వినమరుగైన

అల్పజీవి - రాచకొండ విశ్వనాథశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి ‘‘తెలుగులో కలకాలం నిలిచే నవలలు ఏవి?’’ అనే మీమాంస తలెత్తింది. దానికి సమాధానంగా ఆచంట జానకీరామ్ ఉన్నవ వారి మాలపల్లి, విశ్వనాధ ఏకవీర, గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర, బుచ్చిబాబు చివరకు మిగిలేది, జి.వి.కృష్ణారావు కీలుబొమ్మలు, రావిశాస్ర్తీ అల్పజీవి అని తేల్చారు. నిజంగా ఇవన్నీ తెలుగులో కలకాలం నిలిచే నవలలే. నన్నడిగితే వీటికి తోడు చలం దైవమిచ్చిన భార్య, వీరేశలింగం రాజశేఖర చరిత్రము, కొడవటిగంటి చదువు, నోరి వారి రుద్రమదేవి, శ్రీదేవి కాలాతీత వ్యక్తులను చేరుస్తాయి.
అల్పజీవి కలకాలం నిలిచే నవల అనడంలో అనౌచిత్యం ఏమీ లేదు. ఏ నవల అయినా మనిషి అంతరాంతరాలను, గర్భకుహరాన్ని ఆవిష్కరిస్తే అది కలకాలం నిలుస్తుంది. మానవుని గర్భ కుహరం మానవ స్వభావాన్నీ, సంస్కృతీ లోతులనూ ప్రతిబింబిస్తుంది. అవి అంత తొందరగా మారవు. అందుకని అటువంటి నవలలు కలకాలం నిలుస్తాయి. తన నవలకు రావిశాస్ర్తీ అల్పజీవి అనే పేరును తానుగా పెట్టలేదు. అది 1953లో ధారావాహికంగా భారతిలో వస్తున్నపుడు దాని సంపాదవర్గ సభ్యుడు కె.సత్యనారాయణ పెట్టిన పేరు. ఈ సంగతి రావిశాస్త్రే తన ఆఖర్నోమాటలో చెప్పుకొన్నాడు. కాని ఈయన నవలానుశీలనం చేసి, డాక్టరేట్ అందుకొన్న గ్రంథంలో ఏమో, భారతి సంపాదకవర్గంలోని వి.డి.ప్రసాదరావు ఆ పేరు పెట్టాడంటాడు. ఏది ఏమైనా ఈ నవలకు రావిశాస్ర్తీ మొదట పెట్టిన పేరు అయ్యారే బాబారే! ఏ యుగమైనా, తన స్పిరిట్‌ని తన కళా సాహితీ రూపాలలోకి ప్రక్షేపిస్తుంది. అంటే ఆ యుగంలో ఆ కాలంలో లేచే భావతరంగాలను, ఉద్యమాల హోరును, తత్వ వీచికలను పుణికిపుచ్చుకొని కవులు, కళాకారులు తమ తమ కృతులలో ప్రతిబింబిస్తారు. అయితే అందరూ వాటిని ఒకే విధంగా ప్రతిబింబించరు. కవులు, రచయితలు ముందుగా వ్యక్తులు (ఇండివిడ్యువల్స్), మూర్తులు (పర్సన్స్). అందుకని వారి దర్శనాలు (పర్‌స్సెప్షన్స్) వేరుగా ఉంటాయి. అలాగేవారు ఆత్మాభివ్యక్తీకరణ (సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్) చేసుకొంటారు. అందుకని సమాజం -వ్యక్తి - ఆత్మాభివ్యక్తీకరణం- మూడింటి సంబంధాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ రచనైనా పరిశీలించాలి. అర్థం చేసుకోవాలి. అవగాహన చేసుకోవాలి. 1950లకు ముందు సాహిత్యంలో వచ్చిన తిరుగుబాటు, దానితోపాటు పెల్లుబికిన హేతువాద ఉద్యమం, సంప్రదాయ శృంఖలాలలో ఇరుక్కోని వారిని బాగా ఆకర్షించాయి. ఈ యువకుల మీద బౌద్ధం, రసెల్, మార్క్స్, రాయ్, ఫ్రాయిడ్, ఆడ్లర్‌యూంగ్‌ల ప్రభావం పడింది. ఇలాంటి ప్రభావాలకు లోనై నవలలు నిర్మించిన వారిలో జి.వి.కృష్ణారావు, గోపీచంద్, బుచ్చిబాబు, రావిశాస్ర్తీ ముఖ్యులు. వీరిలో ఎవరి దృక్పథం వారికి వున్నా, ఎవరి తత్త్వం వారికి వున్నా మొత్తంమీద వీరు తెలుగు నవలలకు ఒక పరిణత రూపాన్ని 1960కు ముందే కల్పించారు.
అల్పజీవి నిస్సందేహంగా ఒక మనోవైజ్ఞానిక నవల. మనోవైజ్ఞానిక సిద్ధాంతాల ప్రభావానికి అద్దంపట్టే నవలను మనో వైజ్ఞానిక నవల అనవచ్చు. ఒక రచయిత ఫ్రాయిడ్, ఆడ్లర్, యూంగ్‌ల సిద్ధాంతాలను చదివి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ముఖ్య విషయం ఏమంటే వారి సిద్ధాంతాల తాలూకు ప్రతిధ్వని నవలలో కన్పించడం, ఫ్రాయిడ్ చెప్పిన జీవ మరణ సహజాతాలు. లెబీడో, ఈడిపస్ కాంప్లెక్స్, స్వప్న రహస్యం, చైతన్య స్రవంతి, రక్షణ యంత్రాంగం, స్వేచ్ఛా సంసర్గం సిద్ధాంతాలూ, ఆడ్లర్ చెప్పిన న్యూనతా భావ గ్రంథి, జీవన శైలి, పురుషోద్ధతి, సిద్ధాంతాలూ, యూంగ్ చెప్పిన మూల రూపాలు, అంతర్ముఖ, బహిర్ముఖ, ఛాయ, యానిమ్ (పురుషునిలో వుండే స్ర్తి అంశ), యానిమస్ (స్ర్తిలలో వుండే పురుష అంశ) సిద్ధాంతాలే ఏదోవిధంగా బహిరంగంగా గాని, నర్మగర్భంగా గాని, ఒక నవల ప్రతిబింబిస్తే అది మనోవైజ్ఞానిక నవల అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మనస్సు చరించే తీరును, దాని చిత్రగతులను వర్ణించి లేదా వ్యక్తి మూర్తిమత్వాన్ని కేంద్రంగా చేసుకొని రచించే నవలను మనోవైజ్ఞానిక నవల అనవచ్చు.
-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి