వినమరుగైన

వైతాళికులు -ముద్దుకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1940లో బెజవాడలో జరిగిన నవ్య సాహిత్య పరిషత్తు సప్త సమావేశానికి అధ్యక్షత వహించి ఉపన్యసించిన విశ్వనాథ సత్యనారాయణగారు గాని, తొలిసారిగా 1942లో నవ్య సాహిత్య చరిత్రను నవ్యాంధ్ర సాహిత్య వీధులు పేరిట పుస్తకంగా వెలువరించిన ఆచార్య కురుగంటి సీతారామయ్యగారు గాని, 1948లో పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వము పేరిట నవ్య సాహిత్య ధోరణుల్ని సమీక్షిస్తూ భారతి రజతోత్సవ సంచికలో వ్యాసం రాసిన కృష్ణశాస్ర్తీగారుగాని, ‘నూరేళ్ల సాహిత్యం శీర్షికన- 50 సంవత్సరాల తెలుగు సారస్వతం (1900-1950)’ పేరిట తన ఇంగ్లీషు వ్యాసాన్ని తానే తెలుగు అనువాదం చేసి 1954 ఏప్రిల్ ఆంధ్రదర్శినిలో ప్రచురించిన వ్యాసంలో శ్రీశ్రీగాని- కృష్ణాపత్రిక వజ్రోత్సవ ప్రత్యేక సంచికలో నవ్య సాహిత్య పరిణామశీలనం శీర్షికన 1964లో పెద్ద సమీక్షా వ్యాసం రాసిన నా తండ్రి శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీగారు గాని ఒక్కరు కూడా, నవ్య కవిత్వ ధోరణుల్ని ప్రతిబింబించే ఉద్దేశ్యంతో వైతాళికులు వచ్చిందనిగాని, ముద్దుకృష్ణ తొలిసారిగా ఇంత మంచి ప్రయత్నం చేశాడని గాని ప్రస్తావన చేయనే లేదు. అయితే, 1946లో వేంకట పార్వతీశం కవుల షష్ఠిపూర్తి సందర్భంగా మహోదయము అనే ఆధునిక గీతికాఖండిగా సముచ్ఛయముగా సంకలనానికి సంపాదకత్వం వహిస్తూ- ప్రవేశికలో 18వ పేజీలో- ‘‘1953లో జ్వాలా ప్రకటనాలయము శ్రీ ముద్దుకృష్ణ సంకలితమైన వైతాళికులు అనే పద్య సముచ్ఛయము ప్రకటించింది. వైతాళికులు ప్రసిద్ధిలోకి వచ్చింది’’ అని రాశారు తల్లవఝుల శివశంకర శాస్ర్తీగారు.
ఈ ఉటంకింపుల ఉద్దేశమేమిటంటే 1935-1964 మధ్యకాలం వచ్చిన ప్రముఖ వ్యక్తుల వ్యాసాలు వైతాళికుల సంకలనాన్ని స్మరించకపోవడం ఆశ్చర్యపడదగిన విషయమని.
ఇక పుస్తకంలోకి చూద్దాం. ముద్దుకృష్ణ ఈ సంకలనానికి ఒక ముందుమాట రాశాడు. దానికి శీర్షికేమి పెట్టలేదు. పురాణయుగం నుంచి, నవీన యుగం వరకు వివిధ యుగాలలో సాహిత్యం నడకను చాలా క్లుప్తంగా సమీక్షించాడు. బలంగా తమ ఉద్దేశాలు చెప్పాడు.
ఈ ముందుమాట చివరలో ‘‘ఆధునిక సారస్వతంతో కలిగిన మార్పుకన్న రాదగిందేమో ఎక్కువ ఉన్నదేమో అనిపిస్తుంది’’ అని ముగించాడు. గొప్ప విశేషం; ఈ ముందుమాటని చాలా తటస్థంగా తాను కేవలం ద్రష్టంగా రాశాడు. ఇందులో ఎక్కడ తానీ సంకలనం ఎందుకు చేస్తున్నాడో, ఏ పద్ధతి అనుసరిస్తున్నాడో, ఏమీ చెప్పలేదు. వౌనంగా- ‘ఈ కవులు ఇలా రాస్తున్నారు. ఇది ఈ యుగలక్షణం’ అని వాచా చెప్పకుండానే పుస్తకం పూర్తిగా చదివాక మనంత మనం గ్రహించేలాగా చేశాడు.
వైతాళికులు సంకలనం రాయప్రోలు సుబ్బారావుగారి ఏ దేశమేగినా ఎందు కాలిడినా అనే గీతంతో ప్రారంభమై శ్రీశ్రీ మరో ప్రపంచంతో ముగుస్తుంది. దేశభక్తి, రాష్ట్ర సంకీర్తి, ప్రణయ పద్యాలు, గీతాలు, మానవతా ప్రేమ, అశోన్ముఖత్వం, ఆనాటి గొప్ప వ్యక్తుల ప్రశంస, కృష్ణప్రేమ, కృష్ణమురళి, గ్రామీణ సౌందర్య లాలిత్యాలు, స్వీయ వైయక్తిక దుఃఖ స్పర్శలు, కటికరాత్రులు, కర్పూరపు వెనె్నలలు, కోకిల కూజితాలు, మనిషి మనుగడ కోసం తపన- ప్రధానాంశాలుగా ఇందులో రచనలుంటాయి. ముఖ్యంగా ప్రేమకవితలు ఎన్ని రకాలో! అలాగే దేశభక్తి ప్రకటన లలిత ధ్వనిపూర్ణంగా వుంటుంది.
ఇందులో పద్యాలుగాని, పాటలుగాని, ప్రచురించే విధానంలో- ముద్దుకృష్ణ భావానుగుణంగా పాద, పద విభజన చేశారు. అంతేగాని పద్యం నాలుగు పాదాలుగా , పాట నాలుగు పాదాలుగా ముద్రించలేదు. ముఖ్యంగా వృత్తపద్యాలు ఇందుకుదాహరించవచ్చు.
ఈ సంకలనంలో ఆనాడు జేరిన రామచంద్ర అప్పారావు, పెనుమర్తి వెంకటరత్నం, కొడవటిగంటి వెంకట సుబ్బయ్య, నోరి నరసింహశాస్ర్తీ, బంగారమ్మ, విశ్వసుందర్మ, సౌదామిని వంటి కొందరు ఏనాడో కవులుగా సమసిపోయారు.
తల్లావఝుల శివశంకరశాస్ర్తీ, మల్లవరపు విశే్వశ్వరరావు, రాయప్రోలు, అబ్బూరివంటివారు ఆయా ఉద్యమాల ప్రస్తావన వస్తే గుర్తుకు వస్తారు. ఏ అరమరికలు లేకుండా చెప్పాలంటే; ఈ పుస్తకంలో వున్న పాతికమంది కవుల్లో నిక్కచ్చిగా, నిగ్గుతేలి, నిజంగా వైతాళికులై మూడు భిన్న వర్గాలకు నేతలై నిలిచినవారు ముగ్గురే- వారు విశ్వనాథ, కృష్ణశాస్ర్తీ, శ్రీశ్రీ. మిగతావారందరివి మంచి రచనలని చెప్పవచ్చు. వైతాళికులంటే- సంప్రదాయార్థం- స్తోత్రపాఠకులని, ఆధునికార్థం- పావన నవజీవన బృందావన నిర్మాతలని. ఇటువంటి ఆధునిక వైతాళికుల్ని ఒకచోటికి చేర్చారు ముద్దుకృష్ణ.
-అయిపోయంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-ఇంద్రగంటి శ్రీకాంతశర్మ