వినమరుగైన

ఓబయ్య - వేలూరి శివరామశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లుడి జపం వగైరా కళలు చూసి సోమమ్మ సిగ్గుచేత, కోపం చేత, క్షోభం చేత తుకతుకలాడిపోయింది. మనుకుడుపులు అయిపోయినాయి.
ఓబయ్య తల్లి వీర వెంకమ్మ మా అబ్బాయికి కాఫీ వేళ దాటిపోవుచున్నదమ్మా! ప్రొద్దుగుంకునప్పుడు మరల వచ్చెదను అని ఒకసారీ, మా వాడీనాడు కాఫీ తాగలేదమ్మా! అని ఇంకొకసారీ పెత్తనాలు ఆకస్మికంగా ముగించుకొని వస్తూ వుండేది. పాపం, బిడ్డడు మనుకుడుపుల్లో మంత్రం కుడుపు- కాఫీ కుడుపు అలవాటు చేసుకొని వచ్చాడు. అయితే ఓబయ్యగారి వూళ్ళో కాఫీ మొహం ఎవరికి తెలుసు? కాఫీ అమృతమని ఊరి కుర్రాళ్ల వెర్రి నమ్మకం- కాఫీ సేవనంతో ఓబయ్యకు ఘనమైన నలత కూడా కలిగింది. వైద్యుడు పూర్ణచంద్రోదయం, వసంత కుసుమాకరం పుచ్చుకోమన్నాడు. అనుపానంగా కోడలిని తీసుకురావాలని నిశ్చయించింది. వీర వెంకమ్మ- కోడలి చదువు మాన్పించమని హుకుం జారీ చేసింది. ఓబయ్య కూడా చదువు మానేసి ఇంటి పట్టునే వుండాలనుకొన్నాడు. ఈ రకంగా ఈ నవలలో పూర్వ భాగమంతా గ్రామీణ ప్రాంతాలలో తెల్లదొరల సంస్కృతి క్రమక్రమంగా ఎలా కాలూనూతూ వచ్చిందో వర్ణించారు శివరామశాస్ర్తీగారు.
తరువాత ఓబయ్య క్యాంప్‌కాట్ కొన్నాడు. గడియారం కొన్నాడు. గట్టి ఆలోచనలు సాగించాడు. వసుమతి చదువు మానక్కర్లేదని తల్లి వీరవెంకమ్మకు ప్రతిగా శాసించాడు. సరస్వతీ రసాయనం సేవించాడు. పరీక్షల్లో నెగ్గాడు. ఇంటర్మీడియెట్‌లో చేరి గాంధీగారి పిలుపుమీద చదువుమానేసి, ఇంటికి వచ్చేశాడు.
ఆ రోజుల్లో గ్రామాభ్యుదయం జాతీయోద్యమంలో ఒక భాగంగా ఉండేది. అందువల్ల ఓబయ్య గ్రామోద్ధరణలో పడ్డాడు. ఆ ఊరికొక రోడ్డు- పోస్ట్ఫాసు-సహకార సంఘం- ఆసుపత్రి వగైరా సాధించాడు. ఇంతలో ఆ గ్రామం అభివృద్ధికి ఓర్వలేని అగ్నిదేవుడు విజృంభించాడా అన్నట్లు గ్రామాన్నంతా బూడిదపాలు చేసిన భయంకర అగ్నిప్రమాదం సంభవించింది. కష్టాలు ప్రారంభం- వున్న డబ్బు కర్పూరంలాగా కరిగిపోయింది. విరాళాలకై ప్రకటించారు. మద్రాసులో మెడిసిన్ చదువుతున్న వసుమతి ప్రజాహిత కార్యక్రమాల కోసమై వెయ్యి రూపాయలు విరాళం పంపింది. సతీపతులు కలుసుకొన్నారు. ఇది ఓబయ్య ముచ్చట. ఓబయ్య ఇరవై అధ్యాయాల చిన్న నవల. ఈ కథలో వసుమతి, వీరవెంకమ్మల పాత్రలు పాత కొత్త తరాల మధ్య సంఘర్షణకు ప్రతీకలు- ఆ రోజుల్లో అనేకులు ఓబయ్యలు పుట్టారు. గాంధీగారి మాట శిరసావహించారు. కొందరు స్కూళ్లు బహిష్కరించారు. మరికొందురు జైళ్లకు వెళ్లారు. కానీ గాంధీగారు ఇంగ్లీషు బడులలో చదవద్దని చెప్పారు. కానీ అసలు చదువే మానేయమన్నారా?
గాంధీగారి స్వాతంత్య్ర శంఖారావాన్ని విని తక్షణమే పాఠశాలకు బహిష్కరించాడు ఓబయ్య. చదువు సంధ్యలెలా వున్నా ఈ విషయంలో మాత్రం మహాత్ముతికీ, ఓబయ్యకూ సంపూర్ణ ఐకమత్యం. అహింస ఒకటి అతని అభిమతం. విదేశీ వస్త్ర బహిష్కరణం అతనికి గిట్టదు. అది అతనిలో మిగిలి వున్న ఆంగ్ల వాసన - మిగిలిన విషయాలపట్లాయన జాత్యంధుడు.
సాంప్రదాయక విద్యకు తిలోదకాలు- ఇంగ్లీషు చదువుల ఆరంభం- వాటి ఫలితంగా భారతీయ హృదయాలను ఆకర్షించిన ఆధునిక అలవాట్లు- తెల్లదొరలు సేవించే అమృత సమానమైన కాఫీ ఆచారం. క్రీస్తుమత ప్రచారం- ఆ మత ప్రచారం కోసమై స్కూళ్ల స్థాపన- ఆస్పత్రుల అవతరణ మొదలైన నాటి స్థితిగతులనన్నింటినీ శాస్ర్తీగారు ఓబయ్య నవలలో కథాగర్భితం చేశారు.
వేద శాస్త్రాలకు స్వస్తి చెప్పి- భూగోళ చరిత్రాదులను బోధించడం- తెలుగు అధ్యాపకులు కూడా ఇంగ్లీషులోనే మాట్లాడాలని ఉబలాటపడటం హోటల్‌లో నిత్య పౌరోహిత్యం, షేవింగ్ కిట్ మొదలైన వస్తువులు ప్రతి విద్యార్థికీ హస్తాలంకారాలు కావడం. స్వగ్రామం మరచిపోయి, ప్రతి వ్యక్తీ తాను లండన్‌లో వున్నట్లు భావించడం-
తల్లులు నీతి నియమాలను గంగలో వదిలి పిల్లలకు పెండ్లిమీద పెండ్లి చేయడం మొదలైన అవలక్షణాలు ఆంగ్ల ప్రభువుల దయవల్ల మనకు సంక్రమించిన వరాలు. ఇట్టి విపత్కర స్థితిలో స్వాతంత్య్రమే జాతికి జీవగర్ర అని ప్రబోధించి, స్వదేశాభిమానాన్ని ప్రజా హృదయాలలో ప్రజ్వరిల్లజేసి దేశాన్ని పారతంత్య్ర శృంఖలాల నుంచి విముక్తం చేయడానికై గాంధీ మహాత్ముడు దీక్షాకంకణం ధరించాడు.
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-జంధ్యాల మహతీ శంకర్