వినదగు!

ఆత్మ శుద్ధత్వమే బ్రహ్మత్వ సిద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన పాంచభౌతిక దేహమే ‘క్షేత్రం’. ఈ దేహాన్ని ధరించిన మనమే ‘క్షేత్రజ్ఞులం’. ఈ దేహానికి సంబంధించిన ఎరుకనే ‘క్షేత్రజ్ఞత్వం’. ఈ దేహ క్షేత్ర అస్తిత్వానికి ఆధారమైన పురుషోత్తముడే ‘క్షేత్రి’.
పంచభూతాలతో రూపుదిద్దుకున్న మానవ అవతారం ఎప్పటికైనా పంచభూతాలలో కలవవలసిందే! అయితే రూపుదిద్దుకోవటానికీ, కరిగిపోవటానికీ నడుమ జరిగే సంగ్రామమే మానవ జీవితం. ఈ అశాశ్వతత్వ దేహంలోకి శాశ్వతత్వ ఆత్మ పుట్టుకతో ప్రవేశించినా శరీరం నశ్వర స్థితికి చేరేప్పటికి మరణం రూపేణా భౌతికాన్ని వీడుతోంది. దేహంలో ఉన్నప్పటికీ భౌతిక తత్వానికే దేహి పరిమితమై ఉన్నంతకాలం ఆత్మ వౌన ప్రేక్షకురాలిలా ఉండిపోతోంది.
అలా కాక దేహి భౌతికం నుండి అధిభౌతికం వైపు మరలినప్పుడు ఆత్మ భౌతిక జీవనంలో సైతం జోక్యం చేసుకోవటం ప్రారంభిస్తుంది.. ప్రభావవంతంగా దేహ చైతన్యాన్ని ఆత్మ చైతన్యంగా మలుపు తిప్పుతుంది. దేహిని ‘అహం’కారాదుల నుండి, ఇంద్రియ వైభోగాల నుండి బయటపడేయటానికి సంయమన వర్తనం సాగించటానికి ప్రయత్నిస్తుంటుంది. దీనే్న క్షేత్ర క్షేత్రజ్ఞ యోగంగా భగవద్గీత చెబుతుంది. ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ యోగ ఎరుకతో జ్ఞానయోగం వైపు దృష్టి మరలుతుంది. యోగ సాధనలో జ్ఞాన నేత్రం విచ్చుకోవటం, విప్పారటం అంటే ఇదే!
క్షేత్ర, క్షేత్రజ్ఞులు భౌతికాలు కాబట్టి రెంటికీ రూపం ఉంది.. రెండూ దృశ్యమానాలే. అయితే అటు క్షేత్ర చైతన్యానికి ఇటు క్షేత్రజ్ఞ చైతన్యానికి మూలమైన ఆత్మ, పరమాత్మలు మాత్రం అభౌతికాలు, అరూపాలు, అదృశ్యాలు. దేహాన్ని మనం పుడమిపైని పుట్టుకనో లేదా తల్లి గర్భంలో ఉంటూ పరిణమిస్తూ వచ్చిన స్థితినో ‘ఆది’గాను, ‘ప్రారంభ’ దశగాను చెప్పకోగలమే కానీ ఆత్మకు కానీ, పరమాత్మకు కానీ ప్రారంభ దశనీ, ఆది స్థితినీ చూడలేం. అలాగే ఆత్మ అధీనంలోనివే మానవ రూపానికి ఆధారమైన పంచభూతాలు సైతం. ఇలా భూత వైవిధ్యతలూ, భూత ఉత్పత్తి వికాసాలూ ఆత్మాశ్రీతాలే! ఆత్మ చైతన్యంతో పరిణమించేవే!! ఆ ఆత్మ చైతన్యంతో పరిఢవిల్లేవే!! అందుకే భగవద్గీత-
‘యదా భూత పృథగ్భావమేకస్థమను పశ్యతి
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా’ అని అంటుంది.
మనం సామాన్యంగా మానవ అవతరణకు ‘మూలం’గా పరమ పురుషుడ్ని చెప్పుకుంటుంటాం. మానవ ఆత్మకు మూలంగా ‘పరమాత్మ’ను పేర్కొంటుంటాం. మానవ చైతన్యాన్ని సైతం ఆ ప్రత్యగాత్మ చైతన్యపాయ అనే అర్థం చేసుకో ప్రయత్నిస్తుంటాం. అలాగే ప్రకృతిని సైతం ఒక ‘మూల ప్రకృతి’ ఆధారితంగానే చూస్తుంటాం.
నిజానికి ‘ప్రకృతిం పురుషం చైవ విద్ధ్య నాదీ ఉభావపి’ అంటూ ప్రకృతికీ, పురుషుడికీ ‘ఆది’ అనేదే లేదంటుంది భగవద్గీత. అందుకే ప్రకృతిని కానీ, పురుషుడ్ని కానీ సత్-చిత్-ఆనంద అస్తిత్వాలుగా చెప్పుకోగలమే కానీ వస్తు రూపేణా చెప్పుకోలేం.
అంతెందుకు, ఈ మానవ జన్మ లేదా మానవ దేహం కార్యసంపన్న కాబట్టి, ఆ కార్యమగ్నతకు వలసిన ఇంద్రియ వ్యవస్థకు ‘ప్రకృతి’ హేతువు అయవుంటుంది. ఆ ఇంద్రియ చైతన్యంతో కలిగే సుఖదుఃఖాలకు హేతువు పురుషుడు అవుతుంటాడు. అందుకే మానవ అవతారంలోని పురుషుడ్ని అంటే జీవుడ్ని భోక్త, కర్త అనీ అంటుంటాం. ఈ ఎరుక లేకపోవటమే అవిద్య, అజ్ఞానం. ఈ అజ్ఞానం ప్రిదిలిపోవటమే స్వతంత్రమవటం, స్వతంత్రించటం.
అజ్ఞానం, అవిద్య ప్రిదిలిపోవటానికి ఉపకరించేదే యోగ సాధన. నిరంతర యోగ సాధనతో కర్మ, భక్తి, రాజ, సాంఖ్య యోగ పథాలలో గికత్వం సాధ్యవంటుంది భగవద్గీత.
***
భగవద్గీత పరమాత్మను ‘క్షేత్రి’ అంటుంది. అన్ని క్షేత్ర ఆత్మల చైతన్యం ఆ క్షేత్రి చైతన్యమే అంటుంది. చీకటి అనేది లేనిది, సూర్య తేజస్సుకు సైతం మూలమైంది ఈ పరమాత్మ జ్యోతిస్సే. అదే పరంజ్యోతి. పైగా భూత చైతన్యానికి ఆంతర్యంగాను బాహ్యంగాను ఉన్నది కూడా ఆ పరమాత్మ చైతన్యమే. పైగా -
‘సర్వేన్ద్రియ గుణాభాసం సర్వేన్ద్రియ వివర్జితమ్
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ’
ఇంద్రియ చైతన్యమంతా ఆ పరమాత్మ చైతన్యానిదే అనిపిస్తుంటుంది. మానవ గుణాల కన్నిటికీ మూలం అదే అనిపిస్తుంటుంది. అయినా దేనికీ అది కట్టుబడి ఉండదు. పైగా ఎటువంటి పరిస్థితిలోను కేవలం భౌతిక స్పృహకే పరిమితమైంది కాదు. ఒక విధంగా భౌతికత్వాన్ని వీడిన తర్వాత కలిగే ఇంద్రియాతీత స్పృహ ఇది. అది ఎంతలా ఎన్ని కోట్ల యోజనాల దూరంలో ఉన్నప్పటికీ ‘ఆత్మ’కు సమీపంగానే ఉంటుంది. మానవ అవతారంలోని హృదయ స్థానమే ఈ అంతర్యామి స్థావరం.
అనేకానేక అలల చైతన్యం ఆ పరమాత్మ చైతన్య పాయనే.. అసంఖ్యాక జలధారలు చైతన్యమూ ఆ పరమాత్మ చైతన్య అంశనే.. ప్రవహించే నదుల, కాలువల చైతన్యమూ ఆ పరమాత్మ చైతన్య ఉధృతే. అలాగే మానవ క్షేత్ర ఆత్మల చైతన్యమూ ఆ పరబ్రహ్మ చైతన్యమే. అంతెందుకు మానవ గుణ సంపన్నతలా కానవచ్చే అధిభౌతిక తాత్విక చైతన్యమూ ఆ పరమాత్మ చైతన్యానిదే. అందుకే మన దేహానికే కాదు చివరికి ప్రకృతికి సైతం అతీతమైందిగా పరమాత్మ అస్తిత్వాన్ని పరిగణిస్తుంటాం.
***
ఇంతకీ భగవద్గీతలోని పదమూడవ అధ్యాయం క్షేత్ర - క్షేత్రజ్ఞ - విభాగ యోగం. ఈ అధ్యాయంలో 5 నుండి 11 వరకు ఉన్న ఏడు శ్లోకాలు దేహతత్వాన్ని గురించి, దేహాతీత తత్వాన్ని గురించి విపులీకరిస్తుంటాయి.
‘మహాభూతాన్యహంకారో బుద్ధి రవ్యక్త మేవ చ
ఇన్ద్రియాణి దశైకం చ పఞ్చ చేన్ద్రియగోచరాః’
‘ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశే్చతనా ధృతిః
ఏ తత్ క్షేత్రం సమాసేన సవికార ముదాహృతమ్’
గాలి, నీరు, నిప్పు, ఆకాశం, మట్టి అయిన అయిదు భూతాలు, అహంకారం, అవ్యక్తం, బుద్ధి- వీటితోపాటు అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనో రూపేంద్రియం, అయిదు ఇంద్రియ గ్రహ శబ్ద విషయాలతో పాటు ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, దేహేంద్రియ సంపద, అంతఃకరణ జ్ఞానం, ధైర్యం - ఇవన్నీ దేహిక వికారాలు. వీటి సమ్మేళనమే మానవ క్షేత్రం.
నిజానికి పైకి ఇవి దైహిక స్వభావంలా అనిపిస్తుంటాయి కానీ అవి దైహిక వికారాలు. అంటే స్వభావతః లేనివి.. పుడమిని తాకటంతో గుణాలుగా వచ్చి చేరేవి. వచ్చి చేరుతున్న ఈ గుణాలను నిలుపుదల చేయటం యోగ సాధన వల్లనే సాధ్యం. ఇనుప ఊచ వంగుతుంది. భగభగమండే అగ్నిలో కాలినపుడు. అగ్ని కారణంగా ఇనుముకి ఆ వంగే గుణం కలుగుతోంది. అలాగే, ఆత్మ జీవులమైన మనలను, స్వభావంలో లేని ‘ప్రాపంచిక చేరిక’ల వల్ల, గుణాలు వికారాలు కలుషితం చేస్తున్నాయి. ఈ వికార కాలుష్యం నుండి వైదొలగడమంటే-
నిగర్వి కావాలి; డాంబిక వర్తనం కూడదు; సహనం, ఋజు స్వభావం, స్థిరత్వం, నిగ్రహం, వైరాగ్యం, నిరహంకారం, వొంటబట్టాలి; జన్మ - మృత్యు - జరా - వ్యాధి దుఃఖాల దోషాలను గుర్తించగలగాలి; దేనిపైనా అమితాసక్తి లేకుండాలి; సమచిత్తం అలవడాలి. ఈ వర్తనం వల్లనే సాధనా జీవితం సాధ్యవౌతుంది. ఆ సాధనా జీవితం గికత్వాన్ని అందిస్తంది.. ఆ గికత్వం వల్లనే బ్రహ్మత్వం సిద్ధిస్తంది. అదే బ్రహ్మ సాక్షాత్కారం.. అదే బ్రహ్మజ్ఞానం.. ఆ బ్రహ్మమూ మనమూ ఒక్కటే అన్న స్థితికి చేరుకోవటం ఆత్మ దర్శనమే! అహం బ్రహ్మస్మి.
ఆత్మ తన ఆధ్యాత్మికత్వ ఎరుకలేక భౌతిక వ్యామోహంలో పడిపోవటం వల్ల తన మానవ అవతరణ లక్ష్యాన్ని విస్మరిస్తుంటుంది. అయితే ఏమాత్రం మానవ ఆత్మ తన మానవ అవతరణ లక్ష్యాన్ని పసిగట్టగలిగినా అది భౌతిక మాయామోహిత వాతావరణం నుండి బయటపడి విశ్వవ్యాప్త ఆచరణ పథం పడుతుంది - జ్ఞాన యోగంతో కానీ, సాంఖ్య యోగంతో కానీ, కర్మ యోగంతో కానీ! మనకు వలసిన పురుషోత్తమ యోగం ఇదే!
*

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946