విజయవాడ

ప్రణయ గీతం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అబ్బబ్బా! ఎప్పుడు చూసినా ఏం చదువు? ఇప్పుడు ఐఐటికి ప్రిపేరవ్వాలా? సెలవురోజు కూడా ఒక సరదా లేదు. సంతోషం లేదు’ పుస్తకం చదువుకుంటున్న నన్ను చూసి చిరాకుపడుతూ అన్నది నా భార్య. ‘కొత్త సినిమా వచ్చింది. చాలా బాగుందట. మన పక్కింటివాళ్ళు చూసి వచ్చారు. మనం కూడా వెళదాం’ అన్నది పక్కన కుర్చుంటూ.
‘సరే! పద!’ అన్నాను పుస్తకం మూసేస్తూ.
ఇద్దరం రడీ అయి థియేటర్‌కి వెళ్ళాం. టికెట్‌కొని లోపల కూర్చున్నాం. సినిమా మొదలైంది. కొద్దిసేపటి తర్వాత పాట వచ్చింది. హీరో వెనక ఒక ఇరవై మంది, హీరోయిన్ వెనుక ఒక ఇరవై మంది గ్రూప్ డ్యాన్సర్లు డ్యాన్స్ చేస్తున్నారు. పాటలో ఒక్క పదం కూడా అర్థంకావటం లేదు. గుండెలు అదిరిపోయేటట్లు మ్యూజిక్ వస్తోంది. దృశ్యంలో ఫ్రేములు శరవేగంగా కదిలిపోతున్నాయి. హీరోహీరోయిన్ల ముఖాలు గుర్తుపట్టటానికి వీలుకావటం లేదు. పావుగంట చూసేసరికి సినిమా మీద ఆసక్తి పోయింది. ఏసి హాలు కాబట్టి హాయిగా నిద్రపట్టేసింది.
వాస్తవానికి సినిమాలో ఫ్రేములు నిదానంగా కదులుతూ ఉండాలి. అప్పుడే నటీనటుల ముఖంలో భావప్రకటన స్పష్టంగా తెలుస్తుంది. నేపథ్య సంగీతం తక్కువస్థాయిలో ఉంటేనే పాట చక్కగా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా అంతమంది డాన్సర్లు ఉండకూడదు. నాయికా నాయకులు ఏకాంతంలో ప్రేమించుకుంటారు. బాహాటంగా పదిమందిలో ఎవరూ సరసాలు ఆడుకోరు. ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ వున్న పాటలు గతంలో పాత సినిమాల్లో ఎన్నో వచ్చాయి. మచ్చుకి ఇది ఒకటి. ఎంతో ఇష్టమైన పాట..
‘రావాలి రావాలి రమ్మంటే రావాలి, రకరకాల రసికతలెన్నో రాణిగారు తేవాలి’
‘‘ఆగాలి ఆగాలి ఆగమంటే ఆగాలి, ఆలుమగలమయ్యేదాక అయ్యగారు ఆగాలి’
ప్రేమలో పడిన నాయకుడు విరహంతో ఉన్నాడు. రమ్మనగానే రావాలి, తనని ఆనందింపజేయాలి అని నాయికను పిలుస్తున్నాడు. కానీ ఆమె దగ్గరకు రావటం లేదు. ఆ మూడుముళ్ళూపడి, భార్యాభర్తలమయ్యేదాకా కొంచెం నిగ్రహించుకోమంటోంది.
‘మదిలోన నేను మనువాడినాను. మరి జాలమేల?’
‘ఆ మనసులోనే అరుదైన హాయి ఊహించుకోవోయ్!’
‘ఊహలోనికైనా నీవు ఓదార్చరావే!’
ఎప్పుడైతే నీకు మనసిచ్చానో, అప్పుడే నిన్ను మనసులోనే వివాహమాడేశాను. మనం భార్యాభర్తలతో సమానమే! ఇక ఆలస్యమెందుకు? అంటున్నాడు నాయకుడు. ‘అయితే మనసులోనే ఆ ఆనందం ఊహించుకో’ అని గడుసుగా సమాధానమిస్తోంది నాయిక. ఇక అతనికి దిగిరాక తప్పలేదు. ‘కనీసం ఊహలోనైనా నాదగ్గరకు రావే!’ అని బతిమాలుతున్నాడు. అంటే అంత దూరంగా ఉన్నదన్నమాట.
‘సరదాల పైన చన్నీళ్ళు చల్ల మర్యాద కాదే!’
‘పగ్గాలు లేని ప్రణయాలలోన సొగసేమి కలదోయ్?’
‘కొంటె చూపుల తూపులు రువ్వి శోధించరాదే!’
నువ్వు, నేను ఇద్దరం పరువంలో ఉన్న వారమే! సరదాగా గడపాలని ప్రతి యువకుడికీ ఉండదా! అటువంటి సరదాలపైన చన్నీళ్ళు చల్లటం మర్యాదేనా? అని అడిగాడు. పురుషుడు దుందుడుకు స్వభావం కలవాడు. సూటిగా వెళ్ళిపోవటమేతప్ప తర్వాత జరిగే పరిణామాల గురించి ఆలోచింపడు. కానీ స్ర్తి అలాకాదు. పదిమందిలో పరువుగా జీవించాలనుకుంటుంది. తనని తాను కంట్రోల్ చేసుకుంటుంది. స్ర్తి పురుషుల మనస్తత్వాల మధ్య ఈ వ్యత్యాసం బహుశా పుట్టుకతోనే వస్తుందేమో! అందుకే హద్దుల్లేని ప్రేమలో అందమేముంది? అని ప్రశ్నిస్తుంది నాయిక. కొంటె చూపులనే వలపు బాణాలు వేసి పరీక్ష చేయటం న్యాయమేనా? అని అలకగా అడుగుతున్నాడు నాయకుడు.
‘మగవారలయ్యు మది తెలుసుకోరు తమ మాట తమకే!’
‘ఈ ఆడవారు ఎవరైన ఇంతే మురిపించి రారు’
‘ఒక్కసారి వచ్చిన వనిత మరల వీడిపోదు’
మనది పితృస్వామ్య వ్యవస్థ. తండ్రే కుటుంబానికి పెద్ద. కుటుంబ సభ్యులను క్రమశిక్షణతో, నీతినియమాలతోనూ నడిపపిస్తూంటాడు తండ్రి. అలాంటి మగవాడివై పుట్టినా మనసులోని భావం అర్థం చేసుకోకుండా మారాం చేస్తావే? అని అడిగింది నాయిక. ‘ఈ ఆడవాళ్ళు ఎప్పుడూ ఇంతే! కవ్వించి దగ్గరకు రాకుండా ఉడికిస్తూ ఉంటారు’ అన్నాడు నాయకుడు. ‘వివాహమై నీ భార్య అయిన తర్వాత జీవితాంతం నీదగ్గరే ఉంటాను. ఇక వదలి వెళ్ళను’ అని మనసులో మాట బైటపెట్టింది నాయిక.
ఈ ప్రణయగీతం ‘మర్మయోగి(1964)’ చిత్రంలోనిది. ఆరుద్ర రచించిన ఈ గీతాన్ని స్వీయ సంగీత దర్శకత్వంలో ఘంటసాల జమునారాణితో కలసి కమనీయంగా ఆలపించారు. తెరపైన యన్‌టి రామారావు, కృష్ణకుమారి మనోహరంగా అభినయించారు. పాత చిత్రాల్లోని ఇలాంటి పాటలు విన్నా, చూసినా మనసు అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోతుంది. అందుకే ఆనాటి చిత్రాలు దశాబ్దాలు గడచిపోతున్నా ఇంకా టీవీలలో ప్రసారమవుతూ ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నాయి.

- గోనుగుంట మురళీకృష్ణ,
రేపల్లె, సెల్ నెం: 9701260448

చిన్న కథ

చేసిన పాపము..
చెడని పదార్థము

మా ఇంటి ఎదురుగా శ్రీనిలయం అనే అందమైన బిల్డింగ్. పాతికేళ్ల క్రితం అక్కడ రెండు పాత పెంకుటిళ్లు. చుట్టూ పిట్టగోడ. పరిచయస్థులు కనబడినప్పుడు చిరునవ్వుతో పలకరించే రంగమ్మగారు. కృష్ణంరాజు - చంద్రికారాణి కొడుకు, కోడలు. ఆరుగురు మనవరాళ్లు. మనవలు లేరు. ఊళ్లోనే కూతురు. ఆమెకొక్కడే కొడుకు. ప్రతి పండక్కి భర్త, కొడుకుతో వచ్చి సరదాగా గడిపి వెళ్లేది.
రోజులన్నీ ఒక్కలా వుండవుగా! రంగమ్మగారు జబ్బుపడ్డారు. ఏమైందోగాని రంగమ్మగారికి బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. చుట్టుపక్కల వారిని చూడనిచ్చేవారు కారు. బంధువుల రాకను నిషేధించారు. ఆఖరికి కన్నకూతుర్ని కూడా. పిట్టగోడ క్రెమ్లిన్ గోడలా ఎత్తు లేచింది. లోపలేం జరుగుతోందో ఎవరికీ తెలిసేది కాదు. రంగమ్మగారి జీవితం అండమాన్ జైలు ఖైదీలా..!
ఒకరోజు ఆమె చనిపోయిందని శవాన్ని బయటపడేశారు. కూతురొచ్చి భోరున ఏడ్చింది ఇళ్లు రెండూ తల్లి పేర వున్నాయని! తనకి ఒకటి ఇస్తాననేదని, దానికోసమే అమ్మని వారు బంధించి, బాధించి సంతకాలు చేయించుకుని.. చివరికిలా! అంటూ విలపించింది.
ఆరుగురు అమ్మాయిల పెళ్లిళ్లకి ఒక ఇల్లు అమ్మేశారు. తరువాత రాణిగారికి కేన్సర్ వచ్చింది. ఆ జబ్బుకి రెండో ఇల్లు అమ్మేశారు. చివరి అమ్మాయి దగ్గరికి చేరుకున్నారు. ఆవిడ చేసిన పాపాలు అన్నీ గుర్తుచేశారు వియ్యాలవారు. భరింపరాని అవమానం, రోగం వల్ల కలిగే బాధ తట్టుకోలేక కృష్ణమ్మలో దూకి జీవితానికి ముగింపు ఇచ్చుకుంది. భార్య చేసే అరాచకాలు, తల్లిని భార్య పెట్టిన కష్టాలు చూస్తూ నోరు మెదపని అసమర్థుడు రాజుగారు కూడా ఆమె మార్గానే్న అనుసరించారు.
‘చేసిన పాపము.. చెడని పదార్థము’ అంటారందుకే! అది నిన్ను వెంటాడుతుంది. వేధిస్తుంది. నీ జీవితాన్ని నరకకూపం చేస్తుంది. ఇది తెలియక చాలామంది సాగినంతకాలం నా అంతవాడు లేడని విర్రవీగి ఎన్నో దారుణాలు చేసి జీవిత చరమాంకంలో పశ్చాత్తాపపడినా ఏం లాభం? చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముంది? ఎదుటివారి జీవితాలు చూసి కూడా తమ జీవితాలు సరిదిద్దుకోనివారిని ఏమనాలి? ధర్మరాజు లాంటివాడు జూదమాడి ధర్మపత్నిని, తమ్ముళ్లని ఓడి అడవులపాలై.. ఎన్ని కష్టాలు అనుభవించాడు. వ్యసనం ఆయన్ని అన్ని కష్టాలపాలు చేసింది. ప్రతి మనిషి ధర్మబద్ధంగా నడవాలని ఆశిద్దాం.. ఏమంటారు?

- వి అనూరాధ, విజయవాడ.
పుస్తకాల పండుగ

నవ్యాంధ్రలో
తొలి వేడుక!

బెజవాడ వాసుల, ఆ మాటకొస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోని సకల పుస్తకాల ప్రియుల ప్రియమైన పండుగ - విజయవాడ పుస్తక మహోత్సవం. ప్రతి కొత్త సంవత్సరపు తొలి వేడుకగా నగర పుస్తక ప్రియులను ఈ ఉత్సవం పలకరిస్తుంది. రా.. రమ్మంటూ ఆహ్వానిస్తుంటుంది. ఏటికేడాది కాలం వేగంగా కరిగిపోతూ ఎన్ని మార్పులకు లోనవుతున్నా ఎప్పటికప్పుడు వినూత్న వేదికగా నిలుస్తోంది ఈ సరస్వతీ ప్రాంగణం. తెలుగువారి జీవితాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంభవించిన సకల పరిణామాలను ఓ కథాసంపుటిలా మనముందు అద్దంలా నిలుపుతుంది ఈ పుస్తకాల ప్రపంచం. జనవరి ఒకటి నుంచి 11 వరకు హితులు, స్నేహితులు, సన్నిహితులు, కొంగ్రొత్త నేస్తాలతో కలిసి అలా అలా విహరిద్దాం.. రండి! నవ్యాంధ్ర రాజధానిలో కొత్త ఆశలతో సరికొత్త ఊసులు పంచుకుందాం రారండీ..!
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదాన్‌లో గడచిన 26 సంవత్సరాలుగా వైభవంగా జరుగుతూ వస్తోన్న పుస్తక మహోత్సవం ఎప్పటిలా 2016 జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు జరగబోతోంది. స్వరాజ్య మైదాన్ సమీపంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయం ఏర్పాటు కావటంతో ఇటీవలి కాలంలో సభలు, సమావేశాలకు అనుమతించడం లేదు. పుస్తక మహోత్సవానికి కూడా అనుమతి లేదన్న ప్రచారం జరిగింది. అయితే పుస్తకాభిమానుల ఒత్తిళ్లతో ప్రభుత్వం ఆలస్యంగా అయినా అనుమతి అయితే ఇచ్చింది కాని భద్రతా కారణాల దృష్ట్యా సగభాగంలోనే ఏర్పాటు చేసుకోవాలనే షరతు విధించింది. గత ఏడాది 389 స్టాల్స్‌తో 27వ పుస్తక ప్రదర్శన ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఈ ఏడాది స్థలాభావం వల్ల ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేయాలనే దానిపై ఆలోచన జరుగుతోంది. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీకి ఇటీవలే నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు బెల్లపు బాబ్జీ, కార్యదర్శి ఎబిఎస్ సాయిరాం, ఉపాధ్యక్షులు కె లక్ష్మయ్య, సంయుక్త కార్యదర్శి బి రవికుమార్ నేతృత్వంలో 27వ పుస్తక మహోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది గురజాడ అప్పారావు 100వ వర్ధంతి సభతో పాటు ప్రముఖ రచయిత శివరాజు వెంకట సుబ్బారావు ‘బుచ్చిబాబు’ శతజయంతి సభ జరగనున్నాయి. ప్రధాన వేదికపై నిత్యం పలువురు రచయితల నూతన పుస్తకాల ఆవిష్కరణలు జరగనున్నాయి. జనవరి 4న గాంధీనగర్ ప్రెస్‌క్లబ్ నుంచి సభా ప్రాంగణం వరకు పుస్తక ప్రియులతో పాదయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా బి బాబ్జీ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని ప్రతిఒక్క తెలుగువానికి అందించాలనే ధ్యేయంతో, అలాగే పఠనాసక్తిని పెంపొందించేందుకు గత ఏడాది నుంచి వివిధ నగరాలు, పట్టణాల్లో పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అన్నిరకాల పుస్తకాలు పాఠకులకు ఒకేచోట లభ్యమయ్యేలా చూడటమే తమ లక్ష్యమన్నారు. ఇప్పటివరకు విశాఖపట్టణం, రాజమండ్రి, కాకినాడ, ఖమ్మం, కడప, ఒంగోలులో పుస్తక ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహించామన్నారు. దానివల్ల ఔత్సాహిక రచయితల పుస్తకాలను కూడా పాఠకుల దరికి చేర్చగలిగామన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు. ఎప్పటిలా విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందచేస్తామని బాబ్జీ వివరించారు.
- నిమ్మరాజు చలపతిరావు, (విజయవాడ బ్యూరో)

పుస్తకోత్సవం కాదు.. మస్తకోత్సవం!

విజయవాడ అనగానే నేడు కల్తీ నెయ్యి, కాల్‌మనీ గుర్తుకు రావచ్చు! నిజానికి ఈ ధోరణి కూడా కొత్తకాదు. సప్తగిరి పేరున జరిగిన మోసాలు కూడా చాలామందికి గుర్తుండవచ్చు. ఇలాంటివి కాకుండా విజయవాడకు మంచిగా కూడా బ్రాండ్ ఇమేజ్ ఉంది! భోజనం, సినిమాలు, నవలలు, పత్రికలు, ఆకాశవాణి - ఇలా చాలావాటికి విజయవాడ అనే మాట కలిపితే ఎంతో గ్లామరు! కృష్ణానది, కనకదుర్గ గురించి నేరుగా చెప్పనక్కరలేదు. రాష్ట్రం ప్రెసిడెన్సీతో విడిపోయిన సమయంలో పత్రికలు తెనాలికి రావాలని కొందరు ప్రయత్నించారు. అయితే కూడలి విజయవాడ ఆ సౌలభ్యాన్ని పొందింది. అయితే కొత్త శతాబ్దం రావడానికి రెండు దశాబ్దాల ముందే పత్రికలు, సినిమాలు వంటివి హైదరాబాద్ బాటపట్టాయి. నేడు కొత్త రాష్ట్రం కొత్త రాజధాని హోదాలో అన్నీ వెనక్కి మళ్లుతున్నాయి లేదా కొత్తగా హంగులు సృష్టించుకుంటున్నాయి. కనుక ఇటువంటి వేళ పుస్తకాల పండుగ గురించి జ్ఞాపకాలను నెమరేసుకోవడం హాయిగా ఉంటుంది.
శతాబ్దం మారుతున్న వేళ అటో మూడేళ్లు, ఇటో మూడేళ్లు నేను విజయవాడ ఆకాశవాణిలో పనిచేశాను. విజయవాడ గ్లామర్‌లో నలభయ్యేళ్ల క్రితం ఆకాశవాణి కేంద్రం కార్యక్రమాలు కూడా అంతరభాగం. విద్యార్థిగా ఉన్నప్పుడే గమనించిన నేను ఉద్యోగం రాగానే అక్కడ పనిచేయాలని ఉబలాటపడ్డాను. మద్రాసులో మార్గశిర మాసపు సంగీతోత్సవం ఎంత గౌరవం కలిగి ఉందో, విజయవాడలో సంక్రాంతి ముందు జరిగే పదిరోజుల పుస్తకాల పండుగ అంత విలక్షణమైంది. ఈ సంఘటనకు ముందు వస్తుందోచ్.. అనే ఫీలింగ్‌తో ఒకటి రెండు నెలలు, తర్వాత ‘్భలే జరిగిందే’.. అనే తృప్తి ఒకట్రెండు మాసాలు ఉంటుంది. దీపావళి నుంచి శివరాత్రి దాకా పుస్తక ప్రేమికులను, ఆలోచనాపరులను ఈ సందర్భం తృప్తి పరుస్తుంది. అవును! దీపావళి అనగానే 1999లో దీపావళికి ఆకాశవాణి నిర్వహించిన సినీ కవి సమ్మేళనం గుర్తుకొస్తోంది. అప్పటికి నాకు స్పోకెనెవరీ విభాగం కేటాయించి ఆరు నెలలు అయింది. ‘శత వసంత సాహితీ మంజీరాలు’ ధారావాహిక మొదలై మూడు మాసాలైంది. కొత్తగా చేయాలనే ఉత్సాహం ఉంది. వినూత్నంగా ఏది ప్రతిపాదించినా నిర్దేశకులు, సోదరి సమానులు ప్రయాగ వేదవతిగారు వెన్నుతట్టి వెళ్లమనేవారు. జొన్నవిత్తుల ఎంతో సహకరించారు. దాంతో సినీ కవి సమ్మేళనం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దద్దరిల్లింది. మరుసటిరోజు పత్రికల జిల్లా అనుబంధాల తొలి పేజీలో మొత్తం సినీ కవుల ఆకాశవాణి సమ్మేళనం ముచ్చట్లే!
ఆ కార్యక్రమం విజయం, ఈ వార్తల హోరు మధ్య అశోక్ బుక్‌హౌస్ అశోక్ గారు నాకు ఫోన్ చేశారు - పుస్తకాల పండుగలో ఆకాశవాణి కోసం ఒకరోజు కార్యక్రమం రూపొందించామని! అలా వచ్చిన ప్రతిపాదన 2000 సం.నాటి పుస్తక మహోత్సవంలో రూపం దాల్చింది. సి రాఘవాచారి గారు, కాశీనాథుని నాగేశ్వరరావు గారు అప్పటి సంపాదకులైన సాహితీమూర్తులతో ముచ్చటించారు. దీనికి స్పందనా విశేషం! అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆకాశవాణి విజయవాడ - పుస్తకాల ఉత్సవానుబంధం కలిసే సాగుతోంది.
అయితే ఇది బీజప్రాయంలో ఉన్నప్పుడు మేము భాగస్వాములమని మాకు ఆనందం. అదే సమయంలోనే శత వసంత సాహితీ మంజీరాలకు గ్రంథాలయ సర్వస్వం జనవరి సంచిక వెలువడింది. 1997, 1998, 1999 సంవత్సరాల్లో పుస్తకాల పండుగను నేను పది రోజులూ చూశాను. మాంటిస్సోరి కళాశాల దగ్గర నివాసం గనుక ఐదు నిమిషాల్లో ప్రాంగణం చేరే వీలుండేది. మొబైల్ హడావిడి అప్పటికి రాలేదు. కనుక పాఠకుల ఉత్సాహం, పుస్తకాల వైవిధ్యం, ప్రయత్నాల వినూత్న పంథా జాగ్రత్తగా పరిశీలించాను. 2000, 2001, 2002 సంవత్సరాల పుస్తకాల పండుగతో వినూత్న ‘ఆకాశవాణి’ కార్యక్రమాలతో భాగస్వామినయ్యాను. ప్రాంగణంలో జరిగే సంఘటనే కాదు, ఆకాశవాణిలో పదిరోజుల విశేష కార్యక్రమాలు ఇచ్చాం. నివేదికలు కాకుండా, ఒకసారి తెలుగులోని పది క్లాసిక్స్‌ను రోజుకు ఒకటిగా పరిచయం చేశాం. మరోసారి సంవత్సర కాలంలో వచ్చిన కొత్త పది విలక్షణ పుస్తకాల గురించి రోజుకొకటి చొప్పున విపులంగా వివరించాం. పల్లెపట్టున జాతర అంటాం, లేదా పట్టణాల్లో ఇరుకు బజార్ల సందడిలా కొత్త సంవత్సరం విజయవాడలో పుస్తకోత్సవం ప్రారంభమవుతుంది. ఎవరి గొప్పలు వారు చెప్పుకున్నా, పాఠకులు మాత్రం ఎవరికి కావాల్సినవి వారు కొనుక్కుంటారు.
కాలం మారింది కనుక నవతరం పెద్దబాలశిక్ష చదువుకునే దశలో ఉంది. తమాషా ఏమంటే దీన్ని ఆడియో బుక్‌గానో, సాఫ్ట్ కాపీగానో చదువుకునే ఆర్థిక స్థితి కలిగిన తరమిది. 2012లో పుస్తకోత్సవ వేదిక మీద నా రచన ‘విద్వాన్ విశ్వం’ను కేంద్ర సాహిత్య అకాడమీ ఆవిష్కరించింది. 2015 సందర్భంలో నన్ను విశ్వం గురించి మాట్లాడమని ఆహ్వానించింది. ఇలా చాలా జ్ఞాపకాలుంటాయి.. నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలుంటాయి. పుస్తకోత్సవంలో దొరికిన పుస్తకాలు నా దగ్గర భద్రంగా ఉంటాయి. తద్వారా పరిచయమైన మిత్రులు మనసులో మరింత పదిలంగా ఉంటారు. నేను చెన్నపురిలో ఉన్నా నా మనసు ప్రతి సంవత్సరం పుస్తకాల పండుగ చుట్టూ తిరుగుతూ ఉంటుంది!

- డా. నాగసూరి వేణుగోపాల్
ఆకాశవాణి, చెన్నై.
చరవాణి : 9440732332

మనోగీతికలు

భరతమాత గర్వించు వీరుడతడు!

నూట ఇరువది ఐదు ఏండ్లకు ముందు
భారత ఉపఖండాన దివ్యతేజము వెలిగె
మహారాష్ట్ర కొంకణ ప్రాంత రత్నగిరి జిల్లా
అంబవాడ గ్రామాన మట్టిమనుషుల మధ్య
మాణిక్యమయ్యెను మహనీయుడాతడు
పిచ్చిమూకల సమాజాన
అంటరానితనమున
కులవ్ఢ్యౌపు రోత చీకటి మిణుగురు
ఆచార్యుని ప్రేమలో అలరించె గొప్పగా
బాల్యపు చదువులయందు
ఆరాధన మొందెను
పేరుమ్రోగి, నితడు పేరోలగమున
శాయోజీరావు గైక్వాడ్ మహరాజు మెచ్చె
దళిత కులాన ఇతడు తెలివైనవాడని
పండిత ఫలములు పొందె రాజావారి నుండి
పయనమయ్యె ఆనాడు పరదేశ విద్యలకు
కళాశాలకు బోయె సామాన్య బట్టలతో
ఒకపూట తిని గడిపె విద్యపై ప్రేమతో
గొప్ప చదువులు చదివి విద్యాధికుడయ్యెను
పెక్కు గ్రంథము వ్రాసి, పేరు గడియించె
భారతావనికి వచ్చి బారిష్టరయ్యెను
రాజకీయమున చేరి రాణించె రాజ్యమున
అంతరానితనం వంటి దురాచారములను బాపి
పౌర హక్కులు లేని బ్రతుకులను మార్చెను
చట్టము కొరకు వాదించె చట్టసభల యందు
దళిత కులములకు కలిగించె గౌరవ మర్యాదలు
ఏడుగంటలు వాదించి జనవీరుడయ్యెను
రికార్డు స్థాపించె బొంబాయి కోర్టు నందు
రాజ్యాంగ చట్టముల రచనా రూపమున
అందలాలనందుకుని అధ్యక్షుడయ్యెను
ఏమి వ్రాయగలము ఈయన అద్భుత చరితమును
నిమ్నజాతుల తేజం భారతీయ రత్నం
స్వస్తి ఎరుగని కీర్తి స్వయంప్రకాశాన
చిరస్మరణీయుడు డా. అంబేద్కర్ వీరుడు!
భరతమాత గర్వించు భారతీయుడితడు.

- తన్నీరు సీతారామాంజనేయులు,
జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా.
స్థిరవాణి : 08654 224726

జీవన పాఠం
నిద్రకు ఆయాసమొచ్చి నీరసపడింది
ఎక్కడి వారక్కడ కళ్లు మూసేశారు
కళ్లున్నా చూడలేని కబోదులు మాత్రం
నిశిరాతిరి వెనె్నల్లో
చందమామను చూస్తున్నారు
మనోనేత్రంతో ఆత్రంగా..
చుక్కల రేడు ఎంతకీ రాడు
అడుగిడిన ప్రతి అడుగు
ఒక పదాన్ని సృజిస్తుంది
జీవన పాఠాన్ని బోధిస్తుంది
చేరాల్సిన గమ్యం అగమ్య గోచరమవుతోంది
చుక్కాని చూపించేవారు కరవయ్యారు
చుక్కలకందని చందురుడు
ఆకాశం పక్కపై చుక్కల చాటున నక్కాడు
చూడచక్కనోడు ఏ చుక్కకీ చిక్కనోడు
‘రాత్రి’ ఎక్కడ పుట్టిందీ
ఎక్కడిదాకా వెళుతుంది
ఎక్కడ మాయమవుతోందనని
రాత్రంతా వెతుకుతున్నాను
ఆకర్ష - వికర్షల రహస్యం తెలియక
మనిషి నలిగి, కుమిలి ఛస్తున్నాడు!

తూములూరి రాజేంద్రప్రసాద్,
విజయవాడ.
చరవాణి : 9490332323

ఆనంద దీప్తి
ఎందుకు మనీషి
దిగాలుగా ఉన్నావు!
జగాన చూస్తున్నదేగా
మిగులుగా ఏముంది
యుగాలుగా ఉన్నదేగా?
శిశువుగా పుట్టి
తల్లితండ్రి వద్ద పెరిగి
పల్లె వొడిలో పవళించి
అనుబంధాలు చవిచూసి
బంధాలు పెనవేసుకొని
నాది అనుకొన్నది నీ మనసేగా!
మర జీవనం ఆశల ప్రయాణం
మరల బతుకు మాయజూదం
ఎరల పయనం వ్యథాభరితం
తెరల జీవితం తెగని ఆరాటం
నాది అనుకొన్నది నగుబాటేగా!
మన ముందువాళ్లు
ఇవన్నీ చూసినవాళ్లే కదా!
అనుభవించిన వారేగా
అవలోకనం చేసుకొన్నవారేగా
నాది అనుకొన్నది లేదన్నవారేగా!
తుడిచెయ్యి ఈలోక ఆర్తిని
విడిచెయ్యి శంకలన్నీ పూర్తిగా
మిగిలిపో శాంతమూర్తిలా
ప్రశాంత వదన స్ఫూర్తిగా
అనంత ఆనంద దీప్తిలా..!

ఆచార్య మక్కెన శ్రీను,
విజయవాడ.
ఫోన్ : 9885219712

ఎడారి వసంతం
రెండు మనసులకు అల్లుకున్న
అదృశ్య వారధి.. అపురూప పెన్నిధి
బాధకు భరోసా ఆనందానికి అభినందన
ఒంటరితనానికి జంటతనం
వరుసలు ఏవైనా వయసులు ఎంతైనా
అలవిమాలిన అనురాగానికి చిరునామా
రెండక్షరాల నిత్యయవ్వని.. జవ్వని
అదో రుతురాణి సతతవసంత వనిత
‘అమరం’ అని నాడెన్నో దివ్యమందిరాలు నగరాలు
నిర్మించుకున్న ఘనచరిత మనది
నేడా అమర సౌధాలన్నీ కూలిపోతున్న స్థితి
వజ్రతుల్యమైనదే సుందర దృశ్యభామినే అయినా
ప్రేయసి - ప్రియుడు, సోదర సోదరీమణులు
ఆఖరికి అమ్మానాన్నలు, ఆలూమగలు
అందరినీ జతచేసేది రెండు చుక్కల ప్రేమామృతమే!
అవకాశవాద జాలంతో వ్యామోహపు గాలంతో
ప్రేమమత్స్యకనె్నను ఒడిసిపడుతున్న నవసమాజమా!
ప్రేమగొప్పతనం తగ్గించే ఓ ప్రేమికులారా!
మరో జన్మలో మీరంతా
‘పేడీజనావళై’ పుట్టడం.. పరమసత్యం!!

అమ్మిన శ్రీనివాసరాజు, చరవాణి : 9441317694

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

email: merupuvj@andhrabhoomi.net

- గోనుగుంట మురళీకృష్ణ