వినదగు!

ఇంద్రియాల నియంత్రణతోనే జితేంద్రియత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మయ్య ప్రత్యక్షమయ్యాడు.. చాల రోజుల తర్వాత. బ్రహ్మయ్య దర్శనంతో బ్రహ్మ జ్ఞానం పురివిప్పినట్లుంటుంది. ఇంతకీ బ్రహ్మయ్య ఈ మధ్యకాలంలో కనిపించకపోవటానికి కారణం ‘జన్మభూమి’ని చేరుకోవటమేనట! అదే తన ‘ఆరిజిన్’ అన్నాడు.. జన్మభూమే తన కర్మభూమి అన్నాడు.. అదే తన కర్మక్షేత్రం అన్నాడు. అక్కడనే తన యోగ సాధన నిష్ఠాగరిష్ఠంగా సాగుతోందట. పైగా యోగసాధన ద్వారా సంప్రాప్తమయ్యే ‘బ్రహ్మనిష్ఠ’ సాధ్యమవుతోందట. ఆ బ్రహ్మ నిష్ఠతోనే ‘కర్మ సన్యాస యోగం కాదు మనది.. కర్మయోగం మనది’ అన్నాడు. అలా బ్రహ్మయ్య అంటుంటే ‘సంసారాన్ని త్యజించకుండా యోగం చేయటమే అసలైన కర్మయోగం’ అన్న యోగ సంవిధానం స్ఫురణకొచ్చింది. భగవద్గీత అయిదవ అధ్యాయం కళ్ల ముందు మెదిలింది.
ఈ అధ్యాయం ‘కర్మ సన్యాస యోగం’. కర్మ లక్షణాలు, సన్యాస లక్షణాలు, యోగ లక్షణాలు మూడు పాయలుగా అల్లుకుపోయిన అధ్యాయమిది. అర్జునుడికి కలిగిన - కర్మ సన్యాస యోగం అనుసరణీయమా? కర్మయోగం అనుసరణీయమా? అన్న ప్రశ్నకు కృష్ణుడిచ్చిన సమాధానమే ఈ పంచమాధ్యాయం. కర్మ సన్యాసం కంటే కర్మానుష్ఠానమే అనుసరణీయమని వివరణాత్మకంగా తేల్చి చెప్పటం మనం చూడవచ్చు.
కర్మల్ని సన్యసించాలా? కర్మల్ని అనుష్ఠించాలా? ప్రస్తుతానికి కర్మల విషయాన్ని ప్రక్కనపెట్టి మన సన్యాసులం - సర్వసంగ పరిత్యాగులం - కర్మయోగులం కావటం ఎలానో చూద్దాం. సన్యాసి అంటే బంధాలకు బందీ కానివాడు అనేగా! అంటే ద్వంద్వ ప్రవృత్తి లేనివాడు. ద్వేష ప్రవృత్తి, కాంక్షా ప్రవృత్తి లేనివాడు. ఈ రెండు ప్రవృత్తులకూ అతీతమైన వాడే సర్వకాల సర్వావస్థలలో సన్యాసి అనిపించుకుంటాడు. ‘నిత్య సన్యాసి’ అవుతాడు. పరమార్థ తత్వ జ్ఞానమే నిత్య సన్యాసికి ఆలంబన అవుతుంది. కర్తృత్వాపేక్ష లేనివాడే నిత్య సన్యాసి.. నిజమైన కర్మయోగి. అంటే, కర్మానుష్ఠానంలో ముందుండటమే తప్ప ఆ కర్తృత్వ ఫలిత భారాన్ని వహించకపోవటం.. కర్తృత్వ విషయంలో నిరపేక్షంగా ఉండటం. అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞాని సామాన్య మానవుడిలానే వ్యవహరిస్తుంటాడు... పైకి అతడి చూపు మన చూపులా ఉంటుంది, వినటమూ మనలానే అనిపిస్తుంటుంది, నడకా మన వంటిదే, ఆహార పానీయాల సేవనమూ మన వంటిదే.. ఆతడి శ్వాసక్రియ సైతం మనదిలానే అనిపిస్తుంటుంది. అయితే అన్ని వేళలా అంటే సర్వకాల సర్వావస్థలలో సన్యాసి చిత్తం సదా జాగృతమై ఉంటుంది.. చైతన్య శీలతతో అలరారుతుంటుంది. ఇంద్రియ వశుడు కాదు కాబట్టి విలక్షణతే అతడి వ్యక్తిత్వం. తలదూర్చినా దేనినీ తలకెక్కించుకోక పోవటం ఈ సంసార యోగి వ్యక్తిమత్వం.
చేసే కర్మలను బ్రహ్మదత్తం చేయటం వల్ల ఏ కర్మబంధమూ బాధించదు. కర్మాచరణ వల్ల కలిగే పాప పుణ్యాల ప్రసక్తి సన్యాసి ఎదను తాకదు. తామరాకుకు నీరు అంటనట్లుగానే సన్యాసికి ఫలప్రాప్తి అంటదు.
కర్మయోగం వల్ల సర్వకర్మలను మానసికంగా సన్యసించటం జరుగుతుందే తప్ప దైహికంగా కాదు. అంటే, ఫలప్రాప్తిని లేదా కర్తృత్వాన్ని మనస్సు పట్టించుకోదు.. దేహపరంగా చేసుకుంటూ పోవటమే! ఇంద్రియ వశమై కర్మాచరణ కాక జితేంద్రియత్వంతో కర్మానుష్ఠానం ముఖ్యం. సర్వకర్మలను మనసుతో సన్యసించటమే జితేంద్రియత్వం. ఈ మానవ దేహమే ఒక పురం అనుకుంటే ఈ దేహానికి తొమ్మిది ద్వారాలు.. అవి రూప శబ్ద గంధ రసాశ్రీతాలైన ఏడు ద్వారాలు ప్లస్ విసర్జితావయవాలైన రెండు ద్వారాలు.. వెరసి తొమ్మిది ద్వారాలు. అందుకే మానవ దేహాన్ని నవ ద్వార పురం అనీ అంటాం. ఒక్క జితేంద్రియుడికే ఈ నవ ద్వారపురం సుఖనిలయమవుతుంది. స్వర్గతుల్య మనిపిస్తుంది. కారణం కర్మయోగికి ఈ దేహరూపం ముఖ్యం కాదు.. ఆత్మ స్వరూపమే కర్మాచరణకు ఆలంబన. ‘ఆత్మకు కాక దేహానికి ప్రథమ తాంబూలమిస్తే మోహ వశం కావడం జరుగుతుంది. దేహం ఒక ప్రకటనా మాధ్యమమే తప్ప అదే స్వర్గం కాదన్న తెలివిడే ఆత్మజ్ఞానం. అయితే దీన్ని గుర్తించక దేహ రూపంలో ప్రవర్తిల్లే పాంచ భౌతిక స్వభావానికి కట్టుబడితే కనక మానవ వర్తనమంతా మాయామోహితమే అవుతుంది.
* * *
సర్వసంగ పరిత్యాగులైన కర్మయోగ జీవనులకే నిర్వాణ ప్రాప్తి. ఇహంలో ఉంటూ పరంలో మగ్నం కావటం పరమ నిష్ఠతో గిక సాధనన కొనసాగించటమే! పాంచభౌతిక కాలుష్యం నుండి విడివడటం కర్మ యోగులకు సాధ్యమయ్యే యోగ సాధనా రహస్యం. ఇదే బ్రాహ్మీ స్థితి. ‘పర తత్వంతో ‘స్థిరం’ కావటమే బ్రాహ్మీ స్థితి... సమభావంతో సంసార వశం కాకుండా ఉండటమే యోగ సాధన. అంటే, ఇష్టంతో హర్షాతిరేకమూ పనికిరాదు, అనిష్టతతో ఉద్వేగ సంపన్నతా పనికిరాదు. ఉద్వేగాలకు, ఉద్రేకాలకు లోను కాని ఉత్తేజితత్వమే బ్రహ్మ నిష్ఠ. ఆ బ్రహ్మనిష్ఠతో వర్తించగలిగితే బ్రహ్మవేత్త అయినట్లే! యోగనిష్ఠ కలవారికి సుఖం అనేది అంతఃకరణ కార్యాచరణ ఫలం.. నాశనం కాని జ్ఞానావిష్కరణే ఆనందం.
నిజానికి, సంయోగ వియోగాల పరిధి తెలియటమే జ్ఞానావిష్కరణ. ఈ జ్ఞానావిష్కరణతో ఆది అంతాల నిడివి తెలుస్తుంటుంది. ఈ రెంటికీ మధ్యనున్న అంతరం తరుగుతూ జన్మను, మృత్యువును ‘ఏకం’గా చూడటం సాధ్యపడాలి... కాలం, సృష్టి సంయోగించటం అంటే అదే! అదీ కర్మయోగం.
మన మానవ దేహం కామక్రోధ మద మాత్సర్యాల సంహితనే కదా! ఈ నాల్గింటికీ వశం కావటమే భోగం. ఈ నాల్గింటికీ అతీతం కావటమే యోగం. పాంచ భౌతిక దేహ క్రియలు, కర్మల ‘ఇనె్టన్సిటీ’తో సాగేవే! ఈ ఇనె్టన్సిటికీ ఒక ఫోర్స్ ఉంటుంది, ఒక స్పీడ్ ఉంటుంది. ఈ ఫోర్స్‌కు, స్పీడ్‌కు అనుగుణంగా వర్తించటం ఇంద్రియాలకు లోబడటం. వీటిని కంట్రోల్ చేస్తూ చరించటం జితేంద్రియత్వం. కర్మాచరణలో జితేంద్రియుడైన వాడే కర్మయోగి.
*

కర్మయోగులకే బ్రహ్మ నిర్వాణం సాధ్యం.
‘లభంతే బ్రహ్మ నిర్వాణ మృషయః క్షీణకల్మషాః
భిన్నద్వైధా యతాత్మా న స్సర్వ భూతహితే రతాః’
అవును.. ఆత్మస్వరూపి, సమదర్శి, మననశీలి, అంతఃకరణ చిత్తుడు, సర్వసంగ పరిత్యాగి, సర్వభూతహితుడు, జితేంద్రియుడు అయిన కర్మయోగికి మాత్రమే బ్రహ్మ నిర్వాణం సాధ్యమవుతుంది. *

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946