వినమరుగైన

చదువు -కొడవగంటి కుటుంబరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటికప్పుడు మనం చరిత్రను తవ్వుతూనే ఉంటాము. శిథిలాల కోసమో! సత్యాల కోసమో! ఈ చరిత్ర ప్రయాణాలు మనం వెంట తెచ్చుకున్న గతాన్ని సమీక్షించుకోవటం కోసమే! హిస్టోరియన్ రాసే చరిత్రలో వాస్తు ప్రమాణాలు, తేదీలు, దస్తావేజులు వగైరా ఫాక్ట్స్ ఉంటాయి. రచయిత చరిత్రకు బయటా, లోపలా ప్రయాణిస్తాడు. మానవ సంబంధాలు అంతరంగ సంఘర్షణల ద్వారా చరిత్రను రికార్డు చేస్తారు. మామూలు చరిత్రలలో కనబడని తాత్విక నేపథ్యం, సామాజిక సంబంధాల పరిణామగతి వీటిల్లో కనిపిస్తూంటుంది.
కొకు చదువు ఆ కోవలోకి చెందిన నవల. మొదటి ప్రపంచ యుద్ధపు తొలి రోజుల్లో మొదలై, 1935 ఆర్థిక మాంథ్యం వరకూ సాగే ఒక చారిత్రక కాలాన్ని- సుందరం అనే పాత్ర అనుభూతించిన లేదా ప్రయాణించిన జీవనయాత్రగా ఈ నవలను తీర్చిదిద్దాడు కొకు.
‘ఏ నావెల్ ఈజ్ ఏ స్టేజ్’ అనుకుంటే, ఆ స్టేజీపై పాత్రలు ఒక పర్టిక్యులర్ పీరియడ్‌లో చేసిన ప్రయాణాన్ని చూపటమే రచయిత చేస్తాడు. రచయిత తాత్విక భూమిక, ఆలోచనా విస్తృతి ఈ స్టేజీకి ఒక లైఫ్‌నిస్తుంది. అంత గాఢమైన తాత్విక లోతులకు వెళ్లకపోయినా, కొకు చదువు ఆయా చారిత్రక పరిణామాల్లో మధ్యరగతి జీవితం పొందిన సైద్ధాంతిక పరమైన, ఉద్వేగపరమైన అలజడుల్ని రికార్డు చెయ్యటం ద్వారా- మనిషి మానసికావస్థగానీ, తాత్విక గతి కానీ వాటంతట అవే పరిణామం చెందవని, అవి ఆయా కాలాల చారిత్రక గతులకు అంతస్సూత్రంగానే ఉంటాయనే నిజాన్ని ఆవిష్కరిస్తుంది.
తను వెంట తెచ్చుకున్న ఒక సామాజిక నేపథ్యంలోంచి ప్రయాణాన్ని మొదలుపెట్టి- భారత సామాజిక చిత్రపటంలో వస్తున్న మార్పుల్ని ప్రాపంచిక దృక్పథాల్ని, ఆధునిక భావజాలాన్ని- అన్నింటినీ తనలో ఎదగనిచ్చి ఒక ఆధునిక సామాజిక మానవుడిగా ప్రధాన పాత్ర సుందరం పరిణామం చెందిన తీరు చదువులో కనిపిస్తుంది.
సుందరం అనుభవాలు ఎవరివి? అవి కుటుంబరావు ఆత్మ చారిత్రాత్మక కథనాలే అని కె.వి.ఆర్ అంటాడు. అవి కుటుంబరావుగారి అనుభవాలు కావచ్చు! కాకపోనూ వచ్చు! కానీ ఆ రెండు మూడు దశాబ్దాల్లోని యువకులందరి అనుభవాల వౌలిక అనేది సత్యం.
నవల అంతటా సుందరం ఒక ఆన్‌లుకర్‌గానే కనిపిస్తాడు. పెల్లుబుకుతున్న కాంగ్రెస్ జాతీయోద్యమంగానీ, ఇతరత్రా సంస్కరణోద్యమాలు గానీ, కళా సాంస్కృతిక రంగాల్లో వస్తున్న కొత్త గాలులుగానీ- వేటివైపూ సుందరం మొగ్గు చూపుతున్న సూచనలు కనబడవు. ఒక దశలో నవల మొత్తం యాన్ ఆన్‌లుకర్స్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఎ పీరియడ్‌గా తోస్తుంది. కథానాయకుడనే వ్యక్తి ఏ అద్భుతాలు చెయ్యకుండా, ఏ ఉత్సుకతను స్ఫురింపజేయకుండా పాసివ్‌గా ఉండిపోయాడేమిటి? అని పాఠకుడు నిట్టూర్చే ప్రమాదం ఉంది. అయితే కుటుంబరావుగారి రచన శైలే అంత. ఆయన నవలల్లో ఆవేశం ఉండదు. కవిత్వం ఉండదు. అవి ఆలోచనా ప్రధానంగా సాగుతాయి. ఆయన తనకు తెలిసిన పరిచయమైన జీవితాన్ని మాత్రమే ప్రెజెంట్ చేస్తాడు. ఆయన మాటల్లో చెప్పాలంటే ‘‘నేను మధ్యతరగతి సంస్కారం గలవాణ్ణి! మధ్యతరగతి వారిలో ప్రజా జీవితానికి అనుకూలించే పరివర్తన తెచ్చే అవకాశం ఉంది. ఈ పని ఎంత విజయవంతంగా జరిగితే నేనంత ఉత్తమ కథకుణ్ణి అనిపించుకుంటాను’’. కుటుంబరావుగారు కోరుకునే పరివర్తన బౌద్ధికమైనది. ఆ పరివర్తన పెను ఉప్పెనలా కాక, తేటనీటిపై సన్నగా పరిక్రమించే అలల ప్రయాణంలా సాగుతుంది. అందుకనుకూలమైన శైలి చదువులో మనకు కనిపిస్తుంది. మళ్లీ కుటుంబరావుగారి మాటల్లో చెప్పుకోవాలంటే-
‘‘ఉత్తమ తరగతికి చెందిన నవలల్లో రచయితది ప్రముఖ పాత్ర. అతడు నవలకు జీవం పొయ్యగలడు. అందులోంచి అపారమైన వెలుగును సృష్టించగలడు’’. చదువు నవలలోని వెలుగు- మధ్యతరగతి చట్రంలోంచి- యువతరం క్రమంగా ఆధునిక భావజాలంవైపు ప్రయాణిస్తున్న తీరును ఆవిష్కరించటంలోనే ఉంది.
గొప్ప నవలలన్నీ నేపథ్య చిత్రణలోంచి, సంఘటనలలోంచి క్రమంగా వ్యక్తులపై ఫోకస్ అవుతాయి. సంఘటనల వత్తిడికి- వ్యక్తులు స్పందించటము, ఆ స్పందనలోంచి ఒక ఆలోచన ఒక భావజాలం పరిణామం చెందటం- ఆ మొత్తం సైకిల్ నవలా ప్రపంచాన్ని సృష్టిస్తుంది.
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-వి.చంద్రశేఖరరావు