వినదగు!

వజ్ర సంకల్పమే వజ్రాయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్’
కామధేనువును నేనే.. వజ్రాయుధాన్ని నేనే.
అవును, నాయకుడు వజ్రాయుధం కాగలిగితే ఆథంటిక్ లీడర్... కామధేనువు కాగలిగితే సర్వెంట్ లీడర్ అనిపించుకుంటాడు. కాబట్టి నాయకత్వం అంటే అధికారం మాత్రమే కాదు.. అధికారం ఆయుధం. అంటే ఆయుధాన్ని ధరిస్తే సరిపోదు... భరించటం తెలియాలి... ప్రయోగించటం తెలియాలి.. ప్రయోజనపడటం తెలియాలి. అదీ పవర్ ఆఫ్ ఎ వెపన్.. పవర్ ఆఫ్ ఎ లీడర్.
ఒక వ్యక్తిని మాత్రమే తలెత్తుకునేలా చేసేది నాయకత్వ ప్రతిభ కాదు... అది ఒక సమాజాన్ని, ఒక వ్యవస్థను ఉన్నతంగా నిలబెట్టగల శక్తి కేంద్రం. అయితే నాయకుడికి ఆయుధ ప్రయోగం తెలీకపోతే సమాజం కుప్పకూలుతుంది. వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయి. కాబట్టి భవిష్యత్తు మసకేయకూడదన్న తీవ్ర తపన నాయకుడికి స్వంతమై ఉండాలి. అందుకే కృష్ణుడంతటి వాడు అర్జునుడిని తన కనుసన్నలలో నిలుపుకున్నాడు... అర్జునుడు సైతం కృష్ణుడిని శిరసావహించాడు. శిరసావహించాడు కాబట్టే అర్జునుడు ఆందోళన నుండి, అజ్ఞానం నుండి బయటపడి కర్తవ్య పరాయణుడు కాగలిగాడు. కార్పొరేట్ రంగమైనా, కదన రంగమైనా కోరుకునేది కృష్ణుడి లాంటి నాయకుడినే.
ఈనాటి ప్రజాస్వామ్య దేశాలు కానీ, ప్రాపంచిక వ్యవస్థలు కానీ, చివరికి కంప్యూటరీకరణ సంస్కృతిని పుణికిపుచ్చుకున్న మల్టీనేషనల్ కంపెనీస్ కానీ కోరుకుంటోంది రెస్పాన్సిబిలిటీ అండ్ ఓనర్‌షిప్‌లకు చిరునామా కాగల లీడర్స్‌ని.. అంటే ఈనాటి మనుగడలో మనకు కావలసింది ‘స్వకీయ ముద్ర’గల నాయకులు... బాధ్యతా యుతంగా వర్తించగల నాయకులు, అటు స్వకీయ ముద్ర, ఇటు బాధ్యతగల నాయకులు స్వతంత్రంగానే వ్యవహరిస్తుంటారు. వైయక్తికంగానే అనిపించినా వారిలో ప్రామాణిక పరిణామాన్ని చూడగలం. అందుకే వారు పవర్‌ఫుల్ అండ్ అథారిటేటివ్. కారణం వారి దృష్టి రైట్ పర్ఫామెన్స్ పైనే కేంద్రీకృతమై ఉంటుంది.
ఇంతకీ రైట్ పర్ఫామెన్స్ సాధ్యమయ్యేది ‘స్థితప్రజ్ఞత్వం’తోనే. అంటే స్థితప్రజ్ఞత్వం నాయకత్వ లక్షణం కావలా.
‘సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానావ మానయోః
శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః’
‘తుల్య నిందాస్తుతిర్మౌనీ సంతుష్ణో యేన కేనచిత్
అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః’
శత్రువులతోను, మిత్రులతోను సమభావంతో వర్తించగలగటం, మానావమానాలను, శీతోష్ణాలను, సుఖదుఃఖాలను సమంగా స్వీకరించగలగటం - నిందాస్తుతులకు చలింపకుండటం - మమతాసక్తులు లేకుండటం - ఉన్నదానితో తృప్తి చెందటం - స్థితప్రజ్ఞతా లక్షణాలు. కృష్ణుడు గీతోపదేశంతో అర్జునుడ్ని ఈ స్థితప్రజ్ఞకు నిలువెత్తు నిదర్శనం చేయాలనుకున్నాడు. అదీ కృష్ణుడిలోని ఇన్‌స్పిరేషనల్ లీడర్‌షిప్.
ఇలా, రీడర్స్ ఉద్దేశంలో రైట్ పర్ఫామెన్స్ అంటే తమ ఒక్కరిదే కాదు.. వ్యవస్థలోని ప్రతి ఒక్కరి నుండి అంటే తరతమ భేదాలు లేక పై నుండి కింది దాకా ఉన్న ప్రతి ఒక్కరి నుండీ కర్మాచరణను ఆశిస్తారు... కర్తవ్యోన్ముఖుల్ని చేస్తారు... ఫలితాలను రాబట్టగలుగుతారు. అంటే ‘తాను’ అని కాక ‘తాము’ అనుకోగలగటంతో నాయకత్వ ప్రతిభ రాణిస్తుంది. అంటే ప్రతి ఒక్కరి విషయంలో మానిటరింగ్ అనేది లీడర్ మేనేజ్‌మెంట్ స్కిల్ అవుతుంది. ఒక విధంగా ఉన్న వనరులను ఉపయోగించుకో గలగటం నాయకులకు ముఖ్యం. కళ్ల ముందున్న వనరులను ఉపయోగించుకోవటం తెలీక ఇతర వనరుల కోసం అర్రులు చాస్తుండటం నాయకత్వ లక్షణం కాదు.
ఉన్న వనరులను ఇతరాలను కలుపుకోవటంలోనే నాయకత్వ ప్రతిభ దాగి ఉంటుంది. ఈ లక్షణాలతో మనం కృష్ణుడి తత్వాన్ని అర్థం చేసుకో ప్రయత్నిస్తే కృష్ణుడిలో మనం ఓనర్‌షిప్‌ను చూడగలం... మానిటరింగ్‌కు సాక్ష్యంగాను నిలుస్తాడు.. పైగా పవర్‌ఫుల్ అండ్ అథారిటేటివ్ అని కితాబివ్వకుండా ఉండలేం. ఎవరికీ వకాల్తా పుచ్చుకున్నట్టుండడు కానీ తనకు తాను బాధ్యతగా వర్తించటం చూడగలం. ఇలా కృష్ణుడు యూనిక్ లీడర్‌గా ఎప్పటికప్పుడు మన కళ్ల ముందు నిలబడుతుంటాడు.
మనం తరచూ చెప్పుకునే ‘క్రియేటింగ్ స్పేస్ అండ్ ఎజెండా ఫర్ అదర్స్’ అన్న అంశం కృష్ణ తత్వంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. ఇతరులకు అవకాశం ఇవ్వటం, ఇతరుల లక్ష్యాలను విచక్షణతో చూడగలగటం అన్నది లీడర్‌గా కృష్ణుడికి పెద్ద ఎస్సెట్. నేటి కార్పొరేట్ సంస్కృతిలో చాలామంది లీడర్స్‌ది ‘మార్కెట్ కాంట్రాక్ట్’ అనిపిస్తుంటుంది. అంతమాత్రాన వారి నిబద్ధతను మనం తప్పుపట్టలేం.
పైకి ఎలా కనిపించినా అసలు సిసలు నాయకులలో కృష్ణుడిలా ‘సైకలాజికల్ కాంట్రాక్ట్’ నెలకొని ఉంటుంది. అంటే, వ్యవస్థను ఉన్నతీకరించే ప్రయత్నంలో మానసికబద్ధత అనేది వారికి సహజాలంకారం. వారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముఖ్యం కాదు.. సిట్యుయేషన్ డిమాండ్‌తో ముందుకెళ్తుంటారు. తాము ముందుకు వెళ్తూ తమను వెన్నంటి వస్తున్న వారికి సమానావకాశాలను అందిస్తుంటారు. సహకరిస్తూ, ఒకరికి ఒకరు సహకరించుకునే సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పుతుంటారు.. సంయమనంతో వర్తిస్తుంటారు.
కృష్ణుడిది ఇన్స్‌స్పిరేషనల్ లీడర్‌షిప్... సామాజికుల్ని, అనుయాయుల్ని మేల్కొల్పగలగటమే నిజమైన లీడర్‌షిప్ క్వాలిటీ. అటువంటి సంపూర్ణ ప్రజ్ఞ గల నాయకుడు కృష్ణుడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మనల్ని మేల్కొల్పుతూనే ఉన్నాడు... మనల్నే కాదు మనలోని నాయకుల్నీ మేల్కొల్పుతున్నాడు. అందుకే కృష్ణుడు కేవలం నాయకుడే కాదు.. లీడర్స్ లీడర్ కూడా!
ఇంతకీ ఇన్స్ప్‌రేషనల్ లీడర్-
* స్వార్థంతోను, సంకుచితంగాను వర్తించడు.
* భయపడడు.. భయభ్రాంతులకు లోనుచేయడు.
* మార్పు తీసుకురాగల వ్యక్తిత్వ సంపన్నుడై ఉంటాడు.
* ప్రభావితం చేయగల వర్తనం స్వంతమై ఉంటుంది.
* మన పుట్టుక ప్రయోజనాన్ని, జీవన విలువలను మన ముందు నిలుపుతుంటాడు.
అంటే, నాయకుడన్న వాడు మనల్ని కేవలం ఆ సందర్భానికి తగ్గట్టు మేల్కొల్పితే సరిపోదు.. ఈ భూమి మీదికి వచ్చినందుకు మన పుట్టుక ప్రయోజనాన్ని, జీవన విలువలను ఎరుకపరిచే విధంగా మనలను కర్తవ్యోన్ముఖుల్ని, కార్యాచరణాసక్తుల్ని చేయగలగాలి. అదీ వారి ఇన్స్ప్‌రేషనల్ పవర్. అందుకే కృష్ణోపదేశం అర్జునుడి విషయంలో కేవలం కురుక్షేత్రానికి పరిమితమైంది కాదు. అర్జునుడు ధర్మాన్ని నిలపాల్సిన లక్ష్యాన్ని, సమీప భవిష్యత్తులో తీర్చిదిద్దుకోవలసిన తీరును తెలుపుతూ, మనల్నీ ఆచరణబద్ధుల్ని చేస్తుంటుంది.
అన్నింటికంటే ముఖ్యం మనం అనుకుంటున్నట్టు అర్జునుడు కురుక్షేత్రంలో కూలబడింది కేవలం తన వారిని చంపుతాననే భయవిహ్వలతతో మాత్రమే కాదు... ఒక్కసారి వారందరిలోను తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. అది అర్జునుడి ఆత్మ దర్శనం. అందులో అర్జునుడికి తనలోని కోపం, కోరిక, కాంక్షలు త్రీడి ఎఫెక్ట్‌లో కనిపించాయి. ఆ మూడింటితోను తాను ఎంతలా స్వార్థపూరితమవుతూ వచ్చాడో దర్శనమైంది. వ్యక్తిగత లాభం, వైయక్తిక కీర్తి, అధికార కాంక్ష - వీటితోనే తాను పెరుగుతూ వచ్చింది అన్న ఆలోచనతో తనను తాను భరించలేక చతికిలపడ్డాడు.
ఈ సందర్భంలో కృష్ణుడు ఇన్స్ప్‌రేషనల్ లీడరే అయ్యాడు. అందుకే తన గీతోపదేశంలో ఉన్నత లక్ష్యాల ప్రయత్నంలో కొన్ని వైయక్తిక లక్షణాలను పరిగణించకూడదంటాడు. ‘హయ్యర్ పర్పస్’ ముందు ప్రతీ అంశాన్ని పరిగణించాల్సిన అవసరం లేదంటాడు. సత్వరజస్తమో గుణాలు ఒకదాన్ని వెన్నంటి మరొకటి మన వ్యక్తిత్వంలో బయటపడుతూనే ఉంటాయి కానీ, ఈ త్రిగుణాల విషయంలో సంయమనంతో వ్యవహరించటమే నాయకత్వ ప్రతిభ అని అంటాడు.
మొత్తానికి కృష్ణతత్వాన్ని కూలంకషంగా పరిశీలిస్తే అర్థమయ్యేది నాయకత్వం అంటే ‘ఇన్‌ఫ్లుయెన్స్.. నథింగ్ మోర్, నథింగ్ లెస్’ అని. ఇంకా చెప్పుకోవాలంటే ‘విజన్ అండ్ డైరెక్షన్’ ఉన్నవాడే నాయకుడు... అంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లగల ప్రతిభ కలిగి ఉండటం. ఏది ఏమైనా, అధికారాన్నిబట్టి నాయకత్వ ప్రతిభ వెల్లడి కాదు కానీ కర్తవ్య పరాయణతతో వేసే అడుగులను బట్టి నాయకత్వ ప్రతిభ శోభిస్తుంటుంది. కృష్ణుడన్నట్లుగా ధర్మప్రతిష్ఠాపనే కాదు విలువలకు అర్థాన్నీ ఆపాదించగలిగితేనే ప్రామాణిక నాయకత్వమయ్యేది.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946