వినమరుగైన

కీర్తిశేషులు - భమిడిపాటి రాధాకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కావ్యేషు నాటకం రమ్యం’’
సాహిత్య రూపాలన్నింటిలో, ప్రజా హృదయాల్ని చూరగొనేటట్లు, కావ్య వస్తువుని సాక్షాత్కరింపజేయటంలో ప్రధానమైంది నాటకం. విషయ పుష్టి, భావరస పటుత్వం, శక్తివంతమైన కథా వస్తువుతోపాటు, సామర్థ్యంగల నటవర్గం కనుక వుంటే, ఆ నాటకం, ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
హాస్య ధోరణిలో, సాంఘిక పరిస్థితుల్ని హేళనాత్మకంగా చిత్రించడం ప్రహసనం యొక్క ముఖ్య లక్షణం. ఇది సంస్కృత నాటక సాంప్రదాయమే. దీన్ని లక్షణమైన నాటక రూపంలో, ఆంధ్ర సాహిత్యంలో ప్రవేశపెట్టింది శ్రీ కందుకూరి. వారి ప్రహసనాలు, సంఘ సంస్కారం, సాంఘిక చైతన్యం కలిగించి, సాంఘిక ప్రయోజనం సాధించడమే కాకుండా, ప్రథమ తెలుగు సాంఘిక నాటకం, గురజాడ వారి కన్యాశుల్కం అవతరించడానికి, నేపథ్య వాతావరణమైంది. సంఘ దురాచారాల్ని ఖండించడం సాంఘిక నాటకాల లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించిన తెలుగు సాంఘిక నాటకం గురజాడ వారి కన్యాశుల్కం.
కన్యాశుల్కం తరువాత వ్యంగ్య విమర్శలతో, హాస్య ధోరణిలో సాంఘిక ప్రయోజనాన్ని ఆశించి వెలువడ్డ అరుదైన నాటకాల్లో శ్రీ భమిడిపాటి రాధాకృష్ణగారు రచించిన కీర్తిశేషులు నాటకం మొదటి వరుసలోదని నిస్సంకోచంగా చెప్పవచ్చును. గురజాడవారు గిరీశం చేత మనవాళ్ళు వుత్త వెధవాయిలోయ్ అని, ఏ సమయం సందర్భంలో అనిపించినా, రాధాకృష్ణగారి కీర్తిశేషులు నాటకానికి ఆ వెధవాయిత్వమే ఆధారం, ఆలంబన. వీరి కలంలో చురుకైన హాస్యంతోపాటు సంఘంలో పోరాడుతున్న కుళ్లుని క్షాళన చేయటానికి, హేళన చేస్తూ చెప్పగల వాడి వేడి పుష్కలంగా వుంది. ఈ నాటకంలోని ప్రతి పాత్ర ప్రతి మాట సమాజంలోని వివిధ వర్గాల్ని, వ్యక్తుల్ని వారి వారి ప్రవృత్తుల్ని ప్రతిబింబజేస్తూ తమ నిత్య జీవితంలోలాగే మాట్లాడతాయ్. సుమారు 1900 నుండి 1950 సంవత్సరకాలంలో ఆంధ్రదేశంలో రచనలకి, రచయితలకి ఆదాయపరంగా ఎక్కువ గిరాకీ వుండేది కాదు. ఆ రోజుల్లో ఓ పండితుడు, పద్య కవి అయిన మహానుభావుడు స్వగ్రామం వదలి, పట్నంలో తెలుగు మాస్టారిగా ఉద్యోగం చేసుకుంటూ, జీవితాంతం కృషిచేసి రత్నాల్లాంటి పద్య కవితా గ్రంథాలు రాసి ఆంధ్ర ప్రజలకి కానుకగా సమర్పించారు. రిటైరైన తర్వాత, పట్నంలో బ్రతుకు సాగించలేక, పెద్ద పుణ్యక్షేత్రమయిన తన స్వగ్రామానికి తిరిగి వెళ్లారు. సరైన ఆదరణ అక్కడ కూడా లేక, జీవనయానం దుర్భరంగా గడిపి కన్నుమూశారు. దహన సంస్కారానికి డబ్బులేకపోతే ఆ వూరి ప్రజలు ఆయనమీదున్న గౌరవంతో ఆయన కొడుకుని భక్తితో జోలె పట్టుకు వూరంతా తిరగమని సలహా ఇచ్చారు. అతను అలా తిరిగాక వచ్చిన డబ్బుతోనే ఆ మహాకవికి దహన సంస్కారాలు జరిగినాయట.
దాదాపుగా అదేకాలంలో మరో ప్రముఖ రచయిత, కవి, నాటకకర్త అయిన మహానుభావుడు మరణిస్తే పనె్నండో రోజున పెద్ద ఎత్తున సంతాప సభ జరిపి, కళ్లనీళ్లెట్టుకుంటూ భక్తిశ్రద్ధలు ప్రకటిస్తూ, ప్రేమానురాగాలు చాటి చెప్పి వక్తలు, ప్రముఖులు, సభికులు అందరూ కలిసి, కవిగారి శిలా విగ్రహం వూళ్లో ప్రతిష్ఠించాలని తీర్మానించారు. దానికోసం భారీ ఎత్తున చందాలు కూడా వసూలు చేశారు. 50 సంవత్సరాలు దాటినా శిలావిగ్రహ నిర్మాణం జరగలేదు- యిహ జరుగదు కూడా.
ఆ రోజుల్లో కొద్దిమంది అదృష్టజాతకులైన పద్యకవులు, తమ రచనలని, రాజాలకి, జమీందార్లకి అంకితమిచ్చి, వాటికి ముద్రణాయోగం కల్పించటమే కాకుండా స్వల్పంగా ధనం కూడా ఆర్జించుకోగలిగారు. మిగిలినవారు వారి రచనలు ముద్రితమయితేనే చాలనుకుని పారితోషికం కూడా లేకుండా అంగీకరించారు. ఈ తరుణంలో పద్య నాటకాలు వచ్చి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ప్రదర్శనలిస్తూంటే వ్యాపార దిట్టలైన కొంతమంది పబ్లిషర్స్ రంగంలో ప్రవేశించారు. తమ నాటకాల్ని సర్వక్కుల తోటి ధారాదత్తం చేస్తే ప్రతిఫలంగా పబ్లిషర్‌నుంచి ముట్టేది పుస్తకానికి కేవలం 10 రూపాయల నుంచి 30 రూపాయల దాకా. ఇలా ఎన్ని నాటకాలు వ్రాస్తే వారి కుటుంబాలు గడవాలి? ఇదిలా నడుస్తుంటే, ప్రచురణకి ముందుగానే పేరు ప్రఖ్యాతులు గడించిన నాటకానికి, శాశ్వతమైన సర్వహక్కులు హరించి ఒకొక్క నాటకానికి 50 రూపాయలిచ్చేవారు.
అందులో, కొన్ని వెయ్యి ప్రదర్శనలు దాటినా కూడా, ఒక్కొక్క ప్రదర్శనకి 5 రూపాయల నించి 200 రూపాయలదాకా కాలక్రమేణా ప్రవేశ రుసుం లభించేది. కొన్ని నాటకాలు 30 వేలు, మరికొన్ని లక్షకుపైగా కాపీలు అచ్చయినాయ్. ఇందులోనుంచి కవిగారి చేతుల్లోకి వచ్చింది 50 రూపాయలు మాత్రమే. బహుళ ప్రాచుర్యం కలిగిన ప్రముఖ నాటకాల గతే ఇలాగుంటే, వ్యావహారిక భాషలో వచ్చిన నవల - నాటిక, నాటకం, కథ, షార్టు స్టోరీ, వ్యాసం రచయితల పరిస్థితి దారుణంగా వుండేది. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కీశే పుచ్ఛా భార్గవ రామోజీ