింద నియంత్రించడం
ఎలా భావ్యమనిపించుకుంటుందో
ఒకసారి దీర్ఘంగా యోచించు
శైశవాన్ని చిందులాటలతోనూ
యవ్వనాన్ని కేరింతల సయ్యాటలతోనూ
నడివయసును నకిలీల విజృంభణలతోనూ
వార్ధక్యాన్ని వయసు నొసలపై
ముసలి గీతలతోనూ
జీవన పథాన్ని శృంగార శోభితంగానూ
తీర్చిదిద్దుకుంటూ ప్రతి క్షణాన్ని
మూల్యాంకనం చేసుకుంటూ
సాగినప్పుడే ఒడిదుడుకులను అధిగమిస్తూ
విజయపథంలో విహరించగలుగుతామని
వినయపూర్వకంగా నివేదించుకుంటున్నాను
జీవితాన్ని ప్రతిక్షణం ప్రేమిస్తూ
గమ్యాన్ని సునాయాసంగా
చేరుకోగలుగుతామని
ఇందుమూలముగా
విన్నవించుకుంటున్నాను!

- రావెల పురుషోత్తమరావు
చరవాణి : 9394100531

కల నిజమైతే..!
నిండు పున్నమి వేళ
చందమామ రాజయి
వెలుగు జిలుగుల
సమ్మోహన మేళవింపుగా
రేయిని పాలింప
నే అంతర్మనసుతో
వలపు చిలిపి
ఒయ్యారి భామల
వేటకు బయలుదేర
ఇంద్రధనుస్సు కిరీటధారణగా
తాజ్‌మహల్
వెలుగులు విరజిమ్ముతుండగా
చంద్రరేఖలే
పూబంతులై అభినయింప
ధవళవర్ణ మంచుమబ్బులు
కోలాటమాడుతుండగా
నా మది
సరిగమపదనిస
సనిదపమగరిస పలక
తన తొలకరి చిరుజల్లుల
నవ్వులు కురిపించుతూ
నా సుకుమారి నను చేరినది!
ఆ అద్భుత సౌందర్య సుగుణాల రాశి
సుకుమారి ఒయ్యారి తలోదరి
అధరాలు అరుణోదయ
కాంతులు చిమ్మ
చెంపలు లేగులాబీలై అలరార
బాలామృతాంశువు చంద్రహారంగా
నీలాంబరము ఇంద్రధనుస్సు కోక రవికెలుగా
తళతళ తారలు, చెవి కమ్మలుగా
ధరించిన నా అపరంజి
అభిసారిక
అసూర్యంపర్య
అభినయాలాపములతో
నను మురిపించి
ఆలింగనము చేయ
అభ్యుదితుడనయిన నన్ను
అరుణ కిరణాలు అంతరాయముజేయ
ఆవలింతతో ఉదయమారంభించితిని!

- మర్రి ప్రభాకర్,

అమ్మ
పురిటినెప్పులను
పంటి బిగువున బట్టి
బిడ్డకు జన్మనిచ్చి
తానూ పునర్జన్మ పొంది
తన పేగులో ఎదిగి
ఒడిలో ఒదిగిన బిడ్డను
ప్రేమతో
వాత్సల్యాన్ని
ఆప్యాయతను
అనురాగాన్ని పంచే
అమృతమూర్తి!

- వి వీరభద్రాచార్యులు
చరవాణి : 8106809196

శస్తచ్రికిత్స
పాపం ఆ ఇంటి ఇల్లాలి
కంటికి శస్తచ్రికిత్స చేసి
కనురెప్పలు తొలగిస్తున్నారు
కంటికి ఇబ్బందై కాదు..
రెప్పపాటు సమయంలో
బుల్లితెర సీరియల్స్‌లో
కొన్ని సన్నివేశాలు
మిస్సవుతున్నానని
ఇబ్బంది పడుతోందట!

- కలిమిశ్రీ,
చరవాణి : 9246415150

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

- కోట సావిత్రి